కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్... మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.

ఈ నియంత్రణలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధానమంత్రి ఏం చెబుతున్నారో వినాలని, లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విటర్‌లో విజ్ఞప్తి చేసింది.

ఈ నియంత్రణలకు సహకరించకుండా, వీటిని అతిక్రమించి కోవిడియట్లు (కోవిడ్-ఇడియట్) కావొద్దని తెలిపింది.

ఇప్పటికీ కొంతమంది లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించట్లేదని, ‘దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబ సభ్యులను కాపాడండి’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

నియంత్రణలను కట్టుదిట్టంగా పాటించాలని ప్రజలకు పిలుపునిస్తూ.. ప్రజలంతా ఈ నియమాలను, చట్టాన్ని పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సందర్భంగా మీరు చేయగలిగిన పనులు, చేయకూడని పనులు ఏంటో తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్:

ఇవి దొరుకుతాయి:

1. ఆహారం, నిత్యావసర వస్తువులు

2. పాలు, బ్రెడ్

3. పండ్లు, కూరగాయలు

4. మాంసం, చేపలు

5. విద్యుత్, నీరు

6. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ సర్వీసులు

7. ఆహారం, మందులు, మెడికల్ సామగ్రి ఆన్‌లైన్ డెలివరీ

8. పెట్రోలు, గ్యాస్, నూనె, వాటికి సంబంధించిన వ్యవహారాలు

9. ఆసుపత్రులు, మందుల షాపులు, కళ్లజోళ్ల షాపులు

10. బ్యాంకులు, ఏటీఎం, టెలికాం, ఇంటర్నెట్, పోస్టల్, ఐటీ సేవలు

పైన పేర్కొన్న వస్తువుల అమ్మకంతో పాటు వాటి నిల్వ, రవాణా వసతులకు కూడా అనుమతి ఉంది.

ఇవి మూసివేత:

1. ప్రజా రవాణా.. అంటే ఆర్టీసీ మూసివేత. కేవలం ఆసుపత్రులు, విమానాశ్రయాలకు వెళ్లే వారికే అనుమతి

2. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు కూడా నిలిపివేత

3. అవసరం లేని వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసివేత

4. ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, గోడౌన్లు మూసివేత. ఒకవేళ నడపాలనుకుంటే అతి తక్కువ సిబ్బందితో నిర్వహించాలి.

5. కనీసం పది మంది కంటే ఎక్కువ మంది కలిసే కార్యక్రమాలు అన్నిటి పైనా నిషేధం

6. ఆహార ఉత్పత్తులు, నిత్యావసర ఉత్పత్తులూ చేసే రైతులు, ఇతర వ్యక్తులు వారి పనులు కొనసాగించవచ్చు. కానీ దూరం పాటించాలి.

వీరికి మినహాయింపు:

1. శాంతి భద్రతలు, న్యాయ సంబంధ విధులు చేసేవారు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో, తహశీల్దార్

2. పోలీసు, వైద్య, స్థానిక సంస్థలు, అగ్నిమాపక సిబ్బంది

3. మీడియా

4. నిత్యావసరాల సరఫరాకు సంబంధించిన అన్ని సేవలు

5. వైద్యానికీ, నిత్యావసర సరకులకు మాత్రమే ప్రైవేటు వాహనాలకు అనుమతి

6. నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉండే తయారీ పరిశ్రమలు కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి

7. నిత్యావసర వస్తువుల తయారీ జరిగే కర్మాగారాలు

8. నిత్యావసరాలకు, కోవిడ్ చికిత్సకూ ఉపయోగపడే ప్రైవేటు సేవలు

9. మందుల తయారీ, రవాణా, వాటికి సంబంధించిన వ్యవహారాలు

ఎవరు ఏం చేయాలి?

  • స్థానిక వైద్య సిబ్బంది చెప్పినట్టుగా విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
  • పోలీసులు, మహిళా పోలీసులతో కలసి విదేశాల నుంచి వచ్చిన వారు బయట తిరగకుండా చూడాలి.
  • సాధారణ ప్రజలు తప్పనిసరి అసవరాల కోసం తప్ప బయటకు రావద్దు. వచ్చినా రెండు మీటర్ల దూరం పాటించాలి.
  • వీటిల్లో ఏది కొనసాగాలి? ఏది కొనసాగకూడదు? వంటివి నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టరుకు ఉంది.

ప్రభుత్వ ఏర్పాట్లు

  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల క్వారంటైన్ సౌకర్యం ఏర్పాటు
  • ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రైవేటుతో సమన్వయం చేసుకుని 200 నుంచి 300 వందల పడకల కరోనా వైద్య చికిత్స ఏర్పాటు
  • ఎక్కడా మందులు, నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ధరలను ప్రచారం చేయాలి. ఎక్కువ వసూలు చేస్తే ఐపీసీ కింద కేసులు పెట్టాలి.
  • ఈనెల 29 నాటికి రేషన్‌ సరుకులు ఇస్తారు. కేజీ పప్పుతో పాటు, రేషన్‌ సరకు ఉచితం. మరో వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం. ఏప్రిల్‌ 4న గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వాటిని అందచేస్తారు.
  • కరోనా బాధితుల కోసం ప్రత్యేక యాప్ తయారీ.

Sorry, your browser cannot display this map