బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1975 నవంబర్ 3.. వేకువన 3 గంటలు. ఢాకా సెంట్రల్ జైలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ నురుజ్జమాకు బంగ భవన్ నుంచి మేజర్ రషీద్ ఫోన్ చేశారు.
షేక్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు హత్యకు గురయిన తరువాత ఆయన అత్యంత సన్నిహితులు తాజుద్దీన్ అహ్మద్, సయ్యద్ నజ్రుల్ ఇస్లాం, కెప్టెన్ మన్లూప్ అలీ, కమ్రుజ్జమాలను ఉంచిన జైలు ఇది.
మేజర్ రషీద్ 'జైల్లో అంతా బాగానే ఉందా?' అని నురుజ్జమాను అడిగారు. ఆయన 'అంతా మామూలుగానే ఉంది' అని చెప్పారు.
"కాసేపట్లో అక్కడికి కొందరు సైనిక యూనిఫాంలలో వస్తున్నారు. వారు నలుగురి పేర్లు చెబుతారు. వారిని వాళ్లకు అప్పగించు" అని రషీద్ చెప్పారు.
ఆ ఏర్పాట్లు చేయడానికి నువ్వే స్వయంగా జైలుకు వెళ్లాలని ఆయన చెప్పారు. నురుజ్జుమా ఢాకా జైలు జైలర్‌కు ఫోన్ చేసి, మీరు కూడా త్వరగా జైలుకు రావాలన్నారు. ఇద్దరూ దాదాపు ఒకేసారి జైలు దగ్గరకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
షేక్ ముజీబ్ హత్యలో వారంలోపే అరెస్టులు
బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ సమయంలో ఏర్పాటైన బంగ్లాదేశ్ ప్రభుత్వంలో, ఆ తరువాత షేక్ ముజీబ్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన తాజుద్దీన్ అహ్మద్ కుమార్తె షర్మీన్ అహ్మద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.
షేక్ ముజీబ్ హత్య జరిగిన కొన్నిరోజుల్లోనే తన తండ్రిని కూడా అరెస్టు చేయడం ఆమెకు ఇప్పటికీ గుర్తుంది.
దాని గురించి షర్మీన్ "షేక్ ముజీబ్ హత్య జరిగిన మూడు, నాలుగు గంటల్లోనే ఆర్మీ జవాన్లు మమ్మల్ని మా ఇంట్లో నిర్బంధించారు. ఆగస్టు 22న వారు మా నాన్న తాజుద్దీన్ అహ్మద్‌తో చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్, షేక్ ముజీబ్ హత్యకు కుట్ర పన్నిన వారి దగ్గరకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు" అన్నారు..
"మా నాన్న వెళ్తున్నప్పుడు మా అమ్మ ఆయనతో 'మీరు తిరిగి ఎప్పుడు వస్తారు' అని అడిగారు. ఎందుకంటే వారు ఆయన్ను చర్చల కోసమని తీసుకెళ్తూ, 'మీతో మీ బట్టలు కూడా తెచ్చుకోవాలని' చెప్పారు. అప్పుడు మా నాన్న ఇంటి నుంచి బయటకు వెళ్తూ, మా అమ్మకు చేయి ఊపి, 'ఇక నేను ఎప్పటికీ తిరిగి రాననే అనుకోండి' అన్నారు".

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
భార్యను చివరిసారి కలిసినపుడు...
తాజుద్దీన్ అహ్మద్ ఎలా అనుకున్నారో అదే జరిగింది. చర్చల సాకుతో తీసుకెళ్లిన వారు ఆయన్ను ఢాకా సెంట్రల్ జైలులో వేశారు. ఆయనతోపాటు షేక్ ముజీబ్ మిగతా సన్నిహితులు సయ్యద్ నజ్రూల్ ఇస్లామ్, కెప్టెన్ మన్సూర్ అహ్మద్, కమ్రుజ్జమాలను కూడా అరెస్టు చేశారు.
"వారు జైలుకు వెళ్లాక నెల వరకూ మమ్మల్ని గృహనిర్బంధంలో ఉంచారు. దానిపై మా చిన్నాన్న చాలా పిటిషన్లు వేశారు. తర్వాత కూడా మాకు విముక్తి లభించలేదు. మా నాన్నను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. మేం ఆయన్ను 1975 సెప్టెంబర్ చివర్లో కలిశాం. మా నాన్న మా అమ్మతో.. 'బయట ఉన్న అవామీ లీగ్‌కు చెందిన నేతలకు, ముస్తాక్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోవద్దని.. ఆయన్ను వ్యతిరేకంచమని చెప్పమన్నారు" అని షర్మీన్ అహ్మద్ చెప్పారు.
"నవంబర్ 1న చివరిసారి నాన్నను కలవడానికి అమ్మ జైలుకెళ్లారు. మా నాన్నపై ఎలాంటి ఆరోపణలూ లేకపోయినా, ఆయన్ను జైల్లోనే ఉంచేశారని కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనపై నవంబర్ 5న విచారణ జరగాలి. కానీ మా నాన్న, అమ్మతో 'లీలీ ఈ జైలు నుంచి నేను సజీవంగా బయటికి వస్తానో, లేదో.. వాళ్లు నన్ను ప్రాణాలతో ఉంచుతారో లేదో తెలీదు' అన్నారు. ఆరోజు అమ్మ ఇంటికొచ్చి నాతో 'మీ నాన్నలో చాలా నైరాశ్యం కనిపించిందని, ఏదో చెడు జరగబోతున్నట్టు అనిపించిందని చెప్పారు".

ఖోండ్‌కార్ ముస్తాక్-తాజుద్దీన్ అహ్మద్ శత్రుత్వం
ఈలోపు 1975 నవంబర్ 2న షేక్ ముజీబ్ హంతకులకు వ్యతిరేకంగా బ్రిగేడియర్ ఖాలిద్ ముషారఫ్ నాయకత్వంలో మరో సైనిక తిరుగుబాటు జరిగింది. ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్ తన పదవికి రాజీనామా ఇచ్చేలా, ముజీబ్ హంతకులు తమ కుటుంబాలతో బంగ్లాదేశ్ వదిలి వెళ్లిపోయేలా వారి మధ్య ఒక ఒప్పందం జరిగిదిం. కానీ హంతకులు థాయ్‌లాండ్ విమానం ఎక్కే ముందే ముజీబ్ సన్నిహితులైన నలుగురు సహచరులనూ అంతం చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
షేక్ ముజీబ్ జీవితచరిత్ర రాసిన బంగ్లాదేశ్ ప్రముఖ జర్నలిస్ట్ సయ్యద్ బద్రూల్ అహసన్ "ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్‌కు ఒక రైట్‌వింగ్ నేత ఇమేజ్ ఉంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బంగ్లాదేశ్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన అందులో విదేశాంగ మంత్రిగా చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి" అన్నారు.
"ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్ అప్పుడు బంగ్లాదేశ్ వాదన వినిపించడానికి న్యూయార్క్ వెళ్లబోతున్నారు. కానీ ఆయన సీఐఏతో కుమ్మక్కయ్యారని, న్యూయార్క్ వెళ్లాక పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాన్ఫెడరేషన్ ప్రతిపాదన ఉంచబోతున్నారని ప్రధాని తాజుద్దీన్ అహ్మద్‌కు నిఘా సమాచారం అందింది. దాంతో ఆయన న్యూయార్క్ వెళ్లకుండా తాజుద్దీన్ అడ్డుకున్నారు. ఆయన బదులు వేరేవారిని న్యూయార్క్ పంపించారు" అని అహసన్ చెప్పారు.
"అప్పటి నుంచి ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్‌కు లోలోపలే తాజుద్దీన్ అహ్మద్ అంటే శత్రుత్వం పెరిగింది. అందుకే ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్‌కు ఫోన్ చేసిన ఐజీ నూరుజ్జమా, రిసాల్‌దార్ ముస్లెముద్దీన్ ఆ నలుగురు నేతలనూ హత్య చేయించబోతున్నాడని చెప్పినపుడు ఖోండ్‌కార్ ముస్తాక్ 'అలాగే జరగాలి' అన్నారు".

ఫొటో సోర్స్, Getty Images
వారి హత్యకు ఆదేశం ఇచ్చిన ముస్తాక్
ఈ ఘటన గురించి రచయిత ఎంథనీ మాస్కరెన్హాస్ తన 'బంగ్లాదేశ్-ఎ లెగసీ ఆఫ్ బ్లడ్' పుస్తకంలో ఇంకా వివరంగా రాశారు. మేజర్ రషీద్ దీనిపై తనకు ఒక టేప్ రికార్డర్ ఇంటర్వ్యూ పంపించారు అని చెప్పారు.
అందులో ఆయన "ఉదయం నాలుగు గంటలకు నా దగ్గరున్న టెలిఫోన్ గంట మోగింది. ఫోన్ తీశాను. అవతల నుంచి 'నేను జైళ్ల డీఐజీ మాట్లాడుతున్నా. అధ్యక్షుడితో మాట్లాడవచ్చా' అని అడిగారు".
"రషీద్ ఆ ఫోన్‌ను ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్ దగ్గరికి తీసుకెళ్లారు. అధ్యక్షుడు ఫోన్లో చెప్పింది కాసేపు విన్నారు. తర్వాత మెల్లగా ఏదో చెప్పారు. తర్వాత ఆయన గట్టిగా 'అవును, అవును, అవును'.. అని గట్టిగా చెప్పడం నేను విన్నాను. ఆయన ఏం చెబుతున్నారో నాకు వెంటనే అర్థం కాలేదు. కానీ ఆయన దేనికో అనుమతి ఇస్తున్నట్లు అనిపించింది అన్నారు".

నలుగురినీ తాజుద్దీన్ జైలు గదిలోకి చేర్చారు
ఆ రాత్రి ఢాకా సెంట్రల్ జైల్లో ఘటనాస్థలం దగ్గర ఉన్న అందరితో తాజుద్దీన్ అహ్మద్ కుమార్తె షర్మీన్ అహ్మద్ మాట్లాడారు.
"వారిలో ఒకరైన అబ్దుస్సమద్ ఆజాద్ నమాజుకు ఉదయం 3.40కు లేచారు. జైలు బయట ఆయనకు ఏవో శబ్దాలు వినిపించాయి. తర్వాత ఆయన కొందరు లోపలికి రావడం చూశారు. వారితో జైలర్ కూడా ఉన్నారు. వాళ్లు మొదట మన్సూర్ అలీని ఆయన గది బయటకు లాక్కొచ్చారు. వారికి అదంతా అర్థం కావడం లేదు, తమను ఇంత ఉదయాన్నే ఎందుకు లేపేశారు అనేది అరా అనేది అర్థం కావడం లేదు" అని షర్మీన్ చెప్పారు.
"మరో గదిలో కమరుజ్జమా ఉన్నారు. ఆయనతోపాటు ఒక అవామీ లీగ్ కార్యకర్త కూడా అదే గదిలో ఉన్నారు. ఆయన నాతో కమరుజ్జమా అప్పుడు ఆయన నిద్రపోతుండడంతో పైజమా ఒక్కటే వేసుకున్నారు అని చెప్పారు. బయటికి వెళ్లడానికి ముందు ఆయన చొక్కా వేసుకోడానికి ప్రయత్నిస్తుంటే, ఆయన చేతులు వణకడం కనిపించింది అన్నారు". "వాళ్లు ఇద్దరినీ మా నాన్న ఉన్న సెల్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనతో సయ్యద్ నజ్రుల్ ఇస్లాం కూడా ఉన్నారు. హంతకులు ఆ గదిలో ఉంటున్న మిగతావారిని వేరే గదిలోకి పంపించేశారు. వేరే గదికి వెళ్లిన వారిలో ఒకరైన మొహసిన్ బుల్‌బుల్ లోపల హంతకుల మాటలు తనకు స్పష్టంగా వినిపించాయని చెప్పారు. వారు ఇంత సేపు ఎందుకు పట్టింది, మా దగ్గర అంత టైం లేదు అంటున్నారు. జైల్లో ఒక జవాను కమరుజ్జమాను దాదాపు తోసుకుంటూ మా నాన్న గదిలోకి తీసుకెళ్లాడని చెప్పారు".

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
60 రౌండ్లు కాల్పులు జరిపారు
అందరినీ తన గదిలోకి తీసుకురాగానే, ఏదో జరగరానిది జరగబోతున్నట్లు తాజుద్దీన్ అహ్మద్‌కు అర్థమైంది. షర్మీన్ అహ్మద్ ఆ రోజు జరిగింది చెప్పారు.
"వారు అందరినీ మా నాన్న గదిలోకి తీసుకురావడంతో ఆయన వెంటనే 'నజ్రుల్ సాబ్ మనకు ఎక్కువ సమయం లేదు. వజూ చేద్దాం రండి' అన్నారు". అది పూర్తి కాగానే, జైలర్ నలుగురు హంతకులతో కలిసి వారికి ఎదురుగా వచ్చారు.
"హత్య జరిగిన తర్వాత ఆ జైలర్ మా చెల్లెలు రిమీతో 'వాళ్లు వారిని చంపడానికి వచ్చారనే విషయం తనకు తెలీదు' అని చెప్పారు".
"మన్సూర్‌కు జైలర్ తనతో వచ్చినవారిని పరిచయం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతుండగానే హంతకులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరపడం ప్రారంభించారు. వాళ్లు మొత్తం 60 రౌండ్లు కాల్చారు. గదిలో ఉన్న నలుగురూ నేలకూలారు".

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
తాజుద్దీన్ కొన ఊపిరితో నీళ్లు అడిగారు
60 రౌండ్లు కాల్పుల జరిపిన తర్వాత తాజుద్దీన్ అహ్మద్, కెప్టెన్ మన్సూర్ అలీ వెంటనే చనిపోలేదు. షర్మీన్ అహ్మద్ ఆరోజు అక్కడ ఉన్న వారు చెప్పింది గుర్తు చేసుకున్నారు.
"మా నాన్న అప్పుడు వెంటనే చనిపోలేదు. ఆయన తీవ్ర రక్తస్రావం వల్ల చనిపోయారు. ఒక బుల్లెట్ ఆయన నడుం వెనక నుంచి బయటకు దూసుకెళ్లింది. కానీ ఆయన ప్రధాన అవయవాలకు ఎలాంటి గాయం కాలేదు.
"తర్వాత అక్కడ ఉన్న వారు మా నాన్న తుదిశ్వాస వదులుతూ నీళ్లు అడగడం విన్నారు. కానీ పోలీసులు బయటి వారిని జైల్లోకి ఎలా రానిచ్చారు. కాల్పులు జరిగాక కూడా గాయపడిన వారిని ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు, తమ బాధ్యతలను ఎందుకు విస్మరించారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
తర్వాత కత్తులతో పొడిచారు
ఆ క్రూరత్వం అక్కడితో ఆగలేదు. కొన ఊపిరితో ఉన్న మన్సూర్ అలీని హంతకులు మళ్లీ కత్తులతో పొడిచి ప్రాణం తీశారు.
సయ్యద్ బద్రూల్ అహసన్ ఇదే ఘటన గురించి చెబుతూ "నలుగురు నేతలపై కాల్పులు జరిపి వారు జైలు గేటు దగ్గరికి చేరుకోగానే, ఒక పోలీస్ పరిగెత్తుకుని వెళ్లి, వారిలో కొందరు కొన ఊపిరితో ఉన్నారని చెప్పాడు. దాంతో హంతకులు తిరిగి అక్కడికి వెళ్లారు. ఈసారీ వారు చనిపోయారని తెలిసేవరకూ కత్తులతో పొడుస్తూనే ఉన్నారు" అన్నారు.
జైల్లో ఉన్న నేతలను కత్తులతో పొడిచి చంపారు అనేది ఎంతవరకూ నిజం? అని నేను షర్మీన్‌ను అడిగాను.
దానికి ఆమె "అది ముమ్మాటికీ నిజం. మా చెల్లెలు రిమీనే దానికి సాక్షి. మన్సూర్ అలీ శవాన్ని వారి బంధువు ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహం కళ్లలో, పొట్టలో కత్తులతో పొడిచి ఉండడాన్ని అక్కడ కొందరు చూశారు. హంతకుల మొదటి బృందం అక్కడి నుంచి వెళ్లగానే, వాళ్లు చనిపోయారా లేదా చూసేందుకు మరో బృందం అక్కడికి వచ్చింది. వాళ్లు అక్కడికి వచ్చిన సమయంలో మన్సూర్ అలీ మూలుగుతున్నాడు. అతడు శబ్దం చేయకుండా వారు ఆయన్ను కత్తులతో పొడిచారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్ నటన
ఈ వార్త బంగ్ భవన్ చేరే సమయానికి, అక్కడ బంగ్లాదేశ్ మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. అప్పటికే హంతకులు థాయ్‌లాండ్ వెళ్లిపోయారు.
ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్ ఇదంతా తనకు అసలు తెలీనట్లు అద్భుతంగా నటించారు. మాస్కరెన్హాస్ తన పుస్తకంలో దాని గురించి రాశారు.
"మంత్రిమండలి సమావేశం ముగియబోతుండగా డైరెక్టర్ ఆఫ్ పోర్సెస్ ఇంటెలిజెన్స్ ఎయిర్ కమాండర్ ఇస్లామ్ గట్టిగట్టిగా జైల్లో హత్యలు జరిగాయని వారికి చెప్పారు".
"అది వినగానే ఖోండ్‌కార్ ముస్తాక్ అక్కడే ఉన్న మిగతా వారిలాగే, ఏమీ తెలీనట్లు అమాయకంగా ఉండిపోయారు. నిజానికి అప్పుడు ముస్తాక్ అత్యున్నత స్థాయి నటన ప్రదర్శించారు"

కుటుంబానికి శవం ఇవ్వడం ఆలస్యం
మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పూర్తిగా 48 గంటల తర్వాత అప్పగించారు.
"తర్వాత రోజు నవంబర్ 4న ఉదయం 8.30కు మా నాన్న కాలేజ్ ఫ్రెండ్, డాక్టర్ కరీం మా అమ్మను కలవడానికి వచ్చారు. నేను మా అమ్మ పక్కనే నిలబడి ఉన్నా. ఆయన ఢాకా సెంట్రల్ జైల్లో ఫైరింగ్ జరిగింది అని చెప్పారు" అని షర్మీన్ తెలిపారు.
మా నాన్న, ఆయన ముగ్గురు సహచరులను హత్య చేశారని జైలు డాక్టర్ తనకు చెప్పినట్లు ఆయన అన్నారు. అది వినగానే మా అమ్మ షాక్ అయ్యారు. నేను గట్టిగా దీన్ని నమ్మలేను అన్నారు. అదేరోజు సాయంత్రం వారిని చంపేశారని ధ్రువీకరించారు. జైలు అధికారులు మృతదేహాలను మాకు అప్పగించడానికి చాలా సమయం పట్టింది. మా నాన్న మృతదేహం నవంబర్ 5న అర్థరాత్రి, అంటే ఆయన చనిపోయిన 48 గంటలు దాటిన తర్వాత మా ఇంటికి చేరింది.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
చట్టానికి చిక్కని కొందరు హంతకులు
మరో మూడు రోజులకే బ్రిగేడియర్ ఖాలిద్ ముషారఫ్ సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో సైనిక తిరుగుబాటు జరిగింది. తర్వాత జనరల్ జియావుర్ రహమాన్ అధికారంలోకి వచ్చారు. ఈ దారుణ హత్యాకాండ గురించి 21 ఏళ్ల వరకూ ఎలాంటి దర్యాప్తూ జరగలేదు. 1996లో షేక్ హసీనా అధికారంలోకి వచ్చాక దీనిపై కొత్తగా మళ్లీ సమగ్ర దర్యాప్తు ప్రారంభమైంది. కొంతమంది దోషులకు ఉరిశిక్ష కూడా విధించారు.
దీనిపై సయ్యద్ బద్రుల్ అహసన్ "షేక్ ముజీబ్‌ను హత్య చేసినవారే ఈ హత్యలు కూడా చేశారు. వారిపై విచారణ జరిగాక ఆరుగురికి ఉరిశిక్ష విధించారు. కొంతమంది ఇప్పటికీ విదేశాల్లో దాక్కుని ఉన్నారు. కొంతమంది సహజంగా చనిపోయారు. షేక్ హసీనా అధికారంలోకి రావడానికి మూడు నెలల ముందే ఖోండ్‌కార్ ముస్తాక్ అహ్మద్ కూడా మృతిచెందారు. కానీ ఈ దారుణ హత్యాకాండ వెనుక ఏయే రాజకీయ నేతల హస్తం ఉందనే రహస్యం ఇప్పటికీ వీడలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.COM
రహస్య జీవితం కూడా ఒక శిక్షే
జైల్లో నలుగురు నేతలను హత్య చేసిన కొందరు హంతకులు ఇప్పటికీ చట్టం చేతికి చిక్కకుండా తప్పించుకుని జీవిస్తున్నారు. బంగ్లాదేశ్ బయట రహస్య జీవితం గడుపుతున్నారు.
ఈ కేసులో మీకు న్యాయం లభించిందని మీకు అనిపిస్తోందా? అని నేను షర్మీన్ అహ్మద్‌ను అడిగాను
దానికి ఆమె "నాకు తెలిసి ఇప్పటికీ చిక్కకుండా ఉన్నవారికి కూడా ఒక విధంగా శిక్ష పడింది. వారు ఎప్పటికీ ప్రపంచానికి తెలీకుండా చాటుగా బతకాల్సి ఉంటుంది. అది కూడా ఒక రకమైన శిక్షే. నేను వారికి ఇచ్చే సందేశం ఒకటే. మీరు ఎవర్నైనా చంపేసి ఆ తప్పును, ఒప్పుగా చేయలేరు. వారికి కూడా పిల్లలు, కుటుంబాలు ఉంటాయి. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి" అన్నారు.
చివరగా షర్మీన్ వీళ్లు జాతీయ నేతలు. వాళ్లు ఇప్పటికీ దేశానికి చాలా ఇవ్వవచ్చు. ఈ హంతకుల వెనక చాలా రాజకీయ కుట్రదారులు కూడా ఉన్నారు. వారికి శిక్ష వేసేందుకు ఇప్పటివరకూ ఏం చేయలేదు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు జరగాలి. నేను ఇది ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పడం లేదు. ఏ తప్పు జరిగిందో, దాన్ని సరిదిద్దేందుకు చెబుతున్నా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ అధిపతిని ఎందుకు అరెస్ట్ చేశారు
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- కరోనావైరస్: స్పెయిన్ ప్రధాన మంత్రి భార్యకు కోవిడ్-19.. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో సమస్తం బంద్.. ప్రజలు బయటకు రావటంపై నిషేధం
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








