పాకిస్తాన్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ అధిపతిని అక్కడి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేసింది...

ఫొటో సోర్స్, Geo
- రచయిత, ఇల్యాస్ ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ జంగ్ గ్రూప్ అధిపతి షకీలుర్ రెహమాన్‌ను పాకిస్తాన్ అరెస్టు చేసింది.
30 ఏళ్ల క్రితం చట్ట విరుద్ధంగా భూమిని పొందారన్న ఆరోపణలపై రెహమాన్‌ను పాక్ జాతీయ అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటెబులిటీ బ్యూరో (ఎన్ఐబీ) అదుపులోకి తీసుకుంది. 12 రోజులుగా ఆయన నిర్బంధంలోనే ఉన్నారు.
జంగ్ గ్రూప్ పాకిస్తాన్‌లో జియో టీవీ లాంటి ప్రముఖ చానెళ్లను, దినపత్రికలను నడిపిస్తోంది.
మీడియా స్వేచ్ఛ, రాజకీయ అసమ్మతిపై పాక్‌లో అణచివేత సాగుతోందనడానికి రెహమన్ అరెస్టు నిరద్శనమని పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలు అంటున్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను రెహమాన్ తోసిపుచ్చారు. శుక్రవారం ఆయన్ను ఎన్ఏబీ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఆయనపై అభియోగాల నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.

ఫొటో సోర్స్, Jang
ఎందుకు అరెస్టు చేశారంటే?
లాహోర్‌లో 1986లో రెహమాన్ కొనుగోలు చేసిన కొన్ని ప్లాట్లకు సంబంధించి ఈ కేసు నమోదైంది.
అప్పుడు పంజాబ్ ప్రావిన్సు ముఖ్యమంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్ (ఆ తర్వాత దేశ ప్రధాని పదవి కూడా చేపట్టారు) రెహమాన్‌ను చట్టప్రకారం అనుమతించినదాని కన్నా ఎక్కువ ప్రభుత్వ భూమిని పొందనిచ్చారని ఎన్ఏబీ ఆరోపిస్తోంది.
లాహోర్ డెవలెప్‌మెంట్ అథారిటీ ‘‘భూ మినహాయింపు విధానం’ ప్రకారం రెహమాన్ నాలుగు ఎకరాలు మాత్రమే పొందేందుకు అర్హత ఉండగా, ఆయన 13 ఎకరాలకుపైగా భూమిని పొందారని ఎన్ఏబీ అధికారి ఒకరు చెప్పినట్లు డాన్ దినపత్రిక పేర్కొంది.
ఈ భూ కొనుగోలు చట్ట విరుద్ధమని, రాజకీయపరమైన లంచం కిందకు వస్తుందని ఎన్‌ఏబీ అంటోంది.
ప్రైవేటు పక్షం నుంచి ఈ భూమిని కొనుగోలు చేశానని, అందుకోసం అన్ని పన్నులు, సుంకాలు చెల్లించానని రెహమాన్ చెబుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని అంటున్నారు.
ఈ భూ విక్రయ వ్యవహారం సివిల్ అంశమని, ఎన్ఏబీ లాంటి సంస్థ పరిధిలోకి రాదని ఆయన వాదిస్తున్నారు.
కేసులో బలం గురించి పక్కన పెడితే, ఎన్ఏబీ నిజాయితీపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ చర్యలు చేపట్టడం తరచుగా జరుగుతోంది.
రెహమాన్ అరెస్టు విషయంలో ప్రభుత్వ తీరును పాత్రికేయ సంఘాలు, హక్కుల సంస్థలు, విపక్షాలు తప్పుపడుతున్నాయి.
పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీపీ) కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP
‘‘రాజకీయ దురుద్దేశాలతో, కొందరినే లక్ష్యం చేసుకుని ఎన్ఏబీ చర్యలు చేపడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. స్వతంత్రంగా నడిచే మీడియాపై దాడిగా దీన్ని పాత్రికేయ సమాజం చూస్తోంది’’ అని హెచ్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది.
విచారణ పూర్తి కాకుండానే ఓ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్‌ను అరెస్టు చేయడం వేధించే ప్రయత్నంలా కనబడుతోందని పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (పీబీఏ) వ్యాఖ్యానించింది.
ఎన్ఏబీ నిబంధనల ప్రకారం చూసినా, రెహమాన్ అరెస్టు చట్ట విరుద్ధమే అవుతుందని ఆయన కూతురు అనామ్తా అన్నారు.
‘‘ఇది మీడియా స్వేచ్ఛ కోసం పోరాటం. ఈ రోజు జంగ్ ఎడిటర్ ఇన్ చీఫ్‌కు జరిగింది. రేపు ఇంకెవరికైనా జరగొచ్చు’’ అని ఆమె బీబీసీతో వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌లోని మీడియా సంస్థల్లోకెల్లా జంగ్ గ్రూప్‌కు అతిపెద్ద రిపోర్టర్ల నెట్‌వర్క్ ఉంది. ఆ సంస్థ బలం అదే.
గత కొన్ని నెలల్లో, జియో టీవీలోని ప్రముఖ యాంకర్లు తమ ఇంటర్వ్యూలతో ప్రభుత్వాన్ని చాలాసార్లు ఇరకాటంలో పెట్టారు.
‘‘ఎన్ఏబీ ఆరోపణల్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ, ఎన్ఏబీ కొందరినే లక్ష్యంగా చేసుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వానికి ‘ఫ్రెండ్లీ’ (అనుకూల) మీడియా సంస్థల యజమానుల అక్రమాల గురించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ఏబీ వాటినేమీ పట్టించుకుంటున్నట్లుగా కనబడటం లేదు’’ అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ పాత్రికేయుడు బీబీసీతో అన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు పాక్ సైన్యం 2018 ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు మీడియాపై ఆంక్షలు చాలా పెరిగాయి.
మీడియా బెదిరింపులు ఎదుర్కొన్న సందర్భాలూ గతంలో అనేకం ఉన్నాయి.
2014లో జియో టీవీ వ్యాఖ్యాత హమిద్ మిర్‌పై కాల్పులు కూడా జరిగాయి.

ఆ దాడి విషయంలో ప్రభుత్వం ఎవరినీ శిక్షించలేదు.
బలూచిస్తాన్‌లో గల్లంతవుతున్నవారి గురించి కథనాలు ఇచ్చినందుకే ఆయనపై ఆ దాడి జరిగిందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆ అంశం గురించి పాక్ మీడియాలో కథనాలు ఆగిపోయాయి.
మత సంస్థలను, పాక్ సైన్యాన్ని విమర్శించిన సోషల్ మీడియా బ్లాగర్లు కొందరు కూడా 2017 కొన్ని వారాల పాటు అదృశ్యమయ్యారు. విడుదలైన తర్వాత, వాళ్లు వేరే దేశాలకు వెళ్లిపోయారు.
2018 తర్వాత పాక్‌లో మీడియాపై సెన్సార్షిప్ చాలా పెరిగింది.
పాత్రికేయులను బెదిరించడంతోపాటు టీవీ చానెళ్లను మూసేయడం, కేబుల్ ఆపరేటర్లను ప్రభావితం చేయడం జరుగుతోంది.
2000 సంవత్సరంలో పాకిస్తాన్‌కు సైనిక పాలకుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ ఎన్ఏబీని ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులపై చర్యల కోసం ఈ సంస్థ ఏర్పాటైంది.
అయితే, అప్పుడు అతిపెద్ద రాజకీయ పార్టీలుగా ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు సైనిక ప్రభుత్వ తయారుచేసుకున్న కీలుబొమ్మగానే దీన్ని చాలా మంది చూశారు.
ఆయా పార్టీలను వీడి, ముషారఫ్ పంచన చేరినవారిపై ఎన్ఏబీ కేసులను ఎత్తివేస్తూ వచ్చింది.
2018లో వివాదాస్పద ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాక, కొందరు ప్రతిపక్ష నాయకులను ఎన్ఏబీ అరెస్టు చేసింది. సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచుకుంది.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: వేడిలో బతకలేదు.. వెల్లుల్లి తింటే నయమైపోతుంది - ఇవన్నీ తప్పుడు ఆరోగ్య సలహాలు, వీటిని పట్టించుకోకండి
- కరోనావైరస్: ‘నాకూ కోవిడ్-19 పరీక్ష జరగొచ్చు’ - డోనల్డ్ ట్రంప్.. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - ప్రజలు అడిగిన 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్‌లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్
- కరోనావైరస్ భయాన్ని సైబర్ నేరగాళ్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారు ?
- ‘సీఏఏ వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే దిల్లీలో అలర్లు చేయించారు’
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








