‘సీఏఏ వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే దిల్లీలో అలర్లు చేయించారు’: దిల్లీ మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ ఆరోపణ

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫైసల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక నిరసనలను చల్లార్చడానికే దిల్లీలో అల్లర్లను చేయించారని దిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ అని ఆరోపించారు.

దిల్లీ ప్రభుత్వం ముందుగానే సైన్యాన్ని మోహరించాలని కోరి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

బీబీసీతో ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు.

Presentational grey line
News image
Presentational grey line

సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడేందుకు కొన్ని వారాలుగా ఏర్పాట్లు జరిగాయని, ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ వరకూ దిల్లీలో జరిగిందంతా 'ఏక పక్ష దాడి' అని జఫారుల్ ఇస్లామ్ ఖాన్ అన్నారు.

50 ఇళ్లు ఉన్న వరుసలో ఐదు ఇళ్లను తగులబెట్టడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

''30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు ముఖాలు దాచుకునేందుకు హెల్మెట్లు ధరించి ఈశాన్య దిల్లీపై పడ్డారు. అక్కడే 24 గంటలపాటు ఉండి, విధ్వంసానికి పాల్పడ్డారు. మనుషుల్ని చంపారు. ఇదంతా ఎలా సాధ్యం?'' అని జఫారుల్ ప్రశ్నించారు.

ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం ఆ బృందం దిల్లీకి వచ్చి, 24 గంటలపాటు ఇక్కడే ఉందని... ఇళ్లను, దుకాణాలను లూఠీ చేసిందని జఫారుల్ ఆరోపించారు.

ఈశాన్య దిల్లీని సందర్శించిన తర్వాత మార్చి 2న మైనార్టీస్ కమిషన్ ఓ నివేదిక విడుదల చేసింది. అలర్లకు పాల్పడేందుకు దాదాపు 2000 మంది అక్కడికి వచ్చారని అందులో పేర్కొంది.

దిల్లీ అల్లర్లు, జీఐఏ

ఫొటో సోర్స్, GIA

ఇటు గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ అకాడమీషియన్స్ (జీఐఏ) అనే సంస్థ 'ద షహీన్‌బాగ్ మోడల్ ఇన్ నార్త్ ఈస్ట్ దిల్లీ: ధర్నా టు దంగా' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. దిల్లీ అల్లర్లను వామపక్ష-జీహాదీ విప్లవ మోడల్ అని అందులో వర్ణించింది. మిగతా చోట్ల కూడా ఇలాంటివి జరగొచ్చని హెచ్చరించింది.

పార్లమెంటులో బుధవారం ప్రతిపక్షానికి బదులిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా 300 మంది బయటి వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి, దిల్లీ అల్లర్లలో పాల్గొన్నారని అన్నారు.

ఈ అల్లర్ల వెనుక సీఏఏ వ్యతిరేక నిరసనకారుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.

అయితే అమిత్ షా వ్యాఖ్యలను, జీఐఏ నివేదికను దిల్లీ మైనార్టీస్ కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లామ్ ఖాన్ కొట్టిపారేశారు.

దిల్లీ జనాభాలో 12-13 శాతం ఉన్న ముస్లింలు, అల్లర్లలో నష్టపోయినవారిలో మాత్రం 80-90 శాతం ఎందుకు ఉన్నారో అమిత్ షా ఆలోచించుకోవాలని జఫారుల్ అన్నారు.

దిల్లీ ప్రభుత్వం సైన్యాన్ని మోహరించాలని కోరడంతోపాటు ముందుగానే చాలా చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)