కరోనావైరస్‌కు హోమియోపతి మందు ఉందా-ఆయుష్ ప్రకటనతో అయోమయం

హోమియోపతి ఔషధాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హోమియోపతి ఔషధ ప్రయోగాలు కరోనావైరస్‌కు పనిచేయవు
    • రచయిత, అలిస్టెయిర్ కోలెమాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 కరోనావైరస్‌కు హోమియోపతి 'చికిత్స' ఉందని తాము ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, హోమియోపతి ఔషధాలతో కరోనావైరస్‌ను దీటుగా ఎదుర్కోవచ్చంటూ అప్పటికే ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్న సందేశాలకు ప్రభుత్వం జారీ చేసిన ఆ ప్రకటన అడ్డుకట్ట వేయలేకపోయింది.

సంప్రదాయ, ప్రత్యామ్నాయ ఔషధాల వినియోగాన్ని ఆయుష్ (ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, సోవా, రిగ్పా, హోమియోపతి) మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది. అయితే, ఈ మందులు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి శాస్త్రీయమైన రుజువులు లేవు. హిందూ జాతీయవాదులు వాటిని ప్రచారం చేయడంపై కొన్ని విమర్శలున్నాయి.

News image

కరోనావైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జనవరి 29న ఆయుష్ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కరోనావైరస్ లక్షణాలకు చికిత్స అందించేందుకు హోమియోపతిని అనుసరించవచ్చని అందులో పేర్కొంది.

కానీ, చాలామంది ఆ ప్రకటన ఎలాగైనా అన్వయించుకునేలా ఉంది. దాంతో అయోమయం నెలకొంది. కరోనావైరస్‌ను హోమియోపతితో నయం చేయవచ్చని ఆయుష్ శాఖ చెప్పిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారు.

వాస్తవానికి కరోనా వైరస్ ను హోమియో నయం చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

ఇప్పటి వరకు భారత్‌లో కరోనావైరస్ కేసులు 73 నమోదయ్యాయి.

కరోనా వైరస్ భయంతో మాస్కు ధరించిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

"కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల నివారణకు హోమియోపతి; కరోనావైరస్ లక్షణాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే యునాని ఔషధాలు" అనే శీర్షికతో జనవరి 29న ఆయుష్ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన సూచనలు ఇవ్వడంతో పాటు "హోమియోపతి ఔషధం 'ఆర్సినికం ఆల్బమ్ ‌30'ను రోగనిరోధక శక్తిని పెంచే మందుగా తీసుకోవచ్చు" అని అందులో పేర్కొంది.

హోమియోపతిలో ఆర్సినికంను చాలా రకాల రుగ్మతల నివారణకు వినియోగిస్తారు. ఈ ఔషధాన్ని సురక్షితమైనదిగా భావిస్తారు. కానీ, ప్రధాన స్రవంతి వైద్యంలో దీనిని పెద్దగా సిఫార్సు చేయరు.

కోవిడ్-19 వైరస్‌ నివారణ పేరుతో హోమియోపతి గురించి ప్రచారం చేస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొన్న ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ ఇటీవల మరో పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే మందులను మాత్రమే మేం రూపొందించాం. కరోనావైరస్‌తో వచ్చే అనారోగ్యాన్ని ఆ మందు నయం చేస్తుందని మేం ఎప్పుడూ చెప్పలేదు" అని మంత్రి వివరణ ఇచ్చారు.

"అది ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు చేసిన సాధారణ సూచన మాత్రమే" అని ఆయుష్ శాఖ చెబుతోంది. ఉద్దేశపూర్వకంగానే తమ సూచనలను కొందరు వక్రీకరించి ప్రచారం చేశారని వ్యాఖ్యానించింది.

"కొన్ని మీడియా సంస్థలు, వైద్య సంస్థల నుంచి వెలువడిన కథనాలు ఆయుష్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ వైద్య వ్యవస్థల పట్ల ప్రజలలో అపనమ్మకాన్ని సృష్టించడానికి అవి ప్రయత్నించాయి" అని ప్రభుత్వం ఆ ప్రకటనలో ఆరోపించింది.

ఆ ఆరోపణలను ది హిందూ వార్తాపత్రిక అంగీకరించలేదు. ప్రభుత్వం విడుదల చేసిన మొదటి పత్రికా ప్రకటన అత్యంత బాధ్యతా రహితంగా ఉందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

సందేశాలు

వాట్సాప్‌‌లో చక్కర్లు కొడుతున్న సందేశాలు

ప్రభుత్వం నుంచి వివరణలు వచ్చినా, దేశంలోని సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ వంటి మొబైల్ మెసేజింగ్ యాప్‌లలో 'కరోనావైరస్‌కు హోమియోపతి విరుగుడు' అంటూ అనేక సందేశాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.

"కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో హోమియోపతి మాత్రలు ఉపయోగపడతాయని శాస్త్రీయ పరిశోధనల్లో ఎక్కడా వెల్లడికాలేదు" అని ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్ BOOM పేర్కొంది.

వైరల్ సందేశాలను నిశితంగా విశ్లేషించిన ఆ ఫాక్ట్‌చెక్ సంస్థ... ప్రభుత్వ సూచనలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఆ సందేశాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని గుర్తించింది.

"ఆర్సినికమ్ ఆల్బమ్ 30‌ను ఎప్పుడూ పరీక్షించలేదు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి లేదా నిరోధించడానికి అది ఉపయోగపడుతుందని నిరూపితం కాలేదు" అని ఆ వెబ్‌సైట్ తెలిపింది.

హోమియోపతి ఔషధాలకు డిమాండ్ పెరిగిందని దేశంలోని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 3,500 మందికి 11,500 డోసుల హోమియోపతి ఔషధాన్ని పంపిణీ చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక తెలిపింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఒకచోట ఔషధ పంపిణీ కార్యక్రమంలో, న్యూస్ మినిట్ వెబ్‌సైట్‌తో ఒక వైద్యాధికారి మాట్లాడుతూ, "ఈ మాత్రలు కరోనావైరస్ కోసం మాత్రమే కాదు, అన్ని ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌లకూ పనిచేస్తాయి. సామర్థ్యం ఒక్కో వైరస్‌కు ఒక్కో విధంగా ఉంటుంది. ఇది కరోనావైరస్ చికిత్సకు కాదు, నివారణకు మాత్రమే" అని అన్నారు.

"కరోనావైరస్‌ విషయంలో చాలా గందరగోళం ఉంది. దానిని ఎదుర్కొనేందుకు మనం మరింత సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఈ హోమియోపతి మందు వాడినా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు" అని ఒక వ్యక్తి న్యూస్ మినిట్‌తో అన్నారు.

మందులు

ఫొటో సోర్స్, Getty Images

ఆయుష్ శాఖ ఏం చేస్తుంది?

ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతీయ సంప్రదాయ ఔషధాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. వాటిలో కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. నిజానికి, హోమియోపతి 18వ శతాబ్దం ఆఖర్లో యూరప్‌లో ఉద్భవించింది. కానీ, ఇది భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.

అయితే, శాస్త్రీయత లేని మందులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఈ విధానంపై ఉన్నాయి.

2017లో జరిగిన ప్రభుత్వ సర్వే ప్రకారం, దేశంలో ఆయుష్ ఔషధాలకు చాలా తక్కువ ఆదరణ ఉందని, 93 శాతం అల్లోపతి ఆధారిత మందులనే వాడుతున్నారు.

కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ ఔషధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తోంది.

ఇలాంటి "ఔషధాల" గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా దేశాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)