కరోనావైరస్ తెలంగాణలో లేదన్న మంత్రి ఈటల... యూపీలో మరో కోవిడ్-19 కేసు... భారత్‌లో 30కి పెరిగిన బాధితుల సంఖ్య

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో కరోనావైరస్ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న రెండు కరోనావైరస్ కేసుల రిపోర్టుల్లో నెగిటివ్ అని తేలిందని వెల్లడించారు .
ఇప్పటి వరకు ఒకే ఒక్కరికి వైరస్ సోకిందని, అది కూడా ఆయన దుబాయ్ నుంచి రావడం వల్లే జరిగిందని చెప్పారు.
ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావద్దని కోరారు.
రెండు కేసులు నెగిటివ్ వచ్చినంత మాత్రాన అలసత్వం వహించేది లేదని ఎటువంటి పరిస్థితినినైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి అన్నారు.
మరోవైపు భారత్‌లో కొత్తగా మరో కరోనా కేసు నమోదైనట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తికి కోవిడ్-19 వ్యాధి సోకిందని నిర్ధారించారని అధికారులు వెల్లడించినట్టు ఆ వార్తలో పేర్కొంది.
వైరస్ సోకిన వ్యక్తి గతంలో ఇరాన్ వెళ్లి వచ్చారని తెలిపింది .
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అన్ని చర్యలు తీసుకుంటున్నాం - కేంద్రం
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై లోక్‌సభలో ఒక అధికారిక ప్రకటన చేశారు.
వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యవేక్షణలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సమావేశమయ్యామని చెప్పారు.
ఆయన లోక్‌సభలో ప్రకటన చేసే సమయానికి దేశంలో మొత్తం 29 మందికి కరోనావైరస్ సోకిందని, వారికి వైద్యల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
కాలిఫోర్నియాలో కరోనావైరస్ తొలి మరణం
ఇక ప్రపంచంలోని వివిధ దేశాల్లో చూస్తే... కరోనావైరస్ కారణంగా కాలిఫోర్నియాలో తొలి మరణం సంభవించడంతో ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఈ మరణంతో అమెరికాలో కరోనావైరస్ కారణంగా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు .
కాలిపోర్నియాకు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు సాక్రిమెంటో సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మరణించారు. ఈయన గతంలో గ్రాండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నౌక కాలిపోర్నియా తీరంలోనే ఉంది .
మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సుమారు 150 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో గత వారాంతంలోనే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
గ్రీక్ పోర్ట్ ఆఫ్ ఏథెన్స్‌లో కూడా ఓ క్రూయిజ్ నౌకను నిలిపేశారు. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడమే కారణం.
ఇక దక్షిణ కొరియాలో పరిస్థితి కూడా ప్రమాదకరంగానే కొనసాగుతోంది. ఫేస్ మాస్కుల ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ప్రకటించారు.
ఇరాన్‌లో ఇప్పటి వరకు 107 మంది ప్రాణాలు కోల్పోయారని, 3513మందికి వైరస్ సోకిందని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపినట్టు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఇటలీలో విద్యా సంస్థలకు సెలవులు
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటలీలో పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలకు ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో కరోనావైరస్ కారణంగా 95 ఏళ్ల వృద్ధుడు మరణించారు. దీంతో అక్కడ కోవిడ్ -19 ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండుకి చేరింది.
అటు దక్షిణాఫ్రికాలో తొలి కరోనావైరస్ కేసు నమోదయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎంఎఫ్ రూ.3.66లక్షల కోట్ల ఆర్థిక సాయం
కరోనావైరస్ బాధిత దేశాలకు అందించే సాయంలో భాగంగా ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సుమారు 3 లక్షల 66 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
అంతకుముందు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనావైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకు సుమారు 81 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది.

ఫొటో సోర్స్, TOKYO2020
యథావిధిగా ఒలింపిక్స్ !
మరోవైపు ఒలింపిక్స్ యథావిథిగా జరుగుతాయని జపాన్ ఒలింపిక్ మంత్రి స్పష్టం చేశారు. రద్దు అన్నది ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
దక్షిణ కొరియాలో కోవిడ్-19 కేసుల సంఖ్య 5,766కి చేరింది. దక్షిణ కొరియా పర్యాటకులపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది.
తమ దేశస్థులెవ్వరూ విదేశీయానం చెయ్యద్దని, అలాగే తమ దేశంలో ఉన్న విదేశీయులు కూడా దేశం విడిచి వెళ్లద్దని యూఏఈ ఆదేశించింది.
తప్పని సరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తల తీసుకోవాలని అలాగే విమానాశ్రయాల్లో వైద్యులు నిర్ధేశించిన పరీక్షలు చేసుకున్న తర్వాత ఇంట్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో నిర్దేశిత సమయం ఉండాలని యూఏఈ వైద్య శాఖ స్పష్టం చేసింది .
ఒక వేళ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాల్లో ఉండటం తప్పనిసరి అని తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- ఉత్తర కొరియా: కొత్త సంవత్సరంలో రెండు క్షిపణుల పరీక్ష
- నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా
- తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు నమోదు
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- కరోనావైరస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి మీ పిల్లలకు ఎలా చెప్పాలి?
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









