కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాబర్ట్ కఫే
- హోదా, బీబీసీ హెడ్ ఆఫ్ స్టాటిస్టిక్స్
ప్రాణాంతక కరోనావైరస్ 50కి పైగా దేశాలకు వ్యాపించింది.
ప్రతి వెయ్యి కరోనావైరస్ కేసుల్లో ఐదు నుంచి 40 కేసుల్లో రోగి మరణించే ఆస్కారం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకొంచెం నిర్దిష్టంగా చెప్పాలంటే- వెయ్యి మందిలో తొమ్మిది మంది అంటే దాదాపు ఒక శాతం మంది బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
బ్రిటన్ ప్రభుత్వ "అత్యుత్తమ మదింపు" ప్రకారమైతే మరణాల రేటు రెండు శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండే ఆస్కారముందని ఆరోగ్య శాఖ మంత్రి మ్యాథ్ హాన్‌కూక్ ఆదివారం చెప్పారు.
బాధితుల వయసు, లింగం, ఆరోగ్య స్థితి, వారు నివసించే ప్రాంతంలో ఉండే ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ లాంటి అంశాలపై కోవిడ్19 మరణాల రేటు ఆధారపడి ఉంటుంది.

మరణాల రేటును లెక్కగట్టడం చాలా కష్టం
ఏదైనా వైరస్ వ్యాపించినప్పుడు అది సోకిన ప్రతి ఒక్కరూ వైద్యులను సంప్రదించరు. అత్యధిక వైరస్‌ల విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. వైరస్ సోకిన లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే అత్యధికులు వైద్యులను సంప్రదించరు. అందువల్ల బాధితుల లెక్కింపులో ఇలాంటి కేసులు అన్నీ పరిగణనలోకి రాకపోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల్లో మరణాల రేటు ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తుండటానికి ఇదో ప్రధాన కారణం.
వైరస్ సోకిన లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని గుర్తించడంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉండగా, మరికొన్ని దేశాలు బాగా వెనకబడి ఉన్నాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ జరిపిన ఓ పరిశోధనలో తేలింది.
కేవలం అధికారికంగా నమోదైన కేసుల ప్రాతిపదికగానే లెక్కగట్టే మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మరణాల రేటుకు మరో పార్శ్వం కూడా ఉంది.
ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి లేదా దానివల్ల చనిపోవడానికి సమయం పడుతుంది. మరణాల రేటు లెక్కించే సమయానికి ప్రాణాలతో ఉన్న బాధిత వ్యక్తి తర్వాత చనిపోయే ఆస్కారం కూడా ఉంది. అదే జరిగితే, మరణాల రేటును తక్కువగా లెక్క కట్టినట్లు అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని శాస్త్రవేత్తలు మరణాల రేటును అంచనా వేస్తారు.
నిర్దిష్టమైన చిన్న గ్రూపులపై అధ్యయనం జరిపి, వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్న కేసుల నిష్పత్తిని అంచనా వేస్తారు. ఇలాంటి గ్రూపులపై గట్టి పర్యవేక్షణ ఉంటుంది. వివిధ దేశాలు చైనా నుంచి విమానాల్లో స్వదేశాలకు తీసుకొచ్చిన కరోనావైరస్ బాధితులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే చైనాలోని హుబే రాష్ట్రం డేటాను మాత్రమే చూస్తే మరణాలు రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. చైనాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హుబేలో మరణాల రేటు బాగా ఎక్కువగా ఉంది. హుబే రాజధాని వుహాన్‌లోనే వైరస్ తొలుత బయటపడింది. మరణాల రేటు లెక్కింపులో హుబేకు మాత్రమే పరిమితం కారు.
ఇలా అన్ని రకాల ఆధారాలను బట్టి శాస్త్రవేత్తలు మరణాల రేటు ఎంత 'రేంజ్'లో ఉండొచ్చో చెబుతారు. అలాగే ప్రస్తుతం ఇది ఎంత ఉందనేదానిపై నిర్దిష్టమైన అంచనాను అందిస్తారు.
ఎన్ని లెక్కలు వేసినా, అందరికీ వర్తించే ఏకైక మరణాల రేటు ఏదీ లేదు. ఎందుకంటే వైరస్ అందరిపైనా ఒకే విధంగా ప్రభావం చూపడం లేదు.

ఎవరికి ఎంత ముప్పు?
కోవిడ్19 వ్యాధి వల్ల వృద్ధులు, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ఆస్కారం ఎక్కువ.
నడివయసువారి కన్నా వయసు బాగా పైబడినవారిలో మరణాల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి భారీ అధ్యయనంలో వెల్లడైంది.
30 ఏళ్లలోపువారిలో మరణాల రేటు అత్యంత తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు.
వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో పోలిస్తే మధుమేహం, అధిక రక్తపోటు(హైబీపీ) లేదా గుండెజబ్బులు, లేదా శ్వాసకోశ వ్యాధులున్న బాధితుల్లో మరణాల రేటు ఐదింతలు ఎక్కువగా ఉంది.
మహిళలతో పోలిస్తే మగవారిలో మరణాల రేటు కొంచెం ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే ప్రాంతంలో ఏయే వర్గాలకు ఎంత ముప్పుందనేదానిపై పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
చైనాలో 80 ఏళ్ల బాధితులకు ఒక రకమైన ముప్పుంటే, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో అదే వయసున్న బాధితులకు వేర్వేరు రకాల ముప్పులు ఉండొచ్చు.
వ్యాధి నుంచి కోలుకోవడం, కోలుకోలేకపోవడం బాధితులకు అందే చికిత్సపైనా ఆధారపడి ఉంటుంది. వైరస్ వ్యాప్తి తీవ్రత, వనరుల లభ్యతపై చికిత్స ఆధారపడి ఉంటుంది. వైరస్ శరవేగంగా, విస్తృతంగా వ్యాపిస్తుంటే బాధితులందరికీ అవసరమైన స్థాయిలో చికిత్స అందకపోవచ్చు.

- కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
మరణాల రేటు: ఫ్లూ కన్నా ఎక్కువా?
వేర్వేరు ఇన్‌ఫెక్షన్ల మరణాల రేట్లను పోల్చలేం. ఎందుకంటే ఓ మోస్తరు ఫ్లూ లక్షణాలున్నా చాలా మంది డాక్టర్‌ను సంప్రదించరు. అందువల్ల ఏటా ఫ్లూ కేసులు ఎన్ని ఉన్నాయి, ఏదైనా కొత్త వైరస్ కేసులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు తెలియదు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
- "పసి బిడ్డలను చెత్త కుండీలో పడేయడం నిషిద్ధం"
- నీటిపై తేలియాడేలా వెనిస్ నగరాన్ని ఎలా నిర్మించారు...
- అమెరికాలో కరోనావైరస్... వాషింగ్టన్లో 50 ఏళ్ల వ్యక్తి మృతి
- తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- డయానా నుంచి ట్రంప్ వరకు: తాజ్‌మహల్‌ను సందర్శించిన విదేశీ ప్రముఖుల ఫొటోలు
- తాజ్‌మహల్: కళ్లు తెరవకుంటే కనుమరుగే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










