కోవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘర్
- హోదా, బీబీసీ ఆరోగ్యం, సైన్స్ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఇంకా పెద్ద ముప్పుగానే కొనసాగుతోంది. ఈ వైరస్ అక్టోబరు 7వ తేదీ నాటికి 188 దేశాలకు వ్యాపించింది. ప్రపంచం మొత్తంలో దాదాపు 3.60 కోట్ల కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 10.55.17 లక్షల మందికి పైగా చనిపోయారు.
భారతదేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 67 లక్షలకు చేరుకుంది. చనిపోయిన వారి సంఖ్య దాదాపు లక్షకుపైనే ఉంది. ప్రపంచంలో అత్యధిక కేసుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో భారత్ ఉంది. మరణాల విషయంలో మూడో స్థానంలో ఉంది.
తెలుగు రాష్ట్రాలలోనూ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 7.26 లక్షల కేసులు నమోదయ్యాయి. 6052 మంది చనిపోయారు. తెలంగాణలో 2,04,748 కేసులు నమోదు కాగా 1189 మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కరోనావైరస్ ప్రపంచమంతా విజృంభిస్తున్నా.. ఆ వైరస్ కలిగించే కోవిడ్-19 వ్యాధి నుంచి శరీరానికి రక్షణనిచ్చే వ్యాక్సిన్ ఏదీ ఇంకా విస్తృత వినియోగం కోసం ఆమోదం పొందలేదు.
వేగంగా వ్యాక్సిన్ తయారు చేయటం కోసం వైద్యరంగ నిపుణులు శాయశక్తులా శ్రమిస్తున్నారు. గ్రామాల్లోనూ వ్యాధి విజృంభిస్తోంది.
కరోనావైరస్ వ్యాక్సిన్ ఎందుకంత అత్యవసరం?
ఈ వైరస్ చాలా సులభంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెజారికీ ప్రజలకు ఈ వైరస్ నుంచి ముప్పు ఉంది.
సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారు చేస్తే ఈ వైరస్ నుంచి మనుషులకు రక్షణ లభించగలదు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వైరస్‌ను ఎదుర్కొనేలా శరీరంలోని రోగనిరోధక శక్తికి వ్యాక్సిన్ శిక్షణనిస్తుంది. తద్వారా వైరస్ సోకినా కూడా జనం జబ్బుపడకుండా ఉంటారు.
అలాంటి పరిస్థితి ఉంటే లాక్‌డౌన్‌లను మరింత సురక్షితంగా తొలగించవచ్చు. ప్రజలు మళ్లీ కాస్త స్వేచ్ఛగా తిరగవచ్చు. సామాజిక దూరం నిబంధనలను సడలించవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
వ్యాక్సిన్ తయారీలో ఇప్పటి వరకు పురోగతి ఏమిటి?
పరిశోధన కనీవినీ ఎరుగనంత వేగంగా సాగుతోంది.
ఈ ఏడాది ఆగస్టు 11న స్పుత్నిక్ వీ పేరుతో తొలి కోవిడ్-19 వ్యాక్సీన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సీన్ అద్భుతంగా పనిచేస్తోందని తెలిపింది. అయితే, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఈ వ్యాక్సీన్ ఇంకా దాటుకు రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని సమర్థమంతమైన వ్యాక్సీన్‌గా చెప్పలేమని వివరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం 34 కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సీన్‌ను తయారుచేస్తున్నాయి. ఇవి క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. మరోవైపు మూడు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ రెండో దశలో ఉన్నాయి.
మరో 142 సంస్థలు కూడా ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.
ఆస్ట్రాజెనెకా తయారుచేస్తున్న ఆక్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ ఈ రేసులో అన్నింటి కంటే ముందుందని, దీన్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి రావొచ్చునని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నాలుగు కరోనావైరస్ కుటుంబాలకు చెందిన వ్యాక్సీన్‌లు అందుబాటులో ఉన్నాయని, అయితే ఇవి కోవిడ్-19 నుంచి రక్షణ కల్పించలేవని ఆయన అన్నారు.
అయితే, ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Cezary Kowalski/SOPA Images/LightRocket via Getty
మరోవైపు, కొన్ని నెలల్లోనే వ్యాక్సీన్ తయారు కావొచ్చని వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో అసలు ఈ వ్యాక్సీన్ ధర ఎంత ఉంటుంది? వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని డోసుల వ్యాక్సీన్ అవసరం అవుతుంది? తదితర ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి.
తాము తయారుచేస్తున్న కోవిడ్-19 వ్యాక్సీన్ పది యూరోలు (రూ. 900) కంటే తక్కువే ఉంటుందని సనోఫి సంస్థ అధిపతి ఒలివియర్ బొగిలోట్ తెలిపారు.
''ధరను ఇంకా పూర్తిగా నిర్ణయించలేదు. తర్వరలోనే దీన్ని నిర్ణయిస్తాం. ధర పది యూరోల కంటే తక్కువే ఉంటుంది''అని ఫ్రాన్స్ ఇంటర్ రేడియోతో ఒలివియర్ తెలిపారు.
ఆస్ట్రాజెనెకాతో పోల్చినప్పుడు ధర ఎక్కువగా ఉండటంపై ఒలివియర్ మాట్లాడారు. ''పరిశోధన ఖర్చులు, ఉత్పత్తి, ఇతర అంతర్గత కారణాల వల్ల ధరల్లో వ్యత్యాసముంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఉత్పత్తిని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేసింది''
చైనా సంస్థ సినోఫార్మ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images
తమ వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని చైనా ఫార్మా సంస్థ సినోఫార్మ్ ఛైర్మన్ లీయూ జింగ్‌చెన్ వెల్లడించారు.
మార్కెట్‌లో దీని రెండు డోసుల ధర వెయ్యి చైనా యువాన్‌ల(పది వేల రూపాయలు) కంటే తక్కువగానే ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులకు ఈ డోసులను ఉచితంగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
చైనా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో ఈ వ్యాక్సీన్‌ను చేర్చితే.. ఖర్చంతా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చైనా అధికారులు వెల్లడించారు.
మరోవైపు చైనాలో ఓ వ్యాక్సీన్‌తో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రయోగాల్లో తేలింది. ఈ వ్యాక్సీన్‌ను చైనా సైనికులకు అందుబాటులో ఉంచుతున్నారు.
మోడెర్నా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి దశలోనున్న తమ వ్యాక్సీన్ 33 నుంచి 37 డాలర్ల (దాదాపు రూ.2,500) మధ్యలో ఉంటుందని గత ఆగస్టులో మోడెర్నా వెల్లడించింది.
వ్యాక్సీన్‌ను వీలైనంత తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించినట్లు కేంబ్రిడ్జ్‌కు చెందిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ బాన్‌సెల్ వివరించారు.
''అందరికీ ఈ వ్యాక్సీన్ అందాలని కంపెనీ భావిస్తోంది. అందుకే వీలైనంత తక్కువగా ధరను ఉంచాలని మేం భావిస్తున్నాం''
ఫైజర్ వ్యాక్సీన్
ఈ ఏడాది జులైలో బయోఫార్మా బయోఎన్‌టెక్ కంపెనీతో అమెరికా ప్రభుత్వం 1.97 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సీన్ ధర ఒక డోసుకు 19.50 డాలర్ల వరకూ ఉంటుందని ఫైర్స్‌ఫార్మా తెలిపింది. దీనిలో లాభాలు 60 నుంచి 80 శాతం వరకూ ఉంటాయని పేర్కొంది.
ఈ వ్యాక్సీన్ అయితే, రెండు డోసులు తీసుకోవాలి. సామాన్యులు దీని కోసం 40 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద అయితే ఇది 20 డాలర్లలోపే ఉంటుంది.
మరోవైపు అమెరికాలోని గత మే నెలలో ఎనిమిది మందిపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను నిర్వీర్యం చేయగలిగే యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయని తేలింది.
వైరల్ ప్రొటీన్ల సాయంతో రోగ నిరోధక శక్తిని ప్రేరేపించే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఒక వ్యాక్సిన్‌ను తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పట్టొచ్చు.
అయితే తాజా వ్యాక్సిన్లు మాత్రం కొన్ని నెలల్లోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు.
2021 ఏడాది మధ్యలో విడుదలకు అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే వైరస్(అధికారికంగా Sars-CoV-2) పుట్టినప్పటి నుంచి 12-18 నెలల కాలంలో అందుబాటులోకి వస్తుందన్నమాట.
అదే జరిగితే అది సైన్సులో అద్భుతమే.
అయితే అది ఎంత వరకు పని చేస్తుందనేదానికి గ్యారంటీ లేదు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

ఇంకా చేయాల్సిందేంటి?
శరీరం మీద దాడిచేసే వైరస్ లేదా బ్యాక్టీరియా ఎలా ఉంటుందో వ్యాక్సిన్ మన శరీరంలోని రోగ నిరోధక శక్తికి ప్రమాదరహితమైన శాంపిల్ ద్వారా చూపిస్తుంది.
శరీర రక్షణ వ్యవస్థ ఆ వైరస్ లేదా బ్యాక్టీరియాలు బయటి నుంచి దాడి చేస్తున్నాయని గుర్తించి వాటి మీద ఎలా పోరాటం చేయాలో నేర్చుకుంటాయి.
ఆ తర్వాత నిజమైన వైరస్ మన శరీరానికి సోకినట్లయితే.. దాని మీద ఎలా పోరాడాలో శరీరానికి ముందే తెలుసుకాబట్టి దానిని ఎదుర్కొని నిర్వీర్యం చేస్తుంది.
నిజమైన వైరస్‌ను ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేయటం దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ.
తట్టు, పొంగు, గవద బిళ్లలకు వ్యాక్సిన్లలో బలహీన పరచిన వైరస్‌ను ఉపయోగిస్తారు. అందువల్ల ఆ వైరస్ పూర్తిస్థాయిలో సోకదు.
ఇక సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్‌లో.. మనుషులకు సోకుతున్న ప్రధాన రకాల ఫ్లూ వైరస్ ఉంటాయి. ఈ వ్యాక్సిన్ ఆయా వైరస్‌లను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది.
కొందరు శాస్త్రవేత్తలు.. ముఖ్యంగా చైనా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఇక పలు కొత్త విధానాల్లో.. పెద్దగా పరీక్షించని విధానాల్లో కూడా వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నిస్తున్నారు. వీటిని 'ప్లగ్ అండ్ ప్లే' వ్యాక్సిన్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కొత్త కరోనావైరస్ జెనెటిక్ కోడ్ మనకు తెలుసు కాబట్టి.. దానిని తయారు చేయటానికి అవసరమైన బ్లూప్రింట్ మొత్తం మన దగ్గర ఉన్నట్టే.
ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఈ జెనెటిక్ కోడ్‌లోని ఒక భాగాన్ని చింపాంజీలకు సోకే ఒక ప్రమాదరహిత వైరస్‌లో ప్రవేశపెట్టారు. తద్వారా అవి కరోనావైరస్ లాగానే కనిపించే సురక్షితమైన వైరస్‌ను తయారు చేసినట్లు కనిపిస్తోంది. శరీరంలో కరోనావైరస్ మీద పోరాడే రోగ నిరోధక శక్తిని ప్రేరేపించేందుకు ఈ వైరస్ సరిపోతుందని అంటున్నారు.
ఇతర పరిశోధక బృందాలు ముడి జన్యు సంకేతాన్ని (విధానాన్ని బట్టి డీఎన్‌ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ) వినియోగిస్తున్నారు. వీటిని ఒకసారి శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అవి కొద్దికొద్దిగా వైరల్ ప్రొటీన్లను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి. వీటి మీద పోరాటం చేయటం ఎలాగనేది రోగనిరోధక శక్తి నేర్చుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా కొత్త పద్ధతి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంతమందికి ఇవ్వాలి?
కానీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనుషుల్లో రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా వ్యాధిని అరికట్టాలంటే దాదాపు ప్రపంచ జనాభాలో 60-70శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది (దీన్నేహెర్డ్ ఇమ్యూనిటీ అంటారు ).
అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అన్ని వయసుల వారికీ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందా?
వృద్ధుల్లో వ్యాక్సిన్ తక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే వయసు మళ్లిన రోగనిరోధక వ్యవస్థలు వ్యాక్సిన్లకు అంత బాగా ప్రతిస్పందించవు. ఏటా తీసుకునే ఫ్లూ వ్యాక్సిన్ విషయంలో ఇది మనకు కనిపిస్తుంది.
అయితే ఎక్కువ సార్లు వ్యాక్సిన్ డోసులు ఇవ్వటం ద్వారా కానీ, రోగనిరోధక వ్యవస్థను ఉత్ప్రేరితం చేసే రసాయనంతో కానీ కలిపి వాడటం ద్వారా కానీ ఈ సమస్యను అధిగమించటానికి అవకాశం ఉంది.
వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు?
ఒక వ్యాక్సిన్ సిద్ధమైనపుడు.. ఆరంభంలో దాని ఉత్పత్తి, సరఫరా పరిమితంగా ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యతా క్రమం ప్రకారం వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
నిత్యం కోవిడ్-19 పేషెంట్లతో టచ్‌లో ఉండే వైద్య సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
తర్వాత వయసు మళ్లిన వారిపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి రెండో ప్రాధాన్యం వృద్ధులది.
అలాగే వైరస్ వల్ల ఎక్కువ ముప్పు ఉన్నవారు - అంటే అప్పటికే ఇతరత్రా వ్యాధులతో బలహీనంగా ఉన్న వారు కూడా ఈ ప్రాధాన్యతా క్రమంలో ఉండొచ్చు.
వ్యాక్సిన్‌ను ఎలా తయారు చేస్తారు?
ఒక వ్యాక్సిన్ శరీరంలోని రోగ నిరోధక శక్తికి మనలో ఉన్న వైరస్‌ను చూపిస్తుంది.
శరీరంలోని కణాలు వైరస్‌ను గుర్తించి వాటి మీద పోరాటం మొదలు పెడతాయి.
వ్యాక్సిన్ తయారీలో ఒరిజినల్ వైరస్‌ను ప్రవేశ పెట్టడం అనే ప్రక్రియ దశాబ్దాలుగా సాగుతోంది.
తట్టు, పొంగు, గవద బిళ్లలులాంటి వాటికి మాత్రం బలహీనంగా ఉన్న వైరస్‌ను ప్రవేశపెడతారు.
సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు అవి శరీరంలో తిరుగుతూ ఈ వ్యాధికారక వైరస్‌లను మట్టుబెడతాయి.
కానీ కరోనా ఇందుకు భిన్నం. ఇది కొత్తది. అందుకే దీనికి ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో వ్యాక్సిన్ తయారు చేయాలని భావిస్తున్నారు.
ఎందుకంటే ఈ వైరస్ జెనెటిక్ కోడ్ సైంటిస్టులకు తెలుసు. ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఈ జెనెటిక్ కోడ్‌లోని చిన్న భాగంలో చింపాంజీలకు సోకే వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా ప్రమాదకరం కాని కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు?
వ్యాక్సిన్ సిద్ధమైనా అది కొద్ది మొత్తంలోనే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యతను బట్టి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది.
నిత్యం కోవిడ్-19 పేషెంట్లతో టచ్‌లో ఉండే హెల్త్ కేర్ వర్కర్స్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
తర్వాత వయసు మళ్లిన వారిపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి రెండో ప్రాధాన్యం వృద్ధులది.
వృద్ధులతో కలిసి ఉండేవారు తరువాతి ప్రాధాన్యతా క్రమంలో ఉంటారు.
అయితే పెద్ద వయసులో వ్యాక్సిన్‌లో అసలు పని చేయదని కాదు గానీ, అవకాశాలు తక్కువ ఉంటాయి అంటున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్ సంగతేంటి?
ప్రతి ఔషధానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది.
ఆఖరికి పారాసెటమాల్‌కు కూడా ఏదో ఒక దుష్ప్రభావం ఉంటుంది.
కాకపోతే కరోనా వైరస్ వ్యాధి వ్యాక్సిన్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి చూశాకే సైడ్ ఎఫెక్ట్ కు అవకాశాలు తెలుస్తాయి.
వ్యాక్సిన్ వచ్చేలోపు ఏం ఏయాలి?
వ్యాక్సిన్లు ఇన్‌ఫెక్షన్లు రాకుండా రక్షణ కల్పిస్తాయి. కానీ, వాటిని అడ్డుకునేందుకు అత్యుత్తమ విధానం పరిశుభ్రత పాటించడమే.
కరోనావైరస్ సోకినా, చాలామందిపై దాని ప్రభావం స్వల్పంగానే ఉంటుంది.
క్లినికల్ ట్రయల్స్‌లో కొన్ని యాంటీ-వైరల్ ఔషధాలను వాడుతున్నారు. అయితే అవి పనిచేస్తాయో, లేదో కచ్చితంగాచెప్పలేం.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








