కరోనావైరస్: న్యూ నార్మల్ ఎలా ఉంటుంది? ఇకపై మనం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పనిచేస్తామా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎవా ఓంటివెరోస్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
కరోనావైరస్ వ్యాప్తితో కోట్లాది మంది వృత్తి జీవితాల్లో భారీ మార్పులు వచ్చాయి. రిమోట్‌గా పనిచేయటం పెరిగింది. బలవంతపు సెలవులు పెరిగాయి. ఉద్యోగాలు కూడా పోయాయి.
భారతదేశంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు.
అయితే.. లాక్‌డౌన్ తర్వాత జీవితాలు ఎలా ఉంటాయనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో మనం ఎలా, ఎక్కడ, ఎప్పుడు పనిచేస్తామనే విషయాల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.
‘‘జనం ఎలా కలవాలి, ఉమ్మడిగా ఎలా పనిచేయాలి అనే దాని గురించి కొత్త అవగాహనలు వెల్లువెత్తుతాయి’’ అని హెన్లీ బిజినెస్ స్కూల్ లెక్చరర్ డాక్టర్ మిరియం మారా పేర్కొన్నారు.
‘‘ఇప్పటికే.. మళ్లీ పనుల్లోకి వెళ్లటమంటే.. ఎన్ని గంటలు పనిచేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, శ్రమను ఎలా క్రోడీకరించాలి అనే వాటిపై పునరాలోచనలు చేయటం మనం చూస్తున్నాం’’ అని ఆమె చెప్పారు.
భవిష్యత్తులో వారంలో పనిచేసే సమయం మరింత తగ్గుతుందని, కార్మిక మార్కెట్ మరింత సరళంగా ఉంటుందని న్యూజీలాండ్, కెనడా, ఫిన్‌లాండ్‌లు సూచించాయి.
మనం పనిచేసే తీరును మార్చటం వల్ల ఉత్పాదకత పెరగవచ్చు. ఉద్యోగుల తొలగింపును నివారించవచ్చు. ఎక్కువ సమయం మిగలటం వల్ల దానిని మన ఆరోగ్యానికి, సంక్షేమానికి, విశ్రాంతికి వెచ్చించవచ్చు.
కానీ.. లెక్కకు మిక్కిలి కంపెనీలు ఎన్నడూ చూడని ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో ప్రయోగాలు చేయటం ప్రమాదకరమనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువగా పనిచేయటం
మనం ఎలా పనిచేస్తామనే దానిని పునర్నిర్వచించాలనుకుంటే.. అసలు మనం నిజంగా ఎంత సేపు పనిచేయాల్సిన అవసరం ఉంటుందనేది నిర్ధారించుకోవటంతో మొదలుపెట్టాలేమో.
డాక్టర్ మారా గత ఏడాదంతా.. బ్రిటన్‌లో వారానికి నాలుగు రోజులే పని దినాలు అమలు చేస్తున్న 250 కంపెనీల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేశారు.
‘‘ఈ నాలుగు పని దినాల వారం పూర్తి వేతనంతోనే ఉండాలి. లేదంటే అది పార్ట్ టైమ్ పని అవుతుంది’’ అంటారామె.
దీనివల్ల ఉత్పాదకత పెరగటంతో పాటు.. సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యం పెరగటం వల్ల ఆ కంపెనీలకు 10,400 కోట్ల పౌండ్లు ఆదా అయ్యాయని ఆమె గుర్తించారు.
కానీ.. వారంలో పని దినాలు తగ్గించటం వల్ల కంపెనీలకు ఎక్కువ ఖర్చవుతుందని ఇంకొందరు వాదిస్తున్నారు.
‘‘తక్కువ పని చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చుననేది నెరవేరని కల. అందుకు చాలా ఆధారాలున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన ఎకనమిక్స్ ప్రొఫెసర్ డేనియల్ హామర్మెష్ పేర్కొన్నారు.
అలాగే ఇప్పటికే అప్పుడప్పుడూ, కాలనుగుణంగా పనులు చేసే వారికి కూడా.. వారంలో పని దినాలను తగ్గించటం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు.
‘‘నేను పాఠాలు చెప్పే రోజులను చాలా సులభంగా తగ్గించుకోగలను’’ అంటారు మ్యూజిక్ టీచర్ టాటీ థియో. అయితే.. ఆమె ప్రదర్శన ఇచ్చే పనిని కుదించుకోవటం మాత్రం అంత సులభం కాదు.
‘‘రెండు నెలల పాటు ప్రదర్శనలు ఏవీ ఉండవు. కానీ సీజన్‌లో మాత్రం వారంలో ఏడు రోజులూ పని చేయాల్సి ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.
అయితే.. తక్కువ గంటలు పనిచేయటమనేది చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటుందని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన సైకోథెరపిస్ట్ థెరీస్ పేర్కొన్నారు. కానీ తన వంటి వైద్య సిబ్బంది తక్కువ సమయంలో ఎక్కువ మంది రోగులకు ఎలా చికిత్స అందించగలరో తెలియటం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలివిగా పనిచేయటం
ఈ మహమ్మారి సమయంలో కంపెనీలు తమ వినియోగదారులతో అనుసంధానం కావటానికే కాదు.. తమ ఉద్యోగుల చేత పనిచేయించుకోవటానికి కూడా టెక్నాలజీ మీద ఆధారపడాల్సి వచ్చింది.
కనీసం సంపన్న సంస్థల్లోనైనా చాలా మంది ఉద్యోగుల విషయంలో – భవిష్యత్తులో ‘‘ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండి.. ఆఫీసులను తక్కువగా వినియోగిస్తూ దూరం నుంచే పనిచేయటం’’ ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ హామెర్మెష్ పేర్కొన్నారు.
‘‘దానివల్ల వస్తువులు, సేవల సామర్థ్యం కానీ నాణ్యత కానీ తగ్గుతుందని కాదు. ఇది కేవలం పని చేయటంలో భిన్నమైన పద్ధతి మాత్రమే. ఆ మేరకు క్లయింట్లు, కస్టమర్ల అంచనాలు కూడా మారాయి’’ అంటారు డాక్టర్ మారా.
సంగీతం టీచర్ టాటీకి ఇంట్లో నుంచి పనిచేయటం వల్ల మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి.
‘‘ఇంటి నుంచి పనిచేయటం నాకు చాలా సులభంగా ఉంటుంది. కానీ నా విద్యార్థులతో వ్యక్తిగతంగా అనుసంధానం కాలేకపోవటం పెద్ద లోటుగా అనిపిస్తోంది’’ అన్నారామె.
‘‘కొన్నిసార్లు విద్యార్థుల చేతిలోని వాయిద్య పరికరాన్ని కొంచెం సరిచేయాల్సి వస్తుంది. వారు దానిని పట్టుకునే విధానాన్ని, వారు నిల్చున్న లేదా కూర్చున్న స్థితిని సరి చేయాల్సి వస్తుంది. స్క్రీన్ ద్వారా ఆ పని చేయటం సులభం కాదు’’ అని ఆమె వివరించారు.
ఇక స్క్రీన్ మీద ప్రదర్శనలు ఇవ్వటం మరింత కష్టం అంటారామె.
‘‘ఆ విషయంలో ఇంటి నుంచి పనిచేయటమనేది అసాధ్యం. చేయలేం. ప్రదర్శనలు నిర్వహించలేం. అసలు ప్రాక్టీసే చేయలేం’’ అని చెప్పారు.
బరోక్ చాంబర్ ఆర్కెస్ట్రాను రిహార్సల్ చేయించటానికి ఆమె జూమ్, స్కైప్, ఫోన్ తదితరాల ద్వారా ప్రయత్నించారు. కానీ.. డిజిటల్ జాప్యం వల్ల అదసలు అసాధ్యంగా మారింది. ‘‘మేం అందరం కలిసి ఉంటేనే విజయం సాధిస్తాం. కానీ ఇప్పుడలా ఉండలేం’’ అని పేర్కొన్నారు.
మరోవైపు.. థెరీస్‌కయితే పనికి – ఇంటికి మధ్య సాన్నిహిత్యం పెరగటం చాలా కష్టంగా మారింది.
‘‘నేను సైకోథెరపిస్ట్‌ని (మానసిక రుగ్మతల వైద్యురాలు). నేను చేసే పని అన్నిసార్లూ ఇంటి వాతావరణానికి సరిపోదు’’ అని ఆమె పేర్కొన్నారు.
‘‘కొన్ని రకాల విషయాలను, పదాలను నా ఇంట్లోకి తీసుకురావటం కష్టం. నా పని సమయాన్ని, నా కుటుంబ సమయాన్ని వేరు చేయటం కూడా కష్టంగా మారుతోంది’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Dan Bridge
సురక్షితంగా పనిచేయటం
షాపులు, హాస్పిటళ్లు, పొలాలు వంటి ప్రాంతాల్లో పనిచేసే వారు తమ ఉద్యోగాలను దూరం నుంచి చేయటం సాధ్యం కాలేదు. కానీ ఈ మహమ్మారి సమయంలో వైరస్ సోకకుండా నియంత్రించటం కొత్త ఆందోళనగా మారింది.
‘‘పని ప్రదేశాల్లో పని చేయాల్సిన అవసరం ఉండే వాళ్లకు.. సామాజిక దూరం అనేది ప్రధాన విషయం. కాబట్టి కార్మికులు పెద్ద సంఖ్యలో పనుల్లోకి తిరిగి రావటం మనం చూడకపోవచ్చు’’ అంటారు డాక్టర్ మారా.
భవనాల్లో ఉండే వ్యక్తుల సంఖ్యను తగ్గించటానికి మరో పరిష్కారం.. పని వేళలను వంతుల వారీగా మార్చటం, షిఫ్టులు ప్రవేశపెట్టటం వంటి చర్యలు చేపట్టటం.
ఇక విశ్రాంతి, వినోద కార్యక్రమాలు అందించే వాళ్లకు నిర్దిష్ట సవాళ్లు ఎదురవుతున్నాయి. సినిమా హాళ్లు, సంగీత కచేరీ వేదికల్లో సామాజిక దూరం పాటించటమంటే టికెట్లు కొనేవాళ్ల సంఖ్యను తగ్గించటమే. దానివల్ల వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా దక్కకపోవచ్చు.
‘‘కనీసం ఖర్చులు రావాలన్నా నిర్దిష్ట సామర్థ్యం మేరకు హాళ్లు నిండాల్సి ఉంటుంది’’ అంటారు టాటీ.
‘‘మొత్తం ప్రేక్షకుల సామర్థ్యంలో పావు వంతు మంది మాత్రమే వచ్చేట్లయితే.. ఎవరైనా ఆర్థిక మద్దతు ఇవ్వటమో, ప్రభుత్వ రాయితీలు అందించటమో లేకపోతే అవి జరగవు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందరికీ ఆదాయం
మనం ఎక్కడ, ఎలా జీవనోపాధి పొందుతాము అనే దానికన్నా కానీ.. ‘‘ఏ పనికి’’ మనకు జీతాలు వస్తాయి అనేది.. భవిష్యత్తులో మన పని విషయంలో అత్యంత విప్లవాత్మకమైన ఆలోచన కావచ్చు.
‘‘అందరికీ ఉచితంగా డబ్బులు ఇచ్చే విషయాన్ని మనం పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. అది కూడా ఏదో సాయంగా కాదు.. ఒక హక్కుగా ఇవ్వాలి’’ అంటారు చరిత్రకారుడు రట్జర్ బ్రెజ్మన్.
ఈ సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ – యూబీఐ) అనేది ‘‘కేవలం కొన్నేళ్ల పాటు మాత్రమే కాదు.. కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే కాదు.. కేవలం పేదలకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉండాలి’’ అని ఆయన తన ‘‘ఉటోపియా ఫర్ రియలిస్ట్స్’’ అనే తన పుస్తకంలో వాదిస్తారు.
ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. ఇది 1948 నాటి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (ఆర్టికల్ 25)లో ఉంది.
‘‘భారతదేశం యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ అమలుకు సిద్ధంగా ఉంది’’ అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ షమికా రవి పేర్కొన్నారు.
‘‘బహుశా ఇది నిజంగా సార్వజనీన యూబీఐ అమలయ్యే ‘స్కాండినేవియన్ శైలి’లో జరగదేమో. ఇది అవసరమైన వారికి అందించే వేదిక అవుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.
జనాభాలో సుమారు 30 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసించే ఒక దేశంలో.. ‘‘అవసరమైన వారిని లక్ష్యంగా చేసుకుని ప్రయోజనాలను బదిలీ చేయటం అనేది ఉత్తమ పరిష్కారం కావచ్చు’’ అని ప్రొఫెసర్ రవి వ్యాఖ్యానించారు. ఈ అవసరం, అందకు మార్గాలు అయితే ఉన్నాయి.
వేతనాల చెల్లింపులో లింగ వివక్షను తగ్గించటానికి కూడా యూబీఐ తోడ్పడవచ్చు. ‘‘దీనిని ఒక్కో వయోజనులు అనే ప్రాతిపదికగా అమలు చేయాలి కానీ కుటుంబం ప్రాతిపదికగా కాదు. లేదంటే పెళ్లి, ఇంటి నిర్వహణ వంటి విషయాల్లో అవకాశాలను ఇది మార్చేస్తుంది’’ అని ప్రొఫెసర్ హామెర్మెష్ పేర్కొన్నారు.
కానీ ఈ ఆలోచనను అందరూ సమర్థించటం లేదు.
‘‘ఇంటి నుంచి పని చేయటం లాగానే.. యూబీఐ కూడా మనం ఊహించినట్లు పనిచేయని చాలా అందమైన సిద్ధాంతం’’ అంటారు థెరీస్.
‘‘ఆచరణలో దీనివల్ల పరిష్కారమయ్యే సమస్యల కన్నా మరిన్ని ఎక్కువ సమస్యలు పుట్టుకొస్తాయని, అసమానతలకు దారితీస్తుందని నేను అనకుంటున్నా’’ అంటారామె.

ఫొటో సోర్స్, Getty Images
అసమానత-వాస్తవికత
రిమోట్ వర్కింగ్ వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకపోవటం, సరళంగా పనిచేసుకోగలగటం చాలా మందికి ఆనందం కలిగిస్తోంటే.. ఇతరులను అది ఆర్థికంగా ముంచివేస్తోంది.
రిమోట్ వర్కింగ్ విపరీతంగా పెరగటం వల్ల.. ‘‘ఆఫీస్ క్లీనర్లు వంటి తక్కువ నైపుణ్యాలు గల ఉద్యోగాలకు డిమాండ్ పడిపోతుంది. వారి ఉద్యోగాలు తగ్గిపోతాయి. వేతనాలు దెబ్బతింటాయి’’ అని ప్రొఫెసర్ హామెర్మెష్ పేర్కొన్నారు.
‘‘ఈ ‘కొత్త సాధారణ’ (న్యూ నార్మల్) పరిస్థితులు ఆర్థిక అసమానతలను మరింత పెంచుతాయి’’ అన్నారు.
భారతదేశంలో మార్చి నెలలో 8.7 శాతంగా ఉన్న నిరుద్యోగిత ఏప్రిల్ నెలలో ఏకంగా 23.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్ ఎకానమీ గణాంకాలు చెప్తున్నాయి.
ఉద్యోగాలు కోల్పోయిన 9 కోట్ల మంది కూలీలు, చిన్న వ్యాపారులకు.. రిమోట్‌గా పనిచేయటం, మరింత వెసులుబాటుతో పనిచేసుకోవటం అనే ఆలోచనలు ఏమాత్రం తట్టవు.
మనం పనిచేసే తీరులో మార్పులను అమలుచేయటం కష్టం కావచ్చు. అది ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. రిస్కుతో కూడుకున్నది కావచ్చు. కానీ ఇది భయం పుట్టిస్తుందనటం నిస్సందేహం. అయినప్పటికీ ఇది జరగాల్సిందేనని చాలా మంది వాదిస్తున్నారు.
‘‘మేం సర్వే చేసిన సంస్థల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ సిబ్బంది ఉత్పాదకత మెరుగుపడినట్లు చెప్పాయి. మొత్తంగా 78 శాతం సంస్థలు.. తమ సిబ్బంది మరింత సంతోషంగా ఉన్నారని, 70 శాతం సంస్థలు తమ సిబ్బంది మానసిక ఒత్తిడి తగ్గిందని, 62 శాతం సంస్థలు తమ సిబ్బంది తక్కువగా అనారోగ్య సెలవులు పెట్టారని చెప్పాయి’’ అని డాక్టర్ మారా తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ జపాన్‌లో వారంలో పని దినాలను మరింతగా తగ్గించి ప్రయోగాత్మకంగా పరీక్షించినపుడు.. అది అద్భుత విజయమని ప్రశంసించారు. అమ్మకాలు పెరిగాయి. ఉత్పాదకత పెరిగింది. అందులో పాలుపంచుకున్న వారిలో 92 శాతం మంది తాము మరింత సంతోషంగా ఉన్నామని చెప్పారు.
సరళమైన పని సమయాలు గల సంస్థలు.. ప్రతిభ గల ఉద్యోగులను ఆకర్షించటం, వారిని నిలుపుకోవటం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలుచెప్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మిగులు సమయం బంగారం
‘‘వారాంతంలో ఒక రోజు ఖాళీగా ఉండటం వల్ల జనం మరింత ఎక్కువగా షాపింగ్ చేయటం, రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్లటం, మరింత ఎక్కువగా ఖర్చు పెట్టటం జరుగుతుంటుంది’’ అని డాక్టర్ మారా చెప్పారు. ఈ విషయాన్ని తన పరిశోధన బలపరుస్తోందని పేర్కొన్నారు.
న్యూజీలాండ్‌లో ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ ఇప్పటికే.. కంపెనీలు మరింత సరళంగా ఉండాలని, వారంలో పని దినాలను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల స్థానిక పర్యాటక రంగం పెరుగుతుందని చెప్పారు.
ఫిన్‌లాండ్ నాయకురాలు సనా మారిన్.. పనికి – జీవితానికి మధ్య మరింత సంతులనానికి సానుకూలంగా మాట్లాడారు. పూర్తి వేతనంతో నాలుగు రోజుల పని వారాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.
కంపెనీలు పని వారాన్ని కుదించటం వల్ల అవి వినియోగించే విద్యుత్, కాగితాలు కూడా తగ్గుతాయి. ప్రయాణాలు, రవాణాల అవసరం కూడా తగ్గి.. కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి.
మైక్రోసాఫ్ట్ సంస్థ జపాన్‌లో నిర్వహించిన ప్రయోగం ఈ ఫలితాలను బలపరుస్తోంది. ఆ ప్రయోగంలో విద్యుత్ వినియోగం 23.1 శాతం తగ్గిపోగా.. ప్రింటర్ల వినియోగం దాదాపు 60 శాతం పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులు నిజంగా మారతాయి
మనం పనిచేసే తీరులో విప్లవాత్మక మార్పులను ఊహించటం కష్టం కావచ్చు. కానీ అది సాధ్యమని చరిత్ర చూపుతోంది.
పారిశ్రామిక విప్లవ కాలంలో – 1890లలో – ఫ్యాక్టరీ కార్మికులు వారంలో ఆరు రోజులు - వారానికి 100 గంటలు పనిచేయాల్సి వచ్చేది.
1926 నాటికి.. ‘‘పారిశ్రామిక దిగ్గజం, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు, మోడల్-టి(...) సృష్టికర్త హెన్రీ ఫోర్డ్.. ఐదు రోజుల పని వారాన్ని అమలులోకి తెచ్చిన మొట్టమొదటి పారిశ్రామికుడు అయ్యారు’’ అని రట్జర్ బ్రెజ్మన్ పేర్కొన్నారు.
కార్మికులకు పూర్తి వేతనం కూడా చెల్లించారు.
‘‘జనం అతడిని పిచ్చివాడన్నారు. ఆ తర్వాత అందరూ ఆయన అడుగుజాడల్లో నడిచారు’’ అన్నారాయన.
ఇప్పుడు ప్రపంచంలో చాలా వ్యాపార సంస్థలకు ఐదు రోజుల పని వారాలు మామూలు విషయం కావచ్చు. కానీ ఇప్పుడవి మళ్లీ మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- మే డే: కార్మికులు ఏ దేశాల్లో ఎక్కువ సేపు పనిచేస్తున్నారు?
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








