కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
“ఆయన ఈ రాత్రి గడవడమే కష్టం. పరిస్థితులు హఠాత్తుగా దిగజారాయి” అని డాక్టర్ సరస్వతి సిన్హా రోగి భార్యకు ఫోన్లో చెప్పారు. ఆమె కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న వీధుల గుండా అప్పుడే తన ఆస్పత్రికి వచ్చారు.
అది ఏప్రిల్ 11 రాత్రి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి భారత్ కఠిన లాక్‌డౌన్ గుప్పిట్లో ఉంది.
ఆ రోగి పేరు నితైదాస్ ముఖర్జీ. నగరంలోని అమ్రీ ఆస్పత్రిలో ఉన్న ఆయన దాదాపు రెండు వారాల నుంచీ కోవిడ్-19తో పోరాడుతున్నారు. అదే ఆస్పత్రిలో డాక్టర్ సిన్హా క్రిటికల్ కేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
నిరాశ్రయులు, అనాథలను ఆదుకునే ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే 52 ఏళ్ల సామాజిక కార్యకర్త ముఖర్జీకి వైరస్ రావడంతో వెంటిలేటర్ పెట్టారు. క్రిటికల్ కేర్‌లో ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు.
తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మార్చి 30న ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆయన ఎక్స్ రే భయంకరంగా కనిపించింది. ఎర్రబడిన కణాలు ఊపిరితిత్తుల్లో నిండిపోవడంతో అదంతా తెల్లగా కనిపిస్తోంది. గాలి తిత్తులు ద్రవంతో నిండిపోయి అవయవాలకు ఆక్సిజన్ అందకుండా ఆటంకం ఏర్పడుతోంది. (ఎక్స్ రేలలో ద్రవం తెల్లగా కనిపిస్తుంది)
ఆయన ఆక్సిజన్ లెవల్స్ పెంచేందుకు ఆ రాత్రి డాక్టర్లు ఒక హై-ఫ్లో మాస్క్ ఉపయోగించారు. ఆయనకు డయాబెటిస్ మందులు ఇచ్చాక, కోవిడ్-19 పరీక్ష కోసం త్రోట్ స్వాబ్ తీసుకున్నారు. తర్వాత సాయంత్రం ముఖర్జీకి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది.
అప్పటికి ఆయన శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నారు. నీళ్లు గుటక వేసేందుకు కూడా కష్టంగా ఉంటోంది. సాధారణంగా చాలా మంది 94 శాతం నుంచి 100 శాతం వరకూ ఆక్సిజన్ తీసుకోగలరు. కానీ అది ఆయనకు 83 శాతానికి పడిపోయింది. సాధారణంగా అందరూ నిమిషానికి పది నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటే, ముఖర్జీ నిమిషానికి 50 సార్లు శ్వాస తీసుకుంటున్నారు.
దాంతో ఆయనకు మత్తు మందులు ఇచ్చి వెంటిలేటర్ మీద పెట్టారు. ఆ తర్వాత మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజుల్లో ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోతే చివరికి ఆ వెంటిలేటర్ కూడా తీసేస్తారు.

కోవిడ్-19 వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అందరూ ముఖర్జీ అంత అదృష్టవంతులు కాలేరు. న్యూయార్క్‌లో శ్వాస తీసుకోడానికి వెంటిలేటర్లతో సాయం అందించిన వారిలో దాదాపు 25 శాతం మంది చికిత్స మొదలైన తొలి వారాల్లోనే చనిపోయినట్లు ఒక అధ్యయనంలో తేలింది. వెంటిలేటర్లు పెట్టిన కోవిడ్-19 రోగుల్లో మూడింట రెండు వంతుల మంది చనిపోతున్నారని ఒక బ్రిటిష్ అధ్యయనంలో గుర్తించారు.
కోవిడ్-19 రోగులకు వెంటిలేటర్లు సరిగా పనిచేయడం లేదని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని కేసుల్లో మెకానికల్ వెంటిలేషన్ వల్ల భయంకరమైన ఫలితాలను గుర్తించారు.
“వెంటిలేషన్ నాణ్యంగా లేకపోతే, ముఖ్యంగా శ్వాసకోస వ్యవస్థ వైఫల్యానికి, ఏఆర్డీఎస్ లేదా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కూడా తోడైతే ఊపిరి తిత్తులు దెబ్బతినవచ్చు” అని బెల్జియంలోని ఎరాస్మే యూనివ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ ప్రొఫెసర్ జీన్ లూయిస్ విన్సెంట్ నాతో అన్నారు.
ముఖర్జీ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆయనకు మజిల్ రిలాక్సెంట్స్( కండరాలకు విశ్రాంతి ఇచ్చే మందులు) కూడా ఇచ్చారు. రోగి తనకు తానుగా శ్వాస తీసుకోడానికి ప్రయత్నించకుండా ఆ మందులు కండరాలు స్తంభించేలా చస్తాయి.
ఏప్రిల్ నెలలో ఒక రాత్రి పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఆయనకు జ్వరం పెరిగింది. హార్ట్ రేట్, బీపీ పడిపోయింది. అవన్నీ కలిసి ఒక కొత్త ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యాయి.
అప్పుడు ప్రతి క్షణం చాలా విలువైనది. ఆస్పత్రికి వస్తున్న డాక్టర్ సిన్హా క్రిటికల్ కేర్‌లో ఉన్న తన బృందానికి ఫోన్లోనే తగిన సూచనలు చేశారు.
ఆమె ఆస్పత్రికి చేరుకోగానే, ముఖర్జీ ప్రాణాలు నిలబెట్టేందుకు వారి పోరాటం మళ్లీ మొదలైంది.

ఫొటో సోర్స్, RONNY SEN
డాక్టర్ సిన్హా ఆమె బృందం ఆ ఇన్ఫెక్షన్‌ను అంతం చేసేందుకు ఆఖరి ప్రయత్నంగా యాంటీ బయాటిక్స్ నేరుగా ఆయన రక్తనాళాల్లోకే ఇచ్చారు. వాటితోపాటూ అదనపు మజిల్ రిలాక్సెంట్స్, బీపీని స్థిరంగా ఉంచే మందులు పంపించారు.
ఆ గండం నుంచి ఆయన బయటపడేందుకు మూడు గంటలు పట్టింది.
21 ఏళ్ల మెడికల్ కెరీర్‌లో 16 ఏళ్లు ఇంటెన్సివ్ కేర్ కన్సల్టెంట్‌గా పనిచేసిన డాక్టర్ సిన్హా “నా జీవితంలో అత్యంత అలసిపోయిన అనుభవం ఇదే” అని నాకు చెప్పారు.
“ఆ సమయంలో మేం వేగంగా పనిచేయాల్సుంటుంది. దానిలో చాలా కచ్చితత్వం ఉండాలి. మేం వేసుకున్న ప్రొటెక్టివ్ గేర్ లోపల తీవ్రంగా చెమట పడుతోంది. విజన్ మసకబారుతోంది. మేం నలుగురం ఆ రాత్రి మూడు గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేశాం” అన్నారు.
“మేం ప్రతి నిమిషానికీ మానిటర్స్ చూస్తున్నాం. ఆయనలో ఏదైనా పురోగతి కనిపిస్తోందా, లేదా అనేది గమనిస్తున్నాం. నాలో నేనే ‘ఈయన్ను మేం ఎలాగైనా బతికించాలి’ అనుకున్నా. ఈయనది ప్రాణం పోయే స్థితి కాదు. ఈయన ఐసీయూలో ఉన్న ఒక కోవిడ్-19 రోగి మాత్రమే అనుకున్నా”
ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మళ్లీ స్థిరంగా అయ్యేసరికి ఉదయం 2 గంటలు అయ్యింది. డాక్టర్ సిన్హా తన ఫోన్ చెక్ చేశారు. అందులో ముఖర్జీ భార్య, వదిన నుంచి 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. న్యూజెర్సీలో నివసించే ముఖర్జీ వదిన రెస్పిరేటరీ డిసీజ్ రీసెర్చర్.
“నా జీవితంలోనే అది అత్యంత భయంకరమైన రాత్రి. నా భర్త ఇక లేడు అనుకున్నాను” అని హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న అపరాజిత నాతో అన్నారు.
ఆమె హోం క్వారంటైన్లో ఉన్నారు. అదే ఇంట్లో ఆమెతో పాటు మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న అత్తగారు, పాక్షిక వైకల్యం ఉన్న పిన్ని ఉంటారు. వారిలో ఎవరికీ కోవిడ్-19 పాజిటివ్ రాలేదు.
చాలా కష్టపడి ప్రాణాలు పోయే స్థితిని తప్పించారు. కానీ ముఖర్జీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

ముఖర్జీ లావుగా ఉంటారు. లావుగా ఉన్న రోగులకు శ్వాస అందేలా ఏదైనా చేయాలంటే కష్టం. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. డాక్టర్లు ఆయనకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇచ్చారు. దానిని సాధారణంగా మలేరియా చికిత్స కోసం ఇస్తారు. దానితోపాటూ విటమిన్లు, యాంటీ బయాటిక్స్, మత్తు మందు ఇచ్చారు. జ్వరం ఇంకా తీవ్రంగా ఉంది.
ఐసీయూలో ముఖర్జీ బెడ్ దగ్గరున్న అలారంలు ఎప్పుడూ మోగుతూనే ఉండేవి. ఒకసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే, ఇంకోసారి పోర్టబుల్ మెషిన్ మీద ఎక్స్ రేలో ఊపిరితిత్తులంతా తెల్లగా కనిపించేది.
“ఆయనలో పురోగతి చాలా తక్కువగా ఉండేది. అది ఎప్పుడు జరిగినా చాలా నెమ్మదిగా ఉండేది” అని డాక్టర్ సిన్హా చెప్పారు.
చివరికి ఆస్పత్రిలో చేర్చిన ఒక నెల తర్వాత డాక్టర్ ముఖర్జీలో ఇన్ఫెక్షన్‌ను ఓడించిన సంకేతాలు కనిపించాయి.
వైద్యపరమైన కోమా నుంచి ఆయన మేలుకున్నారు. ఆరోజు ఆదివారం. ఆయన భార్య, వదిన ముఖర్జీకి వీడియో కాల్ చేశారు. ఆయన మెరుస్తున్న ఆ ఫోన్ స్క్రీన్ వైపు అలా చూస్తూ ఉండిపోయారు.
“నాకు అసలు ఏం జరుగుతోందో అర్థ కాలేదు. అంతా మసగ్గా ఉంది. బ్లూ అప్రాన్‌లో ఉన్న ఒక మహిళ నా ముందు నిలబడి ఉండడం కనిపించింది. ఆమె నా డాక్టర్ అని తర్వాత తెలిసింది. అంటే నేను మూడు వారాలకు పైగా అలా నిద్రపోతున్నాను. నేను ఆస్పత్రిలో ఎందుకున్నానో కూడా నాకు తెలీలేదు. ఏదీ గుర్తురావడం లేదు” అని ముఖర్జీ నాతో అన్నారు.
“కానీ నాకు ఒకటి గుర్తుంది. అది కోమాలో ఉన్నప్పుడు నా భ్రమ అనుకుంటా. నేను ఒక దగ్గర ఉన్నాను. నన్ను తాళ్లతో కట్టేసున్నారు. నీకు ఆరోగ్యం సరిగా లేదని కొందరు నాకు చెబుతున్నారు. వాళ్లు నా కుటుంబం దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. నన్ను మాత్రం విడిపించడంలేదు. నేను నాకు సాయం చేసేవారిని సంప్రదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను” అని చెప్పారు.
ఏప్రిల్ నెల చివర్లో డాక్టర్లు ఒక అరగంట పాటు ఆయనకు వెంటిలేటర్ తీసేశారు. ముఖర్జీ దాదాపు ఒక నెల తర్వాత సొంతంగా శ్వాస తీసుకోగలిగారు.
“ఆయనకు వెంటిలేటర్ తీసేయడం చాలా కష్టమైంది. ముఖర్జీకి తరచూ ‘పానిక్ అటాక్స్’ వచ్చేవి. వెంటిలేటర్ లేకుండా తను శ్వాస పీల్చుకోలేమోననే భయంతో, ఆయన మాటిమాటికీ తన బెడ్ పక్కనే ఉన్న ఎమర్జెన్సీ బెల్ నొక్కేవారు” అని డాక్టర్లు నాతో చెప్పారు.
మే 3న వారు వెంటిలేటర్ స్విచాఫ్ చేశారు. ఐదు రోజుల తర్వాత ముఖర్జీని ఇంటికి పంపించారు.


“అది చాలా సుదీర్ఘ పోరాటం. ఆయనకు తీవ్రమైన ఏఆర్డీఎస్ వచ్చింది. నాలుగు వారాలు జ్వరం తీవ్రంగా ఉంది. ఆయన తనకుతానుగా శ్వాస తీసుకోలేకపోయారు. వైరస్ అంత బీభత్సం సృష్టించింది” అని డాక్టర్ సిన్హా చెప్పారు.
ఇప్పుడు ఇంట్లోనే ఉన్న ముఖర్జీ తన కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఆయన మళ్లీ ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్నారు. కొన్ని విషయాలను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
ఆస్పత్రికి తీసుకెళ్లే కొన్ని రోజుల ముందు ఆయన దగ్గు వచ్చింది. ఒక డాక్టర్ దానిని గొంతు ఇన్ఫెక్షన్ అనుకుని మందులు ఇచ్చారు. ఆయన అలాగే బయటకు వెళ్లేవారు. మాస్క్ పెట్టుకుని వీధుల్లో ఉన్న పేదలు, అనాథలకు సాయం చేసేవారు. వారికోసం ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేవారు. అలా తన డయాబెటిస్ మందులు వేసుకోవడం మర్చిపోయేవారు. ఆస్పత్రిలో చేర్చే సమయానికి ఎక్కువగా ఉన్న ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్ ఆ విషయాన్ని చెప్పాయి. ఆయనకు ప్రతి ఏటా సీజన్ మారే సమయంలో దగ్గు వస్తుడడంతో యాంటీ బయాటిక్స్, నెబ్యులైజర్లు ఉపయోగించేవారు.
“కానీ, ఆయనలో డీహైడ్రేషన్, వరసగా నాలుగు గంటలపాటు నిద్రపోతూ ఉండండతో నాకు ఏదో జరుగుతోందని అనిపించింది. ఆయన ఎప్పుడూ లేనంత అలసిపోయారు. తర్వాత ఆయనకు శ్వాస సమస్యలు మొదలయ్యాయి. దాంతో మేం ఆయన్ను వీల్ చెయిర్లో ఆస్పత్రికి తీసుకెళ్లాం” అని ముఖర్జీ భార్య చెప్పారు.
82 రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో పనిచేసిన తర్వాత డాక్టర్ సిన్హా గత వారం ఒక రోజు సెలవు తీసుకున్నారు. అక్కడ ఇప్పుడు బెడ్స్ అన్నీ కోవిడ్-19 రోగులతో నిండిపోయి ఉన్నాయి.
సిన్హా సిబ్బంది మొబైల్లో తీసిన 100కు పైగా ఫొటోలు ముఖర్జీ ప్రాణాలు కాపాడ్డానికి ఆమె, ఆమె టీమ్ ఎన్ని ప్రయత్నాలు చేశారో చెబుతున్నాయి.
అలిసిపోయి ప్రొటెక్టివ్ గేర్‌లోనే నర్సింగ్ స్టేషన్ మీద వాలిపోయిన నర్సులు. ముఖర్జీ బెడ్ దగ్గర వైద్య సిబ్బంది జాగరణ. వెంటిలేటర్ తీసేశాక, ఆస్పత్రి వదిలి వెళ్తూ బలహీనంగా నవ్వుతున్న రోగి పక్కన వారి ముఖాల్లో ఆనందం, ఉపశమనం అన్నీ ఆ ఫొటోల్లో కనిపిస్తున్నాయి.
“ఒక టీమ్‌గా, మేమంతా మా విధులు నిర్వర్తిస్తున్నాం” అని ఆమె చివరగా చెప్పారు. తనంతట తానుగా ఊపిరి తీసుకోగలిగినందుకు ముఖర్జీ వారికి రుణపడి ఉంటారు.
“నేను వ్యాధితో పోరాడానని నాకు తెలుసు. కానీ ఆ వ్యాధితో పోరాడిన డాక్టర్లు, నర్సులు నా ప్రాణం కాపాడారు. దాన్నుంచి బయటపడినవారు తమ కథలు చెప్పుకోవాలి. భయంకరమైన ఈ వైరస్‌ను ఓడించవచ్చు అనే విషయం అందరికీ చెప్పాలి” అంటున్నారు ముఖర్జీ


- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కరోనావైరస్: వెంటిలేటర్లు ఏంటి? అవి ఎందుకు ముఖ్యం?
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








