స్వాల్బార్డ్‌: అర్థరాత్రి కూడా సూర్యుడు కనిపించే ఈ అందమైన దీవికి వీసా లేకున్నా వెళ్ళిపోవచ్చు

స్వాల్బార్డ్‌

ఫొటో సోర్స్, Hopsalka/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇక్కడ మనుషుల సంఖ్య కంటే ధృవపు ఎలుగుబంట్ల సంఖ్యే ఎక్కువ
    • రచయిత, విల్ ఫ్రాంకోమ్
    • హోదా, బీబీసీ ట్రావెల్

నార్వేలోని దీవుల సముదాయంలో గల స్వాల్బార్డ్ దీవికి విమానాల్లో వస్తున్నపుడు కిటికీల్లో నుంచి చూస్తే ముందుగా కనిపించేది మంచు టోపీలు పెట్టుకున్నట్లుండే పర్వతాలు.

అదికూడా సంవత్సరంలో ప్రకాశవంతంగా ఉండే సగం కాలంలో వస్తేనే. ఈ కాలంలో అర్థరాత్రి కూడా సూరీడు ఉంటాడు.. వారంలో ప్రతి రోజూ 24 గంటలూ కనిపిస్తాడు. మిగతా అర్థ సంవత్సరంలో చీకటి రాజ్యమేలుతుంది. తరచుగా ఉత్తర కాంతి మెరుపులీనుతూ నాట్యం చేస్తుంటుంది.

నార్వే ప్రధాన భూభాగానికి ఉత్తరంగా 800 కిలోమీటర్ల దూరంలో.. ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది స్వాల్బార్డ్. ఇది ప్రపంచంలో ఉత్తర కొసన ఏడాది పొడవునా జనం ఉండే ఆవాస ప్రాంతం. ప్రపంచంలో ఉత్తరాన చిట్టచివరన గల యూనివర్సిటీ, చర్చి, బ్రూవరీ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా నివసించగలిగే అతి తక్కువ ప్రాంతాల్లో ఇదొకటి.

స్వాల్బార్డ్ రాజధాని లాంగియర్బన్‌లో నివసించే 2,400 మంది జనాభాలో దాదాపు మూడో వంతు మంది వలస వచ్చినవారే. వారు 50 పైగా దేశాల నుంచి వచ్చారు. ఏ దేశ పౌరులైనా సరే ఒక ఉద్యోగం, నివసించటానికి ఒక ఇల్లు ఉంటే చాలు.. ఇక్కడ స్థిరపడొచ్చు.

ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ

ఫొటో సోర్స్, Bas van Oort

ఫొటో క్యాప్షన్, ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ
స్వాల్బార్డ్‌ రాజధాని లాంగియర్బన్‌

ఈ ప్రాంతానికి మొదటిగా 1,200 సంవత్సరం ప్రాంతంలో వైకింగులు వచ్చారని భావిస్తారు. అయితే నెదర్లాండ్స్ పర్యాటకులు 1956లో చైనాకు ఈశాన్య మార్గం కనుగొనే ప్రయత్నంలో భాగంగా మొదటిగా తాము ఈ ప్రాంతాన్ని సందర్శించిన వైనాన్ని రికార్డు చేశారు.

అనంతర శతాబ్దాల్లో ఇంగ్లండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, రష్యాల నుంచి వాల్‌రస్, తిమింగలాల వేటగాళ్లు ఇక్కడికి వచ్చారు. 1906లో అమెరికా వ్యాపారవేత్త జాన్ మన్రో లాంగియర్.. ఈ దీవుల సముదాయంలో తొలి బొగ్గు గనిని స్థాపించారు. అది 20వ శతాబ్దంలో స్వాల్బార్డ్ ప్రధాన పరిశ్రమగా కొనసాగింది. ఇప్పుడైతే పర్యాటకం, పర్యావరణ, జీవావరణ పరిశోధనలు స్వాల్బార్డ్‌లో ప్రధాన కార్యకలాపాలు.

1920 వరకూ ఈ దీవుల మీద ఎవరి పరిపాలనా లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత.. స్వాల్బార్డ్ మీద నార్వే సార్వభౌమాధికారానికి హామీ ఇస్తూ జరిగిన ఒప్పందం మీద తొమ్మిది దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు ఈ ఒప్పందంలో 46 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఈ భూభాగాన్ని సైనిక అవసరాలకు ఉపయోగించకూడదని ఆ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ దీవుల సహజ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత నార్వేదేనని చెప్తోంది. ఆ ఒప్పందంలో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటంటే.. ఇక్కడ నివసించే నార్వే పౌరులు, నార్వేయేతర పౌరుల మధ్య ఎలాంటి భేదం చూపటానికి వీలులేదు.

స్వాల్బార్డ్‌కు నివాసం వచ్చే జనంలో ఎక్కువ మంది స్థిరపడేది లాంగియర్బన్‌లోనే. ఈ దీవుల్లో ఉన్న మొత్తం రోడ్ల పొడవు కలిపితే కేవలం 40 కిలోమీటర్లే ఉంటాయి. ఊర్ల మధ్య రోడ్లు ఉండవు. వేసవిలో పడవల మీద, చలికాలంలో స్నోమొబైల్ మీద మాత్రమే వేరే ఊర్లకు వెళ్లటానికి వీలుంటుంది.

స్వాల్బార్డ్‌ రాజధాని లాంగియర్బన్‌
ఫొటో క్యాప్షన్, స్వాల్బార్డ్‌ రాజధాని లాంగియర్బన్‌లో ఇళ్లు
టూరిజమే ఇక్కడ ప్రధాన జీవనాధారం
ఫొటో క్యాప్షన్, టూరిజమే ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం

ఎవరైనా నగర పరిధి దాటి బయటకు వెళ్లేటపుడు మామూలుగా ఒక రైఫిల్ వెంటబెట్టుకుని వెళుతుంటారు. ఎందుకంటే పోలార్ బేర్ – (ధృవపు ఎలుగుబంట్లు) ఎదురుపడొచ్చు. ఈ దీవుల్లో నివసించే మనుషుల సంఖ్య 2,926 అయితే ఇక్కడ ఉండే ఎలుగుబంట్ల సంఖ్య 3,000 కన్నా ఎక్కువే మరి.

స్వాల్బార్డ్‌కి ఎవరైనా వచ్చి నివసించవచ్చు. కానీ జన్మించటానికి కానీ, చనిపోవటానికి కానీ ఇది సరైన ప్రాంతం కాదు. గర్భిణులకు ఇక్కడ ఆస్పత్రులు లేవు. ఎవరైనా చనిపోతే నిబంధనల ప్రకారం మృతదేహాన్ని నార్వే ప్రధాన భూభాగానికి తరలించాల్సి ఉంటుంది. 1950ల నుంచీ ఈ దీవుల సమయంలో ఖననం చేయటానికి అనుమతి లేదు. ఎందుకంటే ఈ దీవుల్లోని పెర్మాఫ్రాస్ట్ – ఏడాది పొడవునా కొనసాగే దట్టమైన మంచుపొర – మృతదేహాలు పాడటవకుండా అలాగే కాపాడతాయి. తగినంత లోతులో పూడ్చకపోతే ఆ మృతదేహాలు బయటపడుతుంటాయి కూడా.

స్వాల్బార్డ్‌లోని ఈ పెర్మాఫ్రాస్ట్‌తో పాటు ఏడాది పొడవునా తక్కువ ఉష్ణోగ్రతలు (వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 7 సెంటీగ్రేడ్లు) ఉండటం వల్ల ఇక్కడ గ్లోబల్ సీడ్ వాల్ట్ – ప్రపంచ విత్తన భాండాగారం – స్థాపించారు. లాంగియర్బన్ మెయిన్ రోడ్డుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ విత్తన భాండాగారంలో 2008 నుంచి ఇప్పటి వరకూ ప్రపంచం నలుమూలల నుంచీ తెచ్చిన 9.80 లక్షల విత్తనాలను దాచిపెట్టారు. ఏదైనా ఉపద్రవం సంభవించి ప్రపంచంలో పంటలన్నీ నాశనమైనపక్షంలో ఇవి ఉపయోగపడతాయన్నది ఈ విత్తన భాండాగారం వెనుక గల ఆలోచన.

కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఈ భాండాగారానికి కూడా పూర్తి భద్రత ఉండకపోవచ్చు. 2017లో పెర్మాఫ్రాస్ట్‌లో కొంత భాగం కరిగిపోవటంతో ఈ భాండాగారం ప్రవేశ సొరంగంలోకి వరద ముంచెత్తింది. లాంగియర్బన్‌ను వర్షపు నీటిని గమనంలో పెట్టుకుని డిజైన్ చేయలేదు. ఇటీవలి కాలంలో బురదచరియలు విరిగిపడటం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పెరిగాయి. స్వాల్బార్డ్‌లో సగటు ఉష్ణోగ్రతలు 1971 నుంచి 4 సెంటీగ్రేడ్ల మేర పెరిగాయి. మిగతా ప్రపంచంతో పోలిస్తే ఈ పెరుగుదల ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ప్రపంచంలో అతి వేగంగా వేడెక్కుతున్న ప్రాంతం ఇదే.

స్వాల్బార్డ్‌
స్వాల్బార్డ్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)