కరోనావైరస్: లాక్‌డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం

బాలి

ఫొటో సోర్స్, HonzaHruby/Getty Images

    • రచయిత, ఎల్లీ ఈరిల్స్
    • హోదా, బీబీసీ కోసం

మార్చి 25 మిట్ట మధ్యాహ్నం. రోడ్లపై బైకులు, కార్ల రాకపోకలు లేవు. వీధుల్లో రోజూ నూడిల్స్ అమ్మేవారి కదలికలు లేవు. విమానాల చప్పుళ్లూ లేవు.

ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించేందుకు, నిశ్శబ్దంగా ఇంటి ముందు వరండాపై కూర్చున్న నాకు తూనీగల గుసగుసలు, కప్పల బెకబెకలు మాత్రమే వినిపించాయి.

ఇండోనేషియాలోని బాలీలో నా అరుదైన అనుభవం అది.

కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ అనుకుంటే పొరపాటే.

అది బాలీ నూతన సంవత్సరం రోజు ‘న్యేపీ’. ‘సైలెంట్ డే’ అని కూడా అంటారు.

ఆ రోజు 24 గంటలూ బాలీ వాసులంతా ఇల్లు దాటి కాలు బయటపెట్టరు. ఒక సంవత్సరానికి ముగింపు పలుకుతూ, కొత్త ఏడాదికి సిద్ధం అవుతున్నట్లు సంకేతంగా ఆ రోజు అలా గడుపుతారు. ఈ ఆచారం ఏటా కొనసాగుతుంది.

బాలి

ఫొటో సోర్స్, Getty Images

సందడి తర్వాత నిశ్శబ్దం

ఆ రోజు తుపాను తర్వాత ప్రశాంతత మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే, అంతకుముందు మూడు రోజుల పాటు బాలీ ద్వీపం అంతటా సందడి వాతావరణం ఉంటుంది.

రాక్షసుల ఆకారంలో భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి, డబ్బు చప్పుళ్లతో ఊరేగిస్తారు. అదంతా ఒక భారీ వేడుకగా సాగుతుంది.

ఆ బొమ్మలకు జంతువులను బలి ఇస్తారు. పచ్చి మాంసం, గుడ్లు, మద్యంతో పాటు రకరకాల వంటకాలను పెడతారు.

ఆ రాక్షసులు శాంతించాక, వాటిని తమ ప్రాంతం నుంచి బయటకు సాగనంపేందుకు కాగడాలు పట్టుకుని, భారీ ఎత్తున కేకలు వేస్తూ, పరుగులు పెడతారు.

ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రోజు ‘న్యేపీ డే’ (కొత్త సంవత్సరం).

చంద్రుడి గమనం ఆధారంగా సాకా క్యాలెండర్ ప్రకారం, బాలీలో కొత్త సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తుంది.‌

సాకా సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 78వ సంవత్సరంలో భారత రాజు కనిష్కుడు స్థాపించారు. హిందూ మిషనరీలు దానిని ఇండోనేషియాలోని జావాకు విస్తరించారని, తర్వాత బాలీకి చేరుకున్నారని చరిత్రకారులు చెబుతారు.

ప్రస్తుతం ఇండోనేషియాలో హిందువుల మెజారిటీ ఉన్న ఏకైక ద్వీపం బాలీనే. ఇండోనేషియా జనాభాలో 90 శాతం ముస్లింలే ఉన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

సకలం బంద్

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ విధించడంతో జనాలు ఒక్కసారిగా షాకయ్యారు.

కానీ, బాలీ వాసులకు అది కొత్తేమీ కాదు. వారు ‘న్యేపీ డే’ పేరుతో ఏటా పాటించేదే. అయితే, ఈసారి కరోనావైరస్ వల్ల దానిని పొడిగించినట్లు అయ్యింది.

ఆ రోజు బాలీ ద్వీపం అంతటా ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టకూడదు. పనులకు వెళ్లకూడదు, విందులు, వినోద కార్యక్రమాలు ఉండవు.

వ్యాపార కార్యకలాపాలన్నీ 24 గంటలు పూర్తిగా మూతపడతాయి. విమానాశ్రయాలను కూడా మూసివేస్తారు.

కొంతమంది ఆ రోజు ఉపవాసం పాటిస్తారు. మరీ అవసరమైతే తప్పితే మొబైల్ ఫోన్లనూ వాడరు. అంతేకాదు, కుక్కలు, కోళ్లు కూడా ఆ రోజు నిశ్శబ్దంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

న్యేపీ డే నిబంధనలకు సంబంధించి ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా చూసేందుకు పోలీసులు వీధుల్లో గస్తీ తిరుగుతారు.

బాలి

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు అలా?

వెళ్లిపోయిన రాక్షసులు తిరిగొచ్చినా, “దీవి అంతా నిర్మానుశ్యంగా ఎడారిలా ఉందని అనుకుంటాయి. మరో ఏడాది దాకా రావొద్దని వెనక్కి వెళ్లిపోతాయి” అన్నది స్థానికుల నమ్మకం.

ఆ నమ్మకాన్ని అటుంచితే, ఆ రోజును ఎంతో ఫలవంతంగా వాడుకుంటున్నామని చాలామంది చెబుతున్నారు.

“ఈసారి నిశ్శబ్దం ధ్యానం చేసుకునేందుకు చాలా బాగా పనికొచ్చింది. నేను 40 ఏళ్లుగా న్యేపీ వేడుకలు చేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆచారం వెనకున్న మంచి గురించి ఇంకా తెలుసుకుంటున్నాను” అని స్థానిక హిందువు, పాఠశాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ దార్వియాతి చెప్పారు.

ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరోజైనా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం దొరకడం చాలా మందచిదని, భవిష్యత్తులో ఉత్పాదకతను పెంచేందుకు కూడా అది దోహదపడుతుందని ఆమె అంటున్నారు.

టీవీలు, ఇంటర్నెట్‌లను పక్కన పెట్టేసి, ఆ రోజంతా కుటుంబంతో గడిపే వీలుంటోందని చెబుతున్నారు.

బాలి

ఫొటో సోర్స్, Getty Images

పర్యావరణానికి మేలు

అది కేవలం 24 గంటలే అయినా, పర్యావరణంపై మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతోంది.

2015లో ఇండోనేషియా వాతావరణ విభాగం జరిపిన ఒక అధ్యయనంలో బాలీ సైలెన్స్ డే సందర్భంగా అక్కడి పట్టణ ప్రాంతాల్లో గాలిలో కాలుష్య కారక రేణువుల సాంద్రత 73 శాతం నుంచి 78 శాతం మేర తగ్గిందని తేలింది.

అదే రోజు కర్బన వాయు ఉద్గారాలు 33 శాతం మేర తగ్గాయని వాతావరణ మార్పులపై ఇండోనేషియా వేసిన కమిటీ వెల్లడించింది.

కేవలం ఒక దీవిలో, ఒక్క రోజు అలా చేస్తేనే అంత సానుకూల మార్పు కనిపిస్తోందని, దేశమంతా దానిని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని స్థానికులు అంటున్నారు.

అది ఒక ఆచారంలా కాకుండా, ప్రకృతి పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి కోసం దానిని దేశమంతా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

“కోవిడ్-19 రాకముందు ప్రపంచంలో ఏటా 24 గంటలు మూతపడే ఏకైక విమానాశ్రయం బాలీదే. ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి ఉన్న బాలీ, ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయాలను గౌరవించడంలోనూ ముందుంది. ప్రకృతితో అనుసంధానం కావడం, కుటుంబ బంధాలను పెంచుకోవడం, మనతో మనం కనెక్ట్ కావడం పాశ్చాత్య దేశాల్లో తగ్గిపోతోంది. జీవితంలో చిన్ని చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యమన్నది ఆ దేశాలు గ్రహించాలి” అని దార్వియాతి అంటున్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)