నీడిల్‌ఫిష్: నీళ్లలోంచి ఎగిరొచ్చి మెడలో పొడిచిన చేప

మహమ్మద్ ఇదుల్

ఇండోనేసియాలో సముద్రంలో నుంచి ఒక్కసారిగా ఓ చేప ఎగిరి, మహమ్మద్ ఇదుల్ అనే యువకుడి మెడలో పొడిచింది. ఆ చేప ఎంత బలంగా పొడిచిందంటే, దాని మూతి మహమ్మద్ మెడను చీల్చుకుని ఇంకోవైపు నుంచి బయటకు వచ్చింది.

హెచ్చరిక: కొందరు పాఠకులకు ఈ కథనంలోని ఫొటో చూసేందుకు ఇబ్బందిగా అనిపించవచ్చు

అది నీడిల్‌ఫిష్. 75 సెంటీమీటర్లు పొడవుంది.

మెడలో గుచ్చుకున్న ఆ చేపను అలాగే పట్టుకుని మహమ్మద్ తన స్నేహితుడి సాయంతో, చీకట్లో అర కిలోమీటరు దూరం ఈది ఒడ్డుకు చేరాడు. ప్రాణాలతో బయటపడ్డాడు.

ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాద అనుభవాన్ని 16 ఏళ్ల మహమ్మద్ ఇదుల్ బీబీసీతో ప్రత్యేకంగా చెప్పాడు.

Presentational grey line
News image
Presentational grey line

చేప పొడవడంతో మహమ్మద్ ఇదుల్‌ పాపులర్ అయిపోయాడు. మెడలో చేప తలతో ఉన్న అతడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడు సర్దీతో కలిసి చేపల వేటకు వెళ్లానని మహమ్మద్ బీబీసీతో చెప్పాడు.

''ముందుగా సర్దీ పడవ కదిలింది. నేను మరో పడవలో అతడిని అనుసరించా. తీరం నుంచి అర కిలో మీటర్ దూరం వెళ్లాక, సర్దీ టార్చ్‌లైట్ వేశాడు. వెంటనే నీళ్లలో నుంచి ఓ నీడిల్‌ఫిష్ ఎగిరి, నా మెడలో పొడిచింది'' అని వివరించాడు మహమ్మద్.

మహమ్మద్ ఇదుల్

ఫొటో సోర్స్, facebook

చేప పొడిచిన తర్వాత, అతడు పడవ నుంచి కింద నీళ్లలో పడిపోయాడు. పొడవుగా, కత్తుల్లా ఉన్న ఆ చేప దవడలు అతడి మెడను చీల్చుకుని మరోవైపు నుంచి బయటకువచ్చాయి.

మహమ్మద్ మెడలో గుచ్చుకుని కూడా ఆ చేప కొట్టుకుంటూ, పారిపోయేందుకు ప్రయత్నించింది.

మహమ్మద్ ఆ చేపను గట్టిగా అదిమిపట్టి, గాయం ఇంకా పెద్దదవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

''సర్దీని సాయం అడిగా. చేపను మెడ నుంచి తీస్తే ఎక్కువ రక్తం పోతుందని, దాన్ని బయటకు తీయొద్దని అతడే చెప్పాడు'' అని మహమ్మద్ వివరించాడు.

ఆ ఇద్దరు యువకులూ ఎలాగోలా చీకట్లో అర కిలోమీటర్ దూరం ఈదుకుని తీరానికి చేరారు.

మహమ్మద్‌ను వెంటనే బావుబావులోని ఓ ఆసుపత్రికి అతడి తండ్రి సహారుద్దీన్ తీసుకువెళ్లారు.

మహమ్మద్ గ్రామం నుంచి బావుబావు చేరుకోవాలంటే దాదాపు గంటన్నర ప్రయాణించాలి.

ఆ చేప మూతిని తొలగించేందుకు తగిన పరికరాలు, సామగ్రి బావుబావులోని వైద్యుల వద్ద లేవు. దీంతో చేప మూతి భాగాన్ని మహమ్మద్ మెడలో అలాగే ఉంచి, మిగతా భాగాన్ని మాత్రం కోసి తీసేశారు.

అక్కడి నుంచి మకస్సర్‌లో పెద్దదైన మహిదీన్ సుదిరోహుసోడో ఆసుపత్రికి మహమ్మద్‌ను తరలించారు. ఆ ఆసుపత్రి సిబ్బంది మహమ్మద్ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు.

మహమ్మద్ ఇదుల్

ఫొటో సోర్స్, facebook

ఐదుగురు శస్త్ర చికిత్సా నిపుణులు దాదాపు గంటపాటు శ్రమించి, మహమ్మద్ మెడ నుంచి చేప మూతిని తొలగించారని ఆసుపత్రి డైరెక్టర్ ఖలీద్ సాలెహ్ తెలిపారు.

మహమ్మద్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు.

తనకు ఇప్పుడు నొప్పేమీ లేదని అతడు చెప్పాడు.

మెడను కుడి వైపుకు తిప్పలేకపోతున్నా, అతడు మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నాడు.

ఇంకొన్ని రోజులు అతడు ఆసుపత్రిలోనే గడపాల్సి రావొచ్చు.

''అతడి పరిస్థితిని గమనిస్తున్నాం. కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. కానీ, అతడికి ఇంకా చెకప్స్ చేయాల్సి ఉంటుంది'' అని ఖలీద్ చెప్పారు.

ఇంత జరిగినా, చేపల వేట అంటే తనకు ఇష్టమేనని మహమ్మద్ చెబుతున్నాడు.

''ఇకపై జాగ్రత్తగా ఉండాలంతే. నీడిల్‌ఫిష్‌ కాంతిని సహించలేదు. అందుకే, అది నీళ్లలో నుంచి ఎగిరి, నన్ను పొడిచింది'' అని అన్నాడు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)