‘అన్ని రకాల క్యాన్సర్లకూ చికిత్స చేసే టెక్నిక్’... అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తల

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గాలగర్
- హోదా, బీబీసీ హెల్త్ అండ్ సైన్స్ ప్రతినిధి
మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో దాగి ఉండే ఒక సామర్థ్యాన్ని గుర్తించామని, అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స అందించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేయొచ్చని బ్రిటన్లోని శాస్త్రవేత్తలు చెప్పారు.
ల్యాబ్‌లో ప్రయోగాల్లో రొమ్ము క్యాన్సర్, రక్త క్యాన్సర్, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, ఇతర క్యాన్సర్లను అంతమొందించగల విధానాన్ని గుర్తించినట్లు కార్డిఫ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
ఈ పరిశోధన వివరాలు 'నేచర్ ఇమ్యునాలజీ' జర్నల్‌లో వెలువడ్డాయి.


క్యాన్సర్ రోగుల్లో ఈ టెక్నిక్‌ను ఇంకా పరీక్షించలేదని, కానీ దీనికి అపారమైన సామర్థ్యం ఉందని పరిశోధకులు చెప్పారు.
ఈ పరిశోధన ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఇందులో వెల్లడైన ఫలితాలు ఉత్తేజం కలిగిస్తున్నాయని నిపుణులు తెలిపారు.

ఫొటో సోర్స్, Science Photo Library
శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు?
కణితుల(ట్యూమర్ల)పై వ్యాధి నిరోధక వ్యవస్థ సహజమైన దాడి గురించి ఈ శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఈ దాడిలో ఇప్పటివరకు ఎవరూ గుర్తించని, భిన్నమైన విధానాలను కనుగొనేందుకు వీరు ప్రయత్నించారు. మనిషి రక్తంలో ఉండే ఒక 'టీ-సెల్', దాని ఉపరితలంపై ఉండే 'రిసెప్టర్'లను, వీటి సామర్థ్యాలను గుర్తించారు.
టీ-సెల్ ఒక వ్యాధినిరోధక కణం. ఇది శరీరాన్ని జల్లెడ పట్టి, శరీరానికి ముప్పు కలిగించేదేమైనా ఉంటే గుర్తించి, దానిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది.
ఇదే కణం చాలా క్యాన్సర్లపై దాడి చేయగలదు.
ఈ సామర్థ్యంతో ప్రతి క్యాన్సర్ రోగికీ చికిత్స అందించేందుకు అవకాశం ఉందని పరిశోధకుడు ప్రొఫెసర్ ఆండ్రూ సీవెల్ బీబీసీతో చెప్పారు.
ఈ కణంతో ఇది సాధ్యం కాగలదని గతంలో ఎవరూ నమ్మలేదని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే రకమైన చికిత్సను అభివృద్ధి చేసే అవకాశాలను ఇది మెరుగుపరిచిందని ఆయన చెప్పారు. మనుషుల్లో చాలా రకాల క్యాన్సర్లను ఒకే తరహా టీ-సెల్ నిర్మూలించగలదన్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఇది ఎలా పనిచేస్తుంది?
టీ-కణాల ఉపరితలంపై 'రిసెప్టర్లు' ఉంటాయి. క్యాన్సర్ కణాలను ఈ రిసెప్టర్లు గుర్తించగలవు.
ఊపిరితిత్తులు, చర్మ, రక్త, పెద్ద పేగు, రొమ్ము, ఎముక, ప్రోస్టేట్, అండాశయ, మూత్రపిండాలు, గర్భాశయ క్యాన్సర్లను టీ-కణం, దాని రిసెప్టర్ గుర్తించి అంతం చేయగలవని కార్డిఫ్ విశ్వవిద్యాలయ బృందం ప్రయోగశాలలో చేసిన పరిశోధనల్లో గుర్తించారు.
ఈ పరిశోధనలో టీ-కణం, దాని రిసెప్టర్ సాధారణ కణజాలం జోలికి పోలేదు. ఇది ఎలా సాధ్యమైందనేది నిర్దిష్టంగా తెలుసుకొనేందుకు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.
పరిశోధకులు గుర్తించిన టీ-కణం రిసెప్టర్, మనిషి శరీరంలో ప్రతి కణం ఉపరితలంపై ఉండే ఎంఆర్1 అనే మాలిక్యూల్‌తో 'ఇంటరాక్ట్' అవుతుంది.
క్యాన్సర్ కణాల్లో ఎంఆర్1ను గుర్తించే టీ-కణం గురించి తొలిసారిగా వివరిస్తోంది తామేనని రీసర్చ్ ఫెలో గ్యారీ డాల్టన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ పరిశోధన ప్రాధాన్యం ఏమిటి?
టీ-కణం క్యాన్సర్ చికిత్సలు ఇప్పటికే ఉన్నాయి. ఈ రంగంలో సాధించిన ప్రధానమైన పురోగతిలో రోగనిరోధక వ్యవస్థ ఆధారిత క్యాన్సర్ చికిత్సల అభివృద్ధి ఒకటి. ఈ విషయంలో 'సీఏఆర్-టీ' అత్యంత ప్రముఖ ఉదాహరణ. ఇది ఒక లివింగ్ డ్రగ్. ప్రతి రోగికీ ప్రత్యేకంగా సిద్ధంచేసే ఔషధమే లివింగ్ డ్రగ్. కీమోథెరపీ లాంటి సంప్రదాయ చికిత్సలతో పోలిస్తే సీఏఆర్-టీతో చికిత్స భిన్నమైనది. రోగి నుంచి తెల్లరక్త కణాలను సేకరించి సీఏఆర్-టీ ఔషధాన్ని తయారుచేస్తారు.
రోగి టీ-కణాలకు జన్యు ఇంజినీరింగ్‌తో మార్పులు చేసి వాటి సాయంతోనే క్యాన్సర్‌ను నిర్మూలించేలా ఈ ఔషధాన్ని తయారుచేస్తారు.
సీఏఆర్-టీ ఎంతో అసాధారణమైన ఫలితాలను ఇవ్వగలదు. మృత్యువు అంచుల దాకా వెళ్లిన కొందరు రోగులకు వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టొచ్చు.
సీఏఆర్-టీ విధానంలో ప్రతి రోగికి వారికి ప్రత్యేకించిన పద్ధతిలోనే చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని పరిమితమైన క్యాన్సర్ల చికిత్సలోనే ఇది ఉపయోగపడుతుంది. టీ-కణాలను చికిత్సకు అనువుగా మార్చి, నిర్దిష్ట లక్ష్యంపై గురిపెట్టగల పరిస్థితులున్న సందర్భాల్లోనే ఈ విధానం ఫలితాలను ఇస్తుంది.
ల్యుకేమియా లాంటి రక్త క్యాన్సర్లతో పోలిస్తే గడ్డలతో కూడిన క్యాన్సర్లకు చికిత్సలో ఈ విధానం విజయవంతం కాలేదు.
తాము గుర్తించిన టీ-కణం రిసెప్టర్ అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే చికిత్స విధానం అభివృద్ధి చేయడానికి తోడ్పడగలదని కార్డిఫ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, iStock
ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది?
క్యాన్సర్ రోగి నుంచి రక్త నమూనాను సేకరిస్తారు.
అందులోంచి టీ-కణాలను తీసుకుని జన్యుపరమైన మార్పులు చేస్తారు.
క్యాన్సర్‌ను గుర్తించే రిసెప్టర్ తయారీకి అనుగుణంగా ఈ కణాలను రీప్రోగ్రామ్ చేస్తారు.
ఈ ప్రక్రియలో ఉపయోగించే హానికరంకాని ఒక వైరస్, క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిపై గురిపెట్టేలా టీ-కణాల్లో మార్పులు చేస్తుంది.
రీప్రోగ్రామ్ చేసిన టీ-కణాలను ప్రయోగశాలలో పెద్దయెత్తున ఉత్పత్తి చేస్తారు. తర్వాత వీటిని రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.
సీఏఆర్-టీ విధానంలోనూ ఇలాంటి ప్రక్రియే ఉంటుంది.
ప్రస్తుత పరిశోధనలో శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కణాలపై, జంతువులపై మాత్రమే పరీక్షలు చేపట్టారు. మరిన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాతే మనుషులపై ప్రయోగాలు మొదలుపెట్టనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణుల మాట ఏమిటి?
ఈ పరిశోధన తమకెంతో ఉత్తేజం కలిగిస్తోందని, దీనివల్ల మున్ముందు గొప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే అన్ని క్యాన్సర్లకు ఇది చికిత్స అందించగలదని ఇంత ప్రాథమిక దశలో చెప్పలేమని స్విట్జర్లాండ్‌లోని బాసెల్ విశ్వవిద్యాలయానికి చెందిన లూసియా మోరి, జెనారో డి లిబరో వ్యాఖ్యానించారు.
బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ ప్రొఫెసర్ డేనియల్ డేవిస్ స్పందిస్తూ- ఇది చాలా ప్రాథమిక పరిశోధన అని, రోగులకు ఔషధం అందించే దశకు దగ్గర్లో లేదని చెప్పారు.
"ఇదో ఉత్తేజభరితమైన ఆవిష్కరణ. రోగ నిరోధక వ్యవస్థ గురించి మన మౌలిక అవగాహనను, భవిష్యత్తులో కొత్త ఔషధాలను అభివృద్ధి చేసే అవకాశాలను ఇది మెరుగుపరుస్తుంది. ఇందులో సందేహం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- ఈ రాయల్ తాబేలు 344 ఏళ్లు జీవించిందా?
- 'ఇడియట్స్' గ్రామం పేరు మార్పు... సంబరాలు జరుపుకొంటున్న గ్రామస్థులు
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









