క్యాన్సర్‌ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) డాక్టర్ల కన్నా కచ్చితంగా గుర్తిస్తుందా?

ఫొటో సోర్స్, Science Photo Library
- రచయిత, ఫెర్గుస్ వాల్ష్
- హోదా, బీబీసీ వైద్య రంగ ప్రతినిధి
వైద్యుల కన్నా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) మరింత కచ్చితత్వంతో రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించగలదని ఒక అధ్యయనం సూచిస్తోంది.
మామోగ్రామ్‌లను పరిశీలించటానికి.. గూగుల్ హెల్త్, ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు సహా అంతర్జాతీయ బృందం ఒకటి.. ఒక కంప్యూటర్ నమూనాను రూపొందించి, దానికి శిక్షణనిచ్చింది. దాదాపు 29 వేల మంది మహిళల ఎక్స్-రేలతో ఈ శిక్షణ నిర్వహించింది.
ఈ ఆల్గోరిథమ్.. మామోగ్రాములను పరిశీలించి రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించటంలో ఆరుగురు రేడియాలజిస్ట్‌ల కన్నా మెరుగుగా పనిచేసిందని 'నేచర్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన వివరాలు వెల్లడించాయి.
ఇద్దరు వైద్యులు కలిసి పనిచేసినంత మెరుగుగా ఈ ఏఐ పనిచేసింది.
మనుషుల తరహాలో కాకుండా ఈ ఏఐ అవిశ్రాంతంగా అలసిపోకుండా పనిచేస్తుంది. క్యాన్సర్‌ను గుర్తించటం దీనిద్వారా మెరుగుపడగలదని నిపుణులు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎంత మెరుగుగా పనిచేస్తోంది?
బ్రిటన్ జాతీయ ఆరోగ్య పథకం ఎన్‌హెచ్‌ఎస్‌లో ప్రస్తుతం ఒక్కో మహిళ ఎక్స్‌రేలను ఇద్దరు రేడియాలజిస్టులు విశ్లేషిస్తారు. వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేని అరుదైన కేసుల్లో.. మూడో వైద్యుడు ఆ ఎక్స్-రేలను పరిశీలించి అంచనా వేస్తారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించటానికి చేపట్టిన తాజా అధ్యయనంలో.. మహిళల వివరాలు గోప్యంగా ఉంచి వారి ఎక్స్-రేలను మాత్రమే ఏఐ నమూనాకు అందించారు.
రోగి గత ఆరోగ్య చరిత్రను అంచనా వేసే మానవ నిపుణుల లాగా కాకుండా ఈ ఏఐ కేవలం మామోగ్రాములను మాత్రమే విశ్లేషించింది.
ఇద్దరు వైద్యులు విశ్లేషించే ప్రస్తుత పద్ధతి ఎంత మెరుగుగా ఉందో.. ఏఐ మోడల్ విశ్లేషణ కూడా అంతే మెరుగుగా ఉన్నట్లు ఈ అధ్యయన ఫలితాలు చూపాయి.
నిజానికి, ఒక వైద్యుడు మాత్రమే విశ్లేషించి క్యాన్సర్‌ను నిర్ధారించటం కన్నా ఈ ఐఏ చాలా మెరుగుగా పనిచేసింది.
ఒక రేడియాలజిస్ట్ విశ్లేషణతో పోల్చినపుడు.. ఒక మామోగ్రామ్ అసాధారణంగా ఉందని, క్యాన్సర్ ఉందని తప్పుగా గుర్తించే పొరపాటు.. ఐఏ విషయంలో 1.2 శాతం తగ్గింది.
అలాగే, క్యాన్సర్ లేదని ఒక డాక్టర్ తప్పుగా గుర్తించే పొరపాటు ఏఐ విషయంలో 2.7 శాతం మేర తగ్గింది.
''ఈ పరిశోధన ఫలితాల పట్ల మా బృందం నిజంగా గర్విస్తోంది. రొమ్ము క్యాన్సర్‌ను మరింత ఖచ్చితత్వంతో గుర్తించటానికి వైద్యులకు సాయపడగల ఒక పరికరాన్ని అభివృద్ధి చేయటంలో మేం ముందడుగు వేశాం'' అని గూగుల్ హెల్త్ బృందంలోని డొమినిక్ కింగ్ పేర్కొన్నారు.
మామోగ్రామ్‌లను విశ్లేషించి.. క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించే సామర్థ్యమున్న రేడియాలిజిస్ట్ కావాలంటే.. ఒక డాక్టర్‌కి, ఒక నిపుణుడికి ఒక దశాబ్ద కాలం పాటు శిక్షణ అవసరమవుతుంది.
ఎక్స్-రేలను అధ్యయనం చేయటం కీలకం.. కానీ చాలా సమయం పడుతుంది. బ్రిటన్‌లో 1,000 మందికి పైగా రేడియాలజిస్టుల కొరత ఉందని ఒక అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
మనుషుల చేతుల్లో నుంచి ఏఐ చేతుల్లోకి వెళుతుందా?
లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను డిజైన్ చేయటానికి, శిక్షణనివ్వటానికి మనుషులు అవసరమయ్యారు.
ఇది ఒక పరిశోధన అధ్యయనం. ఇప్పటివరకూ ఈ ఏఐ వ్యవస్థను క్లినిక్‌లలో ప్రవేశపెట్టలేదు.
దీనిని ప్రవేశపెట్టినప్పుడు కూడా రోగ నిర్ధారణకు ఇన్‌చార్జిగా ఒక రేడియాలజిస్ట్ ఉంటారు.
అయితే, మామోగ్రామ్‌లను ఇద్దరు డాక్టర్లు రెండు సార్లు విశ్లేషించాల్సిన అవసరం. ఈ ఏఐ వినియోగంలోకి వచ్చాక ఉండదు. తద్వారా రేడియాలజిస్ట్‌ల మీద పని ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.
''ఇది నా అంచనాలను అధిగమించి ఫలితాలను ఇచ్చింది. వ్యాధి నిర్ధారణ నాణ్యతను మెరుగుపరచటంలో ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. రేడియాలజిస్టులు మరింత ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టటానికి వెసులుబాటు కూడా కల్పిస్తుంది'' అని క్యాన్సర్ రీసెర్చ్ యూకే ఇంపీరియల్ సెంటర్ డైరెక్టర్, ఈ అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్ అరా దార్జీ బీబీసీతో చెప్పారు.
బ్రిటన్‌లో 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్‌హెచ్ఎస్ బ్రెస్ట్ స్క్రీనింగ్ (రొమ్ము క్యాన్సర్ పరీక్ష) కోసం పిలుస్తారు. అంతకుమించిన వయసున్న వాళ్లు తమకు ఈ పరీక్షలు నిర్వహించాలని స్వయంగా కోరవచ్చు.
ఏఐ వినియోగం వల్ల.. ఎక్స్-రేలను కంప్యూటర్ ఆల్గోరిథమ్ క్షణాల్లోనే విశ్లేషించగలదు కాబట్టి రోగ నిర్ధారణ ప్రక్రియ వేగవంతం కాగలదు.
''అంటే, భవిష్యత్తులో రోగులు వేచి ఉండాల్సిన సమయం తగ్గిపోతుంది. ఆందోళన చెందటం తగ్గిపోతుంది. మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయి'' అని క్యాన్సర్ రీసెర్చ్ యూకే ఇంపీరియల్ సెంటర్ డైరెక్టర్ ఆఫ్ క్యాన్సర్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ సారా హియామ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మెషీన్లు ఆటోమేటిగ్గా మిమ్మల్ని 'ఫైర్' చేస్తే ఎలా ఉంటుంది
- టెక్నాలజీ 2010-19: ఈ పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్
- యూపీ పోలీస్, మోదీ ప్రభుత్వంపై మరో ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్
- 'సూర్యుడు ఓం అంటూ జపం చేస్తున్నాడు’: నాసా వీడియో అంటూ కిరణ్‌బేడి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








