బికినీ అటోల్: ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జొనాథన్ అమోస్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్, శాన్ ఫ్రాన్సిస్కో
అది 1946 జులై 25. బికినీ అటోల్ వద్ద అయిదో అణు బాంబు పేలింది. సముద్ర జలాల్లో మొట్టమొదటి పేలుడు అది.
పసిఫిక్ మహాసముద్రం నుంచి భారీ మేఘం పుట్టగొడుగు ఆకారంలో పొడుచుకొస్తున్న చిత్రాన్ని ప్రపంచంలో చాలామంది చూశారు.
అణు యుద్ధం జరిగితే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపేలా పేలుడు ప్రాంతంలో వదిలిపెట్టిన నౌకలను తునాతునకలు చేస్తూ ఆ మేఘం నింగినంటింది.
ఇదంతా జరిగి 73 ఏళ్లయిన తరువాత ఇప్పుడు శాస్త్రవేత్తలు అక్కడి సముద్రతలంపై ఆ నాటి పేలుడును మ్యాప్ చేయడానికి వచ్చారు. అక్కడ ఇప్పటికీ భారీ బిలం ఉంది. ఆ అణు విస్ఫోటంలో నాశనమైన ఓడల శకలాలూ అక్కడ గుట్టలుగుట్టలుగా సముద్రంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, CSHEL UNIVERSITY OF DELAWARE
భారీ మడుగు కావడం, సుదూరంగా ఉండడంతో బికినీ అటోల్ (మార్షల్ ఐలాండ్స్‌లోని కొన్ని చిన్నచిన్న ద్వీపాల సమూహం)ను అణుబాంబు పేల్చడానికి సరైన స్థలంగా ఎంచుకున్నారని డెలావర్ యూనివర్సిటీకి చెందిన సర్వే టీమ్ లీడర్ ఆర్థర్ ట్రెంబానిస్ వివరించారు.
ఆ ప్రపంచ యుద్ధాన్ని, భారీ అణు విస్ఫోట తీవ్రతను వివరిస్తూ ప్రసిద్ధ అమెరికన్ హాస్యనటుడు బాబ్ హోప్.. ''భూమి మీద యుద్ధం ప్రభావం లేని ఒక స్థలాన్ని యుద్ధం ముగిసిన వెంటనే కనుగొన్నాం. ఆ స్థలం నరకానికి ఎగిరిపోయింది'' అంటూ వ్యంగ్యంగా చెప్పారని ట్రెంబానిస్ గుర్తు చేశారు.
ఆపరేషన్ క్రాస్ రోడ్స్ పేరిట అమెరికా బికినీ అటోల్ వద్ద ఏబుల్, బేకర్ అనే రెండు అణు బాంబులను పరీక్షించింది. 'హెలెన్ ఆఫ్ బికినీగా పిలిచే బేకర్ అణుబాంబు బరువు 21 వేల టన్నులు. దాన్ని పసిఫిక్ సముద్రం లోపల 27 మీటర్ల లోతున పేల్చారు.
ఈ విస్ఫోటం 20 లక్షల టన్నుల నీటిని, భారీ మొత్తంలో ఇసుకను, చిదిమేసిన పగడపు దిబ్బలను పైకి చిమ్మింది. ఈ పేలుడులో అసాధారణమైన శక్తి విడుదల కావడమే కాకుండా అప్పటి అవక్షేపాలు సముద్రతలంపై పేరుకుపోయి ఉంటాయని డాక్టర్ ట్రెంబానిస్ అభిప్రాయపడ్డారు.
ఓషనోగ్రాఫర్లు, జియాలజిస్టులు, మైరైన్ ఆర్కియలాజిస్టులు, ఇంజినీర్ల బృందమొకటి బికినీ అటోల్‌లోని విస్ఫోటన ప్రాంతంలో అల్ప పీడనాన్ని గుర్తించింది.
సోనార్ ఉపయోగించి వారు 800 మీటర్ల పొడవున ఆకృతిని మ్యాప్ చేశారు.
ఆ తరువాత అమెరికా జియోఫిజికల్ యూనియన్ సమావేశంలో డాక్టర్ ట్రెంబానిస్ దాన్ని వివరిస్తూ.. ''కెప్టెన్ మార్వెల్ స్వయంగా భూగ్రహానికి ఒక పంచ్ ఇవ్వడంతో లొత్త పడిందా అన్నట్లుగా ఉంది'' అన్నారు.
బికినీ అటోల్ వద్ద నాటి దృశ్యాన్ని బహిర్గతం చేయానలనుకుంటున్నామని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, CSHEL UNIVERSITY OF DELAWARE
అణుబాంబు విస్ఫోటంతో ఏర్పడిన బిలాన్ని ప్రకృతి తనకు తాకిన గాయంలా ఇప్పటికీ చూపుతోందని చెప్పిన ట్రెంబానిస్.. ''80లు, 90ల్లో అక్కడ ఇలా లేదు.. ఆ కాలంలో ఈతగాళ్లు అక్కడ దిగితే కాస్త భిన్నమైన శిథిలాలు కనిపించేవంతే. మేమిప్పుడు అధునాతన సోనార్ టెక్నాలజీ వాడుతున్నాం. మొత్తం దృశ్యానికి రూపమిస్తాం. ఇది ఒక భారీ సింధుశాఖను ఫ్లాష్ లైట్‌తో వెలుగులీనేలా చేయడం వంటిదే'' అన్నారు.
అణుబాంబు విస్ఫోటంతో ఏర్పడిన ఈ బిలం చుట్టూ అలలు గులాబీ పువ్వుల రెక్కల్లా ఉన్నాయి. పేలుడు తరువాత తొలినాళ్లలో ఆకాశంలోకి వేగంగా చిమ్మిన అన్ని వస్తువులకు ఇదే సాక్ష్యం.. క్రమక్రమంగా నీటి లోతుల్లోకి చేరి సముద్ర తీరమంతా ఆ వస్తువులు, అవశేషాలు వ్యాపించాయి.

ఫొటో సోర్స్, ARTHUR TREMBANIS
పేలుడు ప్రభావం వల్ల ఇప్పటికీ పర్యావరణంపై ఉన్న ప్రభావం అంచనా వేయడం ఈ సర్వే ఉద్దేశం. రేడియేషన్ స్థాయి ప్రస్తుతం గణనీయంగా తగ్గినప్పటికీ ఆ ఘటనలో నాశనమైన నౌకల శకలాల వల్ల కాలుష్యం ఇంకా ఉంది.
అప్పుడు నాశనం చేసినవన్నీ జర్మనీ, అమెరికా, జపాన్ నావికాదళాల్లోని పాడుబడిన నౌకలు. వీటి శిథిలాలు అక్కడ కృత్రిమ పగడపు దిబ్బలుగా మారుతాయని ఏమాత్రం ఊహించి ఉండకపోవచ్చు.
అప్పటి యుద్ధక్రీడ మేరకు కొన్ని వినియోగంలో లేని నౌకలను అలాగే ఉంచేశారు.. అంటే, ఇంధనం, ఆయుధాలు నిండిన నౌకలవి.
''మేం ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేస్తున్నప్పుడు అమెరికా విమానవాహక యుద్ధనౌక సరతోగా సమీపంలో ఉండగా దాన్నుంచి చమురు వాసన రావడాన్ని గుర్తించాం. దాన్నుంచి ఇంకా చమురు విడుదలవుతూనే ఉంది.
పెరల్ హార్బర్‌పై దాడిలో వినియోగించిన మరో నౌక నాగాతో నుంచి కూడా చమురు మైళ్ల దూరం పాకింది. ఈ ఓడలు నీటిలో శిథిలమవుతూనే ఉండడంతో వీటి వల్ల ఏర్పడుతున్న కాలుష్యం పెను సమస్యగా మారొచ్చని డాక్టర్ ట్రెంబానిస్ చెప్పారు.
ఇవికూడా చదవండి:
- ప్రమాదకర ప్రాంతానికి వెళ్లొద్దామా!
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలపై అంతర్జాతీయ కోర్టుకు మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూచీ
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- బెంగళూరులో బొమ్మ పోలీసులతో ట్రాఫిక్ నియంత్రణ
- మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్ ప్రశ్న, సమాధానం ఏంటి?
- మనీ లాండరింగ్‌పై పుస్తకం రాసిన ప్రొఫెసర్ అదే కేసులో అరెస్టు
- అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








