వ్యభిచారంలో మగ్గుతున్న అమ్మాయిల రక్షణకు పులిపై వచ్చిన 'సూపర్ హీరోయిన్'

ఫొటో సోర్స్, Priyashakti
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అత్యాచారాలు, యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా పోరాడే 'కామిక్ క్రూసేడర్' ప్రియ మరో కొత్త పోరాటం ప్రారంభించారు. సామూహిక అత్యాచార బాధితురాలైన ఆమె ఈసారి అమ్మాయిల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.
నిర్భయపై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన రెండేళ్ల తరువాత 2014 డిసెంబరులో ఈ ఫిమేల్ సూపర్ హీరో 'ప్రియ' క్యారెక్టర్ తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఫస్ట్ ఎడిషన్‌లో పులి మీద స్వారీ చేస్తూ కనిపించే ప్రియ శక్తి అత్యాచార బాధితుల గురించి మాట్లాడుతుంది. రెండో ఎడిషన్ 'ప్రియాస్ మిర్రర్'లో యాసిడ్ దాడులపై చర్చిస్తుంది.
చివరి ఎడిషన్ 'ప్రియ అండ్ ద లాస్ట్ గర్ల్స్'లో అమ్మాయిలను అక్రమంగా తరలించే రాహు అనే క్యారెక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
రాహు ఇందులో రహస్యంగా ఒక వ్యభిచార నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలను ఎత్తుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తుంటాడు. రాహు ముఠా ఎత్తుకొచ్చిన వారిలో ప్రియ సోదరి లక్ష్మి కూడా ఉంటుంది.
ప్రవాస భారతీయ నటి, రచయిత్రి దీప్తి మెహ్తా ఈ కామిక్‌కు స్క్రిప్ట్ అందించారు.
ప్రధాన క్యారెక్టర్ అయిన ప్రియ ఊళ్లో అమ్మాయిలంతా మాయమైపోయారని తెలుసుకున్నాక ఇంటికి రావడంతో 'ప్రియ అండ్ ద లాస్ట్ గర్ల్స్' కథ మొదలవుతుంది.
అప్పుడామె తన ఎగిరే పులి 'సాహస్'పై స్వారీ చేసుకుంటూ రాహు ఉన్న చోటికి వెళ్తుంది.

ఫొటో సోర్స్, Priyashakti
అక్కడ దురాశ, అసూయ, కామం రాజ్యమేలుతుంటాయి. మగవాళ్లను సుఖపెట్టడానికి, సేవ చేయడానికి మాత్రమే అక్కడ ఆడవాళ్లుంటారు. అందుకు ఎవరైనా అంగీకరించలేదో వారిని రాయిగా మార్చేస్తారు.
అక్కడికి వెళ్లిన ప్రియను బెదిరిస్తారు, ఆమెపై దాడి చేస్తారు. రాహు దగ్గర పనిచేసే ఒక మహిళ ప్రియను కూడా వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నిస్తుంది.
''నువ్వు మా దగ్గర పనిచేస్తే.. అయిదారుగురు మగవాళ్లను సుఖపెడితే చాలు, మిగతావారిలా 20 మందిని సుఖపెట్టనవసరం లేదు'' అంటూ ఆ మహిళ ప్రియను బలవంతం చేస్తుంది.
చివరకు ప్రియ ఇవన్నీ దాటుకుంటూ రాహుతో పోరాడి తన సోదరిని, మిగతా అమ్మాయిలను అక్కడి నుంచి విడిపిస్తుంది.
ఆ పోరాటంతో ఆమెకు విజయం దక్కలేదు. తాను విడిపించిన అమ్మాయిలను తీసుకెళ్లడానికి వారి కుటుంబీకులు ముందుకు రాలేదు. వ్యభిచార కూపం నుంచి బయటపడినవారిని కళంకితుల్లా చూస్తారు.
కానీ ప్రియ, మిగతా అమ్మాయిలు పితృస్వామ్యాన్ని ఎదిరించడానికి నిలబడతారని చెప్తారు మెహ్తా.
''నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మహిళలు MeToo పేరుతో మాట్లాడినట్లే ఇది కూడా'' అని చెప్పారు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 2107 అక్టోబరులో హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం అనంతరం ప్రపంచమంతటా విస్తరించింది.

ఫొటో సోర్స్, Priyashakti
''చాలా కామిక్ పుస్తకాల్లో మాదిరిగా మంచి వ్యక్తి గెలవడం, దుష్టులు ఓడిపోవడంతో సరిపెట్టే కామిక్ పుస్తకం ఇది కాదని నేను మొదటి నుంచి చాలా స్పష్టంగా చెబుతున్నాను, అంతకంటే ఇది ఎక్కువ ఆలోచన కలిగించాలి'' అని మెహ్తా అన్నారు.
కోల్‌కతాలోని రెడ్‌లైట్ ఏరియా సోనాగాచీ వెళ్లి, అక్కడ వ్యభిచార వృత్తిలో ఉన్న అనేక మందితో మాట్లాడిన తరువాత మహిళల అక్రమ రవాణా అంశంగా ఈ ఎడిషన్ రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు ఈ కామిక్ సిరీస్ సృష్టికర్త రామ్ దేవినేని బీబీసీకి తెలిపారు.
''తమను మాయ చేసి కొందరు అక్కడికి తీసుకొచ్చినట్లు నాతో మాట్లాడినవారిలో సగం మంది చెప్పారు. ఆ తర్వాత బలవంతంగా ఆ వృత్తిలో దించారని వివరించారు. మరికొందరు మాత్రం తీవ్రమైన పేదరికం కారణంగా గత్యంతరం లేక ఈ వృత్తిలో ఉన్నట్లు చెప్పారు'' అని తెలిపారు.
''చిన్నచిన్న గదుల్లో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉంటుంటారు. వారిలో చాలామందికి చిన్నపిల్లలుంటారు. కొందరైతే పిల్లలు పక్కన ఉంటుండగానే విటులతో గడపాల్సి వస్తుందని చెప్పారు. ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించాయి'' అని అన్నారు రామ్ దేవినేని.
''వారిలో చాలామంది ఆడవాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నా వెళ్లకుండానే ఆగిపోయారని అర్థమైంది. తమ కుటుంబాల కోసం, పిల్లల కోసం తమ జీవితాలను త్యాగం చేసినట్లే భావిస్తారు వారు'' అంటారాయన.
అక్కడున్నవారిలో చాలామంది కథలు 'ప్రియ అండ్ లాస్ట్ గర్ల్స్'లో చూడొచ్చని చెప్పారు రామ్ దేవినేని.

ఫొటో సోర్స్, Priyashakti
మహిళలపై హింస నిర్మూలనకు ఐరాస 16 రోజుల ఉద్యమం చేపడుతున్న రోజునే (25.11.2019) ఈ 'ప్రియ అండ్ లాస్ట్ గర్ల్స్' డిజిటల్ రూపంలో విడుదలైంది.
ఐరాస గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆయుధ వ్యాపారం తరువాత రెండో అతిపెద్ద వ్యవస్థీకృత నేర వ్యాపారం మానవ అక్రమ రవాణా. మాదకద్రవ్యాల వ్యాపారం కంటే కూడా ఇది పెద్దది.
ఇది వేల కోట్ల డాలర్ల అక్రమ వ్యాపారమని న్యూయార్క్‌కు చెందిన యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్ రుచిర గుప్తా 'బీబీసీ'తో చెప్పారు.
భారత్‌లో అక్రమ రవాణా బాధిత బాలికలు, మహిళలకు 'అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్‌వైడ్' అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయపడుతున్న ఆమె.. ''ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది అక్రమ రవాణా బాధితులుంటే వారిలో 2.7 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు'' అని చెప్పారు.
భారత్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు మానవ అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారాయని అన్నారు.
ఈ కామిక్‌ను భారత్, అమెరికాల్లోని పాఠశాలలు, కాలేజీల్లో చూపించి చర్చకు దారితీసేలా చేయాలని భావిస్తున్నట్లు గుప్తా చెప్పారు.
యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ కామిక్‌ను ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి ఇందులోని ప్రత్యేకమైన యానిమేషన్, చిత్రాలను చూడ్డానికి వీలు కల్పించేలా ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉపయోగించినట్లు గుప్తా చెప్పారు.

ఫొటో సోర్స్, Priyashakti
''వ్యభిచారమనేది ప్రపంచంలోని పురాతన వృత్తుల్లో ఒకటని చెబుతుంటారు. కానీ, ఎవరో కొందరు ఆడవాళ్లు పొట్టకూటి కోసం డబ్బు తీసుకుని మగవారికి సుఖమందించడానికి, మానవ అక్రమ రవాణాకు తేడా ఉందని గుర్తించరు. ఇది బలహీన పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను దోచుకోవడమే'' అంటారు రుచిర గుప్తా.
''అమ్మాయిలను వస్తువులుగా చూసే పురుషుల దృష్టిలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. అందుకు సరైన సమయం యువకులుగా ఉన్నప్పుడే వారిలో ఈ మార్పు తేవడం'' అంటారామె.
ఆర్ట్ వర్క్: సిద్ ఫిని, నెడా కజెమిఫార్
ఇవి కూడా చదవండి.
- పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాద సదస్సుపై ఆగ్రహం
- ఫూమీ: ఏసుక్రీస్తు విగ్రహాలను బలవంతంగా కాలితో తొక్కించే ఈ ఆచారం ఏంటి?
- ప్రపంచంలో మొబైల్ డాటా ధరలు ఎక్కువగా ఉంది ఈ దేశంలోనే.. డాటా కోసం తిండి మానేస్తున్నారు
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- తెలంగాణ: ఆర్టీసీ చరిత్రలో చివరి సమ్మె ఇదే అవుతుందా?
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








