భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆయేషా పెరెరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల ఒక అణు విద్యుత్ ప్లాంటు మీద సైబర్ దాడి జరగటంతో.. భారతదేశం సైబర్ యుద్ధంలో తనను తాను రక్షించుకోగల సామర్థ్యం మీద చర్చ మొదలైంది. అయితే.. దానికంటే కూడా సైబర్ దాడికి సులభంగా గురవగల దేశ ఆర్థిక వ్యవస్థలలోని లోపాల గురించి భారతీయులు ఎక్కువ పట్టించుకోవాలని నిపుణులు అంటున్నారు.
భారతదేశంలోని అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటు మీద సైబర్ దాడి జరిగిందన్న వార్తలు గత నెలలో పతాక శీర్షికలకు ఎక్కాయి.
ఈ ఉదంతంతో.. భారతదేశ ''సైబర్ సంసిద్ధత'' ఎంత సమర్థవంతంగా ఉందనే దాని మీద చర్చ మొదలైంది. హానికరమైన డిజటల్ దాడుల నుంచి దేశం తన కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించుకోగలదా అనే ప్రశ్నలూ తలెత్తాయి.
కానీ.. అంతకన్నా పెద్ద సమస్య ఒకటుంది. అది కోట్లాది మంది భారతీయులను ప్రభావితం చేస్తోంది. అదే.. డెబిట్ కార్డ్ హ్యాకింగ్ వంటి అనేక రకాల ఆర్థిక మోసాలు.
కేవలం గత నెలలోనే.. 12 లక్షల డెబిట్ కార్డుల వివరాలు ఆన్‌లైన్‌లో లభ్యమవటం గురించి దర్యాప్తు చేసే పనిని సింగపూర్‌కు చెందిన 'గ్రూప్-ఐబీ' అనే సైబర్ భద్రత సంస్థకు అప్పగించింది భారత రిజర్వు బ్యాంకు.
ఇక గతేడాది పుణేలోని కాస్మోస్ బ్యాంక్‌కు చెందిన డాటా సప్లయర్ల మీద సైబర్ దాడి చేసిన హ్యకర్లు 90 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం ఎందుకు ఇంత బలహీనంగా ఉంది?
''భారతదేశపు ఆర్థిక వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి.. కారణం మనం లావాదేవీల కోసం స్విఫ్ట్ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లనే ఇప్పటికీ వాడుతున్నాం. ఈ ఇంటర్నేషనల్ గేట్‌వేలు.. దాడులకు వీలుకల్పించే.. తెరిచిన తలుపుల వంటివి'' అని బీబీసీతో చెప్పారు అరుణ్ కుమార్. ఆయన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో సైబర్ విభాగానికి సారథ్యం వహిస్తున్నారు.
సిమాన్‌టెక్ అనే సైబర్ భద్రత సంస్థ తన నివేదికలో.. ప్రపంచంలో ఫిషింగ్, మాల్‌వేర్ దాడులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రస్థాయి మూడు దేశాల్లో ఉందని పేర్కొంది.
భారతదేశపు డిజిటల్ జనాభా సంఖ్య తక్కువే అయినా.. ఫ్రాన్స్ దేశపు జనాభాతో సమానమైన సంఖ్యలో భారతదేశ ప్రజలు ప్రతి ఏటా కొత్తగా ఇంటర్నెట్‌కు అనుసంధానమవుతున్నారు. కానీ.. ఇలాంటి కొత్త వినియోగదారులు సైతం డిజిటల్ చెల్లింపులు జరపక తప్పని పరిస్థితులు ఉండటం చాలా ఆందోళనకరం.
ఉదాహరణకు.. 2016 నవంబర్‌లో ప్రభుత్వం అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసినపుడు.. డిజిటల్ చెల్లింపులు ప్రత్యామ్నాయం అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీగా ప్రచారం చేసి ప్రోత్సహించారు.

అప్పటి నుంచీ స్వదేశీ (పేటీఎం), అంతర్జాతీయ (గూగుల్) చెల్లింపుల వేదికలు భారతదేశంలో ఓ భారీ పరిశ్రమగా మారాయి.
ఇండియాలో 2023 నాటికి మొబైల్ చెల్లింపులు లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ అవుతుందని క్రెడిట్ సూసీ నివేదిక అంచనా వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులు కూడా ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం దేశంలో 90 కోట్ల కార్డులు పనిచేస్తున్నాయి.
''భారతదేశంలో ఇంటర్నెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన వారిలో చాలా మంది - 30 కోట్ల మందికి పైగా - మధ్య, దిగువ తరగతులకు చెందినవారు. వారి డిజిటల్ అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంది వేరే రాష్ట్రాలకు వచ్చి, తమకు తెలియని భాష ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న వలస కార్మికులు. కాబట్టి వారు మోసపోవటం సులభం'' అని సాంకేతిక నిపుణుడు ప్రశాంతో రాయ్ బీబీసీతో పేర్కొన్నారు.
''రెండో విషయం ఏమిటంటే.. ఇటువంటి మోసాలను బ్యాంకులు రిపోర్ట్ చయటం చాలా అరుదు. అంటే.. కొన్నిసార్లు అసలు ఏం జరిగిందనేది కూడా వినియోదారులకు తెలియదు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి?
భారతదేశంలో ఆర్థిక మోసాలు చాలా రూపాల్లో ఉన్నాయి. హ్యాకర్లు.. ఏటీఎంలలో స్కిమ్మర్లు, కీబోర్డు కెమెరాలు అమర్చుతారు. వాటిద్వారా వినియోగదారుల కార్డు వివరాలను అవి గ్రహిస్తాయి. అలాగే.. ప్రజలకు ఫోన్ చేసి వారి వివరాలు వారే వెల్లడించేలా మోసం చేస్తుంటారు.
డిజిటల్ లావాదేవీల రేఖలు అస్పష్టంగా, గందరగోళంగా ఉండటం సమస్య. వాస్తవ ప్రపంచంలో ఇచ్చేవారు, తీసుకునేవారి మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. కానీ మొబైల్ చెల్లింపుల వేదిక మీద.. ఇది అన్నివేళలా స్పష్టంగా ఉండదు. ఉదాహరణకు.. ఒక టేబుల్‌ను ఆన్‌లైన్‌లో అమ్మటానికి ప్రయత్నించినపుడు.. ఎవరో ఒక వ్యక్తి తాను దానిని కొంటానంటూ ఫోన్ చేసి.. ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తానని చెప్తుంటారు'' అని రాయ్ వివిరంచారు.
''ఆ వ్యక్తి తాను డబ్బులు చెల్లించానంటూ.. దానిని నిర్ధారించటానికి 'మీకు ఒక టెక్ట్స్ మెసేజ్‌లో కోడ్ వచ్చింది.. ఆ కోడ్ చెప్పండి' అని అడుగుతారు. చాలా మంది ఇంకేమీ ఆలోచించరు. ఆ తర్వాత తమ ఖాతా నుంచి డబ్బులు పోయాయని వీరికి తెలుస్తుంది'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులను ఎలా మెరుగుపరచవచ్చు?
ఒక సమస్య ఏమిటంటే.. ఈ వ్యవస్థలు వాటికవే సురక్షితమైనవి కాదు. తగినంత పారదర్శకమైనవీ కాదు. ఉదాహరణకు కాస్మోస్ మోసంలో.. అక్కడున్న సాఫ్ట్‌వేర్ అన్ని లావాదేవీల్లో మోసం జరిగినపుడు తేడాలను గుర్తించలేకపోయింది. ఆ మోసాన్ని గుర్తించేటప్పటికి భారీ మొత్తంలో డబ్బులు పోయాయి.
పైగా.. ప్రమాణీకరణ లోపించటం కూడా లావాదేవీలు గందరగోళంగా మారటానికి.. ప్రత్యేకించి మొదటిసారి వాడేవారు అయోమయంలో పడటానికి కారణమవుతోంది. ఉదాహరణకు ఏటీఎంలు చాలా రకాలుగా ఉంటాయి. అలాగే దేశంలోని పేమెంట్ యాప్‌లు ఉపయోగించే తీరుతెన్నులూ ఒక్కోటి ఒక్కో రకంగా ఉంటుంది.
రెండో విషయం.. మానవ సమస్య కూడా ఉందంటారు సుకుమార్. పొంచివున్న ప్రమాదాల గురించి కనీస అవగాహన కూడా ప్రజలకు లేదు. దీనివల్ల వారికి, కొన్నిసార్లు మొత్తం వ్యవస్థకు ప్రమాదం ఉంటుంది.
''కీబోర్డుల మీద పనిచేసేటపుడు మనుషులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటు మీద ప్రభావం చూపిన వైరస్.. బహుశా అక్కడి సిబ్బందిలో ఒకరు సంస్థలోని ఒక కంప్యూటర్‌లోకి ఒక యూఎస్‌బీ డ్రైవ్‌ను ప్లగ్ చేసినపుడు మొత్తం వ్యవస్థలోకి ప్రవేశించి, ప్లాంటు భద్రతకు ముప్పుగా మారినట్లు కనిపిస్తోంది. బ్యాంకు సిబ్బంది లేదా ఇతర ఆర్థిక సంస్థల సిబ్బందితో కూడా ఇలాగే జరగొచ్చు'' అని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ పాత్ర ఏమిటి?
ఆర్థిక లావాదేవీల్లో భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం, ఆర్థిక సంస్థలేనని.. వినియోగదారులు కాదని రాయ్ అంటారు.
''భారతదేశపు ఇంటర్నెట్ వృద్ధిని బట్టిచూస్తే.. కేవలం డిజిటల్ అవగాహన పెంపొందించటం మీద మాత్రమే ఆధారపడటం సాధ్యం కాదు. హ్యాకర్లు అనుసరించే అత్యాధునిక పద్ధతులను.. వారు నిరంతరం మారుస్తున్న ఎత్తుగడలు, పద్ధతులను తప్పించుకోవటం ఎలా అనేది ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండటం అసాధ్యం. కాబట్టి మనల్ని రక్షించే భారం నియంత్రణ సంస్థల మీదే ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు.
వివిధ సైబర్ సెక్యూరిటీ సంస్థల మధ్య సమాచారం తగినంత వేగంగా లేకపోవటం మరొక సమస్య.
భారతదేశపు డిజిటిల్ మౌలికసదుపాయాల భద్రతకు సంబంధించిన మొదటి సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్).. పొంచివున్న ప్రమాదాల గురించి ప్రభుత్వానికి తెలియజేటంలో చాలా నత్తనడకన నడుస్తోంది.
కానీ.. దీని గురించి భారతదేశానికి ఇప్పటికే అవగాహన ఉంది. జాతీయ సైబర్ భద్రత విధానం 2020ని రూపొందిస్తోంది. విధానం స్పష్టంగా ఉండాల్సిన ఆరు కీలక రంగాలను కూడా గుర్తించింది. వీటిలో ఆర్థిక భద్రత ఒకటి.
అయితే.. దేశంలోని ప్రతి ప్రధాన రంగానికీ ఒక సెర్ట్ ఉండటం ఉత్తమమంటారు రాయ్. వాటి మధ్య పరస్పర సమాచార సంబంధాలు ఉండటంతో పాటు, ప్రభుత్వం వాటికి సమన్వయకర్తగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అప్పుడు మాత్రమే.. నగదు రహిత ఆర్థికవ్యవస్థకు మారుతున్నపుడు వచ్చే ప్రమాదాలకు భారతదేశం సమర్థవంతంగా ప్రతిస్పందించగలదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- భాయిచంద్ పటేల్: 'ఆ అమ్మాయిలకు తిరగడానికి తెల్లవాళ్ళు, పెళ్లికి మాత్రం మనలాంటి వాళ్లు కావాలి'
- 'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'
- నీటిపై తేలియాడే వెనిస్ను ముంచెత్తిన వరదలు
- హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి?
- కశ్మీర్, అయోధ్యల తరువాత... మోదీ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమిటి?
- కరసేవకుడి నుంచి ప్రధానమంత్రి వరకు… నరేంద్ర మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- ‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్‌ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’
- లీగల్ హ్యాకింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యువకుడు
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- అమెరికాలో తాజా నత్తల వ్యాపారం: గ్రీన్హౌస్ ఫామ్‌ల్లో నత్తల్ని సాగుచేసి రెస్టారెంట్లకు అమ్ముతున్న హెలీకల్చరలిస్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








