అంతరిక్షం నుంచి తొలి నేరం... భూమ్మీద బ్యాంకు ఖాతాను హ్యాక్ చేశారని ఆరోపణలు

ఫొటో సోర్స్, Reuters
అంతరిక్షం నుంచి జరిగిన నేరం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేరానికి సంబంధించి నాసా విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న అన్నె మెక్‌క్లెయిన్ అనే వ్యోమగామి తన మాజీ జీవిత భాగస్వామి బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలించినట్లుగా తేలింది.
మాజీ జీవిత భాగస్వామి బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేసినట్లు అన్నె అంగీకరించారని.. అయితే, తానేమీ ఆ ఖాతాలో డబ్బును మళ్లించడం వంటి పనులు చేయలేదని చెప్పారని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.
కాగా ఆమె మాజీ జీవిత భాగస్వామి సమ్మర్ వోర్డెన్ దీనికి సంబంధించి ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
అన్నె మెక్‌క్లెయిమ్, సమ్మర్ వోర్డెన్ ఇద్దరూ మహిళలే. అన్నె వ్యోమగామి కాగా వోర్డెన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటిలిజెన్స్ అధికారి. ఈ ఇద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరు విడిపోయారు. అన్నెతో పెళ్లికి ముందే వోర్డెన్‌కు కుమారుడు ఉన్నాడు.
మరోవైపు అన్నె మెక్‌క్లెయిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి వచ్చాక ఆమె న్యాయవాది రస్టీ హార్డిన్ 'న్యూయార్క్‌టైమ్స్'తో మాట్లాడారు.
అన్నె కేవలం కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికే ఆ ఖాతాను పరిశీలించారని.. మాజీ జీవిత భాగస్వామి వోర్డెన్ కుమారుడి బాగోగులు చూసుకోవడానికి, బిల్లులు కట్టడానికి సరిపడా డబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికే ఆమె ఆ ఖాతాను పరిశీలించారని చెప్పారు.
విడిపోవడానికి ముందు నుంచే వోర్డెన్, అన్నె ఇద్దరూ కలిసే వోర్డెన్ కుమారుడి బాగోగులు చూసేవారని చెప్పారు.
కాగా నాసా ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయ దర్యాప్తు అధికారులు ఈ ఆరోపణలపై అన్నె, వోర్డెన్ ఇద్దరితోనూ మాట్లాడారని 'న్యూయార్క్ టైమ్స్' తెలిపింది.
అన్నె మెక్‌క్లెయిన్ ప్రఖ్యాత వెస్ట్ పాయింట్ మిలటరీ అకాడమీలో చదువుకుని ఆర్మీ పైలట్‌గా పనిచేశారు. ఇరాక్ గగనతలంపై 800 గంటలు యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమెకు ఉంది.
అనంతరం 2013లో నాసాకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలలు గడిపారు.
త్వరలో పూర్తిగా మహిళలతోనే నిర్వహించే స్పేస్‌వాక్‌లోనూ ఆమె పాల్గొనాల్సి ఉంది. కానీ, చివరి నిమిషంలో ఆమెను తప్పించారు. ఆమెకు సరిపడా స్పేస్ సూట్ దొరక్కపోవడంతోనే పంపించడం లేదని నాసా చెబుతోంది.
అంతరిక్షం నుంచి జరిగిన నేరానికి భూమిపై చట్టాలు వర్తిస్తాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అమెరికా, కెనడా, జపాన్, రష్యా, పలు ఐరోపా దేశాలకు చెందిన 5 స్పేస్ ఏజెన్సీలు సంబంధాలు కలిగి ఉన్నాయి. ఆయా దేశాల చట్టాలే వారికి అంతరిక్షంలోనూ వర్తిస్తాయి.
అంటే, అంతరిక్షంలో ఓ కెనడా దేశీయుడు నేరానికి పాల్పడితే కెనడా చట్టాల ప్రకారమే అతడిపై విచారణ జరుగుతుంది.
అంతరిక్ష పర్యటకం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో అంతరిక్ష నేరాలపై విచారణకు తగిన విచారణ వేదికల ఏర్పాటు అవసరం కూడా ఉంది.
కాగా.. అంతరిక్ష కేంద్రంలో ఎలాంటి నేరాలూ జరిగినట్లు ఇంతవరకు తమకు తెలియదని నాసా అధికారులు చెప్పినట్లుగా 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- అరుణ్ జైట్లీకి వచ్చిన సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ ఎలా వేధిస్తుంది...
- ఫోర్బ్స్ టాప్-10 జాబితాలో స్కార్లెట్ జాన్సన్... నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్
- మోదీని యూఏఈ సన్మానిస్తుంటే పాకిస్తాన్‌కు అభ్యంతరం దేనికి
- జీ7 సదస్సు: అసలు జీ7 బృందం ఏమిటి? అది ఏం చేస్తుంది?
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టాలని ఈమె 7 లక్షలు అప్పుచేసి డిస్నీలాండ్ వెళ్లారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









