ఖమేనీ ఎక్కడున్నారనే సమాచారం అమెరికా, ఇజ్రాయెల్‌కు ఎలా తెలిసింది? ఆ దాడులను ఇరాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గోర్డాన్ కొరెరా
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి కారణమైన దాడి, అందరూ ఊహించినట్లుగా అర్ధరాత్రి కాకుండా ఉదయం వేళలో జరిగింది. కొన్నిగంటల ముందే అందిన అత్యంత కీలకమైన నిఘా సమాచారాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించుకోవడమే దీనికి కారణం.
ఇరాన్ సీనియర్ నాయకులందరూ ఒకేచోట సమావేశమయ్యే అవకాశం కోసం వారు నెలల తరబడి వేచి చూశారు.
శనివారం ఉదయం సెంట్రల్ తెహ్రాన్‌లోని ఒక కాంపౌండ్‌లోకి ఖమేనీ చేరుకోనున్నారని వారికి సమాచారం అందింది.
అదే సమయంలో సమావేశమవుతున్న ఇతర సీనియర్ సైనిక, నిఘా విభాగాల అధికారుల ఆచూకీని కూడా వారు గుర్తించారు.
సుప్రీం లీడర్ కదలికలను అమెరికా, ఇజ్రాయెల్ నెలల తరబడి ట్రాక్ చేశాయి. వారు ఉపయోగించిన కచ్చితమైన పద్ధతులు రహస్యంగా ఉన్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో వాటి గురించి ప్రస్తావించారు.
"ఆయన మా ఇంటెలిజెన్స్, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి తప్పించుకోలేకపోయారు" అని తెలిపారు.
ఇది మానవ వనరుల ద్వారా సాధ్యమై ఉండవచ్చు, లేదా ఆయా వ్యక్తులపై సాంకేతిక నిఘా ద్వారా సాధ్యమయ్యే అవకాశం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘ నిఘా
గత జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలో, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌తో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు, అధికారులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. వ్యక్తుల కదలికలను అర్థం చేసుకోవడానికి టెలికాం, మొబైల్ ఫోన్ వ్యవస్థలను ఛేదించి నిఘా పెట్టినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
ఇందులో భాగంగా కొన్నిసార్లు కీలక అధికారులతో సంబంధం ఉన్న బాడీగార్డుల కదలికలను కూడా ట్రాక్ చేశారు. సుదీర్ఘ కాలం పాటు ఇలా చేయడం ద్వారా, ఒక వ్యక్తి దైనందిన జీవన సరళిని అర్థం చేసుకోవచ్చు. ఇది వారి కార్యకలాపాలను అంచనా వేయడానికి, అర్థం చేసుకోవడానికి, వారు ఎప్పుడు బలహీనంగా ఉన్నారో గుర్తించడానికి సహాయపడుతుంది.
శత్రువులకు సుప్రీం లీడర్ లక్ష్యంగా ఉన్నారని ఇరాన్‌కు తెలుసు. నెలలుగా జరుగుతున్నా, ఇటువంటి భద్రతా లోపాలను సరిదిద్దడంలో విఫలం కావడం అనేది ఇరాన్ భద్రతా, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల భారీ వైఫల్యాన్ని సూచిస్తోంది. లేదా ఇజ్రాయెల్, అమెరికాలు నిరంతరం తమ పద్ధతులను మార్చుకుంటూ, ట్రాక్ చేయడానికి కొత్త మార్గాలను కనుగొనగలిగే సామర్థ్యాన్ని ఇది చాటుతోంది. పగటిపూట దాడి జరిగే అవకాశం తక్కువని ఇరాన్ అంచనా వేసి కూడా ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Airbus DS 2026
సీఐఏ నుంచి సమాచారం..
ఇరాన్ సుప్రీం లీడర్ సహా, పలువురు సీనియర్ నాయకుల సమావేశం గురించి అమెరికాకు సీఐఏ నుంచి నిఘా సమాచారం వచ్చిందని, అయితే ప్రత్యక్ష దాడిని నిర్వహించడానికి దానిని ఇజ్రాయెల్‌కు బదిలీ చేసినట్లు 'న్యూయార్క్ టైమ్స్' రిపోర్టు చేసింది.
ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య స్పష్టమైన పని విభజన ఉన్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానంగా దేశ నాయకత్వ లక్ష్యాలపై దాడులకు దృష్టి పెడితే, అమెరికా సైనిక లక్ష్యాలపై దాడికి దిగింది.
సుప్రీం లీడర్, ఇతర అధికారుల కదలికలకు సంబంధించిన సమాచారం తగినంత ముందుగానే లభించింది. దీనివల్ల సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ప్రయోగించే యుద్ధ విమానాలతో దాడిని ప్లాన్ చేయడానికి వీలైంది.
ఈ దాడిని ఒకే లక్ష్యం కంటే ఒక విస్తృత పోరాటానికి నాందిగా భావించాలని ప్రణాళిక రచించారు. లభించిన అవకాశాన్ని చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఈ దాడి చేశారు.
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తెహ్రాన్ చేరుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది, అయితే అవి ఎంత దూరం నుంచి క్షిపణులను ప్రయోగించాయనేది స్పష్టంగా తెలియదు. నిర్ణయం తీసుకున్న తర్వాత, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:40 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సుమారు 30 బాంబులతో ఆ కాంపౌండ్‌పై దాడి చేసినట్లు రిపోర్టులున్నాయి.
కాంపౌండ్ కింద ఉన్న భూగర్భ బంకర్‌ను సుప్రీం లీడర్ తన రక్షణ కోసం ఉపయోగిస్తుండటమే దీనికి కారణం కావచ్చు (కాేనీ, ఇది ఇరాన్ పాలకవర్గానికి ఉన్న అత్యంత లోతైన బంకర్లలో ఒకటి కాదని సమాచారం). ఈ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడానికి, భూమిలోకి లోతుగా చొచ్చుకుపోయేలా అనేక క్షిపణులను ప్రయోగించాల్సి రావొచ్చు.
వారసులను ముందే ఎంచుకున్నారా?
ఇరాన్ రాజధానిలోని ఇతర ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. అందులో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కార్యాలయం కూడా ఉంది. అయితే తాను సురక్షితంగా ఉన్నానని ఆయన తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీ, రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదే, ఐఆర్‌జీసీ కమాండర్ జనరల్ మహమ్మద్ పాక్పూర్ సహా ముగ్గురు అగ్రశ్రేణి ఇరాన్ రక్షణ అధికారులు మరణించినట్లు ఇరాన్ ధృవీకరించింది.
యుద్ధ విమానాలు దాడులు జరిపిన సమయంలో, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో అర్ధరాత్రి అయ్యింది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ తన ఉన్నతాధికారులతో కలిసి పరిణామాలను పర్యవేక్షించారు. సుప్రీం లీడర్ మరణించారనే ధృవీకరణ రావడానికి కొన్ని గంటల సమయం పట్టింది.
అయినప్పటికీ, ఇరాన్ ఇటువంటి పరిస్థితి కోసం ముందే సిద్ధమైంది. కేవలం ఖమేనీ కోసమే కాకుండా, ఇతర ఉన్నతాధికారుల వారసత్వ ప్రణాళికలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లు రిపోర్టులు ఉన్నాయి. అందుకే, ఈ మరణాలు యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తాయనేది స్పష్టంగా తెలియడం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













