దాడుల్లో ఖమేనీతో పాటు రక్షణ మంత్రి, రివల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక ఏంటంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, రక్షణ మంత్రి మేజర్ జనరల్ అజీజ్ నాసిర్‌జాదేహ్, ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మౌస్వీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు.
ఇరాన్ ఎలైట్ ఆర్మీ, రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి జనరల్ మొహమ్మద్ పాక్పోర్, కొంతమంది సీనియర్ కమాండర్ల మరణాన్ని కూడా ధ్రువీకరించారు.
ఖమేనీ మరణించినట్టు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించిన తర్వాత, ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రెజెంటర్ కన్నీళ్లతో ఖమేనీ మరణాన్ని ప్రకటించారు. దేశం 40 రోజుల సంతాప దినాలను పాటిస్తుందని చెప్పారు.
ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో దాదాపు 40 మంది ఇరాన్ అధికారులు మరణించారని కొన్నివర్గాలు చెప్పినట్టు అమెరికాకు చెందిన బీబీసీ న్యూస్ పార్ట్‌నర్ సీబీఎస్ తెలిపింది.


ఫొటో సోర్స్, ARMIN KARAMI/Middle East Images/AFP via Getty Image
‘దాదాపు 40 మంది కీలక వ్యక్తులు మృతి’
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ) అధిపతితో సహా అనేక మంది సీనియర్ అధికారులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఇరాన్ సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మౌస్వీ వైమానిక దాడుల్లో మరణించారని ఇరాన్ టీవీ తెలిపింది.
ఐఆర్‌జీసీ కమాండర్ జనరల్ మొహమ్మద్ పాక్పోర్ మరణించారని ఇరాన్ కూడా ధ్రువీకరించింది.
రక్షణ మంత్రి మేజర్ జనరల్ అజీజ్ నాసిర్‌జాదేహ్ కూడా మరణించారు.
సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ అలీ షంఖానీ కూడా చనిపోయారు.
ఈ దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు లేదా మనవరాలు కూడా మరణించారని ప్రభుత్వ మీడియా తెలిపింది.
దాడుల్లో దాదాపు 40 మంది ఇరాన్ అధికారులు చనిపోయారని నిఘా వర్గాలు, మిలిటరీ వర్గాలు సీబీఎస్‌కు తెలిపాయి.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
ట్రంప్ తాజా హెచ్చరికలు..
అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని హెచ్చరిస్తూ ఐఆర్‌జీసీ నుంచి ఒక ప్రకటన వెలువడింది.
"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన దాడి ఆక్రమిత భూభాగాలు, అమెరికా ఉగ్రవాద స్థావరాలపై క్షణాల్లో ప్రారంభమవుతుంది" అని ఆ ప్రకటనలో ఉంది.
దీనిపై స్పందించిన ట్రంప్, అదే జరిగితే అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు.
" గతంలో ఎప్పుడూ చేయనంత శక్తివంతమైన దాడిని ఈరోజు ప్రారంభిస్తామని ఇరాన్ చెప్పింది. కానీ, వారు అలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వారు అలా చేస్తే మేం ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా వారిపై తీవ్రమైన దాడి చేస్తాం" అని ఆయన ట్రూత్ సోషల్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఒక్కరోజులో చాలా నాశనమైంది’
"చరిత్రలో అత్యంత చెడ్డ వ్యక్తుల్లో ఒకరైన ఖమేనీ ఇప్పుడు చనిపోయారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఖమేనీ, ఆయన రక్తపిపాసి గ్యాంగ్ వల్ల చనిపోయిన, గాయపడ్డ అమెరికన్లు, అనేక దేశాల ఇతర ప్రజలకు కూడా జరిగిన న్యాయం" అని అంతకుముందు తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో డోనల్డ్ ట్రంప్ రాశారు.
"ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి లభించిన అతిపెద్ద అవకాశమిది. ఐఆర్‌జీసీ, సైనిక అధికారులు,ఇతర భద్రతా, పోలీసు దళాలు చాలా మంది ఇకపై పోరాడటానికి ఇష్టపడటం లేదని మమ్మల్ని రక్షణ కోరుతున్నారని తెలుస్తోంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు.. ఇప్పుడైతే వారికి రక్షణ లభించవచ్చు. ఆలస్యం చేస్తే మిగిలేది మరణమే'' అని ట్రంప్ రాశారు.
"ఇరాన్ దేశభక్తులతో ఐఆర్‌జీసీ, పోలీసులు శాంతియుతంగా ఐక్యమై, ఒక యూనిట్‌గా, దేశాన్ని వీలైనంత గొప్పగా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కావాలి. ఎందుకంటే, ఖమేనీ మరణించడమే కాదు. దేశం ఒక్క రోజులోనే చాలా వరకు నాశనమైంది, దాదాపు తుడిచిపెట్టుకుపోయింది" అని ట్రంప్ అన్నారు.
"ఏదేమైనా, అత్యంత కచ్చితత్వంతో, భారీ బాంబు దాడులు ఈ వారమంతా లేదంటే అవసరమైనంత కాలం కొనసాగుతాయి. తద్వారా మనం పశ్చిమాసియా అంతటా, వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా శాంతిని సాధించగలం" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














