ఇరాన్: ఎవరీ ఖమేనీ? ఈయన వారసుడి ఎంపిక ఎలా జరుగుతుంది?

ఇరాన్ సుప్రీం లీడర్, అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, EPA-EFE/Shutterstock

చదివే సమయం: 3 నిమిషాలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆయన కార్యాలయంలో అధికారిక విధులలో నిమగ్నమై ఉన్నప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులలో మరణించినట్టు తెలిపింది.

ఈమేరకు ఇరాన్‌లో 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ క్రమంలో ఖమేనీ వారసుడు ఎంపిక గురించి ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మరో ఇద్దరు కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపింది.

ఖమేనీ వారసుడి ఎంపిక బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌పైన ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఎంపిక జరిగిపోవాలి.

అయితే ఇరాన్‌లో ప్రస్తుత దాడుల దృష్ట్యా ఈ సభ్యులందరినీ సమావేశపరచడం భద్రతా కారణాల రీత్యా అంత తేలిక కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రుహోల్లా అయతొల్లా ఖమేనీ మరణించిన రోజున ఈ తతంగం ఏమీ లేకుండా ఖమేనీని వారసుడిగా ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏమిటీ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్?

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, ఖమేనీకి వారసుడిని ఎంపిక చేసే బాధ్యత ఆయనను ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కే ఉంటుంది.

ఇది మొత్తం 88 మంది మతపెద్దలతో కూడిన సంస్థ. ఈ సభ్యులను ప్రజలు ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. నిజానికి ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అత్యంత విధేయులైన మతపెద్దలకే పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అందువల్లే ప్రస్తుత అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ఖమేనీలానే అతివాద దృక్పథం ఉన్నవారే.

రాజ్యాంగం ప్రకారం, ఈ మతపెద్దలు వీలైనంత త్వరగా కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవాలి. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల సభ్యులందరినీ తక్షణమే సమీకరించడం సవాలుగా మారవచ్చు. ఈలోగా అధ్యక్షుడు, న్యాయాధిపతి, శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌కు చెందిన ఒక మతపెద్ద కలిసి సుప్రీం లీడర్ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు.

ఇరాన్ సుప్రీం లీడర్, అయతొల్లా అలీ ఖమేనీ
ఫొటో క్యాప్షన్, అయతొల్లా అలీ ఖమేనీ

మతగురువు నుంచి సుప్రీం లీడర్ వరకు..

ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత, దేశంలో రెండో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.

1989 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఈయన అధికారంలో లేని సమయం ఇరాన్ యువతకు తెలియదు.

ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ ఈయనే కేంద్రం. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారాన్నయినా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు.

ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండడం కూడా ఆయన్ను మరింత శక్తిమంతుడిని చేసింది.

అజ్ఞాతవాసం, జైలు జీవితం..

ఇరాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన మషాద్‌లో, 1939లో ఖమేనీ పుట్టారు.

మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండోవారు. ఇరాన్‌లో ఆధిపత్యవర్గమైన షియా ముస్లింలలో ఈయన తండ్రి మధ్యస్థాయి మతగురువు.

చిన్నవయసులోనే ఖురాన్‌ను లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ 11 ఏళ్లకే మతగురువు అయ్యారు.

ఆ సమయంలో అనేక మతనాయకుల తరహాలోనే ఈయన పనితీరు రాజకీయం, ఆధ్యాత్మికం మేళవింపుగా ఉండేది.

ఇరాన్ షాల విమర్శకుల వర్గంలో ఖమేనీ చేరారు. ఇస్లామిక్ విప్లవం వల్ల షా చక్రవర్తి పదవీచ్యుతులయ్యారు.

చాలా సంవత్సరాల పాటు ఖమేనీ అజ్ఞాత జీవితం, జైలు జీవితం గడిపారు. షా పాలనలో రహస్య పోలీసులు ఆయన్ను ఆరుసార్లు అరెస్టు చేశారు.

1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తర్వాత, రాజధాని తెహ్రాన్‌లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నిమమితులయ్యారు. అనంతరం 1981లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

సుప్రీం లీడర్ రుహోల్లా ముసావి ఖమేనీ 86 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత, 1989లో ఆయన వారసుడిగా అయతొల్లా అలీ ఖమేనీని మతపెద్దలు ఎంపిక చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)