బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు, హనీట్రాప్ అంటూ ఫిర్యాదు చేసిన బండి భగీరథ్.. అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, UGC
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
ఓ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసు నమోదవ్వడానికి కొద్ది గంటల ముందు కరీంనగర్ టూ టౌన్ పోలీసుస్టేషన్ లో బండి సాయి భగీరథ్ ఆ బాలిక, ఆమె తల్లిదండ్రులపై కేసు పెట్టారు.
తనను హనీట్రాప్ చేసి డబ్బుల కోసం వేధిస్తున్నారని సాయి భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగిందంటే..
బండి సంజయ్ కుమారుడు బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ స్పందించాయి.
బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.
ఈ విషయంపై బండి సంజయ్ స్పందించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ఒక్క రోజు ముందు రాజకీయ కుట్రతో తన కుమారుడిపై కేసులు పెట్టించారని ఆరోపించారు.
హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ లో మే 8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
''బండి సాయి భగీరథ్‌పై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు’’ పేట్ బషీరాబాద్ ఇన్ స్పెక్టర్ విజయవర్దన్ బీబీసీతో చెప్పారు.
కేసులో వివరాల ప్రకారం, బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ 2025 డిసెంబరు 31వ తేదీ రాత్రి 17 ఏళ్ల తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాం హౌస్‌లో పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ది హిందూ రిపోర్టు చేసింది.
తన కుమార్తెకు స్నేహితుల ద్వారా బండి భగీరథ్ 2025 జూన్ లో పరిచయం అయ్యారని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.
''మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటానని భగీరథ్ నమ్మించాడు. 2025 అక్టోబరులో నానక్ రాం గూడలోని అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి బలవంతం చేశాడు. నవంబరు 13న మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌కు స్నేహితులతో వెళ్లిన క్రమంలో వేధింపులకు గురిచేశాడు'' అని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
''ఇద్దరు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు కలిసి డిసెంబరు 31వ తేదీ రాత్రి మొయినాబాద్ ఫాంహౌస్‌లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి 1.30 - 2.30గంటల మధ్య సమయంలో నా కుమార్తె నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి తన కోరిక తీర్చాలంటూ భగీరథ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. అసభ్యంగా ప్రవర్తించడం, ప్రైవేటు భాగాలు తాకడం సహా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మైనర్ అయిన నా కుమార్తె అక్కడి ప్రతి కూల పరిస్థితుల్లో నిస్సహాయురాలై, ప్రతిఘటించలేక ఇబ్బంది పడింది'' అని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నారు.
తను చేసిన పనులకు బాధ్యత తీసుకోకుండా వదిలించుకోవాలని భగీరథ్ చూశాడని బాలిక తల్లి ఆరోపించారు.
''నా కుమార్తెకు సర్దిచెప్పాలని జనవరి 13న భగీరథ్ నాకు మేసేజ్ చేశాడు. ఆ తర్వాత జనవరి 19, 26 తేదీల్లో నా కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది'' అని ఆమె తెలిపారు.
బాలిక తల్లి ఫిర్యాదుపై పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ లో బీఎన్ఎస్ సెక్షన్ 74, 75, పొక్సో చట్టంలోని సెక్షన్ 11/12 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.
''అత్యాచార యత్నం జరిగినట్టు మాకు ఫిర్యాదు అందింది. బాలికను అసభ్యంగా తాకడం, ఆమెతో అసభ్యంగా ప్రమర్తించడం, లైంగిక కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడం సహా బలవంతం చేసినట్టుగా ఫిర్యాదు అందింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేశాం'' అని విజయవర్దన్ బీబీసీతో చెప్పారు.
బాలికను భరోసా కేంద్రానికి తరలించి ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని, తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఏప్రిల్ 23వ తేదీన బండి సంజయ్‌ను కలిసినట్టు బాలిక తల్లి తెలిపారు. ఆ సమయంలో తమతో రాజీ చేసుకోవాలని ప్రయత్నాలు చేశారని ఆరోపించారామె.
దీనిపై బండి సంజయ్ స్పందించారు. సరిగ్గా ప్రధాని మోదీ పర్యటనకు ఒకరోజు ముందు తన కుమారుడిపై కేసు పెట్టడానికి కారణమేమిటని ఆయన ప్రశ్నించారు.
''ఎంతో మంది నన్ను కలుస్తుంటారు. అలా వారు కలిసి ఉంటే ఆధారాలు చెప్పమనండి. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు'' అని బండి సంజయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బండి భగీరథ్ ఫిర్యాదులో ఏముందంటే..
భగీరథ్ పెట్టిన కేసుపై బండి సంజయ్ ప్రైవేటు కార్యదర్శి మే 10 వ తేదీన మీడియాకు వివరాలు విడుదల చేశారు.
''ఒక మహిళ తన కూతురిని అడ్డుపెట్టుకొని బండి సంజయ్ కుమారుడిని హనీట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసింది. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ, ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది'' అని తెలిపారు.
బండి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ టూటౌన్ పోలీసుస్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
''కామన్ స్నేహితుడి ద్వారా ఓ అమ్మాయి నాకు పరిచయం అయ్యింది. స్నేహం, సామాజిక బంధాల నేపథ్యంలో నన్ను, నా స్నేహితులను, ఆ అమ్మాయి కుటుంబం వారి పార్టీలు, సమావేశాలు, ఆధ్యాత్మిక పర్యటనలకు తీసుకెళ్లారు. ఆ క్రమంలో విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి చోట్లకు స్నేహితులతో కలిసి వెళ్లాం'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు భగీరథ్.
తర్వాత అమ్మాయి, తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి చేశారని భగీరథ్ చెప్పారు.
''ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే తనపై క్రిమినల్ కేసులు పెడతామని, లైంగికంగా వేధించారని కేసులు పెడతామని బాలిక, ఆమె తల్లిదండ్రులు వేధించారు. అదే సమయంలో నా నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. నేను భయపడి 50వేల రూపాయలు ఇచ్చాను. అయితే తమకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాలిక తల్లి మానసికంగా వేధించారు'' అని భగీరథ్ పేర్కొన్నారు.
భగీరథ్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 308(6), 351(2), 61(8) r/w 3(5) కింద బాలిక, ఆమె తల్లిదండ్రులపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై బాలిక తల్లిదండ్రులను సంప్రదించేందుకు బీబీసీ ఫోన్ ద్వారా ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు. రాగానే వారి స్పందనను అప్ డేట్ చేస్తాం.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో బాలికపై కేసు నమోదైందా?
భగీరథ్ తన ఫిర్యాదులో భాగంగా ఏప్రిల్ 21న నిర్మల్ పోలీసుస్టేషన్‌లో సదరు బాలికపై కేసు నమోదయినట్టు చెప్పారు.
'' నా స్నేహితులలో కొందరికి కూడా బాలిక, ఆమె తల్లిదండ్రులతో ఇదే తరహా సమస్య ఎదురయింది. వారు ఏప్రిల్ 21, 2026న నిర్మల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది'' అని భగీరథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిలను బీబీసీ సంప్రదించింది.
''నిర్మల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందని వార్తలు రావడంతో విచారణ చేశాం. ఏప్రిల్ 21న నిర్మల్ పరిధిలోని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్టు ఆధారాలు లేవు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, UGC
గతంలోనూ వివాదాల్లో భగీరథ్
బండి భగీరథ్‌ను గతంలోనూ వివాదాలు చుట్టుముట్టాయి. 2023 జనవరిలో మహేంద్ర యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సమయంలో తోటి విద్యార్థిని దూషిస్తూ దాడి చేశారన్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
ఈ విషయంపై పెద్ద వివాదం రేగింది.
ఆ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన మహేంద్ర యూనివర్సిటీ అదే ఏడాది మార్చిలో బండి భగీరథ్‌ను సస్పెండ్ చేసింది.
దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని తిరిగి యూనివర్సిటీలో చేరారు.
అలాగే సదరు వీడియోలో భగీరథ్ చేతిలో దాడికి గురైనట్టు కనిపించిన బాధితుడు తర్వాత అప్పట్లో ఒక వీడియో విడుదల చేశారు.
దీని ప్రకారం తనదే తప్పు ఉందని, ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించినందుకే భగీరథ్ తనను కొట్టాడని వివాదం మరిచిపోయి మళ్లీ తాము కలిసిపోయామని బాధితుడు వీడియో విడుదల చేశారు.
అప్పట్లో బండి సంజయ్ కూడా దానిపై స్పందించారు. తన కుమారుడిని అనవసరంగా రాజకీయాల్లో లాగుతున్నారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ దుమారం
బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పొక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందించాయి.
ప్రధాని మోదీకి అభిమాన మంత్రి అయిన బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టకుని తనను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
''బాలిక తీవ్రంగా ప్రతిఘటించినా, లైంగికంగా వేధించడంతోపాటు ఎవరికి చెప్పొద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. బాలికనే కాకుండా ఆమె తల్లిదండ్రులపైనా బెదిరింపులకు దిగారు. బాలిక ఫిర్యాదుకు స్పందించి ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదుచేశారు'' అని కాంగ్రెస్ పేర్కొంది.
ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు(కేటీఆర్) స్పందించారు.
''బండి సంజయ్ కుమారుడిపై ఇతర పోక్సో నేరస్తుల మాదిరిగా ఎందుకు విచారణ జరపడం లేదు'' అని ప్రశ్నించారు.
బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బాలిక న్యాయం కోసం మూడు నెలలుగా తిరుగుతుంటే, తిరిగి ఆమెపైనే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, instagram.com/bandisanjay_bjp
బండి సంజయ్ ఏమన్నారంటే…
భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ స్పందించారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలు, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు.
''అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్‌గా, ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి'' అన్నారు.
తప్పేదో, ఒప్పేదో న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

ఫొటో సోర్స్, UGC
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. బండి భగీరథ్‌ను అరెస్టు చెయ్యాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































