ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి... బాధితుల్లో చాలా మంది పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
స్విట్జర్లాండ్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చిలో 1950 నుంచి లైంగిక వేధింపులకు సంబంధించిన దాదాపు 1,000 కేసులు బయటపడినట్లు యూనివర్శిటీ ఆఫ్ జూరిచ్ పరిశోధకుల కమిటీ తేల్చింది.
బాధితుల్లో చాలామంది పిల్లలు ఉన్నారని, వారిలో 56 శాతం మంది బాలురున్నారని కమిటీ రిపోర్టు తెలిపింది. నిందితుల్లో అత్యధికులు పురుషులు ఉన్నట్లు పేర్కొంది.
వేధింపులను దాచే ప్రయత్నం చేసిన సాక్ష్యాలను కూడా విచారణ కమిటీ కనుగొంది. అంటే చర్చిలోని చాలామందికి జరుగుతున్నదేంటో తెలుసు, కానీ, దానిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు.
ఈ కేసుల సంఖ్య పరిశీలిస్తే ఇది కేవలం తీగ మాత్రమేనని, ఈ తీగ లాగితే డొంకంతా కదిలి చాలా కేసులు బయటపడతాయని యూనివర్సిటీ పరిశోధకులు భావిస్తున్నారు.
చర్చి అధికారులు నియమించిన మోనికా డోమ్మాన్, మారియెట్టా మీయర్ కమిటీ ఏడాది పాటు విచారణ చేసి ఈ నివేదిక రూపొందించింది.

ఫొటో సోర్స్, Getty Images
సగం వరకు అక్కడే జరిగాయి..
విచారణ కోసం కమిటీకి చర్చి రికార్డులపై పూర్తి యాక్సెస్ ఇచ్చారు అధికారులు. లైంగిక వేధింపుల బారిన పడిన వారితో సహా అనేకమందిని ఈ కమిటీ ఇంటర్వ్యూలు చేసింది.
అయితే అనేక ఇతర పత్రాలు అందుబాటులో లేవని వారు చెప్పారు. బిషప్ ఆధీనంలోని పలు రికార్డులు ధ్వంసమయ్యాయని, లైంగిక వేధింపులకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను అప్పట్లో రికార్డు చేయలేదన్నారు.
"ఆ చీకటి రోజుల్లో ఏం జరిగిందనే దాన్ని బట్టి మాకు లభించిన రికార్డులను పరిశీలిస్తే చాలా తక్కువ శాతం కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలుస్తోంది" అని డోమ్మాన్, మీయర్ తెలిపారు.
''మేం గుర్తించిన కేసుల్లో సగం వరకు మతాధికారి ప్రమేయం ఉండే పిల్లల క్లబ్స్, సంఘాలలో మతపరమైన విద్య, కన్ఫెషన్ (క్షమాభిక్ష, ఒప్పుకోలు), బిషప్‌లకు సేవ చేయడం తదితర వాటిల్లోనే జరిగాయి'' అని పరిశోధకులు చెప్పారు.
మరో 30 శాతం కేసులు క్యాథలిక్ పిల్లల గృహాలు, డే స్కూల్‌లు, బోర్డింగ్ పాఠశాలలు తదితర సంస్థలలో జరిగినట్లు కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పటి మతాధికారులు ఏం చేశారు?
లైంగిక వేధింపుల కేసులను డాక్యుమెంట్ చేయడంతో పాటు, అప్పటి చర్చి అధికారులు ఈ కేసుల విషయంలో ఎలా వ్యవహరించారో కూడా తెలుసుకున్నారు పరిశోధకులు.
చాలాకేసులు "రహస్యంగా ఉంచారు, కప్పిపుచ్చారు లేదా చిన్నవిషయం" అని చెప్పారని పరిశోధకులు అంటున్నారు.
అంతేకాదు ఆ సమయంలో బిషప్‌లతో సహా అధికారులు 'బాధితులకు సాయం చేయడంలో అలసత్వం' ప్రదర్శించారని కమిటీ నివేదిక తెలిపింది.
ఆరోపణలు ఎదుర్కొన్న మతాధికారులను విచారణ ఎదుర్కోకుండా తరచుగా వేర్వేరు స్థానాలకు బదిలీ చేసేవారు క్యాథలిక్ చర్చిలోని ఉన్నత స్థాయి అధికారులు.
వారి చర్యలకు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా కొన్నిసార్లు విదేశాలలో కూడా పని చేయడానికి పంపించేవారు.
దీన్ని బట్టి చర్చి ఉన్నతాధికారులు తమ సమూహంలోని ప్రజల భద్రత, శ్రేయస్సు కంటే చర్చి, దాని అధికారుల కీర్తికే ప్రాధాన్యతనిచ్చారని అర్థం అవుతోందని కమిటీ అభిప్రాయపడింది.
లైంగిక వేధింపుల కుంభకోణాలు వెలువడే వరకు (21వ శతాబ్దం వరకు) ఈ వైఖరి మారలేదని పరిశోధకులు తెలిపారు.
పరిశోధకుల రిపోర్టులు తమను ఆశ్చర్యానికి గురిచేయలేదని, ఎందుకంటే ఇప్పటికీ తాము అలాంటి వేధింపులకు గురవుతున్నామని బాధితుల్లో కొందరు చెప్పారు.
నాకు మాటలు రావడం లేదు: బిషప్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్
"దశాబ్దాలుగా స్విట్జర్లాండ్‌లోని క్యాథలిక్ చర్చి అధికారులు ఈ నేరాలను కప్పిపుచ్చారు, నిందితులను రక్షించారు. బాధితులను ఇది బాధ పెడుతుందని తెలిసి కూడా, వారిని నిశ్శబ్ధం చేసి, సంస్థ ప్రతిష్టను కాపాడుకున్నారు" అని రిపోర్టులో తెలిపింది కమిటీ.
''సంస్థ లెక్కలేనన్ని సాకులను చెప్పింది, బాధితులకు సరైన న్యాయం చేయలేదు'' అని స్విట్జర్లాండ్‌లోని 'క్యాథలిక్ చర్చి పాలక మండలి' స్విస్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ రెనాటా అసల్-స్టెగర్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
దీని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని రెనాటా వ్యాఖ్యానించారు.
2024లో ప్రారంభం కానున్న యూనివర్శిటీ ఆఫ్ జూరిచ్ ప్రాజెక్ట్‌కు నిధులు సమకూరుస్తామని చర్చి అధికారులు హామీ ఇచ్చారు.
ఇవి కూాడా చదవండి
- నిపా వైరస్ మళ్లీ వచ్చింది... ఇద్దరు చనిపోవడంతో కేరళలో అలర్ట్
- చాట్ జీపీటీని 'గూగుల్ కిల్లర్' అని ఎందుకు అంటున్నారు... ఏఐ రేసులో గూగుల్ ఎక్కడ?
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














