‘ప్రార్థనల కోసం డబ్బులు చెల్లించి అప్పుల పాలయ్యాను, అద్భుతం జరిగేదెప్పుడు?’

ఎవర్‌లైన్ ఒకెల్లో
    • రచయిత, లిబె డిసెకో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎవర్‌లైన్ ఒకెల్లో తన జీవితం మారుతుందనే ఆశతో ప్రార్థనల కోసం అప్పు తీసుకుని పాస్టర్‌కి డబ్బులు చెల్లించారు. కానీ తన జీవితం మారకపోగా, ఆ రుణభారం తడిసిమోపెడైందని కన్నీటిపర్యంతమయ్యారు.

కెన్యా రాజధాని నైరోబిలోని కిబెరాలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు ఎవర్‌లైన్ ఒకెల్లో. తన నలుగురు పిల్లలకు తిండి పెట్టేంత డబ్బులు కూడా తన వద్ద లేవని ఎవర్‌లైన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఎన్నో నెలలుగా ఉపాధి లేక డబ్బులు సంపాదించలేకపోతున్నట్లు చెప్పారు. ఆ సమయంలో ఒక పాస్టర్ గురించి ఎవర్‌లైన్‌కి తెలిసింది.

ఆయన ప్రార్థనలు జీవితాలను మారుస్తున్నాయని పలువురు చెప్పారు. దీంతో ప్రార్థనల కోసం ఆమె పాస్టర్ వద్దకు వెళ్లారు. 115 డాలర్లు (15,000 కెన్యన్ షిల్లింగ్స్, భారత కరెన్సీలో రూ. 9,579) ఇస్తే ప్రార్థనలు చేస్తానని ఆయన ఎవర్‌లైన్‌కి చెప్పారు.

దీన్ని ‘‘సీడ్ ఆఫరింగ్’’గా అభివర్ణించారు. అంటే ఆధ్యాత్మిక నాయకుడికి అందించే ఆర్థిక సాయంగా పేర్కొన్నారు.

ప్రార్థనల కోసం ఈ మనీని ఎవర్‌లైన్ తన స్నేహితురాలి వద్ద అప్పుగా తీసుకుని పాస్టర్‌కి చెల్లించారు. ఈ పాస్టర్ ప్రార్థనలు చాలా శక్తివంతమైనవని, వారంలోనే ఆమె చెల్లించిన డబ్బులు వెనక్కి వస్తాయని ఆమె విన్నారు.

కానీ ఎన్నిరోజులైన ఎవర్‌లైన్ జీవితంలో ఎలాంటి అద్భుతం జరగలేదు. చెప్పాలంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. స్నేహితురాలి వద్ద తీసుకున్న అప్పు వడ్డీ భారంతో కొండలా పెరిగిపోయింది.

115 డాలర్లు అప్పు తీసుకుంటే, అది ప్రస్తుతం 300 డాలర్లకు పెరిగిపోయింది. ఆ అప్పును ఎలా చెల్లించాలో కూడా ఎవర్‌లైన్‌కి తెలియడం లేదు. ఆమె స్నేహితురాలు తనతో మాట్లాడటం మానేశారు. ఎవర్‌లైన్‌కి ఇంకా ఉద్యోగం దొరకలేదు.

‘‘పరిస్థితులు మరింత కష్టంగా మారుతుండటంతో, నేను నా ఆశలన్నీ వదులుకున్నాను’’ అని ఎవర్‌లైన్ చెప్పారు.

కెన్యాలో పెరిగిన ఖర్చులకు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

నిరాశలో బతుకుతున్న కెన్యా ప్రజలు

కెన్యాను జీవన వ్యయాల సంక్షోభం తీవ్రంగా దెబ్బకొట్టింది. 2022 సెప్టెంబర్‌కి ముందు 12 నెలల్లో ఆహార ధరలు సుమారు 16 శాతం పెరిగినట్టు కెన్యా జాతీయ గణాంకాల బ్యూరో తెలిపింది. గత ఏడేళ్లలో ఉపాధి కోల్పోయిన కెన్యా ప్రజల సంఖ్య రెండింతలు పెరిగినట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు పేర్కొన్నాయి.

ప్రజలు తీవ్ర నిరాశలో బతుకుతున్నారని కెన్యా మల్టిమీడియా యూనివర్సిటీ సోషియోలాజిస్ట్ డాక్టర్ గ్లాడీస్ న్యాచియో చెప్పారు.

దీంతో చాలా మంది ప్రజలు మంత్రాలు, తంత్రాలు ద్వారా నెరవేరే పరిష్కారాలను కోరుకుంటున్నారని, అద్భుతం జరగడం కోసం అప్పు చేసైనా డబ్బులు చెల్లించేలా ఉన్నారని అన్నారు.

‘‘దేవుడు ప్రజల్ని పేదలుగా ఉండేలా కోరుకోడని వారంటున్నారు. అందుకోసం మేము ఈ చెల్లింపులు చేస్తున్నట్లు చెబుతున్నారు’’ అని గ్లాడీస్ చెప్పారు.

ఇలా చేయడమనేది ప్రోస్పెరిటీ గోస్పెల్ నుంచి వచ్చింది. అంటే ఈ విధానంలో దేవుడిని నమ్మకంతో కొలిస్తే ఆరోగ్యాన్ని, సంపదను అందిస్తాడని ప్రజల విశ్వసిస్తారు.

డబ్బులు చెల్లించడం ద్వారా దేవుడిపై తమకున్న నమ్మకాలను నిరూపించుకోవాలంటూ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా చెల్లించడం ద్వారా దేవుడు ఆ డబ్బులను రెండింతలు చేస్తాడని నమ్ముతున్నారు.

ప్రోస్పెరిటీ గోస్పిల్‌ మూలాలు అమెరికాలో ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇవి మరింత పెరిగాయి. 1970 చివరిలో, 1980 ప్రారంభంలో నైజీరియా పాస్టర్లు అమెరికా వెళ్లి దీన్ని గురించి తెలుసుకుని వచ్చారు. 2000 ప్రారంభంలో ఆఫ్రికా వ్యాప్తంగా దీని ప్రచారం నిర్వహించారు.

కెన్యా ప్రజల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

న్యాచియో ప్రజల రుణభారం మరింత పెరిగిపోవడానికి మరో కారణాన్ని కూడా ఎత్తి చూపారు. కెన్యా ప్రజలు మొబైల్ ఫోన్లలో రుణానికి దరఖాస్తు చేసుకుంటే చాలు, డబ్బులు వచ్చేస్తాయని అన్నారు.

ఇదే 26 ఏళ్ల డెన్నిస్ ఓపిలికి కూడా జరిగింది. మూడేళ్ల పాటు కళ్లుకాయలు కాసేలా ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసుగుపోయిన డెన్నిస్, తన స్నేహితుడిని సాయం కోసం అర్థించారు.

‘‘నా స్నేహితుడు నన్ను చర్చికి వెళ్లమన్నాడు. కొంత మనీ తీసుకుని వారు నీకోసం ప్రార్థనలు చేస్తారు. నీకు కచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తాది అని అతను నాకు చెప్పాడు’’ అని డెన్నిస్ తెలిపారు.

మూడు నెలలు పాటు ప్రతి ఆదివారం ఇచ్చిన విరాళాలతో, మొత్తంగా తాను 180 డాలర్లు ఇచ్చినట్టు తెలిపారు.

ఆయన పొదుపు చేసుకున్న డబ్బులన్ని అయిపోయిన తర్వాత, క్యాష్ యాప్‌ల ద్వారా, స్నేహితుల నుంచి 120 డాలర్లు అప్పుగా తీసుకున్నట్లు చెప్పారు.

‘‘పాస్టర్ నాకు చెప్పిన విషయాన్ని నేను నమ్మాను. నాకు జాబ్ వస్తుందనుకున్నాను. అప్పు చేయడంలో నాకెలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే, ఉద్యోగం వస్తే ఆ డబ్బులను తిరిగి చెల్లించవచ్చు. కానీ, ఎంత కాలం వేచిచూసిన నాకు ఉద్యోగమే రాలేదు. ఆ తర్వాత ఎందుకో అనుమానం మొదలైంది’’ అని డెన్నిస్ చెప్పారు.

ఆ తర్వాత కొంత కాలానికే రుణ కంపెనీలు చెల్లింపుల కోసం కాల్స్ చేయడం ప్రారంభించాయని అన్నారు.

డెన్నిస్ ఓపిలి

‘‘కొన్ని సార్లు నేను ఒక దగ్గర కూర్చుని, రిలాక్స్ అవుతూ, మిగతా వాటి గురించి ఆలోచించే సమయంలో ఎవరో ఒకరు కాల్ చేసి, వారి డబ్బులను తిరిగి ఇచ్చేయాలని అడిగే వారు. వారికి తిరిగి డబ్బులు చెల్లించేందుకు నా వద్ద చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు’’ అని డెన్నిస్ చెప్పారు.

ఒకవేళ తాను డబ్బులు చెల్లించలేకపోతే, వారేం చేస్తారేమోనని భయమేసేదన్నారు. వారు తనపై కేసులు వేస్తారా లేదా పోలీసులు కస్టడీకి తీసుకుంటారో కూడా తెలియదన్నారు.

అదృష్టవశాత్తు డెన్నిస్‌కి ప్రస్తుతం చిన్న పని దొరకడంతో, కంపెనీలు, స్నేహితుల నుంచి తీసుకున్న రుణాలను మెల్లమెల్లగా తీర్చడం ప్రారంభించారు.

తనకింకా దేవుడిపై నమ్మకం ఉందన్నారు. కానీ ఈ పనులు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు.

పాస్టర్ ప్రార్థన

ఫొటో సోర్స్, Getty Images

అద్భుతం జరుగుతుందనే ఆశతో ఇలా రుణభారంలో కూరుకుపోవడం కేవలం కెన్యాలో మాత్రమే కాదు. అమెరికాలో నైజీరియన్ చర్చికి వెళ్లే భార్య, భర్తలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

సారా అనే అమ్మాయి తన పేరుని ఆ చర్చిలో ఎప్పుడూ వాడొద్దని, దక్షిణ అమెరికాలో తానెక్కడ నివసిస్తున్నానో కూడా ఎవరికీ చెప్పొద్దని చెప్పింది. ఎందుకంటే, నెలకు తాను సంపాదించే జీతంలో పదోవంతు చర్చికి, నైజీరియా నుంచి దీన్ని నిర్వహించే నాయకత్వానికి ఇవ్వాలని స్థానిక పాస్టర్లు డిమాండ్ చేసేవారు. ఏడాదిలో ఇచ్చే తొలి నెల సంపాదనకి ఇది అదనం.

స్థానిక లీడర్లకు నెలవారీ టార్గెట్లు కూడా ఉంటాయని సారా చెప్పారు. దీంతో వారు తమపై ఒత్తిళ్లు పెంచుతారని అన్నారు. చర్చి సర్వీసుల కోసం ప్రజలు తమ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా డబ్బులు చెల్లించడాన్ని తాను చూసినట్లు సారా పేర్కొన్నారు.

‘‘నా ఆదాయం పదోవంతు చర్చికి చెల్లిస్తున్నాను. నెల చివరికి వచ్చే సరికి నా దగ్గర డబ్బులు ఉండటం లేదని నాకనిపిస్తుంది’’ అని చర్చికి వచ్చే ఒక మహిళ తనకి చెప్పినట్లు సారా చెప్పారు.

అద్దెలు చెల్లించడం కంటే దేవుడికి డబ్బులు సమర్పించుకోవడం ముఖ్యమని పాస్టర్లు చెబుతుంటారని సారా అన్నారు.

మరి అద్భుతాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నిస్తే, ‘‘మీరు సరిపడినంత చెల్లించలేదు. అంటే మీ వద్ద తగినంత నమ్మకం లేదన్నమాట’’ అని చెప్పేవారని సారా తెలిపారు.

చివరి ఆశ

అలాంటి చర్చిల్లో ఇతరులు ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

చెప్పినట్లు వాగ్ధానాలు నెరవేరకపోతే ప్రజలు ఎందుకు ఇస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని వరల్డ్ క్రిస్టియానిటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జార్జ్ హాస్టీన్ అన్నారు.

ప్రోస్పెరిటీ గోస్పెల్ చెప్పే విధంగా డబ్బులు బాగా వస్తాయని, ఉపాధి పొందుతారనే విషయాలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉన్నాయని హాస్టీన్ అన్నారు.

పేదరికంలో జీవించే వారిని కూడా ఇవి ఆకర్షిస్తున్నాయని అన్నారు.

‘‘మీరు బాధపడుతున్నారని మాకు తెలుసు. మేము చాలా ప్రాక్టికల్‌గా, మీకోసం ఆకర్షణీయమైన పరిష్కారాన్ని అందజేస్తాం’’ అని ఆ చర్చిలో చెబుతారు.

కానీ, ప్రజలెందుకు రుణభారంలో కూరుకుపోతున్నా డబ్బులు ఇస్తున్నారు.

‘‘మీ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా ఆడే లాటరీ గేమ్ కాదు ఇది’’ అని డాక్టర్ హాస్టీన్ అన్నారు.

అవును అన్ని ఆశలు వదులుకున్న వారికి, ఇదొక చివరి అవకాశంగా ఉంటుంది.

అయితే కెన్యా విషయానికి వస్తే, ఈ అనుభవంతో దేవుడిపై ఉన్న నమ్మకాన్ని తాను వదులుకోలేదని ఎవర్‌లైన్ చెప్పారు.

‘‘చర్చి తప్పుడుదని నేను చెప్పను. చర్చి మంచిది. కానీ అక్కడ పనిచేసే పాస్టర్లు తప్పుడు పనులు చేస్తున్నారు. డబ్బులు అడిగేది వారు మాత్రమే’’ అని ఎవర్‌లైన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)