దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మీద ఈడీ ఆరోపణలు ఏమిటి?

ఫొటో సోర్స్, @RaoKavitha
దిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన (గురువారం నాడు) తమ మందు విచారణకు హాజరు కావలసిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది.
ఇదే కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డిసెంబర్ 12వ తేదీన ఎంఎల్‌సీ కవితను దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో.. కవితకు స్నేహితుడిగా భావిస్తున్న హైదరాబాదీ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. ఆయన దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బినామీగా ఉన్నారని అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ ఆరోపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దిల్లీ మద్యం విధానం కుంభకోణం ఆరోపణల మీద అంతకుముందు దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ రాజకీయ వివాదంగా మారింది. సిసోడియా అరెస్టును నిరసిస్తూ పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ మీద మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగ్వంత్ మాన్, తేజస్వి యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సంతకం చేశారు.
దిల్లీ మద్యం విధానం ద్వారా తమకు మేలు చేకూర్చినందుకు గాను.. ఆ రాష్ట్రంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ‘సౌత్ గ్రూప్’ అని చెప్తున్న వ్యాపారుల బృందం కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిందని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఈ ‘సౌత్ గ్రూప్’లో బీఆర్ఎస్ ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవిత, వైఎస్ఆర్ ఎంపీ శ్రీనివాసులు రెడ్డిల ప్రతినిధులుగా అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబులు ఉన్నారని అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ ఆరోపించినట్లు హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, @RaoKavitha
‘తెలంగాణ తలవంచదు’: కవిత స్పందన
ఈడీ నోటీసుల మీద ఎంఎల్‌సీ కవిత ‘తెలంగాణ తల వంచదు’ అంటూ ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. భారత జాగృతి సంస్థ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి మార్చి 10వ తేదీన దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు శాంతియుత నిరాహార దీక్ష చేపడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దానికి ఒక రోజు ముందు మార్చి 9వ తేదీన తనను విచారణకు హాజరు కావలసిందిగా ఈడీ సమన్లు జారీ చేసిందని ఆమె ట్వీట్ చేశారు.
చట్టానికి కట్టుబడ్డ పౌరురాలిగా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. అయితే, మార్చి 10న దిల్లీలో ధర్నాతో పాటు, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున.. ఈడీ విచారణకు హాజరయ్యే తేదీ విషయంలో న్యాయసలహా తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే.. తమ నాయకుడు కేసీఆర్ చేస్తున్న పోరాటానికి, వినిపిస్తున్న గళానికి వ్యతిరేకంగా, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ బెదిరింపు ఎత్తుగడలతో తాము బెదిరేది లేదని కేంద్రంలోని అధికార పార్టీ తెలుసుకోవాలని కవిత ఆ ప్రకటనలో స్పష్టంచేశారు.
‘‘మీ వైఫల్యాలను ఎండగట్టటానికి, భారతదేశానికి ఉజ్వలమైన ఉత్తమమైన భవిష్యత్తు కోసం గళం విప్పటానికి కేసీఆర్ నాయకత్వంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజావ్యతిరేక, అణచివేత పాలనకు తెలంగాణ ఎన్నడూ తల వంచలేదు, తల వంచబోదు అని దిల్లీలోని అధికార దురహంకారులకు గుర్తు చేస్తున్నా’’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కవితకు ఈడీ సమన్లు ఇవ్వడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. కవిత తెలంగాణ రాష్ట్ర పరువు తీశారని ఆయన విమర్శించారు. సీబీఐ, ఈడీలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇంతకీ దిల్లీలో మద్యం గొడవ ఏంటి?
ఒక్క ముక్కలో చెప్పాలంటే, మొన్నటి వరకూ దిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. అందుకోసం రూపొందించిన కొత్త మద్యం విధానం నిబంధనల్లో గోల్‌మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా సిఫారసు చేశారు. దీంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
కొత్త మద్యం విధానం మీద అవినీతి ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో.. ఆ పాలసీని దిల్లీ ఆప్ ప్రభుత్వం రద్దు చేసింది. పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది.
ఆరోపణలకు మూలమైన దిల్లీ కొత్త మద్యం విధానం.. 2021 నవంబర్ నుంచి అమలులోకి వచ్చింది. ప్రైవేటు సంస్థలకు మద్యం అమ్మే పద్ధతి ప్రారంభించడంతో పాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా ఆ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని దిల్లీ ప్రభుత్వం చెప్పింది.
ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది.
మద్యం రిటైలర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి.
అంతా బాగానే ఉంది కానీ, ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో పలు అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఈడీ, సీబీఐ రెండూ ఆరోపిస్తున్నాయి.
ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు చేసింది. అనంతరం 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని చెప్తున్న ఈ ఎఫ్ఐఆర్‌లో మరో 15 మంది పేర్లను కూడా జతచేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. మొత్తం 21 చోట్ల సీబీఐ సోదాలు చేసింది.
మద్యం టెండర్ల తరువాత లైసెన్సు పొందిన వాళ్లకు అనుచిత ప్రయోజనాలు అందించడం కోసం, నిర్ణీత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా దిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ, మంత్రి సిసోడియాలపై ఆరోపణలు చేసింది సీబీఐ.
''లైసెన్స్ ఫీజులలో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సును పొడిగించటం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్సుదారులకు కల్పించటానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటం సహా అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ'' అని సీబీఐ పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి, ఆరోపిత ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను బదిలీ చేయడంలో సిసోడియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
ఎక్సైజ్ పాలసీని అమలు చేయటానికి వీలుగా, అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని దిల్లీ మంత్రిమండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని.. కానీ ఆ తరువాత, నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సీబీఐ పేర్కొంది.
అయినా కూడా, ఉప ముఖ్యమంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం, ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేసిందని సీబీఐ ఆరోపించింది.
ఈ కొత్త విధానం వచ్చే సరికి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న తెలుగు వ్యక్తి, ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను సస్పెండ్ చేశారు.
ఇందులో అరుణ్ రామచంద్ర పిళ్ళైను సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో ఏ 14గా చేసింది. ఆయన హైదరాబాద్ కోకాపేటలో ఉంటారు. ఇండో స్పిరిట్స్‌కి చెందిని సమీర్ మహేంద్రు నుంచి డబ్బు సేకరించి ప్రభుత్వంలోని వ్యక్తులకు ఇచ్చినట్టుగా రామచంద్ర పిళ్లైపై ఆరోపణలు చేసింది సీబీఐ. ఈ ఏడాది ప్రారంభించిన రాబిన్ డిస్టిలరీ అనే కంపెనీలో ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు.
అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ మంగళవారం నాడు (ఈ నెల 7వ తేదీన) అరెస్ట్ చేసింది. ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ వ్యవహారంపై గతంలో సీబీఐ విచారణ సందర్భంగా, బీజేపీ నేతల ఆరోపణల నేపథ్యంలో కవిత ఇంతకుముందు కూడా స్పందించారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కూ, తనకూ ఏ సంబంధమూ లేదని.. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తన మీద ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆమె చెప్పారు.
"దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలపై బట్ట కాల్చి మీద వేసి, దుమ్మెత్తి పోసి, మీరే తుడుచుకోండి అనేటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. నిరాధారంగా ఏదిపడితే అది మాట్లాడడం ఆరోగ్యకరం కాదు. నాకూ, దానికీ ఏ సంబంధం లేదు. కేసీఆర్ కూతుర్ని బద్నాం చేస్తే కేసీఆర్ ఆగం అయిపోతాడు అని, భయపడతాడని అనుకుంటున్నారేమో. కేంద్రాన్ని ఎండగట్టే విషయంలో మేం వెనక్కు తగ్గుతాం అనుకుంటే, మీరు వృథా ప్రయత్నం చేస్తున్నట్టే లెక్క. అది పూర్తిగా వ్యర్థం. ఈ రకంగా మీడియాలో కథనాలు ఇచ్చి, మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా మీద ఇలానే చేశారు. ధైర్యంగా తిప్పి కొట్టాం. బిల్కిస్ బానో వంటి అంశాలపై మాట్లాడుతున్నందుకే ఇలా చేశారు" అని కవిత మీడియాతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళా సైంటిస్టులకు నెలకు రూ.55 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?
- హెచ్3ఎన్2 వైరస్ ఏమిటి? డాక్టర్లు ఏమంటున్నారు?
- సింగిల్ స్క్రీన్ థియేటర్స్: శిథిలాలుగా మారుతున్న ఒకనాటి భారతదేశ సినిమా వైభవ ప్రతీకలు
- నరేంద్రమోదీ-అమిత్ షా: అమృతపాల్ సింగ్ రెచ్చిపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా లాభమా, నష్టమా?
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల వాటా పెరుగుతోందా, తగ్గుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














