మనీ లాండరింగ్ అంటే ఏంటి? అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధం ఎలా చేస్తారు?

మనీ లాండరింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - ఆమెను ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు".

"నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడి విచారణకు హాజరవుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ"

"మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్"

"మనీలాండరింగ్ ఆరోపణల పై సోదాలు నిర్వహించిన సీబీఐ"

ప్రతిరోజూ వార్తల్లో ఇలాంటి హెడ్‌లైన్లను తరచుగా చూస్తున్నాం.

ఇటీవల సుప్రీం కోర్టు కూడా మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి ఉండే విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తుకు సంబంధించిన అధికారాలను సమర్ధిస్తూ తీర్పునిచ్చింది.

మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని ప్రొవిజన్ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

ఈడీ అధికారులకు విస్తృత అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సమీక్షించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

ఇలా తరచుగా వింటున్న మనీ లాండరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.

మనీ లాండరింగ్ అంటే...

బ్లాక్ మనీని (చట్ట వ్యతిరేకంగా, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు)ను వైట్ మనీగా (చట్టబద్ధంగా) మార్చే ప్రక్రియనే మనీ లాండరింగ్ అని అంటారు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన లేదా ఆదాయానికి మించి సమకూరిన సంపాదనను బ్లాక్ మనీ అని అంటారు.

మనీ లాండరింగ్‌లో వివిధ దశలను, చోటు చేసుకునే విధానాన్ని బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థలో యాంటీ మనీ లాండరింగ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న బిపిన్ నాయిర్ బీబీసీకి వివరించారు.

మనీ లాండరింగ్ ఎలా జరుగుతుంది?

మనీ లాండరింగ్ ప్లేస్‌మెంట్, లేయరింగ్, ఇంటెగ్రేషన్ అనే మూడు దశల్లో జరుగుతుంది.

ప్లేస్ మెంట్

ఫొటో సోర్స్, Getty Images

ప్లేస్‌మెంట్

చట్ట వ్యతిరేకంగా సేకరించిన డబ్బును ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టే దశను ప్లేస్‌మెంట్ అని అంటారు. మరొక రకంగా చెప్పాలంటే అక్రమంగా సంపాదించిన డబ్బును సక్రమ మార్గాల ద్వారా సంపాదించినట్లు చూపించే దశ.

ఉదాహరణకు మీ చేతిలోకి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ఆదాయానికి మించిన డబ్బు వచ్చింది. ఈ డబ్బు దొంగతనం, లంచాలు, దోపిడీలు, అవినీతి కార్యకలాపాల ద్వారా రావచ్చు. ఈ లావాదేవీలన్నీ సాధారణంగా నగదు రూపంలో జరుగుతాయి.

ఉదాహరణకు ఒక వ్యక్తికి అక్రమ మార్గాల ద్వారా వారానికి రూ.3లక్షల రూపాయిలు సమకూరుతున్నాయి. ఈ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అలా చేయడం వల్ల మాత్రమే ఆయన ఆ డబ్బును చట్టబద్ధమైన సొమ్ముగా చూపించగలరు.

ఈ డబ్బును చిన్న మొత్తాలుగా విడదీస్తారు. 3 లక్షలను ఆరు భాగాలుగా విభజించి ఆరు సార్లు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇలాంటి వాటిని ఒకే బ్యాంకులో కాకుండా వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లలో జమ చేస్తారు.

ఇందుకోసం నిబంధనలను కఠినంగా పాటించని బ్యాంకులను ఎంపిక చేసుకుంటారు. చట్ట వ్యతిరేకంగా సంపాదించిన డబ్బును ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెడతారు.

మనీ లాండరింగ్

ఫొటో సోర్స్, Getty Images

నల్ల ధనాన్ని ఆర్ధిక వ్యవస్థలోకి ఎలా పంపిస్తారు?

విదేశాల్లో ఉండే షెల్ సంస్థలు లేదా అకౌంట్లకు కొంత సొమ్మును పంపిస్తారు. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా ఉన్న దేశాల్లో షెల్ సంస్థలు, అకౌంట్లను తెరుస్తారు. ఈ అకౌంట్లలోకి డబ్బును చేరుస్తారు.

కొన్ని వ్యాపారాల్లో జరిగే లావాదేవీల్లో ఈ నల్లధనాన్ని వైట్ మనీతో చిన్న మొత్తాల్లో కలిపేస్తారు. ఉదాహరణకు నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే రియల్ ఎస్టేట్, క్యాసినో, క్లబ్‌లు, బార్ల లాంటి వ్యాపారాల్లో చేరుస్తారు.

నల్ల ధనాన్ని సక్రమంగా సంపాదించిన ధనంగా చూపించేందుకు రకరకాల మార్గాలు అవలంభిస్తారు.

ఇన్‌వాయిస్ ఫ్రాడ్:

బ్లాక్ మనీని బదిలీ చేసేందుకు ఇన్‌వాయిస్ మోసాలు చాలా ఎక్కువగా చేస్తారు.

ఒక వస్తువు లేదా సేవల ఇన్‌వాయిస్ విలువను ఎక్కువ లేదా తక్కువ చేసి చూపిస్తారు. వస్తువులను మారు పేర్లతో రవాణా చేయడం (విలాసవంతమైన వస్తువులను తక్కువ విలువున్న వస్తువులుగా చూపించడం), ఉత్పత్తులను, సేవలను కొనకుండా కొన్నట్లు బిల్లులు చూపించడం ఇన్‌వాయిస్ మోసం కిందకే వస్తుంది.

ఉదాహరణకు హైదరాబాద్‌లోని హెటిరో ఫార్మా సంస్థపై అక్టోబరు 2021లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రహస్యంగా దాచిపెట్టిన అకౌంటు పుస్తకాలతోపాటు డబ్బు కూడా బయటకు వచ్చింది.

షెల్ కంపెనీలు, ఉనికిలోలేని సంస్థల నుంచి సామగ్రి కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిసార్లు ధరలను కావాలనే ఎక్కువ చేసి చూపించినట్లు తేలింది. నగదు రూపంలో డబ్బులు చెల్లించి భూములు కూడా కొన్నట్లు వెలుగులోకి వచ్చింది.

కంపెనీ ఖాతాలో వ్యక్తిగత ఖర్చులను కలిపి రాయడం, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే చాలా తక్కువకే భూములు కొనుగోలు చేయడం లాంటి అవకతవకలను కూడా అధికారులు గుర్తించారు.

ఈ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

స్మర్ఫింగ్

ఫొటో సోర్స్, Getty Images

స్మర్ఫింగ్

ఒక పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి ఎవరికీ అనుమానం రాకుండా లావా దేవీలను నిర్వహిస్తారు. ఈ చిన్న మొత్తాలను వివిధ బ్యాంకు అకౌంట్లలోకి పంపిస్తారు.

అయితే, దీనిని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అకౌంట్లలోకి పంపిస్తారు. వీళ్ళను స్మర్ఫ్స్ అంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్మర్ఫ్‌లను కూడా నియమిస్తారు. లేదా ఒకే వ్యక్తి దీర్ఘకాలంలో ఈ లావాదేవీలను నిర్వహిస్తారు.

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలో సాగుతున్న అక్రమ నిధుల లావాదేవీల్లో కనీసం 1% కూడా పట్టుకోలేకపోతున్నామని హెచ్‌ఎస్‌బీసిలో ఫైనాన్షియల్ క్రైమ్ రిస్క్ గ్రూప్ హెడ్ కోలిన్ బెల్ బీబీసీకి గతంలో చెప్పారు.

ప్రపంచ నాయకులు

ఆఫ్‌షోర్ అకౌంట్లు

లాండర్ చేసిన డబ్బును ఆఫ్‌షోర్ (విదేశీ) అకౌంట్లలో దాచిపెడతారు. ఈ ప్రక్రియలో ఆ డబ్బుకు నిజమైన యజమాని ఎవరో తెలియదు. దేశంలో పన్ను చెల్లించే పని ఉండదు. కొన్ని దేశాలు ఇలాంటి వారికి స్వర్గధామాలుగా పని చేస్తాయి.

చిన్న మొత్తాల్లో డబ్బును విదేశాలకు తరలిస్తారు.

కస్టమ్స్ నిర్దేశించిన పరిమితికి కాస్త తక్కువగా చిన్న మొత్తాల్లో డబ్బును నగదు రూపంలో విదేశాలకు తరలిస్తారు. దీనిని విదేశాల్లో ఉన్న బ్యాంకుల్లోకి చేరుస్తారు. అక్కడి నుంచి తిరిగి స్వదేశీ బ్యాంకుల్లోకి పంపే ఏర్పాట్లు చేస్తారు.

ప్రపంచ నాయకులు, రాజకీయ వేత్తలు, బిలియనీర్ల రహస్య సంపద, ఆర్థిక లావాదేవీలను బయటపెట్టిన 'పండోరా పేపర్స్' ఈ కోవలోకే వస్తాయి.

ప్రస్తుతం పదవిలో ఉన్న, మాజీ నాయకులు సుమారు 35 మందితో పాటు 300 మంది ప్రభుత్వ అధికారులు ఈ లావాదేవీలు జరిపినట్లు పండోరా పేపర్స్ ద్వారా వెల్లడైంది.

జోర్డాన్ రాజు రహస్యంగా 70 మిలియన్ పౌండ్ల (రూ. 703 కోట్లు) ఆస్తిని కూడబెట్టినట్లు ఇందులో బయటపడింది.

లండన్ కార్యాలయాన్ని కొన్నప్పుడు యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన భార్య స్టాంపు డ్యూటీలో 3,12,000 పౌండ్ల (రూ. 3.1 కోట్లు)ను ఎలా ఆదా చేశారో ఇవి వెల్లడించాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో రహస్య ఆస్తులు ఉన్నట్లు 'పండోరా పేపర్స్' చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, పాండోరా పత్రాల్లో ఉన్న ప్రముఖులెవరు?

లేయరింగ్

ఇది రెండవ దశ. ఇది మనీ లాండరింగ్ ప్రక్రియలో కీలకమైన దశ.

ఈ దశలో డబ్బును పూర్తిగా ఆర్ధిక వ్యవస్థలోకి తెచ్చేందుకు సంక్లిష్టమైన లావా దేవీలు జరుగుతాయి. ఈ లావాదేవీలను కనిపెట్టడం అధికారులకు చాలా కష్టంగా మారుతుంది. ఈ పనిని చాలా వ్యూహాత్మకంగా, తప్పుడు లెక్కల ద్వారా చేస్తారు.

లెక్కలేనన్ని లావాదేవీలను నిర్వహించి, డబ్బు మూలాలను, అసలు యజమానిని తెలియకుండా చేస్తారు.

ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారా డబ్బును వివిధ దేశాలకు పంపిస్తారు. ఇన్సూరెన్సు పాలసీలు కొంటారు. స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. షెల్ సంస్థల్లోకి పంపిస్తారు.

కొన్ని లావాదేవీలను సాధారణంగా కనిపించే విధంగా ఇంటర్నెట్ బిల్లులు, ఆన్ లైన్ షాపింగ్ కోసం కూడా చేస్తారు.

ఈ దశలో బ్లాక్ మనీని వైట్ మనీలా కనిపించేలా చేస్తారు.

లేయరింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇంటెగ్రేషన్ - సమీకరణ

డబ్బును ఆర్ధిక వ్యవస్థలోకి వివిధ మార్గాల్లో ప్రవేశ పెట్టి, రకరకాల లావాదేవీలను నిర్వహిస్తారు. దీనిని న్యాయంగా సంపాదించిన డబ్బుగా చూపిస్తారు.

ఉదాహరణకు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడతారు.

డబ్బు పూర్తిగా ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టగానే బ్యాంకు అకౌంట్లలోంచి నచ్చిన విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవడం, విదేశీ పర్యటనలు చేయడం లాంటివి చేస్తారు.

ఇందుకోసం నేరుగా బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తారు. లేదా ఏటిఎం నుంచి డబ్బులు తీస్తారు.

డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని వివరించేందుకు ఇంటెగ్రేషన్‌ను చాలా జాగ్రత్తగా చేస్తారు.

తిరిగి ఈ డబ్బంతా రకరకాల అకౌంట్లు, వ్యక్తుల చుట్టూ తిరిగి నేరస్థుడు లేదా అసలైన యజమానిని చేరుతుంది. ఈ దశలో బ్లాక్ మనీకి, వైట్ మనీకి మధ్య తేడా కనిపెట్టడం చాలా కష్టంగా మారుతుంది.

ఈ డబ్బును ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఇక ఎవరూ తమను పట్టుకోలేరనే ధీమాతో లాండరర్ అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడతారు.

చట్టవ్యతిరేకంగా సంపాదించిన నల్ల ధనం అంతా ఇప్పుడు వైట్ మనీగా మారిపోతుంది. ఈ దశను ఇంటెగ్రేషన్ అని అంటారు.

ఈ డబ్బును ప్రాపర్టీ మార్కెట్, ఖరీదైన కార్లు, కళాఖండాలు, నగలు, లేదా ఖరీదైన వస్తువులను కొనుక్కునేందుకు వాడతారు.

నిజానికి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగాలనే నియమం లేదు. ఈ ప్రక్రియ అంతా ఏకకాలంలో కూడా జరిగే అవకాశముంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడంలో చాలా మంది వ్యక్తుల పాత్ర ఉంటుంది.

విద్వేషాలను రెచ్చగొట్టే మతాధికారి అబూ హంజా కొడుకు టిటో ఇబన్ షేక్ నకిలీ బ్యాంకు అకౌంట్ల ద్వారా దొంగతనాలు, మోసాల ద్వారా సంపాదించిన సుమారు 350,000 పౌండ్లను లాండర్ చేసినట్లు కోర్టు విచారణలో తెలిసింది.

ఈ కేసులో యూకే కోర్టు ఇబన్ షేక్‌కు 3 సంవత్సరాల 9 నెలల జైలు శిక్షను విధించింది.

అల్ కాపోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అల్ కాపోన్

మనీ లాండరింగ్ ఎప్పటి నుంచి జరుగుతోంది?

నిజానికి, మనీ లాండరింగ్ 2000 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతోందని ఇండియా ఫోరెన్సిక్ వెబ్ సైటు పేర్కొంది.

చైనాలో వ్యాపారులు డబ్బును రకరకాల వ్యాపారాలు, సంక్లిష్టమైన లావాదేవీల ద్వారా నిర్వహించి సంపాదనను ప్రభుత్వ అధికారుల నుంచి దాచిపెట్టేవారని చెబుతారు.

కానీ, ఇటాలియన్ మాఫియా అల్ కాపోన్ అకౌంటంట్ చట్టవ్యతిరేకంగా సంపాదించిన డబ్బుకు లెక్కలు చెప్పలేకపోవడంతో ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది.

అమెరికాలో 1920లు, 30లలో నగదు లావాదేవీలను మాత్రమే ఆమోదించే లాండ్రీలను మాఫియా నిర్వహించేది. దోపిడీలు, వ్యభిచార ర్యాకెట్లు, జూదం లాంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా సంపాదించిన డబ్బును చట్టబద్ధం చేసేందుకు ఈ లాండ్రీలను కేంద్రంగా చేసుకుని లావాదేవీలు నిర్వహించేవారు. కాపోన్ మాఫియాకు లాండ్రీల ద్వారా నల్ల ధనాన్ని వైట్ మనీగా మార్చడానికి వాడటం వల్ల ఈ ప్రక్రియకు మనీ లాండరింగ్ అనే గ్లామర్‌తో కూడిన పేరు వచ్చిందని చెబుతారు.

ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో ప్రతి ఏటా మనీ లాండరింగ్ చేసిన సొమ్ము 5% (2019)వరకు ఉంటోందని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ తెలిపింది.

9/11 ఘటన

ఫొటో సోర్స్, Getty Images

9/11 ఘటన

అమెరికాలో సెప్టెంబరు 2001లో జరిగిన ట్విన్ టవర్స్ పేలుళ్లను చేపట్టేందుకు హైజాకర్లకు అవసరమైన డబ్బెలా వచ్చింది? ఈ ఘటనకు అల్ ఖైదాకు 400,000 - 500,000 డాలర్ల ఖర్చు అయినట్లు అమెరికన్ అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 300,000 డాలర్లు హైజాకర్ల బ్యాంకు అకౌంట్ల ద్వారా పంపిణీ జరిగింది.

దీనికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయి? ఈ 9/11 ఘటన మనీ లాండరింగ్ ప్రక్రియకు ఒక ప్రముఖ ఉదాహరణగా నిలుస్తుంది.

యూఎస్ నేషనల్ కమీషన్ ఆన్ టెర్రరిస్ట్ ఎటాక్స్ సమర్పించిన నివేదికలో ఈ ప్రక్రియను వివరించారు.

"అల్ ఖైదా సభ్యులు డబ్బును భద్రపరచడం, బదిలీలు చేయడం కోసం అమెరికన్ బ్యాంకులను, ఆర్ధిక సంస్థలను ఉపయోగించారు. జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో ఉన్న మధ్యవర్తులు ఈ అకౌంట్లలోకి డబ్బును పంపించారు."

"క్యాష్ డిపాజిట్లు, వైర్ ట్రాన్స్ఫర్స్, ట్రావెలర్ చెక్స్ మార్పిడి ద్వారా డబ్బును అకౌంట్లలోకి జమ చేశారు. వీటిని ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న మొత్తాల్లో నిర్వహించారు. విదేశీ అకౌంట్లలో ఉన్న డబ్బును ఏటీఎంలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా బయటకు తీశారు."

"ఈ డబ్బును అమెరికాలో ఫ్లైట్ శిక్షణకు, రవాణా ఖర్చులు, గృహ, నిత్యావసరాలు, ఇతర రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించారు. అయితే, ఈ లావాదేవీలు నిర్వహించిన వారికెవరికీ అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ గురించి అవగాహన లేదు. దీంతో, ఈ లావాదేవీల గురించి పేపర్ ట్రయిల్ నిర్వహించారు."

"ఈ సంఘటన జరిగేటప్పటికి దేశంలో అమలులో ఉన్న మనీ లాండరింగ్ నిరోధించే చట్టాలు డ్రగ్ ట్రాఫికింగ్, భారీ మోసాలపై మాత్రమే దృష్టి పెట్టేవి. దీంతో, ఈ లావాదేవీలను కనిపెట్టలేకపోయారు."

"నిజానికి ఒసామా బిన్ లాడెన్ సొంత డబ్బును అల్ ఖైదాకు నిధులుగా ఇవ్వలేదు. గల్ఫ్ ప్రాంతంలో వివిధ ఇస్లాం స్వచ్చంద సంస్థలు, విరాళాల ద్వారా సేకరించిన డబ్బు అల్ ఖైదాకు నిధులుగా సమకూరేవి."

ఈ ఉదంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే సవాలును విసిరింది.

ఈ సంఘటన తర్వాత అమెరికా ప్రభుత్వం టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ పై దృష్టి పెట్టి యూఎస్ పేట్రియాట్ చట్టం-2003ను అమలులోకి తెచ్చింది. చాలా దేశాలు తమ ఆర్ధిక నేరాల నియంత్రణ చట్టాలను కొత్తగా రూపొందించడం లేదా పటిష్ఠపరచడం చేసుకున్నాయి.

ఈ చట్టం ద్వారా ఆర్ధిక వ్యవస్థలు, బ్యాంకులు అమలు చేసే నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం ఆర్ధిక సంస్థలకు సూచించింది.

వీడియో క్యాప్షన్, మీ ఖాతాలో డబ్బులు పోతే బ్యాంకులు ఇస్తాయా

మనీ లాండరింగ్ జరిగినట్లు బ్యాంకులు ఎలా తెలుసుకుంటాయి?

బ్యాంకులో అకౌంట్ తెరిచినప్పుడే సగటు ఆదాయ వర్గాల్లోకి ఖాతాలను వర్గీకరిస్తారు. నిర్ణీత పరిమితి దాటి అకౌంట్లలోకి డబ్బు చేరినప్పుడు, బ్యాంకులో లావాదేవీలను పర్యవేక్షించే ట్రాన్సాక్షన్ మానిటరింగ్ విభాగానికి ఆటోమేటిక్ ట్రిగర్ వెళుతుంది.

ఈ విభాగం నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడకు వెళుతున్నాయనే విషయాలను తమకు అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా సమీక్ష చేస్తుంది.

ఈ లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానిస్తే అకౌంట్‌ను బ్లాక్ చేయడం లేదా ఆ వివరాలను ప్రభుత్వ ఆర్ధిక నేరాల పరిశోధన విభాగానికి అందచేస్తుంది. భారతదేశంలో ఈ వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు అందచేస్తుంది. సదరు వ్యక్తులు లేదా సంస్థల అకౌంట్లలోకి జరిగే లావాదేవీలను పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటుంది.

చాలా రకాల నేర కార్యకలాపాలను తెలుసుకునేందుకు చట్ట వ్యవస్థలు ఆర్ధిక వ్యవస్థలు అందించే సమాచారం పై ఆధారపడతాయి.

మనీ లాండరింగ్ నిరోధించే వ్యవస్థలు పటిష్టంగా లేకపోవడంతో చాలా అంతర్జాతీయ బ్యాంకులు భారీ మొత్తంలో ఫైన్లను చెల్లించాయి.

మనీ లాండరింగ్ కార్యకలాపాలను అడ్డుకోలేకపోయినందుకు నాట్‌వెస్ట్ యూకే రెగ్యులేటర్లకు 265 మిలియన్ పౌండ్ల జరీమానాను చెల్లించింది.

హెచ్‌ఎస్‌బీ‌సి హోల్డింగ్స్ సంస్థ కార్యకలాపాల్లో మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 1.92 బిలియన్ డాలర్ల జరిమానాను అమెరికన్ అధికారులకు చెల్లించేందుకు అంగీకరించింది.

మనీ లాండరింగ్ నేరం రుజువైతే శిక్ష ఏంటి?

భారత్‌లో మనీ లాండరింగ్ చట్టం 2002ను అనుసరించి మనీ లాండరింగ్ నేరాలకు 3 - 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇది వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.

మనీ లాండరింగ్‌తో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసినట్లు కూడా నిరూపణ అయితే, 10సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)