పండోరా పేపర్స్: దేశాధ్యక్షులు, రాజకీయ నాయకుల రహస్య సంపద గుట్టు రట్టు

వరల్డ్ లీడర్స్
    • రచయిత, పండోరా పేపర్స్ రిపోర్టింగ్ టీమ్
    • హోదా, బీబీసీ పనోరమ

ప్రపంచ నాయకులు, రాజకీయ వేత్తలు, బిలియనీర్ల రహస్య సంపద, ఆర్థిక లావాదేవీలను 'పండోరా పేపర్స్' బయటపెట్టాయి.

ప్రస్తుతం పదవిలో ఉన్న, మాజీ నాయకులు సుమారు 35 మందితో పాటు 300 మంది ప్రభుత్వ అధికారులు ఈ లావాదేవీలు జరిపినట్లు పండోరా పేపర్స్ ద్వారా వెల్లడైంది.

జోర్డాన్ రాజు రహస్యంగా 70 మిలియన్ పౌండ్ల (రూ. 703 కోట్లు) ఆస్తిని కూడబెట్టినట్లు ఇందులో బయటపడింది.

లండన్ కార్యాలయాన్ని కొన్నప్పుడు యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆయన భార్య స్టాంపు డ్యూటీలో 3,12,000 పౌండ్ల (రూ. 3.1 కోట్లు)ను ఎలా ఆదా చేశారో ఇవి వెల్లడించాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో రహస్య ఆస్తులు ఉన్నట్లు 'పండోరా పేపర్స్' చెబుతున్నాయి.

దక్షిణ ఫ్రాన్స్‌లో 12 మిలియన్ పౌండ్ల (రూ. 120 కోట్లు)కు రెండు విల్లాలను కొనుగోలు చేసిన ఆఫ్‌షోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ గురించి చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెజ్ బాబిస్ వెల్లడించలేదు.

గత ఏడేళ్లలో ఫిన్సెన్ ఫైల్స్, ప్యారడైజ్ పేపర్స్, పనామా పేపర్స్, లక్స్‌ లీక్స్ పేర్లతో రహస్య పత్రాలను బహిర్గతం చేశారు. ఇప్పుడు తాజాగా పండోరా పేపర్స్ పేరుతో రహస్య సమాచారం బయటకు వచ్చింది.

భారీ స్థాయిలో ఉన్న ఈ సమాచారంపై 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్' (ఐసీఐజే) పరిశోధన చేసింది. ఇందులో 650 మందికి పైగా రిపోర్టర్లు పాల్గొన్నారు.

గార్డియన్, ఇతర మీడియా సంస్థలతో కలిసి బీబీసీ పనోరమ సంయుక్తంగా ఈ పరిశోధన చేసింది. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, పనామా, బెలిజ్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన 14 ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీల నుంచి సంపాదించిన దాదాపు 12 మిలియన్ల (కోటీ 20 లక్షలు) పత్రాలను అధ్యయనం చేశారు.

పండోరా పేపర్స్ వివరాలు

కొంతమంది ప్రముఖులు అవినీతి, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

యూకేలో రహస్యంగా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రముఖులు, సంపన్నులు చట్టబద్ధమైన కంపెనీలను ఎలా ఏర్పాటు చేస్తున్నారో తాజా లీకుల ద్వారా వెల్లడైంది.

ఈ రహస్య కొనుగోళ్ల వెనకున్న 95,000 ఆఫ్‌షోర్ సంస్థల యజమానుల వివరాలను ఈ పత్రాలు బయటపెట్టాయి.

'ఆఫ్‌షోర్ ప్రాపర్టీ యజమానుల' రిజిస్టర్‌ను నిర్వహించడంలో యూకే ప్రభుత్వ వైఫల్యం తాజా లీకులతో బయటపడింది.

సొంత దేశాన్నే దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇహమ్ అలియేవ్, అతని కుటుంబం దీనికి ఒక మంచి ఉదాహరణ.

అలియేవ్‌తో పాటు అతని సన్నిహితులు యూకేలో 400 మిలియన్ పౌండ్ల (రూ. 4,018 కోట్లు)కు పైగా విలువైన రహస్య ఆస్తి ఒప్పందాలలో పాల్గొన్నట్లు పరిశోధనలో కనుగొన్నారు.

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వానికి, తాజా లీకులు ఇబ్బందికరంగా మారవచ్చు. లండన్‌లో తమకున్న ప్రాపర్టీల్లో ఒకదాన్ని క్రౌన్ ఎస్టేట్‌కు అమ్మడం ద్వారా అలియేవ్ 31 మిలియన్ పౌండ్ల (రూ. 311 కోట్లు) లాభాన్ని పొందారు. బ్రిటన్ రాణి ప్రాపర్టీ ఎంపైర్‌కు చెందిన ఈ క్రౌన్ ఎస్టేట్ దేశం కోసం నగదును సేకరిస్తుంది.

వీటిలో అత్యధిక భాగం లావాదేవీల్లో చట్టపరంగా ఎలాంటి తప్పూ కనిపించదు.

''ఈ లావాదేవీల్లో చట్టపరమైన తప్పులు ఎన్నడూ కనిపించలేదు. కానీ పన్నును తప్పించుకోవడానికి, మోసపూరిత పద్ధతుల్లో డబ్బును సంపాదించడానికి ప్రముఖులకు ఈ ఆఫ్‌షోర్ కంపెనీలు ఎలా సహాయపడతాయో తెలుసుకోవచ్చు'' అని ఐసీఐజేకు చెందిన ఫెర్గస్ షీల్ అన్నారు.

''విదేశాల్లో లక్షల డాలర్ల విలువైన ఆస్తులను కొనడానికి వారంతా ఆఫ్‌షోర్ అకౌంట్లను, ఆఫ్‌షోర్ ట్రస్టులను వినియోగించుకుంటున్నారు. తమ దేశ పౌరుల ప్రయోజనాలను పణంగా పెట్టి వారి సొంత కుటుంబాలను ఆర్థికంగా బలపరుస్తున్నారు'' అని ఆయన అన్నారు.

''చాలా అంశాల్లోని రహస్యాలను ఈ పరిశోధన బహిర్గతపరుస్తోంది. కాబట్టి దీనికి పండోరా పేపర్స్ అనే పేరు పెట్టినట్లు'' ఐసీఐజే చెబుతోంది.

మాలిబు
ఫొటో క్యాప్షన్, మాలిబులో జోర్డాన్ రాజు కొన్న ఇల్లు

జోర్డాన్ రాజుకు మాలిబు బీచ్‌లో భవనాలు

జోర్డాన్ రాజు యూకే, యూఎస్‌లలో 70 మిలియన్ పౌండ్ల (రూ. 703 కోట్లు)కు పైగా విలువైన రహస్య ఆస్తుల్ని ఎలా కూడబెట్టారో తాజా పండోరా పేపర్స్ బయటపెట్టాయి.

బ్రిటీష్ వర్జీనియా ఐలాండ్‌లోని ఆఫ్‌షోర్ కంపెనీల నెట్‌వర్క్‌తో పాటు 'పన్ను స్వర్గాలు'గా భావించే ఇతర పద్ధతుల గురించి జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ అల్-హసన్ తెలుసుకున్నారు. 1999లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీటి ద్వారా 15 ఇళ్లను ఆయన కొనుగోలు చేశారు.

ఇందులో 3 ఇళ్లు సముద్రం ఒడ్డున ఉన్నాయి. మాలిబు, కాలిఫోర్నియాల్లో ఉన్న ఈ భవనాల విలువ 50 మిలియన్ పౌండ్లు (రూ. 502 కోట్లు). వీటితో పాటు యూకేలోని లండన్, అస్కాట్ ప్రాంతాల్లో కూడా ఆయన ఆస్తులను కొన్నారు.

ఈ ఆస్తులన్నింటిని రాజు, వ్యక్తిగత సంపదతోనే కొనుగోలు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. వీటిని జోర్డాన్ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఆయన ఉపయోగిస్తారన్నారు.

అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా ఆస్తులు కొనుగోలు చేయడం సర్వసాధారణమే అని లాయర్లు పేర్కొన్నారు. భద్రత, గోప్యత కోసమే ఇలా చేస్తారని అన్నారు.

పండోరా పేపర్స్‌లో బహిర్గతమైన ఇతర అంశాలు

కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా, అతని కుటుంబంలోని ఆరుగురు సభ్యులు రహస్యంగా ఒక ఆఫ్‌షోర్ కంపెనీ నెట్‌వర్క్‌ను సొంతం చేసుకున్నారు. ఇలాంటి 11 సంస్థలతో వారు సంబంధాలు కలిగి ఉన్నారు. ఇందులోని ఒక సంస్థ 30 మిలియన్ డాలర్ల (రూ. 222 కోట్లు) ఆస్తులను కలిగి ఉంది.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సన్నిహిత వర్గమైన క్యాబినెట్ మంత్రులు, వారి కుటుంబాలు మిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉన్న కంపెనీలను, ట్రస్టులను రహస్యంగా నడుపుతున్నాయి.

సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియాడ్స్ స్థాపించిన న్యాయ సంస్థ... ఆఫ్‌షోర్ కంపెనీల అసలు యజమానుల పేర్లను దాచి ఉంచేందుకు వారి స్థానంలో నకిలీ యజమానులను ఏర్పాటు చేసినట్లు అందరూ చెబుతుంటారు. కానీ ఈ ఆరోపణలను న్యాయ సంస్థ ఖండించింది.

యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిర్ జెలెస్కీ, 2019లో ఎన్నికల్లో గెలిచే ముందే తన వాటాను ఒక రహస్య ఆఫ్‌షోర్ కంపెనీలోకి బదిలీ చేశారు.

మాజీ బ్యాంకర్ అయిన ఈక్వెడార్ ప్రెసిడెంట్ గిలెర్మో లాసో తన దగ్గరి కుటుంబ సభ్యులకు అమెరికా దక్షిణ డకోటాకు చెందిన ఒక ట్రస్టు ద్వారా చెల్లింపులు జరిపారు.

టోనీ బ్లెయిర్

ఫొటో సోర్స్, Getty Images

కార్యాలయం కొనుగోలులో స్టాంపు డ్యూటీ చెల్లించని టోనీ బ్లెయిర్

టోనీ బ్లెయిర్, చెరీ బ్లెయిర్ తమ సంపదను దాచుకున్నట్లు పండోరా పేపర్స్‌లో ఎలాంటి సంకేతాలు లేవు.

కానీ 6.45 మిలియన్ పౌండ్ల (రూ. 64 కోట్లు) భవనం కొనుగోలు సమయంలో ఈ జంట స్టాంప్ డ్యూటీ చెల్లించలేదని ఈ పత్రాల్లో తెలిసింది.

2017లో సెంట్రల్ లండన్‌లోని మెరిల్‌బోన్‌లో ఉన్న ఆ భవన యాజమాన్య సంస్థ అయిన ఆఫ్‌షోర్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా బ్లెయిర్ దంపతులు దాన్ని సొంతం చేసుకున్నారు.

యూకేలో ఈ విధంగా ఆస్తులను కొనుగోలు చేయడం చట్టబద్ధమే. స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ బ్లెయిర్‌పై దీనికన్నా ముందే పన్ను అంశంలో విమర్శలున్నాయి.

మెరిల్‌బోన్‌లో ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం చెరీ బ్లెయిర్ లీగల్ కన్సల్టెన్సీ నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలకు ఈ కన్సల్టెన్సీ సలహాలు, సూచనలు అందిస్తుంది. అలాగే చెరీ బ్లెయిర్ నెలకొల్పిన మహిళల ఫౌండేషన్‌కు కూడా సలహాలు ఇస్తుంది.

ఆఫ్‌షోర్ కంపెనీ ద్వారానే ఆ భవనాన్ని కొనాలని, దాన్ని అమ్మినవారు పట్టుబట్టారని చెరీ బ్లెయిర్ చెప్పారు.

యూకే నిబంధనల ప్రకారమే వారు ప్రాపర్టీని తమకు అమ్మారని, భవిష్యత్‌లో ఆ భవనాన్ని విక్రయిస్తే మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

బహ్రెయిన్‌కు చెందిన ఓ కుటుంబం ఆ భవనానికి అసలు యజమానులు అని చెప్పారు. భవనం కొనుగోలు సమయంలో తాము ఎవరితో లావాదేవీలు జరుపుతున్నామనే అంశం మొదట్లో ఇరు పార్టీలకు తెలియదని వెల్లడించారు.

మేఫెయిర్‌లోని ఈ భవనాన్ని 2009లో ఫ్రంట్ కంపెనీ కొనుగోలు చేసింది.
ఫొటో క్యాప్షన్, మేఫెయిర్‌లోని ఈ భవనాన్ని 2009లో ఫ్రంట్ కంపెనీ కొనుగోలు చేసింది.

రూ. 331 కోట్ల భవనానికి యజమాని ఓ బాలుడు

ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా అజర్‌బైజాన్ పాలకుడు అలియేవ్ కుటుంబం, యూకేలోని ప్రాపర్టీలను రహస్యంగా ఎలా సంపాదించుకుందో లీకైన పత్రాలు చెబుతున్నాయి.

సుదీర్ఘ కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న అలియేవ్, ఆఫ్‌షోర్ కంపెనీల ద్వారా 17 ప్రాపర్టీలను కొన్నారు. 11 ఏళ్ల తన కుమారుడు హైదర్ అలియేవ్ కోసం లండన్‌లోని ఆఫీస్ బ్లాక్‌ను 33 మిలియన్ పౌండ్లు (రూ. 331 కోట్లు) వెచ్చించి తీసుకున్నట్లు ఈ పత్రాలు తెలుపుతున్నాయి.

మేఫెయిర్‌లోని ఈ భవనాన్ని 2009లో అధ్యక్షుడు ఇహమ్ అలియేవ్ స్నేహితునికి చెందిన కంపెనీ కొనుగోలు చేసింది.

ఒక నెల తర్వాత ఈ భవనాన్ని హైదర్ పేరు మీదికి బదిలీ చేశారు.

అలియేవ్ కుటుంబానికి చెందిన మరో ఆఫీసు బ్లాకును 2018లో క్రౌన్ ఎస్టేట్‌కు 66 మిలియన్ పౌండ్ల (రూ. 663 కోట్లు)కు ఎలా అమ్మారో కూడా ఈ పరిశోధనలో బయటపడింది.

ఆఫీసు బ్లాకు కొనుగోలు సమయంలోనే చట్టప్రకారం అవసరమైన అన్ని తనిఖీలను చేపట్టామని క్రౌన్ ఎస్టేట్ పేర్కొంది. ఇప్పుడు మరోసారి వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పింది.

కఠినమైన చట్టాల అమలుతో మనీ లాండరింగ్‌ను కట్టడి చేస్తున్నామని యూకే ప్రభుత్వం చెబుతోంది.

pandora papers

12 మిలియన్ల పత్రాలతో కూడిన పండోరా పేపర్స్ ప్రపంచ నాయకులు, రాజకీయ వేత్తలు, బిలియనీర్ల రహస్య సంపదను, ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని ఐసీఐజే ఈ పత్రాలపై పరిశోధన చేసింది. 117 దేశాలకు చెందిన 600 మందికి పైగా జర్నలిస్టులు ఈ రహస్య పరిశోధనలో పాల్గొన్నారు. యూకేలో 'ద గార్డియన్' వార్తా సంస్థతో కలిసి బీబీసీ పనోరమ ఈ ఇన్వెస్టిగేషన్‌ను చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)