తమిళనాడు: ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారిపై అత్యాచారం కేసులో 'టూ ఫింగర్ టెస్ట్' చేశారనే ఆరోపణలు

టూ ఫింగర్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

భారత వైమానిక దళంలోని ఒక మహిళా అధికారికి 'టూ ఫింగర్ టెస్ట్' చేయడం వివాదాస్పదం అవుతోంది. భారత్‌లో ఈ పరీక్షపై నిషేధం ఉంది.

తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో ఒక సహోద్యోగి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ మహిళా అధికారి ఆరోపించారు. దీనిపై భారత వైమానిక దళానికి ఫిర్యాదు చేశారు.

బాధితురాలు దీనిపై కోయంబత్తూర్‌లో కేసు పెట్టారు. లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేయొద్దని సీనియర్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని.. బెదిరించారని, హింసించారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.

కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయించినప్పుడు, విచారణలో ఎన్నో నియమాలు ఉల్లంఘించినట్లు ఆమెకు తర్వాత తెలిసింది,

"ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ గ్రూప్ కెప్టెన్‌ను కలవాలని నాకు చెప్పారు. అక్కడే నాకు వైద్య పరీక్షలు కూడా చేశారు. ఆ సమయంలో నేను ఇద్దరు డాక్టర్లను కలిశారు. నాకు మెడికల్ టెస్ట్ చేయడం గురించి వాళ్లే కన్‌ఫ్యూజ్‌లో ఉన్నట్టు కనిపించింది" అని మహిళా అధికారి ఎఫ్ఐఆర్‌లో చెప్పారు.

"ఆ డాక్టర్లు నన్ను గతంలో లైంగిక సంబంధాల గురించి కూడా ప్రశ్నించారు. నన్ను అలా ప్రశ్నించే అధికారం వారికి లేదని నాకు తర్వాత తెలిసింది. తర్వాత వాళ్లు నాకు వైద్య పరీక్షలు చేశారు.

వాళ్లు నా ప్రైవేట్ పార్ట్స్ పరిశీలించారు. నా జననాంగంలో వేళ్లు చొప్పించి స్వాబ్ తీసుకున్నారు. అత్యాచారం కేసు దర్యాప్తులో 'టూ ఫింగర్ టెస్ట్' చేయరనే విషయం కూడా నాకు తర్వాత తెలిసింది.

ఆ పరీక్షలు నన్ను మరింత కలవరానికి గురిచేశాయి. అమితేష్ హర్ముఖ్(అత్యాచార నిందితుడు) చేసిన అత్యాచారం లాంటి భయంకరమైన హింసను మళ్లీ ఎదుర్కొంటున్నట్టు అనిపించింది" అని బాధితురాలు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.

టూ ఫింగర్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

'ఫింగర్ టెస్ట్‌'పై కోర్టు తీర్పు

ఈ మహిళా అధికారి అందులో ఇచ్చిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 10న బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు ఆమెకు మడమ దగ్గర గాయమైంది. అదే రోజు ఆమెపై లైంగిక దాడి కూడా జరిగింది.

ఎఫ్ఐఆర్‌లో బాధితురాలు జరిగిన మొత్తం ఘటన గురించి చాలా వివరంగా చెప్పారు.

ఐదేళ్ల క్రితం 2016 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 'టూ ఫింగర్ టెస్ట్' మీద తీర్పు ఇచ్చింది. జస్టిస్ బీఎస్ చౌహాన్, ఎఫ్ఎంఐ కలిఫుల్లాతో కూడిన ఈ బెంచ్‌ 'టూ ఫింగర్ టెస్ట్', దాని వివరణ అత్యాచార బాధితుల గోప్యత, వారి శారీరక, మానసిక గౌరవం అనే హక్కును ఉల్లంఘిస్తుందని తీర్పు ఇచ్చింది. రిపోర్టులో లైంగిక సంబంధాలు ఉన్నట్లు తేలినా, ఆ సంబంధాలు పరస్పర అంగీకారంతో జరిగినవా, లేక ఆమెపై అత్యాచారం జరిగిందా అనేది తెలీదని చెప్పింది.

ఇలాంటి క్రూరమైన, అమానవీయమైన లేదా అవమానకరమైన వైద్య ప్రక్రియ ఏదీ ఉండకూడదని కోర్టు ఆదేశించింది. లైంగిక నేరాల దర్యాప్తులో బాధితురాలి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు పేర్కొంది.

లైంగిక నేరాల విచారణలో బాధిత మహిళల పట్ల సున్నితంగా వ్యవహరించేలా చూసుకోవడం వ్యవస్థ బాధ్యత. వారి భద్రత కోసం అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. వారి గోప్యతతో చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా ఏదీ చేయకూడదు.

'టూ ఫింగర్ టెస్ట్‌'ను గతంలో మహిళ కన్యత్వాన్ని పరీక్షించడానికి చేసేవారు. లైంగిక సంబంధాల సమయంలోనే కాకుండా సైకిల్ తొక్కడం, క్రీడలు లేదా ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కూడా కన్నెపొర చిరగవచ్చని తర్వాత చెప్పారు.

'టూ ఫింగర్ టెస్ట్' అశాస్త్రీయం అని నిరూపితమైందని చెన్నై నుంచి బీబీసీతో మాట్లాడిన న్యాయవాది సుధా రామలింగం చెప్పారు.

టూ ఫింగర్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫిర్యాదులో ఏం చెప్పారు

అత్యాచార కేసు దర్యాప్తు, అత్యాచారంలో పెద్ద తేడా ఉన్నట్లు తనకు అనిపించలేదని బాధితురాలు భావిస్తున్నారు. అత్యాచారం జరిగిన సమయంలో తనకు స్పృహ లేదని చెప్పారు.

"ఏ బెడ్‌పై రేప్ జరిగిందో దానిపై ఉన్న బెడ్ షీట్ కూడా మేం అప్పగించాం. ఆ గదిలో ఉన్న వీర్యం మరకలు ఉన్న పరుపు కూడా తీసుకురమ్మని డాక్టర్లు మాకు చెప్పారు" అన్నారు.

"మడమ గాయంతో నేను కొన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. మందులు వేసుకున్న తర్వాత నా సహోద్యోగితో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో నేను డ్రింక్ తెప్పించాను" అని బాధితురాలు చెప్పారు.

తాను రెండో డ్రింక్ తెప్పించినపుడు నిందితుడే తన కోసం డ్రింక్ తీసుకొచ్చాడని, దానికి డబ్బు కూడా ఆయనే చెల్లించారని మహిళా అధికారి చెప్పారు.

ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. వాంతి కూడా చేసుకున్నారు. దాంతో మహిళా సహోద్యోగులు తనను గది వరకూ తీసుకెళ్లారని, మంచం పై పడుకోబెట్టారని బాధితురాలు చెప్పారు.

"నేను నిద్రపోతున్నప్పుడు అమితేష్ నా గదిలోకి వచ్చాడు. తను చాలాసార్లు నన్ను లేపే ప్రయత్నం చేసాడు. 'నాకు చాలా నిద్రొస్తోంది, పడుకోనివ్వు' అని నేను అన్నాను. ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు" అని మహిళా అధికారి తెలిపారు.

"తర్వాత నన్ను గది వరకూ తీసుకెళ్లిన మహిళా స్నేహితురాలు 'నువ్వు అమితేష్‌కు నీ గదిలోకి రావడానికి అనుమతి ఇచ్చావా, నీ అండర్ గార్మెంట్స్ ఎందుకు తీసున్నాయి' అని అడిగారు. నా గదిలోకి వచ్చినపుడు నా బెడ్ మీద నిందితుడిని కూడా చూశానని ఆమె చెప్పారు. మహిళా సహోద్యోగి తర్వాత రోజు నా పడకపై వీర్యం మరకలు కూడా చూశారు. నేను ఆ విషయం నిందితుడిని అడిగినపుడు, అతడు క్షమించమన్నాడు" అని వివరించారు.

టూ ఫింగర్ టెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

నిందితుడి అరెస్ట్

ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేష్ హర్ముఖ్‌ను సెప్టెంబర్ 26న కోయంబత్తూర్‌లో మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో నిబంధనల గురించి ప్రశ్నించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు, మా అధికార పరిధిలో జోక్యం చేసుకుంటున్నారని పోలీసులను చెప్పారు.

అలాంటి కేసుల్లో సాయుధ దళాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉంటాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. కానీ, పోలీసులు వెనక్కు తగ్గలేదు. బాధితురాలు ఫిర్యాదు చేసింది కాబట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది కాబట్టి, దానిపై ఏదైనా వ్యాఖ్యలు చేయడం సరికాదని బీబీసీతో మాట్లాడిన రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎయిర్ ఫోర్స్ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది

కోర్టు మార్షల్ ప్రారంభించడానికి వీలుగా నిందితుడిని ఎయిర్ ఫోర్స్‌కు అప్పగించాలని కోర్టు చెప్పిందని హర్ముఖ్ వకీల్ ఎన్.సుందరవడివేలు బీబీసీకి చెప్పారు. అదనపు మహిళా కోర్టు జడ్జ్ ఎన్ తిలకేశ్వరి ఈ కేసులో దర్యాప్తు చేయవద్దని పోలీసులను కూడా ఆదేశించారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)