మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా

FACEBOOK/VIJAY RUPANI

ఫొటో సోర్స్, FACEBOOK/VIJAY RUPANI

ఫొటో క్యాప్షన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం, అహ్మదాబాద్ నుంచి దిల్లీ వరకు అంతటా చర్చనీయమైంది.

ఓవైపు ఆయన రాజీనామాకు కారణాలపై ఊహాగానాలు, పదవీకాలంపై చర్చలు జరుగుతుండగా... మరోవైపు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు నరేంద్రమోదీకి మరో ప్రత్యామ్నాయం లేకపోయిందా అనే చర్చా మొదలైంది.

భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు నరేంద్ర మోదీ వరుసగా మూడు సార్లు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

దూకుడు, పదునైన వ్యూహాలతో దూసుకెళ్లిన ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధానమంత్రిగా ఎదిగారు.

ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకొని ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసిన నాటి నుంచి, విజయ్ రూపానీ రాజీనామా వరకు గుజరాత్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతూనే ఉంది.

ఈ పరిస్థితులను బట్టి చూస్తే, గుజరాత్ ఇప్పటివరకు నరేంద్రమోదీకి వారసులను అందివ్వలేకపోయిందా ? అనే ప్రశ్న సమంజసమైనదిగానే అనిపిస్తోంది.

ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకునేందుకు, గుజరాత్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న కొందరు రాజకీయ నిపుణులతో ‘బీబీసీ గుజరాతీ’ మాట్లాడింది.

FACEBOOK/VIJAY RUPANI

ఫొటో సోర్స్, FACEBOOK/VIJAY RUPANI

ఫొటో క్యాప్షన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

''వికాస పురుషుడి''గా మోదీకి ఉన్న క్రేజ్

గుజరాత్ రాజకీయాలపై పట్టున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు జతిన్ దేశాయ్ మాట్లాడుతూ, 'ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీతో ఆ తరువాత వచ్చిన సీఎంలను పోల్చడం వల్లే గుజరాత్ రాజకీయాల్లో ఇంకా అస్థిరత కొనసాగుతుంద’’ని అన్నారు.

'' తన హయాంలో మోదీ ఒక అభివృద్ధి నాయకుడిగా తనకంటూ ఇమేజ్‌ ఏర్పరుచుకున్నారు. కేంద్ర నాయకత్వం కూడా ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు'' అని ఆయన చెప్పారు.

'' ప్రస్తుత నాయకత్వంతో పోలిస్తే, అప్పటి బీజేపీ కేంద్ర నాయకత్వం మరింత ప్రజాస్వామికమైనది. 2014 మే నెలలో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుంచి గుజరాత్‌లో వికాస పురుషుడిగా ఆయనకున్న ఇమేజ్‌తో ఏ నాయకుడా పోటీపడలేకపోయారు.''

మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో... ఆయన నాయకత్వానికి బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి గానీ, గుజరాత్‌లో ప్రాంతీయ పార్టీల నుంచి గానీ ఎలాంటి పోటీదారులూ లేరు.

''ఒకవేళ అలాంటి ప్రత్యర్థులు ఎదురైనా కూడా, మోదీ వారిని తన రాజకీయ వ్యూహాలతో అణచివేసేవారు. కానీ ఆయన తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన ఇద్దరు నాయకుల్లో, పార్టీలో తలెత్తిన అంతర్గత తిరుగుబాటును అణచివేయగల సామర్థ్యం ఉన్నట్లు కనిపించలేదు'' అని దేశాయ్ పేర్కొన్నారు.

MODI

ఫొటో సోర్స్, Reuters

మోదీ ఎవర్నీ ఎదగనివ్వరు

తన రాష్ట్రంపై, నియోజకవర్గంపై మరో వ్యక్తి పట్టు సాధించడాన్ని నరేంద్రమోదీ ఇష్టపడరని రాజకీయ విశ్లేషకులు, డాక్టర్ హరి దేశాయ్ అన్నారు.

విజయ్ రూపానీ రాజీనామా చేయడమే దీనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ''ఆయన స్థానంలో ఎవరూ స్థిరపడకూడదని మోదీ కోరుకుంటారు. ఇతర రాజకీయ నాయకులకున్న ఇమేజ్, పార్టీకి సమస్యగా మారకూడదనుకుంటారు. అందుకే ఆయన సమయానుకూలంగా ముఖ్యమంత్రుల్ని మార్చే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు'' అని దేశాయ్ వివరించారు.

''ఇందిరా గాంధీ కూడా తన హయాంలో ఇదే వ్యూహాన్ని అనుసరించారు. అందుకే ఏ రాజకీయ నాయకుడి ఇమేజ్ ఆమెకు సవాలుగా మారలేదు. అందుకే రాష్ట్రాలలో ఎదుగుతున్న నాయకుల్ని ఆమె ఎప్పటికప్పుడు మార్చేసేవారు. ఇందిరా గాంధీ అనుసరించిన ఈ విధానాన్నే ఇప్పుడు బీజేపీ, మోదీ అవలంబిస్తున్నారు.

ANANDIBEN PATEL

ఫొటో సోర్స్, ANANDIBEN PATEL

ఫొటో క్యాప్షన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్

గుజరాత్ రాజకీయాల్లో

గత 20 ఏళ్లలో గుజరాత్ రాజకీయాలలో ఏం జరిగినా కూడా దాని ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించింది. 2001 అక్టోబర్ 3న అప్పటి ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో అనేక ఊహాగానాల తర్వాత, బీజేపీ నాయకత్వం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీని నియమించింది..

'అభివృద్ధి నాయకుడి'గా మోదీ ఎదగడం ఈ ప్రక్రియతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి రాజకీయ అడ్డంకిని అధిగమిస్తూ, రోజురోజుకూ రాజకీయంగా ఎదిగిన మోదీ... 2014 నాటికి గుజరాత్ రాజకీయాల్లో శిఖరంగా మారారు.

ఈ క్రమంలోనే ఆయన 'గుజరాత్ మోడల్' 'వికాస్ పురుష్' ఇమేజ్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి, తిరుగుబాటు కూడా మోదీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయి.

ఈవిధంగా, చాలాకాలం తర్వాత భారత ఓటర్లు 2014లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు.

TWITTER / NITINBHAI_PATEL

ఫొటో సోర్స్, TWITTER / NITINBHAI_PATEL

ఫొటో క్యాప్షన్, విజయ్ రూపానీకి మిఠాయి తినిపిస్తోన్న బీజేపీ నేత నితిన్ పటేల్

దీని తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, గుజరాత్‌లో మాత్రం ఆధిపత్య పోరు ప్రారంభమైంది.

నరేంద్ర మోదీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆనందీబెన్ పటేల్‌కు లభించింది. గుజరాత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె నిలిచారు. కానీ రెండేళ్ల తర్వాత, 2016 ఆగస్టు 1న '75 ఏళ్ల వయో పరిమితి'ని కారణంగా చూపుతూ ఆమె పదవికి రాజీనామా చేశారు.

పార్టీలో అంతర్గత తిరుగుబాటు, పటీదార్ల ఉద్యమం పర్యవసానంగా ఆమె పదవి నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు చెబుతారు.

దీని తర్వాత కొన్ని రోజుల వరకు గుజరాత్ తదుపరి సీఎం ఎవరు అనే అంశంలో స్పష్టత రాలేదు. దీంతో ముఖ్యమంత్రిని నియమించేందుకు స్వయంగా అమిత్ షా గుజరాత్‌కు వచ్చారు. ఆ సమయంలో నితిన్ పటేల్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని నిపుణులు అంచనా వేశారు. కానీ విజయ్ రూపానీకి బీజేపీ ఆ పదవిని కట్టబెట్టింది.

అయినప్పటికీ, రూపానీ ప్రభుత్వం ఎంత కాలం నిలబడుతుందనే దానిపై అందరూ సందేహిస్తుండేవారు. అనుకున్నట్లే 2017 డిసెంబర్‌లో అలాంటి పరిస్థితే తలెత్తింది.

కానీ రూపానీపై విశ్వాసం ఉంచిన మోదీ, అమిత్ షా ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ విజయ్ రూపానీ తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోగలిగారు.

ఆ తర్వాత కూడా పార్టీలో అంతర్గత కలహాలు, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌తో అభిప్రాయభేదాల కారణంగా విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి.

ఐదేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తర్వాత 2021 సెప్టెంబర్ 11న విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)