కేంద్ర ప్రభుత్వం అనకూడదా, యూనియన్ గవర్నమెంట్ అనాలా? తమిళనాడు అభ్యంతరాలేంటి?

పార్లమెంట్
    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘కేంద్ర ప్రభుత్వం” వర్సెస్ ‘‘యూనియన్ ప్రభుత్వం” పదాల మధ్య సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

మోదీ ప్రభుత్వాన్ని ‘సెంట్రల్ గవర్నమెంట్’ (కేంద్ర ప్రభుత్వం) అని పిలవాలని కొందరు అంటుంటే.. ‘‘యూనియన్ గవర్నమెంట్” అని పిలవాలని మరికొందరు అంటున్నారు.

ఇంతకీ ఈ వివాదం ఎక్కడ మొదలైంది.. రాజ్యాంగంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి? రాజ్యాంగ నిపుణులు ఏం అంటున్నారు?

ఎంకె స్టాలిన్

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డీఎంకె నేత ఎంకె స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్ రిప్లయ్‌తో..

తమిళనాడు ప్రభుత్వం జారీచేసిన ఓ ఆదేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ‘‘యూనియన్ ప్రభుత్వం’’ అని ప్రస్తావించారు.

దీంతో సోషల్ మీడియా వేదికలపై చర్చ మొదలైంది. అనంతరం మీడియాలోనూ దీనిపై చర్చలు జరిగాయి.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని జూన్ 23న తమిళనాడు అసెంబ్లీలో తిరునెల్వేలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ కోరారు.

‘‘కేంద్ర ప్రభుత్వం (మధియ అరసు)’’ అనే పదానికి బదులు ‘‘యూనియన్ (ఒండిరియమ్ అరసు)’’ అని రాయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

నాగేంద్రన్ ప్రశ్నకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యుత్తరం ఇచ్చారు. ‘‘ ఒండిరియమ్ (యూనియన్) అనే పదాన్ని ఉపయోగించేందుకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే సమాఖ్య స్ఫూర్తికి ఈ పదం అద్దం పడుతోంది. మేం దీన్ని ఉపయోగించడాన్ని కొనసాగిస్తాం’’అని అసెంబ్లీ వేదికగా స్టాలిన్ చెప్పారు.

‘‘1957 నుంచీ ఈ పదాన్ని మేం ఉపయోగిస్తున్నాం. రాజ్యాంగంలోనూ భారత్‌ను ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’గానే పేర్కొన్నారు’’అని స్టాలిన్ చెప్పారు.

తమిళిసై సౌందరరాజన్

ఫొటో సోర్స్, facebook/DrTamilisaiBJP

ఫొటో క్యాప్షన్, తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ గవర్నర్..

ఈ విషయంలో డీఎంకే వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, ఇదివరకు తమిళనాడు రాష్ట్రంలోని బీజేపీ విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా యూనియన్ అనే పదాన్ని ఓ సందర్భంలో ఉపయోగించారు.

ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గాను తమిళిసై కొనసాగుతున్నారు. కొత్తగా ఏర్పాటైన పుదుచ్చేరి కేబినెట్‌తో ప్రమాణ స్వీకారం సమయంలో ఆమె ‘‘యూనియన్ గవర్నమెంట్’’అనే పదాన్ని ఉపయోగించారు.

దీనిపై వివాదం చెలరేగడంతో పుదుచ్చేరి రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. దశాబ్దాల నుంచి ఇక్కడ చదువుతున్న టెంప్లేట్‌లోని పదాలనే ఆమె చదివారని పేర్కొంది.

ఇంట్రడక్షన్ టు ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Introduction to the Constitution of India

రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారత రాజ్యాంగంపై ‘‘ఇంట్రడక్షన్ టు ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’’ పేరుతో ప్రముఖ రచయిత, న్యాయవాది దుర్గాదాస్ బసు (డీడీ బసు) ఓ పుస్తకం రాశారు.

దీనిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1) గురించి డీడీ బసు వివరంగా చర్చించారు. ‘‘ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్’’అని పేర్కొన్నారు.

ఇంట్రడక్షన్ టు ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Introduction to the Constitution of India

ఫొటో క్యాప్షన్, ఇంట్రడక్షన్ టు ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా

రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)లో ‘‘యూనియన్’’ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో ఈ పుస్తకంలో డీడీ బసు చర్చించారు.

‘‘భారత సమాఖ్య అవతరణకు రాష్ట్రాల మధ్య ఒప్పందం కారణం కాదు. ఈ సమాఖ్య నుంచి విడిపోవడానికి ఏ రాష్ట్రానికీ స్వేచ్ఛ లేదు. అందుకే ఇక్కడ మేం యూనియన్ అనే పదాన్ని ఉపయోగించాలని భావించాం. యూనియన్ అంటే మొత్తం అనే అర్థం వస్తుంది’’అని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 1948లో చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

అంబేడ్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ వందనం

ఫొటో సోర్స్, AMBEDKAR HOUSE

ఫొటో క్యాప్షన్, అంబేడ్కర్ విగ్రహానికి ప్రధాని మోదీ వందనం

అసలు సెంటర్ అనే పదం లేదు..

మరోవైపు అసలు రాజ్యాంగ నిర్మాతలు ‘‘సెంటర్’’ అనే పదాన్ని రాజ్యాంగంలో ఉపయోగించలేదని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు చెప్పారు.

‘‘మన దేశం రాష్ట్రాల సంఘమని రాజ్యాంగంలో చెప్పారు. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంటు అనే పదాన్ని రాజ్యాంగంలో వాడలేదు. కానీ, మనం వాడుకలో ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాం. యూనియన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంగా చెబుతున్నాం’’అని ఆయన వివరించారు.

యూనియన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య తేడాను కూడా శ్రీధరాచార్యులు వివరించారు. ‘‘యూనియన్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని మనం భారత ప్రభుత్వంగా పిలుస్తాం’’అని అన్నారు.

‘‘యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్టు, భారత పార్లమెంటు, భారత ప్రభుత్వం ఉంటాయి. రాష్ట్రపతిని కూడా యూనియన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ అని పిలుస్తారు. దాదాపు అన్నిచోట్లా యూనియన్ అనే ఉంటుంది’’అని ఆయన వివరించారు.

‘‘రాజ్యాంగంలో కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం అనే పదాలను ఎక్కడా ఉపయోగించలేదు. అయితే, 1897లో తీసుకొచ్చిన ‘ద జనరల్ క్లాసెస్ యాక్ట్’లో సెంటర్ అనే పదాన్ని నిర్వచించారు’’.

అంబేడ్కర్ హౌస్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ అంబేడ్కర్‌తో ఆయన రెండో భార్య మాయి అంబేడ్కర్ (కుడి), ఉద్యమకారుడు రావ్ బహదూర్ సి.కె.బోలే (ఎడమ)

అలా వాడుకలోకి వచ్చింది..

సెంటర్, సెంట్రల్ గవర్నమెంటు పదాల మూలాలు బ్రిటిష్ వలస ప్రభుత్వంలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న భానుమూర్తి చెప్పారు.

‘‘బ్రిటిష్ కాలంలో గవర్నర్ జనరల్ పరిపాలనా యంత్రాంగాన్ని ‘సెంట్రల్ గవర్నమెంట్’గా నిర్వచించేవారు. భారత్‌లో స్థానిక ప్రభుత్వం ఏర్పాటుకు 1919లో బ్రిటిష్ పార్లమెంటు ఓ చట్టాన్ని ఆమోదించింది. దీనిలో అధికారాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపకాలు చేశారు. ఇక్కడ సెంటర్ అనే పదాన్ని ఉపయోగించారు.’’

‘‘అదే సమయంలో యూనియన్ పదాన్ని కూడా ఇక్కడ తొలుత ఉపయోగించింది బ్రిటనే. అధికారం బదిలీ కోసం 1946లో తీసుకొచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో యూనియన్ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించారు. దీనిలోని చాలా అంశాలను రాజ్యాంగ నిర్మాతలు పరిగణలోకి తీసుకున్నారు.’’

‘‘కేంద్రానికి పరిమిత అధికారాలు కల్పించాలని అప్పటి క్యాబినెట్ మిషన్ సూచించింది. అయితే, దేశ విభజన, కశ్మీర్‌లో హింస నడుమ ఈ సమీకరణాలను రాజ్యాంగ నిర్మాతలు మార్చారు. కేంద్రానికి ఎక్కువ అధికారాలను ఇచ్చారు’’అని భానుమూర్తి చెప్పారు.

అంబేడ్కర్ హౌస్

రెండింటికీ తేడా ఏమిటి?

సెంటర్, యూనియన్ మధ్య తేడాల గురించి తన పుస్తకం ‘‘అవర్ కాన్‌స్టిట్యూషన్: ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ కానిస్టిట్యూషనల్ లా’’లో రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ వివరించారు.

‘‘సెంటర్ అంటే ఒక వృత్తంలో మధ్య భాగం మాత్రమే. అదే యూనియన్ అంటే వృత్తం మొత్తం వస్తుంది’’అని కశ్యప్ వివరించారు.

అవర్ కాన్‌స్టిట్యూషన్

ఫొటో సోర్స్, Our Constitution

సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ అనే పదాలను ఉపయోగిస్తున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘యూనియన్, రాష్ట్రాలు.. ఈ రెండింటికీ అధికారాలను రాజ్యాంగమే కల్పిస్తోంది. ఈ రెండింటినీ ఒకదాని కింద మరొకటి పనిచేస్తున్నట్లు గుర్తించకూడదు. ఒకదానితో మరొకటి సమన్వయంతో పనిచేస్తున్నట్లు భావించాలి’’అని కశ్యప్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు: బీఆర్ అంబేడ్కర్

అధికారాల కేంద్రీకృతమే అసలు సమస్య

మన దేశంలో అధికారాలన్నీ యూనియన్ దగ్గర కేంద్రీకృతం అవుతూ వస్తున్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం అనే పదం వాడకం పెరుగుతోందని శ్రీధరాచార్యులు అభిప్రాయపడ్డారు.

‘‘ఇప్పుడు తమిళనాడు కూడా ఈ విషయంపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాల అధికారాలు కూడా కేంద్రం తీసేసుకుంటోంది కాబట్టే, నేను కేంద్ర ప్రభుత్వం అనడానికి సిద్ధంగా లేనని స్టాలిన్ అంటున్నారు.’’

‘‘భారత దేశం యూనిటరీ కాదు. అంటే ఏకీకృత ప్రభుత్వ వ్యవస్థ కాదు. ఇక్కడ అధికారాలన్నీ మూడంచెల్లో విభజించి పెట్టారు. కానీ, ఇప్పుడు అధికారాలు కేంద్రీకృతం అవుతున్నాయి. అదే అసలు సమస్య.’’

‘‘సెంటర్ లేదా సెంట్రల్ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాతలు కావాలనే ఉపయోగించలేదు. ఎందుకంటే అధికారాలను ఒక చోట కేంద్రీకృతం కావడం వారికి ఇష్టం లేదు. అందుకే అన్నింటినీ కలిపి ఉంచే అర్థం వచ్చేలా యూనియన్ గవర్నమెంట్ అనే పదాన్ని ఉపయోగించారు’’అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)