కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్‌సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2020 ఆగస్టు మొదటివారంలో భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
‘‘మీరు తయారుచేస్తున్న కోవాగ్జిన్ ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?’’ఇది ఆయనకు ఎదురైన మొదటి ప్రశ్న.
‘‘మా వ్యాక్సీన్ ఒక బాటిల్ మంచినీటి కంటే తక్కువ ధరకే లభిస్తుంది’’అని విలేకరులకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఆ మాట చెప్పి, ఇప్పటికి దాదాపు 10 నెలలు గడుస్తున్నాయి. ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
పది నెలల్లో ఏం మారింది? అంటూ కృష్ణా ఎల్లాను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారత్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తున్న టీకాల్లో కోవాగ్జిన్‌కే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
కోవాగ్జిన్ ధరను రూ.12,00గా నిర్ణయిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ జూన్ 8న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై జీఎస్టీ రూ.60, వ్యాక్సీన్ వేయడానికి రూ.150 కలిపితే, ఇది మొత్తంగా రూ.1410 అవుతుంది. అంటే ప్రైవేటు ఆసుపత్రిలో కోవాగ్జిన్ వేసుకోవాలంటే రూ.1,410 చెల్లించాలి. కోవిషీల్డ్‌కు రూ.780, స్పుత్నిక్ వీకి రూ.1,145 చెల్లిస్తే సరిపోతుంది.
కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత, అసలు కోవాగ్జిన్ ధరను ఎందుకు ఇంత ఎక్కువగా నిర్ణయించారు? అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ధర ఎక్కడికి పోతోంది?
ధర ఎందుకు ఎక్కువగా ఉందో తెలుసుకోవాలంటే, మొదట మనం ఈ వ్యాక్సీన్ తయారీ ప్రక్రియను అర్థం చేసుకోవాలి. ఈ అంశంపై భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసెర్) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అమ్జాద్ హుస్సేన్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘వ్యాక్సీన్ తయారీ ప్రక్రియ దానిలో ఉపయోగించే టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కోవాగ్జిన్‌ను అచేతన వైరస్‌లతో తయారుచేస్తున్నారు. ఈ విధానంలో వ్యాక్సీన్లు తయారుచేయడానికి కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది’’.
‘‘దీని కోసం మొదట వైరస్‌ను కృత్రిమంగా పెంచాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని అచేతన స్థితిలోకి తీసుకెళ్లాలి. అంటే ఇనాక్టివేట్ చేయాలి’’.
‘‘వైరస్‌లను కృత్రిమంగా పెంచడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. మరోవైపు వ్యాక్సీన్ల అభివృద్ధి సమయంలో కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటిలో మొదటిది ప్రీ-క్లినికల్ స్టడీ, అంటే కణాలపై వ్యాక్సీన్లను ప్రయోగిస్తారు. ఆ తర్వాత మూడు క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలి. దీని కోసం చాలా ఖర్చు అవుతుంది’’.
‘‘కొన్ని దేశాల్లో నిబంధనలు వేరుగా ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా భిన్న దేశాల్లో పరీక్షలు నిర్వహించాలి. ఆ తర్వాత దేశాల్లోని ఔషధ ప్రాధికార సంస్థలు ఈ టీకాలకు అనుమతి ఇస్తాయి. ఆ తర్వాత భారీగా ఉత్పత్తి మొదలవుతుంది. అప్పుడు కూడా చాలా ఖర్చు అవుతుంది. నాణ్యత పరిశీలించడం చాలా ముఖ్యం. క్వాలిటీ కంట్రోల్ సవ్యంగా ఉందని చెప్పిన తర్వాతే వీటిని వ్యాక్సీన్ కేంద్రాలకు తరలిస్తారు’’.
‘‘అంటే వ్యాక్సీన్ ధర అనేది టెక్నాలజీతోపాటు ట్రయల్స్, ఉత్పత్తి, క్వాలిటీ కంట్రోల్, మెయింటెనెన్స్‌లపై ఆధారపడి ఉంటుంది’’.

ఫొటో సోర్స్, EPA
టెక్నాలజీపై చాలా ఎక్కువ
ఇప్పుడు భారత్ బయోటెక్ వ్యాక్సీన్ ధర ఎందుకు ఎక్కువగా ఉందో పరిశీలిద్దాం. దీని కోసం ముందు సంస్థ ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తోందో చూద్దాం.
అచేతన వైరస్‌తో సంస్థ వ్యాక్సీన్లను తయారుచేస్తోంది. అందుకే వ్యాక్సీన్ల తయారీ ఆలస్యం అవుతోంది. దీనితో పోలిస్తే వెక్టర్ ఆధారిత వ్యాక్సీన్(కోవిషీల్డ్ లాంటివి)లను వేగంగా తయారుచేయొచ్చు.
కోవాగ్జిన్‌లో ఉపయోగిస్తున్న అచేతన వైరస్‌లను ప్రత్యేకమైన బయోసేఫ్టీ లెవల్-3 (బీఎస్ఎల్-3) ల్యాబ్‌లలో పెంచాల్సి ఉంటుంది.
మొదట్లో భారత్ బయోటెక్‌కు ఒక బీఎస్ఎల్-3 ల్యాబ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు వీటి సంఖ్య నాలుగుకు పెరిగింది. దీని కోసం సంస్థ భారీగా ఖర్చు పెట్టింది.
బీఎస్ఎల్-3 ల్యాబ్‌ల పనితీరుపై పుణెలోని ఐసెర్ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ వినీత బాల్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘ఆ ల్యాబ్‌లలో పనిచేసే వారంతా పీపీఈ కిట్లు వేసుకోవాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది’’.
‘‘ఒక్కో వ్యాక్సీన్ కోసం కొన్ని మిలియన్ల వైరస్‌లు అవసరం అవుతాయి. వీటన్నింటినీ కృత్రిమంగా పెంచాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది’’.
‘‘వైరస్‌తో పని అంటే చాలా ప్రమాదకరం. అందుకే చాలా భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. బీఎస్ఎల్-3 ల్యాబ్‌ల నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. బీఎస్ఎల్-1, బీఎస్ఎల్-2లలో పనిచేసినంత తేలిగ్గా బీఎస్ఎల్-3లో పనిచేయలేం’’.
‘‘ఇలాంటి ల్యాబ్‌లు మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని కొత్తగా ఏర్పాటుచేయాలంటే నాలుగు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఇక్కడ పనిచేసేవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది’’.
అందుకే రెండు లేదా నాలుగు కంపెనీల్లో ఈ వ్యాక్సీన్‌ను తయారుచేసేందుకు చర్చలు నడుస్తున్నాయి. దీని కోసం ఆయా సంస్థలకు భారత్ బయోటెక్ టెక్నాలజీని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు వైపులా సాయం చేస్తోంది.

ఫొటో సోర్స్, FAROOQ NAEEM
క్లినికల్ ట్రయల్స్ కోసం..
ఇటీవల ఓ టీవీ షోలో కృష్ణ ఎల్లా మాట్లాడారు. ‘‘వ్యాక్సీన్లను విక్రయించి ఎక్కువ డబ్బులు సంపాదించాలని మేం కూడా అనుకుంటాం. కానీ ట్రయల్స్ కోసమే మేం పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది’’.
‘‘మేం సంపాదిస్తున్న కొంత మొత్తాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ఉపయోగిస్తాం. భవిష్యత్ మహమ్మారుల కట్టడికి ఇది ఉపయోగపడుతుంది’’అని ఆయన చెప్పారు.
కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం తాము రూ.350 కోట్లు ఖర్చు పెట్టామని భారత్ బయోటెక్ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి సాయమూ తీసుకోలేదని సంస్థ వివరిస్తోంది.
‘‘ఆ ఖర్చును మా బాధ్యతగా భావిస్తున్నాం. దాన్ని ఇవ్వాలని మేం కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ కోరలేదు’’అని కృష్ణ చెప్పారు.

ఫొటో సోర్స్, ADRIANA DUDULEANU / EYEEM
నెమ్మదిగా ఉత్పత్తి..
‘‘ఇప్పటివరకు అచేతన వైరస్‌తో ఏడాదికి ఏ సంస్థా 15 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను తయారుచేయలేదు. కానీ, మేం చేస్తున్నాం. ఉత్పత్తి నెమ్మదిగా జరుగుతోంది. అయితే, మేం ముందే ఈ లక్ష్యాలు పెట్టుకున్నాం’’అని కృష్ణ వివరించారు.
‘‘కొన్ని ఇతర సంస్థలు మీకంటే వేగంగా వ్యాక్సీన్లు తయారుచేస్తున్నాయని కొందరు అంటున్నారు. ఇలా పోల్చడం సరికాదు. కోవాగ్జిన్‌తో ఏ టీకానూ పోల్చలేం’’.
ప్రభుత్వ డిమాండ్‌కు అనుగుణంగా కోవాగ్జిన్‌ను పెద్ద మొత్తంలో వేగంగా ఉత్పత్తి చేయడం సాధ్యంకాదు అనే విషయాన్ని ముందునుంచే నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో టీకాలు తీసుకుంటున్న వారిలో 90 శాతం మందికి కోవిషీల్డ్ ఇవ్వడానికి ఇదే కారణం. మరోవైపు కోవాగ్జిన్ ధర ఎక్కువగా ఉండటంతో కంపెనీ 10 శాతం ధరను తగ్గిస్తోంది కూడా.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర దేశాల్లో
ఇక్కడ ఎదురవుతున్న లోటును విదేశాల్లో వ్యాక్సీన్లను విక్రయించడం ద్వారా పూడ్చుకోవాలని భారత్ బయోటెక్ భావిస్తోంది.
ఇప్పటికే 60కిపైగా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ తెలిసింది. జింబాబ్వే, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇరాన్‌లలో అత్యవసరంగా వినియోగించేందుకు కోవాగ్జిన్‌కు అనుమతులు కూడా ఇచ్చారు.
అయితే, చాలా దేశాల్లో ఇంకా అనుమతులు రాలేదు. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలతో సంస్థకు ఎలాంటి ఒప్పందాలు లేవు.
ఇతర దేశాల్లో 15 నుంచి 20 డాలర్లకు కోవాగ్జిన్‌ను విక్రయిస్తున్నామని సంస్థ చెబుతోంది. అంటే ఒక్కో వ్యాక్సీన్‌ను రూ.1,000 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తున్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times/getty images
కేంద్ర ప్రభుత్వానికి తక్కువకు
కోవాగ్జిన్ ధర ఎందుకు ఎక్కువగా ఉందనే అంశంపై ఇటు భారత్ బయోటెక్, అటు కేంద్ర ప్రభుత్వాలను బీబీసీ సంప్రదించింది. అయితే, ఈ వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.
అయితే, భారత్ బయోటెక్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి బీబీసీతో మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం రూ.150కి ఈ వ్యాక్సీన్‌ను మా దగ్గర నుంచి కొనుగోలు చేస్తోంది. అంటే మేం ఉత్పత్తి చేస్తున్న టీకాల్లోని 75 శాతం టీకాల వల్ల మాకు ఎలాంటి ఆదాయమూ రావట్లేదు’’.
అయితే, ఈ వ్యాక్సీన్ల ధర ఎక్కువగా ఉండటంతో చిన్నచిన్న ఆసుపత్రులు ఈ వ్యాక్సీన్లు వేయడానికి ముందుకు రావడం లేదని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ అలెగ్జాండర్ థామస్ అన్నారు.
‘‘భారత్‌లోని 70 శాతం ఆరోగ్య సేవల్ని ప్రైవేటు ఆసుపత్రులే చూసుకుంటున్నాయి. అలాంటిది కేవలం 25 శాతం వ్యాక్సీన్లనే వారికి వదిలిపెట్టడంలో అర్థంలేదు’’.
‘‘ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కేంద్ర ప్రభుత్వం టీకాలు సరఫరా చేయాలి. అప్పుడు కేవలం సర్వీస్ చార్జ్ మాత్రమే తీసుకుని ఈ ఆసుపత్రులు టీకాలు వేయగలుగుతాయి. దీంతో చిన్నచిన్న ఆసుపత్రులు కూడా వ్యాక్సీన్లు వేయడానికి ముందుకు వస్తాయి’’.
దేశంలోని చిన్న చిన్న ఆసుపత్రుల హక్కుల కోసం అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇన్ ఇండియా పనిచేస్తోంది.
ఈ నిర్ణయంతో సంస్థకు నష్టమే..
వ్యాక్సినేషన్ విధానాల్లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్ బయోటెక్‌కు భారీ నష్టం వాటిల్లింది.
ఇదివరకు ఒక్కో వ్యాక్సీన్‌ను కేంద్ర ప్రభుత్వానికి రూ.150.. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300 నుంచి రూ.400కు సంస్థ విక్రయిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్న వ్యాక్సీన్లను కూడా తామే కొనుగోలు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
అంటే, రూ.300 నుంచి రూ.400కు విక్రయించడంతో ఇప్పటివరకు వచ్చిన లాభాలు ఇకపై భారత్ బయోటెక్‌కు రావు. మొత్తం వ్యాక్సీన్లను రూ.150కే సంస్థ విక్రయించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనంతరం ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించే ధరలను భారత్ బయోటెక్ పెంచింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- BBCISWOTY: క్రీడల్లో మహిళల గురించి భారతీయులు ఏమనుకొంటున్నారు?
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- క్విజ్: పీవీ సింధు గురించి మీకేం తెలుసు?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









