జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో కోటీశ్వరులు అత్యల్ప స్థాయిలో చెల్లిస్తున్న ఆదాయపు పన్ను వివరాలను ప్రో పబ్లికా అనే వార్తా సంస్థ ప్రచురించింది.
ప్రపంచంలోని అత్యంత ధనవంతులు కడుతున్న పన్నుల రిటర్నులను తాము పరిశీలించినట్లు ఈ వెబ్‌సైట్ చెప్పింది. ఈ జాబితాలో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారెన్ బఫెట్ కూడా ఉన్నారని చెబుతోంది.
అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ 2007, 2011 సంవత్సరాల్లో, మస్క్ 2018లో అసలు పన్ను చెల్లించినట్లు దాఖలాలే లేవని చెబుతోంది.
ఈ పన్ను వివరాలు బహిర్గతం కావడం చట్ట వ్యతిరేకమని, దీని గురించి ఎఫ్‌బీఐ, పన్ను అధికారులు విచారణ చేస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు.
కోటీశ్వరులు చెల్లిస్తున్న పన్నుల వివరాలను ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ సమాచారాన్ని వెలికి తీసి విశ్లేషిస్తున్నట్లు ప్రో పబ్లికా తెలిపింది. రానున్న వారాల్లో మరింత సమాచారాన్ని వెల్లడి చేస్తామని ప్రకటించింది.
అయితే, ఈ ఆరోపణలను బీబీసీ నిర్ధరించలేదు.
ధనికులు చెల్లిస్తున్న పన్నులు, పెరుగుతున్న అసమానతల గురించి దేశంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు బయటపడ్డాయి.
అమెరికాలో అత్యంత ధనవంతులైన 25 మంది అతి తక్కువ మొత్తంలో అంటే తమ స్థూల ఆదాయంలో సగటున 15.8 శాతం పన్నులుగా చెల్లిస్తున్నారు. ఇది అమెరికాలోని ప్రధాన రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చెల్లిస్తున్న దాని కంటే చాలా తక్కువ అని ప్రో పబ్లికా పేర్కొంది.
"కోటీశ్వరులు చెల్లించే పన్నులు అతి తక్కువగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. అసలు పన్నులు కట్టకపోవడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అత్యంత ధనవంతులు ప్రభుత్వ విధానాలను చట్టబద్ధంగా తప్పించుకోగలరు" అని ప్రో పబ్లికా ఎడిటర్ జెస్సీ ఈసింగెర్ అన్నారు.
బైడెన్ ప్రణాళికలు
అమెరికాలో కోటీశ్వరులు ఇటీవల కాలంలో తమ ఆస్తులు పెంచుకున్నప్పటికీ చట్టబద్ధమైన పన్ను విధానాలలోని లొసుగులను వాడుకుంటూ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులను పూర్తిగా కట్టకపోవడం గానీ, లేదా అతి తక్కువ మొత్తానికి కానీ తగ్గించుకోగల్గుతున్నారు" అని వెబ్ సైటు పేర్కొంది,
ధనవంతులు సహాయ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం, లేదా సాధారణ ఆదాయం కాకుండా, పెట్టుబడుల నుంచి ఆదాయం సంపాదించడం లాంటివి చూపిస్తూ తాము కట్టాల్సిన పన్నులను తగ్గించుకుంటున్నారు.
అమెరికాలో 25 మంది అత్యంత ధనవంతుల ఆస్తి మొత్తం కలిపి 2014-2018 మధ్య కాలంలో 401 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. ఈ ఆదాయంతో పోలిస్తే, వారు 13.6 బిలియన్ డాలర్లను మాత్రమే పన్నుగా కట్టినట్లు ప్రో పబ్లికా తెలిపింది.
ప్రభుత్వం తలపెట్టిన భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడుల కార్యక్రమం కోసం ధనవంతులు కట్టాల్సిన పన్నులను పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన కూడా చేశారు.
పన్ను రేట్లను పెంచుతూ, పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం పై పన్నును రెట్టింపు చేయడం, వారసత్వపు పన్నును విధించాలని భావించారు.
కానీ, "బైడెన్ చేసిన ప్రతిపాదనల వల్ల అమెరికాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్లు లాంటి ఎక్కువ పన్నులు చెల్లించాల్సి రాగా, అత్యంత ధనికుల జాబితాలో ఉన్న 25 మందికి ఈ ప్రతిపాదనల వల్ల చెల్లించే పన్నుల్లో పెద్దగా తేడా ఏమి కనిపించదు.
జార్జ్ సోరోస్ అనే దాత కూడా అతి తక్కువ పన్నులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణల పై ఆయన ఆఫీసు స్పందించలేదు.
కానీ, ఆయన పెట్టుబడుల పై వచ్చిన నష్టాల కారణంగా ఆయన ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లింపులు బాకీ లేరని, ప్రో పబ్లికా కు ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. ధనవంతులు అధిక పన్నులు చెల్లించాలనే ప్రతిపాదనను ఎప్పటి నుంచో ఆయన సమర్ధిస్తున్నారని కూడా ఆ ప్రకటనలో జత చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
చట్ట వ్యతిరేకం
ఆదాయపు పన్ను వివరాలకు సంబంధించిన పత్రాలు ఇలా బయటపడటం గోప్యతకు సంబంధించిన అంశాలను లేవదీసిందని, ఈ పత్రాలను బయటపెట్టిన వారి వివరాలు చట్టబద్ధంగా తెలుసుకుంటానని న్యూ యార్క్ మాజీ మేయర్ మైకేల్ బ్లూమ్ బర్గ్ అన్నారు. అయితే, ఆయనకు సంబంధించిన వివరాలు కూడా ఈ బయటపడిన పత్రాల్లో ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.
అమెరికా ఇంటర్నల్ రెవన్యూ సర్వీస్ లో జరిగిన బడ్జెట్ కోతల వల్ల ధనిక వర్గాలు, భారీ కార్పొరేషన్ల పై తమ పన్నుల విధానాలను అమలు పరచడానికి ఎలా ఆటంకంగా పరిణమించాయో వివరిస్తూ ప్రో పబ్లికా అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది.
ఈ వ్యాసాలకు ప్రతిస్పందన గానే, ఈ పత్రాలు లభించినట్లు సంస్థ పేర్కొంది.
"ఆమోదం లేకుండా ప్రభుత్వ సమాచారాన్ని బయట పెట్టడం చట్ట వ్యతిరేకం" అని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జెన్ సాకి చెప్పారు.
ఈ విషయాన్ని ఎఫ్‌బిఐ, ఫెడరల్ విచారణకు, మరో ఇద్దరు ట్రెజరీ విభాగపు పరిశీలకులకు పంపించినట్లు ట్రెజరీ విభాగపు ప్రతినిధి లిలీ ఆడమ్స్ చెప్పారు. వీరందరికీ విచారణ చేసేందుకు స్వతంత్ర అధికారాలు ఉన్నాయి.
"ప్రత్యేకంగా ఏ ఒక్కరి గురించీ ఏమి మాట్లాడలేను. ప్రస్తుతానికి ఈ వివరాలు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ నుంచి లీక్ అయ్యాయనే విషయం పై మాత్రం విచారణ జరుగుతోంది" అని యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కమీషనర్ ఛార్లెస్ రెటిగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ అనుసరించాల్సిందే - దిల్లీ హైకోర్టు
- ప్రశాంత్: పాక్ జైలులో నాలుగేళ్లు గడిపిన హైదరాబాద్‌వాసి విడుదల
- చైనాలో ఇక ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చు
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ‘కోవిడ్-19 సహజంగా పుట్టిందంటే నమ్మను..చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి’
- ఇజ్రాయెల్: లక్షలాది యూదులను చంపిన నాజీ అధికారి ఐష్‌మన్‌ను ఎలా పట్టుకుంది?
- పాలస్తీనియన్లకు మద్దతుగా కశ్మీర్లో ప్రదర్శనలు, 21 మంది అరెస్ట్
- వెస్ట్ బ్యాంక్ చరిత్రేమిటి.. ఇజ్రాయెల్ దాన్ని ఎందుకు ఆక్రమించాలనుకుంటోంది
- బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమా.. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది..
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
- యాంఫోటెరిసిన్-బీ: బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే మందుకు తీవ్ర కొరత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








