జీడీపీ: నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధి - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 1.6 శాతం వృద్ధి నమోదు చేసింది.
మొత్తం ఆర్థిక సంవత్సరానికి చూసుకుంటే జీడీపీ సంకోచం 7.3 శాతంగా ఉందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ తెలిపారంటూ ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా జీడీపీ వృద్ధి మందగించిందని పేర్కొంది.
మార్చి నెల గణాంకాలు ఎకానమీ అన్ లాకింగ్‌కు ప్రతిరూపంగా నిలిచాయని ముంబైలోని ఎలారా క్యాపిటల్ సంస్థలో ఎకనమిస్ట్‌గా వ్యవహరిస్తున్న గరిమా కపూర్ వ్యాఖ్యానించినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
మరోవైపు మే 23 నాటికి దేశంలో నిరుద్యోగిత 14.7శాతం పెరిగిందని ముంబైకి చెందిన ప్రైవేట్ థింక్ ట్యాంక్ సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించిందని రాయిటర్స్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ అనుసరించాల్సిందే - దిల్లీ హైకోర్టు
కొత్త ఐటీ నిబంధనలను సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ అనుసరించాల్సిందేనని దిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది.
ఈ నిబంధనలను ట్విటర్ అనుసరించడం లేదని చెబుతూ అడ్వొకేట్ అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
అయితే, ఈ నిబంధనలను తాము అనుసరిస్తున్నామని, ఇప్పటికే ''రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్''ను కూడా నియమించామని కోర్టుకు ట్విటర్ తెలిపింది. అయితే, ట్విటర్ ఎలాంటి అధికారినీ ఏర్పాటు చేయలేదని కేంద్రం వివరించింది.
''కొన్ని ట్వీట్లపై ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినప్పుడు.. వారు కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయడం లేదని తెలిసింది''అని అమిత్ ఆచార్య తెలిపారు.
''ఫిబ్రవరి 25 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే, వీటిని అమలు చేసేందుకు మూడు నెలల గడువును అదనంగా కేంద్రం ఇచ్చింది. ఆ గడువు పూర్తయినా, ట్విటర్ ఈ నిబంధనలను అమలు చేయడం లేదు''.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 వ్యాక్సీన్: దేశ వ్యాప్తంగా వ్యాక్సీన్ల ధర ఒకేలా ఉండాలి - సుప్రీం కోర్టు
కోవిడ్-19 వ్యాక్సీన్ల సమీకరణలో ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సీన్ల ధర ఒకేలా ఉండాలని సూచించింది.
ఈ అంశంపై జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ సభ్యులుగాగల త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
''భారీగా కొనుగోలు చేయడం వల్లే తమకు తక్కువ రేటుకు వ్యాక్సీన్లు వస్తున్నాయని కేంద్రం అంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ కొనడంతో ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. దేశం మొత్తంగా వ్యాక్సీన్ల ధర ఒకేలా ఉండాలి''.
''45ఏళ్లు పైబడిన వారి కోసం మాత్రమే కేంద్రం వ్యాక్సీన్లు పంపిణీ చేస్తోంది. 45ఏళ్లలోపు వారి విషయంలో రవాణా ఖర్చులతో సహా ఇతర ఖర్చులను రాష్ట్రాలనే భరించాలని చెబుతోంది. ఇలా చేయడం న్యాయమేనా? బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి''అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
వ్యాక్సీన్ కోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్ని నిబంధన విషయంలోనూ సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది.

ఫొటో సోర్స్, kakani govardhanareddy
ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి
కరోనాను తగ్గించేందుకు అంటూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
అయితే, ఆయన ఇస్తున్న మందులలో కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి నిరాకరించింది. మిగతా రకాలు పంపిణీ చేసుకునేందుకు అనుమతులిచ్చింది.
అయితే, ఆనందయ్య మందు వల్ల ఎలాంటి హాని లేకపోయినప్పటికీ అవి వాడితే కోవిడ్ తగ్గుతుందనడానికి నిర్ధరణ లేదని నివేదికలు తేల్చాయి.
ఆనందయ్య పి, ఎల్, ఎఫ్, కే అనే నాలుగు రకాల మందులను కరోనా మందులంటూ పంపిణీ చేసేవారు. వాటిలో కే అనే మందును అధికారులకు చూపించలేదు. దాంతో ఆ మందుకూ అనుమతి ఇవ్వలేదు.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కంట్లో వేసు మందుపై ఇంకా నివేదికలు రాకపోవడంతో దానికి అనుమతులు ఇవ్వలేదని, ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చడంతో అనుమతించామని అధికారులు చెబుతున్నారు.
అయితే, ఆనందయ్య మందు వల్ల ఎలాంటి హాని లేకపోయినప్పటికీ అవి వాడితే కోవిడ్ తగ్గుతుందనడానికి నిర్ధరణ లేదని నివేదికలు తేల్చాయి.

ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగించింది. తొలుత విధించిన కర్ఫ్యూ ఈ రోజు(మే 31)తో ముగియనుండడంతో తాజా మరో 10 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఉన్నట్లుగానే మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వేళలు అమలవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీకై ఉండొచ్చన్న బ్రిటన్ నిఘా ఏజెన్సీ
కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీకైన తర్వాతే ప్రపంచమంతా వ్యాపించి ఉండవచ్చని అమెరికా ఇప్పటికే ఆరోపించింది. తాజాగా బ్రిటన్ నిఘా ఏజెన్సీ కూడా ఇదే భావన కనబర్చింది.
వివిధ వర్గాలను ఉటంకిస్తూ బ్రిటన్ పత్రిక సండే టైమ్స్ ఈ వార్త ప్రచురించిన తర్వాత, కరోనా వైరస్ మూలాలను బయటపెట్టడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్ర దర్యాప్తు జరిపించాలని బ్రిటన్ మంత్రి నదీమ్ జహావీ కోరారు.
"డబ్ల్యూహెచ్ఓను తమ దర్యాప్తు పూర్తి చేయనివ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే కరోనా వైరస్ మూలాలు తెలుస్తాయి. మనం ఇందులో ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు" అన్నారు.
ఈ రిపోర్ట్ రాగానే కన్జర్వేటివ్ ఎంపీ టామ్ టుగెంఢట్ కూడా వెంటనే స్పందించారు.
"వుహాన్ మౌనం కలవర పెడుతోంది. భవిష్యత్తులో మనల్ని మనం కాపాడుకోవాలంటే, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, దాని గుట్టు తెలుసుకోవడం అవసరం" అన్నారు.

ఫొటో సోర్స్, AFP
నైజీరియా: ఇస్లామిక్ స్కూల్లోని విద్యార్థులను అపహరించిన సాయుధులు
నైజీరియాలోని నీజర్ రాష్ట్రంలో ఒక ఇస్లామిక్ పాఠశాలలోని విద్యార్థులను సాయుధులు అపహరించారని ఆ దేశ అధికారులు తెలిపారు.
ఇటీవల నైజీరియాల్లోని పాఠశాలలపై వరుస దాడులు జరుగుతున్నాయి.
తాజా దాడిలో టెజీనా నగరంలోని ఒక పాఠశాల నుంచి చాలామంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు.
అయితే, ఎంతమంది విద్యార్థులను అపహరించారు అనేది స్పష్టంగా తెలీలేదని నీజర్ రాష్ట్ర అధికారులు తెలిపారు.
తమ స్కూల్లోని 150 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారని ఒక టీచర్ బీబీసీకి తెలిపారు.
మిగతా రిపోర్టుల్లో 200 మంది విద్యార్థులను అపహరించినట్లు వార్తలు వస్తున్నాయి.
నైజీరియా ఉత్తర రాష్ట్రాల్లో డబ్బు కోసం స్కూలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్న కేసులు ఇటీవల పెరుగుతున్నాయి.
ఫిబ్రవరిలో జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఒక బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలికలను సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు. తర్వాత వారిలో చాలామందిని విడిచిపెట్టారు.
తాజా దాడిలో, తుపాకులతో బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు నగరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు దిస్ డే న్యూస్ వెబ్సైట్ తెలిపింది.
కాల్పులకు భయపడి చుట్టుపక్కల జనం పారిపోవడంతో, వాళ్లు ఇస్లామిక్ పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను ఎత్తుకుపోయారు.
ఈ పాఠశాలకు 6-18 ఏళ్ల బాలబాలికలు హాజరవుతారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారని, ఒకరు చనిపోయారని అధికారులు తెలిపారు.

ఒక కారులో ప్రయాణిస్తున్న కొందరిని కూడా దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
ఇటీవల డబ్బు కోసం కిడ్నాప్‌లు చేయడం నైజీరియాలో సర్వ సాధారణం అయ్యిందని బీబీసీ నైజీరియా కరస్పాండెంట్ మాయెనీ జోన్స్ తెలిపారు.
ఇంతకు ముందు పొరుగు రాష్ట్రం కడునాలోని ఒక యూనివర్సిటీకి చెందిన 14 మంది విద్యార్థులు అపహరణకు గురయ్యారు. వారిని విడిచిపెట్టిన మరుసటి రోజే టెజీనాలోని ఇస్లామిక్ పాఠశాలపై తాజా దాడి జరిగింది.
ఫిబ్రవరిలో కగారా నగరానికి చెందిన 27 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు.
గత డిసెంబర్ నుంచి నైజీరియాలో కనీసం ఆరుసార్లు ఇలాంటి కిడ్నాప్‌లు జరిగాయని 800 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది అపహరణకు గురయ్యారని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
ఇటీవల జరుగుతున్న కిడ్నాప్‌ల వెనుక నేరగాళ్ల ముఠాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








