జనరల్ హ్లయింగ్: సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు

జనరల్ హ్లయింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మియన్మార్‌లో సైనిక పాలనకు కారణమైన జనరల్ హ్లయింగ్

సైనిక తిరుగుబాటు తర్వాత ఆర్మీ జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్ మియన్మార్‌లో అత్యంత బలమైన వ్యక్తిగా మారారు.

64 ఏళ్ల హ్లయింగ్ ఇదే ఏడాది జులైలో రిటైర్ అయ్యేవారు. కానీ, అత్యవసర స్థితి ప్రకటనతో మియన్మార్‌లో హ్లయింగ్ పట్టు మరింత బలంగా మారింది.

కానీ, ఇక్కడివరకూ చేరుకోడానికి మిన్ ఆంగ్ హ్లయింగ్ సుదీర్ఘ ప్రయాణం చేశారు. సైన్యంలో చేరాలని ప్రయత్నించి రెండు సార్లు విఫలమైన హ్లయింగ్ మూడోసారి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం సంపాదించగలిగారు.

ఆయన ఆ తర్వాత మెల్లమెల్లగా మియన్మార్ బలమైన సైన్యం తత్మడా జనరల్ పదవి వరకూ చేరుకోగలిగారు.

తిరుగుబాటు కంటే ముందు...

మియన్మార్‌లో 2021 ఫిబ్రవరి 1న జరిగిన తిరుగుబాటుకు ముందు కూడా కమాండర్ ఇన్ చీఫ్‌గా జనరల్ హ్లయింగ్ రాజకీయపరంగా చాలా ప్రభావవంతంగా ఉండేవారు. హ్లయింగ్ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కూడా మియన్మార్ ఆర్మీ తత్మడా బలం తగ్గనీయలేదు. అలా చేసినందుకు, మైనారిటీలపై దాడులు జరిపినందుకు ఆయన అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు, ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కానీ, ఇప్పుడు తన నేతృత్వంలో మియన్మార్ సైనిక పాలనలోకి అడుగుపెడుతున్నప్పుడు జనరల్ హ్లయింగ్ తన బలాన్ని పెంచుకోడానికి, మియన్మార్ భవిష్యత్తు నిర్ణయించే దిశగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

యాంగూన్ యూనివర్సిటీలో న్యాయ విద్యార్థి అయిన హ్లయింగ్ మూడో ప్రయత్నంలో మియన్మార్ డిఫెన్స్ అకాడమీలో చోటు సంపాదించారు. తర్వాత ఆయన పదాతిదళంలో సైనికుడి నుంచి జనరల్ స్థాయి వరకూ ఎదిగారు. ఆ ప్రయాణంలో ఆయనకు వరుస పదోన్నతులు లభించాయి. 2009లో ఆయన బ్యూరో ఆఫ్ స్పెషల్ ఆపరేషన్-2 కమాండర్ అయ్యారు.

ఆ పదవిలో కొనసాగుతూ హ్లయింగ్ ఈశాన్య మియన్మార్‌లో సైనిక ఆపరేషన్లు నిర్వహించారు. ఈ దాడులతో మైనారిటీ శరణార్థులు చైనా సరిహద్దుల్లోని తూర్పు షాన్, కొకాంగ్ ప్రాంతాలు వదిలి పారిపోవాల్సివచ్చింది.

హ్లయింగ్ సైనిక దళాలు హత్యలు, అత్యాచారం, అరాచకానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదుగుతూ వెళ్లారు. 2010 ఆగస్టులో హ్లయింగ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకే 2011 మార్చిలో ఎంతోమంది సీనియర్ సైనికాధికారులను అధిగమించి, సుదీర్ఘ కాలంపాటు మియన్మార్ ఆర్మీకి నాయకత్వం వహించిన జనరల్ థాన్ ష్వే స్థానం పొందగలిగారు.

హ్లయింగ్‌తో తనకు చిన్నతనం నుంచీ పరిచయం ఉందని రాసిన బ్లాగర్, రచయిత హ్లావూ ఆయన బర్మా చేసిన బీకర యుద్ధాల్లో పోరాడారని చెప్పారు. కానీ, హ్లయింగ్‌ను ఆయన ఒక స్కాలర్‌గా, జెంటిల్‌మెన్‌గా వర్ణించారు.

మియన్మార్ సైన్యం

ఫొటో సోర్స్, Reuters

రాజకీయ ఆధిపత్యం, మారణ హోమం

మియన్మార్‌లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన సైనిక పాలన అంతమై, ప్రజాస్వామ్యం వచ్చాక హ్లయింగ్ ఆర్మీ చీఫ్‌ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా తత్మడా బలాన్ని చూపించడానికి సిద్ధంగా ఉండేవారు. ఆర్మీ మద్దతున్న యూనియన్ సాలిడేటరీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ అధికారంలోకి రావడంతో హ్లయింగ్ రాజకీయ ఆధిపత్యం, సోషల్ మీడియాలో ఆయన ఉనికి గణనీయంగా పెరిగింది.

కానీ, 2016లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో, మార్పును స్వీకరించిన ఆయన బహిరంగ కార్యక్రమాల్లో ఆంగ్ సాన్ సూచీతోపాటూ కనిపించడం ప్రారంభించారు.

ఎన్ఎల్‌డీ పార్టీ ద్వారా రాజ్యాంగాన్ని మార్చడానికి, సైన్యం అధికారాలను పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

కానీ, ఆ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టిన హ్లయింగ్ పార్లమెంటులో సైన్యానికి 25 శాతం సీట్లు ఉండేలా, భద్రతకు సంబంధించిన ముఖ్యమైన పదవులన్నీ సైన్యం దగ్గరే ఉండేలా చూసుకున్నారు.

రఖైన్
ఫొటో క్యాప్షన్, రఖైన్‌లో తగలబడుతున్న గ్రామం

2016-17లో ఆర్మీ ఉత్తర రఖైన్ స్టేట్‌లో మైనారిటీలయిన రోహింజ్యాలపై దాడులకు దిగడంతో వారంతా మియన్మార్ వదిలి పారిపోవాల్సి వచ్చింది.

తర్వాత ఊచకోత ఆరోపణలతో హ్లయింగ్ అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

రఖైన్ ప్రాంతంలో జరిగిన ఊచకోత, రఖైన్, కచిత్,షాన్ ప్రాంతంలో మానవహక్కుల ఉల్లంఘన, యుద్ధ నేరాల ఆరోపణల్లో మియన్మార్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ హ్లయింగ్ సహా మిగతా టాప్ జనరళ్ల పాత్రపై దర్యాప్తు జరపాలని, శిక్ష విధించాలని 2018 ఆగస్టులో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ చెప్పింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ప్రకటన తర్వాత ఫేస్‌బుక్‌ హ్లయింగ్ అకౌంట్ డిలీట్ చేసింది. ఆ తర్వాత మియన్మార్‌లో తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన, అందులో పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ఫేస్‌బుక్ అకౌంట్లు కూడా డిలీట్ చేశారు.

జాతి ప్రక్షాళన, మానవహక్కుల ఉల్లంఘనలో పాత్ర ఉన్నందుకు అమెరికా 2019లో రెండు సార్లు హ్లయింగ్‌పై ఆంక్షలు విధించింది. 2020 జులైలో బ్రిటన్ కూడా అతడిపై ఆంక్షలు విధించింది.

సూచీతో హ్లయింగ్

ఫొటో సోర్స్, Reuters

అధికారం హస్తగతం

2020 నవంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ ఏకపక్ష విజయం సాధించింది.

కానీ, తర్వాత తత్మడా, సైన్యం మద్దతుదారుల పార్టీ యూఎస్‌డీపీ పదే పదే ఎన్నికల ఫలితాలను వివాదాస్పదం చేశాయి. ఎన్నికల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆ పార్టీ చెప్పింది. కానీ, ఎన్నికల కమిషన్ ఆ ఆరోపణలను ఖండించింది.

ఫిబ్రవరి 1న కొత్త ప్రభుత్వాన్ని అధికారికంగా అంగీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య వివాదాలు కొనసాగుతుండంతో సైనిక తిరుగుబాటు కూడా జరగవచ్చని ఊహిస్తూ వచ్చారు.

1962, 1988లో జరిగిన తిరుగుబాటును ఉదాహరణగా చెప్పిన హ్లయింగ్ "రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, దానిని అంతం చేయాల్సిందే" అని జనవరి 27న హెచ్చరించారు.

అయితే, జనవరి 30 నాటికి హ్లయింగ్ కార్యాలయం ఆయన ప్రకటనపై వెనక్కితగ్గింది. సైనికాధికారుల ప్రకటనను మీడియా వక్రీకరించిందని ఆరోపించింది.

అయితే, ఫిబ్రవరి 1న ఉదయం తత్మడా స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూచీ, అధ్యక్షుడు విన్ మ్యింట్ సహా చాలామంది నేతలను అదుపులోకి తీసుకుంది. ఏడాది పాటు అత్యవసర స్థితిని ప్రకటించింది.

తర్వాత మియన్మార్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న హ్లయింగ్, ఎన్నికల్లో కుంభకోణం జరిగిందనే ఆరోపణలకు ప్రాధాన్యం ఇచ్చారు.

హ్లయింగ్ నాయకత్వంలో జరిగిన నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కుంభకోణంలో ఆరోపణలపై కౌన్సిల్ దర్యాప్తు చేస్తుందని, కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు.

మిన్ ఆంగ్ హ్లయింగ్ ఈ ఏడాది జులైలో కమాండర్ ఇన్ చీఫ్ పదవి నుంచి రిటైర్ కాబోతున్నారు. అప్పటికి ఆయన వయసు 65 ఏళ్లు దాటుతుంది. కానీ, ఆయన ఇప్పుడు తన పదవిని స్వయంగా మరో ఏడాది పొడిగించుకున్నారు. మియన్మార్‌లో మళ్లీ సైనిక పాలన మొదలవడంతో హ్లయింగ్ సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)