మియన్మార్: ‘రాత్రికి రాత్రే మా ప్రపంచం తలకిందులైంది’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అలైస్ కడీ
- హోదా, బీబీసీ న్యూస్
దేశంలో అధికారాన్ని సైన్యం హస్తగతం చేసుకుంటోందనే వార్తలతో మియన్మార్ సోమవారం ఉదయం మేల్కొంది.
‘‘ఇప్పుడు సైనిక కుట్ర వార్తలను లైవ్ ట్వీట్ చేస్తుంటానని నేను అనుకుంటున్నా’’ అని రాయిటర్స్ మాజీ జర్నలిస్ట్ ఏ మిన్ థాంట్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు ట్వీట్ చేశారు.
‘‘జనం మేల్కొని, భయంభయంగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు ఇప్పుడు నిశబ్దంగానే ఉన్నాయి. ఉదయం ఆరు గంటల నుంచీ స్నేహితులు, బంధువుల ఫోన్లు వెల్లువలా వస్తున్నాయి. ఇంటర్నెట్ వస్తూ పోతూ ఉంది. నా సిమ్ కార్డు పని చేయటం లేదు’’ అని ఆయన తెలిపారు.
సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుందన్న విషయాన్ని సైన్యం యాజమాన్యంలోని ఒక టెలివిజన్ చానల్‌లో ప్రకటించారు.
అత్యున్నత సైనిక కమాండర్ ఇన్‌చార్జ్ బాధ్యతలు స్వీకరించారని.. దేశవ్యాప్తంగా ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని ఆ ప్రకటనలో తెలిపారు. దేశ ప్రజా ప్రతినిధి ఆంగ్ సాన్ సూచీతో పాటు, ఆమెకు చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ సభ్యులనూ నిర్బంధించారు.
నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూచీ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సైనిక కుట్ర చోటు చేసుకుంది. ఆ ఎన్నికల్లో మోసాలు జరిగాయని సైన్యం ఆరోపిస్తోంది. ‘‘కుట్రకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాల’’ని సూచీ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.
మియన్మార్‌ను 2011 వరకూ సైనిక బలగాలు పరిపాలించాయి. ఆ ఏడాది సూచీ సారథ్యంలో ప్రజాస్వామిక సంస్కరణలు సైనిక పాలనకు ముగింపు పలికాయి.
మియన్మార్ ప్రధాన నగరం యాంగాన్ నివాసి ఒకరు.. తాను ఉదయపు నడకకు వెళ్లటానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చిందని బీబీసీకి చెప్పారు. సూచీని నిర్బంధించారన్న విషయం ఆ మెసేజ్ ద్వారా తెలిసిందని తన పేరు వెల్లడించవద్దంటూ తెలిపారు. ఆ 25 ఏళ్ల మహిళ వెంటనే సోషల్ మీడియాలో లాగిన్ అయ్యారు.
‘‘రాత్రికి రాత్రి ప్రపంచం పూర్తిగా తల్లకిందులైందనే వార్తలతో నిద్ర లేవటం కొత్త అనుభవమేమీ కాదు. కానీ ఆ పరిస్థితుల నుంచి ముందుకు సాగిపోయామని నేను అనుకున్నాను. మళ్లీ ఇటువంటి అనుభవం ఎదురుకాబోదని భావించాను’’ అని ఆమె తన చిన్నప్పడు సైనిక పాలన గురించి గుర్తుచేసుకున్నారు.
‘‘మా ప్రాంతీయ మంత్రులందరినీ నిర్బంధించటం నన్ను బాగా కలచివేసింది. అంటే కేవలం సూచీని మాత్రమే కాదు ప్రతి ఒక్కరినీ వారు బంధించారు’’ అని చెప్పారు.
ప్రాంతీయ ప్రజాప్రతినిధి పాపా హాన్‌ను అరెస్ట్ చేస్తున్న దృశ్యాన్ని ఆమె భర్త ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేశారు.
సినీదర్శకుడు మిన్ టిన్ కో కో గ్యీ సహా రాజకీయ కార్యకార్తలను కూడా అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
కనీసం 42 మంది ప్రజాప్రతినిధులు, 16 మంది పౌర సమాజ ఉద్యమకారుల అరెస్టులను తాము నమోదుచేసినట్లు మియన్మార్‌లోని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంస్థ బీబీసీకి తెలిపింది.
పేర్లను తనిఖీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది. నిర్బంధించిన వారిలో కొందరిని అదే రోజు విడుదల చేసినట్లు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘నగరంలో సైనిక వాహనాల సంచారం’
‘‘తెల్లవారుజామున సైనిక కుట్ర వార్తలతో మేం మేల్కొన్నాం. మా మిత్రుల్లో కొందరిని అరెస్ట్ చేశారు’’ అని స్థానిక కార్యకర్త ఒకరు బీబీసీ న్యూస్‌డే కార్యక్రమానికి చెప్పారు.
‘‘ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. బయటకు వెళ్లి నా ఫోన్ ఉపయోగించలేను. డాటా అనేదే లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఇదీ. నగరంలో సైనిక వాహనాలు తిరుగుతున్నాయి’’ అని ఆమె వివరించారు.
రాజధాని నగరం నేపీడాలో స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 11:15 గంటల వరకూ ఫోన్ సిగ్నల్ లేదని స్థానిక జర్నలిస్ట్ కేప్ డైమండ్ ట్వీట్ చేశారు. ‘‘నో కాల్, నో వైఫై’’ అని ట్విటర్‌లో రాశారు.
ప్రభుత్వ టీవీ చానల్ సహా దేశీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు ఏవీ పనిచేయలేదు.
యాంగాన్‌లో ఇళ్లు, కార్యాలయాల మీద ఎగురవేసిన ఎన్ఎల్‌డీ పార్టీ ఎర్ర జెండాలను తొలగించారు.
‘‘నా పొరుగింటివారు హింస జరుగుతుందన్న భయంతో ఎన్‌ఎల్‌డీ జెండాను తొలగించారు’’ అని జర్నలిస్టు, పరిశోధకురాలు అన్నీ జమాన్ ట్వీట్ చేశారు.
స్థానిక మార్కెట్ నుంచి ఒక జెండాను తొలగిస్తున్న వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
జనం నిత్యావసర వస్తువులను కొనితెచ్చి నిల్వచేసుకున్నారు. ఏటీఎంల ముందు క్యూకట్టారు. ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోవటంతో బ్యాంకులు కార్యకలాపాలను నిలిపివేశాయి. అయితే మంగళవారం కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని చెప్పాయి.
యాంగాన్‌లో ‘‘భయం, ఆగ్రహం, నిస్పృహ’’ నెలకొన్నాయని బీబీసీ బర్మీస్ సర్వీస్ జర్నలిస్ట్ న్యీన్ చాన్ యే చెప్పారు.
బియ్యం వంటి ఆహార సరఫరాలను హడావిడిగా కొనితెచ్చుకున్న జనం.. తర్వాత ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఇళ్లలోనే ఉండి వేచిచూస్తున్నారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
భయం భయంగా...
మియన్మార్‌లో చాలా మంది ప్రజలు ఆర్థికంగా కష్టకాలం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సైనిక కుట్ర జరగటంతో తమకు కనీస నిత్యావసరాలూ అందవని ఆందోళన చెందుతున్నారు.
‘‘సరకుల ధరలు పెరిగిపోతాయని నాకు ఆందోళనగా ఉంది. నా కూతురు స్కూలు చదువు ఇంకా ముగియలేదు. పైగా ఇది మహమ్మారి విస్తరిస్తున్న సమయం’’ అని మా నాన్ అనే యాంగాన్ వ్యాపారి బీబీసీతో చెప్పారు.
సరకుల ధరలు పెరిగిపోతాయని, ‘‘జనం తిరుగుబాటు చేస్తార’’ని యాంగాన్‌కు చెందిన ఒక గృహిణి థాన్ థాన్ న్యూంట్ కూడా భయపడుతున్నారు. ‘‘ఆంగ్ సాన్ సూచీ, ఆమె సహచరులను త్వరగా విడిచిపెడతారని నేను ఆశిస్తున్నా’’ అని చెప్పారామె.
ఈ సైనిక కుట్రతో దేశం మళ్లీ 1990లు, 2000ల సంవత్సరాల నాటి మిలటరీ పాలన కింద జీవితానికి తిరిగివస్తుందనే భయాలు వాస్తవమైనవి.
సైన్యం 1988లో రక్తసిక్త కుట్రను అమలుచేసింది. సోవియట్ తరహా ఏక పార్టీ పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల సారథ్యంలో జరిగిన తిరుగుబాటును అణచివేసే క్రమంలో వేలాది మంది చనిపోయారు.
1990 ఎన్నికల్లో సూచీ గెలుపును అంగీకరించటానికి సైన్యం తిరస్కరించటంతో ఆమె ప్రముఖ నాయకురాలిగా ఎదిగారు. సైనిక పాలనకు, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా రెండు దశాబ్దాల పాటు పోరాడారు.
అవినీతి, ధరల అస్థిరత, రోజు వారీ జీవితంలో అణచివేత, కొన్ని ప్రాంతాల్లో పోషకాహార లోపం, మరికొన్ని ప్రాంతాల్లో జాతుల మధ్య సంఘర్షణలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని చాలా మంది భయపడుతున్నారు.
‘‘ఈ పరిస్థితిల్లో జీవనం కొనసాగిస్తామని మాకు మేం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లోనూ మేం కొనసాగాం. కానీ అలా జరగకుండే ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మాకు మేం ధైర్యం చెప్పుకోవాల్సిన పరిస్థితులు లేకుండా ఉంటే బాగుండేదని నేను కోరుకుంటున్నా’’ అని యాంగాన్‌లో ఓ పాతికేళ్ల యువకుడు బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
‘వీధి మార్కెట్లు తెరిచే ఉన్నాయి’
అయితే.. సైనిక మద్దతుదారులు కొందరు ఈ కుట్ర పరిణామంతో సంబరాలు చేసుకున్నారు. దేశభక్తి సంగీతం మోగిస్తూ నగర వీధుల్లో పరేడ్లు నిర్వహించారు.
‘‘సైన్యం మద్దతుదారులైన కొంతమంది పౌరులు పెద్ద సంగీతం వినిపిస్తూ సంబరాలు చేసుకుంటుంటే.. ఎన్ఎల్‌డీ మద్దతుదారుల్లో స్పష్టంగా ఆగ్రహం కనిపిస్తోంది’’ అని మియన్మార్‌లో దాదాపు ఆరేళ్ల పాటు నివసించిన అమెరికా ప్రవాసి గ్రిఫిన్ హాచ్‌కిస్ బీబీసీకి వివరించారు.
అయితే.. పరిస్థితులు మరింత తీవ్రంగా లేకపోవటం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
‘‘సిటీ హాల్ కాంపౌండ్‌లో కొన్ని సైనిక వాహనాలు మినహా ఇంకేదీ అసాధారణంగా కనిపించలేదు’’ అని యాంగాన్‌లో పర్యటించిన గ్రిఫిన్ తెలిపారు.
నగరంలో జనం చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. చాలా దుకాణాలు తెరిచివుండటం, వ్యాపారం చేస్తుండటం కనిపించిందని ఆయన చెప్పారు.
‘‘సైనిక కుట్రను నిరసిస్తూ జనం వీధుల్లో ప్రదర్శన చేపడతారని భావించా. నగరం చుట్టూ సైనిక వాహనాలు మోహరిస్తారని అనుకున్నా. కానీ అలాంటివేమీ జరగలేదు’’ అని యాంగాన్‌లో తన బర్మీస్ భార్యతో కలిసి నివసిస్తున్న మైఖేల్ ఘిలిజాన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- బడ్జెట్ 2021: కరోనా మహమ్మారితో భారత ఆర్థికవ్యవస్థకు ఎంత నష్టం... ఏంటి పరిష్కారం?
- దక్షిణ కోస్తా రైల్వే జోన్: ప్రకటించి రెండేళ్లు అవుతున్నా పనులు ఎందుకు మొదలు కాలేదు... అడ్డం పడుతున్నదేంటి ?
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








