ఇరాన్: కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా

ఇరాక్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, మిడిల్ ఈస్ట్ ఎడిటర్, బాగ్దాద్

జనరల్ కాసిం సులేమానీని హతమార్చాలన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయంగా అనేక పరిణామాలకు దారితీసింది. అందులో ఒకటి జిహాదీలపై పోరాటం అసంపూర్తిగా మిగలడం.

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ప్రస్తుతం ఆత్మరక్షణ తమ తొలి ప్రాధాన్యమని అమెరికా, దాని మిత్రదేశ సైన్యాలు ప్రకటించాయి.

సైనిక కోణంలో చూస్తే వారికి వేరే మార్గం లేకపోయుండొచ్చు.

ఇరాన్, ఆ దేశం నుంచి సహాయం అందుకుంటున్న ఇరాక్‌లోని మిలీషియా దళాలు సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన పూనాయి.

దీంతో అమెరికా, దాని మిత్ర దేశాల బలగాలు నేరుగా తుపాకుల బోనులో ఉన్నట్లయింది.

ఈ పరిణామాలన్నీ ఐఎస్‌కు మేలు చేస్తున్నాయి. వరుస దెబ్బలతో పతనమైన ఐఎస్ కోలుకుంటూ, పుంజుకోవడానికి ఈ పరిస్థితులు దోహదపడతాయి.

తమ దేశం నుంచి తక్షణమే అమెరికా వైదొలగాలని కోరుతూ ఇరాక్ పార్లమెంటు తీర్మానించడం కూడా తీవ్రవాదులకు కలిసొచ్చేదే.

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు

ఫొటో సోర్స్, ANADOLU AGENCY

ఐఎస్ చాలాకాలంగా ఎదురుదెబ్బలు తింటూనే మళ్లీ పుంజుకుంటోంది. ఇరాక్‌లో నాశనమైన అల్ ఖైదా నుంచే ఐఎస్ ఉద్భవించింది.

ఇరాక్, సిరియాల్లో ఐఎస్‌ ఆధిపత్యానికి ముగింపు పలకడానికి 2016, 2017లో భారీ సైనిక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎంతోమంది జిహాదిస్టులు హతం కాగా మరికొందరిని జైళ్లలో పెట్టారు. అయినా, జిహాదిస్టుల అంతం ఐఎస్‌ను అంతం చేయలేకపోయింది.

ఐఎస్ ఇప్పటికీ తనకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో చురుగ్గానే ఉంది. మెరుపు దాడులు, బలవంతపు వసూళ్లు, హత్యలతో విరుచుకుపడుతోంది.

ఐఎస్ వ్యతిరేక పోరాటం కోసం చేరిన అమెరికా, ఐరోపా మిత్ర దేశాల సైనికుల నుంచి శిక్షణ పొందిన బలమైన సైన్యం, పోలీసు బలగం ఇరాక్‌కు ఉంది.

సులేమానీని హతమార్చిన తరువాత అమెరికాతో పాటు డెన్మార్మ్, జర్మనీలు కూడా ఇరాక్ సేనలకు శిక్షణ కార్యక్రమాలు, కార్యకలాపాలు నిలిపివేశాయి.

ప్రస్తుతం ఇరాక్‌లో ఉన్న తమ సైనిక శిక్షకులను జర్మనీ.. జోర్డాన్, కువైట్‌లకు రప్పిస్తోంది.

ఐఎస్ వ్యతిరేక పోరాటంలో ఇరాకీ సేనలే యుద్ధ క్షేత్రంలో ఎక్కువ రిస్క్ తీసుకున్నాయి. శిక్షణతో పాటు ఇరాకీ సేనలు అమెరికా బలగాల నుంచి లాజిస్టిక్స్ విషయంలోనూ సహాయం పొందారు. అయితే, ఇప్పుడు అమెరికా బలగాలు తమ స్థావరాలకు పరిమితమయ్యాయి.

ఐఎస్

ఫొటో సోర్స్, iS propaganda

ఐఎస్ తీవ్రవాదులు సంబరాలు జరుపుకోవడానికి మరో కారణమూ ఉంది. సులేమానీని చంపాలని ట్రంప్ నిర్ణయించిన తరువాత తమ శత్రువుల్లోనే ఒకరిని మరొకరు చంపుకోవడమనే బహుమతి వారికి దొరికింది.

జిహాదీలు 2014లో ఇరాక్‌లోని రెండో ప్రధాన నగరం మోసుల్‌ సహా అక్కడి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరాక్‌లోని షియా మతాధికారి గ్రాండ్ ఆయతుల్లా అలీ అల్ సిస్తానీ సున్నీ తీవ్రవాదులతో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.

దీంతో షియా యువత వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారంతా సాయుధ బలగాలుగా పరిణామం చెందడంలో సులేమానీ, ఆయన కడ్స్ బలగాలు కీలక పాత్ర పోషించాయి.

ఈ మిలీషియాలు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేనివారు.. ఐఎస్‌కు అత్యంత క్రూరమైన శత్రువులు వీరు.

పాపులర్ మొబిలైజేషన్ అనే సంస్థ నీడలో ఈ ఇరాన్ మద్దతుగల దళాలన్నీ ఇరాక్ మిలటరీగా మారాయి. శక్తిమంతమైన మిలీషియా నేతలంతా బలమైన రాజకీయ నేతలుగా మారారు.

2014 తరువాత ఇరాక్, ఈ మిలీషియాలు ఒకే శత్రువుతో పోరాడాయి.

షియా మిలీషియా

ఫొటో సోర్స్, AFP

2003 తరువాత అమెరికా దురాక్రమణలకు వ్యతిరేకంగా పోరాడిన షియా మిలీషియాలు ఇప్పుడు మళ్లీ అదే దారిలోకి రావడం ఖాయం.

సులేమానీ సరఫరా చేసిన అధునాతన ఆయుధాలు, అందించిన శిక్షణతో వారు చాలామంది అమెరికన్ సైనికులను హతమార్చగలిగారు.

గతవారం సులేమానీ హత్యకు అమెరికా అధ్యక్షుడు ఆదేశాలివ్వడానికి అదీ ఒక కారణమే.

సులేమానీ హత్యకు ముందే షియా మిలీషియాలు అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్నాయి.

అమెరికా ఎంబసీపై నిరసనకారుల దాడి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమెరికా ఎంబసీపై నిరసనకారుల దాడి

ఉత్తర ఇరాక్‌లోని ఓ స్థావరంపై డిసెంబర్ చివరలో అమెరికా కాంట్రాక్టరును చంపడానికి ప్రతిగా జరిపిన వైమానిక దాడిలో కతైబ్ హిజ్బుల్లా గ్రూప్‌కి చెందిన 25 మంది సాయుధులు మరణించారు.

వారి నేత అబూ మహ్దీ అల్ ముహందిస్ బాగ్దాద్ విమానాశ్రయంలో సులేమానీని కలుసుకున్నారు. అనంతరం సులేమానీతో పాటు కారులో ప్రయాణించి ఆయనతో పాటు మరణించారు.

తమ శత్రువుల మధ్య వైరం సాగుతున్నప్పుడు, శత్రువు బలహీనపడినప్పుడు, అస్థిర, గందరగోళ పరిస్థితులు ఉండడాన్ని అవకాశంగా మలచుకుని జిహాదిస్టులు విజృంభిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.

గతంలోనూ ఇది జరిగింది... ఇప్పుడూ అలాగే జరగడానికి అవకాశాలున్నాయి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)