ఇరాన్ క్షిపణి దాడి వల్లే ఉక్రెయిన్ విమానం కూలిపోయిందా?

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా

ఫొటో సోర్స్, GEOFF ROBINS / GETTY IMAGES

ఉక్రెయిన్ ప్రయాణికుల విమానాన్ని ఇరాన్ క్షిపణితో కూల్చారని ఆధారాలు చెబుతున్నాయని, అది పొరపాటున జరిగి ఉండవచ్చని పశ్చిమదేశాల నేతలు చెబుతున్నారు.

ఈ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కెనడా, బ్రిటన్ నేతలు కోరారు. ఉక్రెయిన్ విమానం ఇరాన్‌లో కుప్పకూలడంతో అందులోని 176 మంది మృతిచెందారు.

విమానంపై తాము క్షిపణి దాడి చేశామని వస్తున్న ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది.

ఇరాక్‌లోని రెండు అమెరికా వైమానిక దళ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ విమానం కూలిపోయింది.

ఆ విమానం కూలిన సమయాన్ని బట్టి ఇరాన్ దానిని అమెరికా ప్రతిదాడిగా, ఆ దేశ యుద్ధ విమానంగా అనుకుని ఉంటుందని అమెరికా మీడియా చెబుతోంది.

"రెండు క్షిపణి దాడులు జరిగినట్లు ఇన్‌ప్రారెడ్ 'బ్లిప్స్‌'ను ఒక శాటిలైట్ గుర్తించింది. వాటి తర్వాత మరో పేలుడు 'బ్లిప్' కనిపించింది" అని అమెరికా నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు సీబీఎస్ న్యూస్ చెప్పింది.

ఇరాన్ రష్యా మిసైల్ సిస్టమ్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇరాన్ సైన్యంలోని రష్యా క్షిపణి వ్యవస్థ

పెంటగాన్‌లోని సీనియర్ నిఘా వర్గాల అధికారులు, ఇరాకీ నిఘా అధికారులు మాత్రం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం PS752ను రష్యా తయారీ టార్ క్షిపణితో కూల్చారని చెబుతున్నారు.

విమాన ప్రమాదం 'సందేహాలకు తావిస్తోంది' అని గురువారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ఇరాన్ టాప్ జనరల్ కాసిం సులేమానీని అమెరికా జనవరి 3న డ్రోన్ దాడులతో చంపిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా
ఫొటో క్యాప్షన్, కూలిపోయే ముందు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన విమానం దృశ్యం

ఉక్రెయిన్ విమానం 'బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డింగ్స్‌'ను దాని తయారీదారులైన బోయింగ్ లేదా అమెరికాకు అప్పగించడం కుదరదని ఇరాన్ చెప్పింది.

అయితే, ఇరాన్ విదేశాంగ శాఖ ఈ విమాన ప్రమాదంపై జరిగే అధికారిక దర్యాప్తులో భాగమయ్యేందుకు బోయింగ్‌ను ఆహ్వానించింది..

అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదంపై దర్యాప్తు చేసే హక్కు ఇరాన్‌కు ఉంది. కానీ, సాధారణంగా ఇందులో తయారీదారులు కూడా పాల్గొంటారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఇరాన్ టీవీలో చూపించిన దృశ్యాల్లో కూలిన ప్రాంతాన్ని చదును చేసి ఉండడం కూడా కనిపించింది.

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా
ఫొటో క్యాప్షన్, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రుడో

క్షిపణి దాడి గురించి ఏం చెప్పారు

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో "రకరకాల నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఉక్రెయిన్ విమానాన్ని ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో ఇరాన్ కూల్చివేసినట్లు తెలుస్తోంది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాకపోవచ్చు" అన్నారు.

"దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని ఇది చెబుతోంది. కెనడా ప్రజలకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు కావాలి. కానీ అప్పుడే ఆరోపణలు చేయడం, ఏదైనా ఒక నిర్ణయానికి సరికాదు" అని ట్రుడో అన్నారు. తనకు అందిన ఆధారాల గురించి వివరంగా చెప్పడానికి ఆయన నిరాకరించారు.

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా

ఫొటో సోర్స్, AFP

ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్ విమానంలో కీవ్ నుంచి టొరంటో వెళ్లాల్సిన 63 మంది కెనడా ప్రయాణికులు కూడా ఉన్నారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ట్రుడోలాగే బావిస్తున్నారు. "ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిన కెనడా, మిగతా అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి మేం దీనిని పరిశీలిస్తున్నాం" అన్నారు.

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా

అమెరికా, ఇరాక్ అధికారులు మాత్రం ఆ విమానాన్ని రష్యా తయారీ 'టార్ ఎం-1' ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థతో కూల్చారని, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని ఇద్దరు పెంటగాన్‌ అధికారులు చెప్పినట్లు న్యూస్ వీక్ తెలిపింది.

అమెరికా వైమానిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ విమాన విధ్వంసక వ్యవస్థ బహుశా అప్రమత్తం అయ్యుంటుందని తమకు కొన్ని వర్గాల నుంచి సమాచారం అందినట్లు అది చెప్పింది.

పెంటగాన్ ఈ అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి బహిరంగ వ్యాఖ్య చేయలేదు.

విమానానికి ఏం జరిగుంటుందని భావిస్తున్నారని అడిగినపుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ "నా సందేహాలు నాకున్నాయి. ఆ ప్రమాదం చాలా విషాదకరం, కానీ అవతలివైపు ఎవరో పొరపాటు చేసుండాలి" అన్నారు.

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా

ఫొటో సోర్స్, AFP

గురువారం దీనిపై మాట్లాడిన ఉక్రెయిన్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రెటరీ ఓలీక్సీ డాన్యలోవ్ తన ఫేస్‌బుక్ పోస్టులో విమానం కూలిపోవడానికి మరో మూడు కారణాలు ఉండచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.

  • ఆకాశంలో డ్రోన్, లేదా ఎగురుతున్న దేన్నైనా విమానం ఢీకొని ఉండడం
  • సాంకేతిక కారణాలతో విమానం ఇంజన్ పాడవడం/పేలిపోవడం
  • తీవ్రవాదుల దాడి వల్ల విమానం లోపల పేలుడు

"ఉక్రెయిన్ దర్యాప్తు అధికారులు ఇప్పటికే ఇరాన్‌లో ఉన్నారు, ఘటనాస్థలంలోని శిథిలాల్లో క్షిపణికి సంబంధించినవి ఏవైనా ఉన్నాయేమో చూస్తున్నారు" అని డాన్యలోవ్ చెప్పారు.

ఇరాన్‌ రష్యా క్షిపణి రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తోంది.

ఉక్రెయిన్ విమాన ప్రమాదం దర్యాప్తులో తూర్పు ఉక్రెయిన్‌లో కూలిన 2014 మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17 ప్రమాదంపై దర్యాప్తు చేసిన నిపుణులు కూడా ఉన్నారని డాన్యలోవ్ చెప్పారు.

క్షిపణితో విమానం కూల్చారని భావిస్తున్న కెనడా

ఇరాన్ ఏం చెబుతోంది

"విమానాశ్రయం పరిసరాల నుంచి మొదట పశ్చిమం వైపు వెళ్లిన విమానం, ఏదో సమస్యతో కుడివైపు తిరిగింది. మళ్లీ విమానాశ్రయం వైపు వస్తున్న సమయంలో అది కూలిపోయింది" అని ఇరాన్ పౌర విమానయాన సంస్థ(సీఏఓ) చీఫ్ అలీ అబెద్జదేహ్ చెప్పారు.

"కూలిపోయే ముందు విమానం మంటల్లో ఉండడాన్ని ప్రత్యక్షసాక్షులు చూశారు. ఇమామ్ ఖొమైనీ విమానాశ్రయానికి తిరిగివచ్చే ముందు తమకు సమస్య ఉన్నట్లు పైలెట్లు ఎలాంటి కాల్ చేయలేదు.

"సైంటిఫిక్‌గా, ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణితో పేల్చడం అసాధ్యం. అలాంటి వదంతుల్లో లాజిక్ లేదు" అని ఆయన చెప్పారు.

ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి అలీ రబేయ్ ఈ వార్తలను 'మానసిక యుద్ధం'గా వర్ణించారు.

"విమానంలో ఏయే దేశాల పౌరులు ఉన్నారో, ఆ దేశాలన్నీ తమ ప్రతినిధులను పంపించవచ్చు. బ్లాక్‌బాక్స్ గురించి జరుగుతున్న దర్యాప్తులో పాల్గొనేందుకు ప్రతినిధులను పంపాలని మేం బోయింగ్‌ను కోరుతున్నాం" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)