సూర్య గ్రహణం: ఇంత స్పష్టమైన గ్రహణాన్ని ఇప్పుడు చూడకుంటే 2031 వరకూ చూడలేరు

- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
2019 డిసెంబర్ 26న.. అంటే గురువారం ఉదయం ఏర్పడుతున్న సూర్య గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. రాబోయే పది సంవత్సరాల్లో ఏర్పడే 4, 5 సూర్య గ్రహణాలతో పోలిస్తే, భారత్ నుంచి చూడగలిగే వాటిల్లో అత్యధిక శాతం కనిపించే సూర్య గ్రహణం ఇదేనని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ చెప్పారు.
మళ్లీ ఈ స్థాయిలో సూర్యగ్రహణం కనిపించాలంటే 2031 వరకూ ఆగాల్సిందేనని ఆయన అంటున్నారు.
ఈ గ్రహణం ఏర్పడేది ఇలా..
"డిసెంబర్ 26 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ గ్రహణాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి చూడవచ్చు. ఉదయం 9.30 గంటల సమయానికి 75 శాతం సూర్యుడిని చంద్రుడు కప్పేస్తాడు. అది ఉదయమే అయినా.. మనకు సాయంత్రం అయినట్లుగా భ్రాంతి కలుగుతుంది" అని రఘునందన్ వివరించారు.
"మనం ప్రతి నెలా చంద్రుడిని నెలవంకగా చూస్తాం. కానీ, ఈరోజు గ్రహణ సమయంలో కాసేపు సూర్యుడు నెలవంకలా కనిపిస్తాడు" అని ఆయన చెప్పారు.
సూర్య గ్రహణం అంటే?
సూర్యగ్రహణం అన్నది సర్వసాధారణంగా జరిగే ఖగోళ దృగ్విషయం. సౌరకుటుంబంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. గ్రహాల చుట్టూ ఉప గ్రహాలు పరిభ్రమిస్తుంటాయి.
సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించే క్రమంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు.. గ్రహణాలు ఏర్పడతాయి.
అమావాస్య నాడు సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు భూమ్మీద కొంత భాగంలో ఉన్న వారికి సూర్య బింబం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కనిపించకుండా పోతుంది.

ఫొటో సోర్స్, AFP
దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటలకు పాక్షిక గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట 36 నిమిషాలకు ముగుస్తుంది. వలయాకార గ్రహణం 9 గంటల 6 నిమిషాలకు మొదలై 12 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది.
దక్షిణాదిన చాలా ప్రాంతాల నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు అని రఘునందన్ చెప్పారు. కోయంబత్తూరు, కోజికోడ్, మధురై, మంగళూరు, తిరుచిరాపల్లి వంటి ప్రాంతాల నుంచి 93 శాతం వలయాకారంలో గ్రహణం కనిపిస్తుందని ఆయన వివరించారు.
తమిళనాడులోని ఊటీ నుంచి 3 నిమిషాల 18 సెకన్ల పాటు అత్యధిక నిడివితో గ్రహణాన్ని వీక్షించవచ్చని రఘునందన్ చెబుతున్నారు. ఊటీ నుంచి చూస్తే సూర్యుడిని 92.9 శాతం చంద్రుడు కప్పేసినట్లు గ్రహణం కనిపిస్తుందన్నారు.
"హైదరాబాద్‌లో సూర్యుడు ఒక నెల వంకలా కనిపించొచ్చు. అసోంలో అర్ధ చంద్రుడిలాగా సూర్యుడు కనిపిస్తాడు. కోయంబత్తూరు, ఊటీ, కోజికోడ్, మధురై, మంగళూరు తదితర ప్రాంతాల్లో సూర్యుడు వలయాకారంలో కనిపిస్తాడు" అని రఘునందన్ వివరించారు.

ఫొటో సోర్స్, NASA/SDO
రఘునందన్ చెప్పిన వివరాల ప్రకారం, ఉత్తర భారతదేశంలో చిట్టచివరన ఉన్న లేహ్ దగ్గర సూర్యగ్రహణం డిసెంబర్ 26 ఉదయం 8 గంటల 26 నిమిషాలకు ప్రారంభమై 10.52 గంటలకు పూర్తవుతుంది. ఆ సమయంలో అక్కడి ప్రజలకు 31.4 శాతం సూర్యుడు చంద్రుడి ఛాయలో కనిపిస్తాడు.
ఈశాన్య రాష్ట్రాల్లోని దక్షిణాదిన చిట్టచివరన ఉన్న దిబ్రూఘడ్‌లో ఆలస్యంగా ఉదయం 8.51 గంటలకు గ్రహణం ప్రారంభమై, 11.42 గంటలకు పూర్తవుతుంది.
మధ్య భారత్‌లో ఉన్న భోపాల్‌లో ఉదయం 8.11 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమై, 11 గంటల 2 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ ప్రాంతం నుంచి చూసే వారికి సూర్యుడు 59 శాతం చంద్రుడితో కప్పేసినట్లు కనిపిస్తాడు.
అయితే, భారత దేశంలో సూర్యగ్రహణం ముందుగా ప్రారంభమయ్యేది మాత్రం గుజరాత్‌లోని ద్వారక నుంచే. ఇక్కడ దేశంలో అన్ని ప్రాంతాల కన్నా ముందుగానే అంటే ఉదయం 8.03 గంటలకు గ్రహణం ప్రారంభమై 10.45 గంటలకు వరకూ కొనసాగుతుంది. ఆ సమయంలో ఈ ప్రాంతం నుంచి చూస్తే 74.6 శాతం సూర్యుడు చంద్రుడితో కప్పేసి కనిపిస్తాడు.

ఫొటో సోర్స్, EPA
భారత్‌తో పాటు.. చాలా దేశాల్లో గ్రహణం
భారత్‌తో పాటు.. చాలా దేశాల్లో సూర్యగ్రహణ ఛాయ ప్రయాణిస్తుంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం, డిసెంబర్ 26న 2.59 గంటల 53 సెకన్లకు గ్రహణం ప్రారంభమవుతుంది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7.59 గంటలకే గ్రహణం సౌదీ అరేబియాలో ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి సూర్యగ్రహణపు నీడ (అంబ్రా) అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి.. భారత్‌లోని కేరళ, కర్ణాటక, తమిళనాడుల మీదుగా ప్రయాణిస్తుంది. ఆపై శ్రీలంక, సింగపూర్, ఇండోనేషియాల మీదుగా ప్రయాణించి... భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 26 మధ్యాహ్నం 1.35 గంటలకు పసిఫిక్ సముద్ర ప్రాంతంలో ముగుస్తుంది.
భూమ్మీద ఈ గ్రహణాన్ని వీక్షించే చిట్ట చివరి ప్రదేశం పసిఫిక్ సముద్రంలో ఉన్న గువామ్ ద్వీపంలోని హగ్తానా.

సంపూర్ణ సూర్య గ్రహణం అంటే?
సూర్య గ్రహణంలో రెండు భాగాలుంటాయి. సూర్యుడిని పూర్తిగా చంద్రుడు కప్పేయడం వల్ల దాని నీడ భూమ్మీద పడుతుంది. ఈ నీడను అంబ్రా అంటారు.
అంబ్రా పడే ప్రాంతానికి రెండు వైపులా చాలా దూరం వరకూ ఆ నీడ కనిపిస్తుంది. దానిని పెనంబ్రా అంటారు. అంబ్రా పడిన ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. పెనంబ్రా ప్రయాణించే భాగంలో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రతి అమావాస్యకూ సూర్య గ్రహణం ఎందుకు రాదు?
భూమి చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వల్ల ప్రతి అమావాస్య నాడు భూమి నుంచి చూసే సరికి, చంద్రుడి కక్ష్య సూర్యుడికి కాస్తంత పైభాగంలో కానీ, కింది భాగంలో కానీ ఉంటుంది. దీని వల్ల ఈ మూడు ఒకే సరళ రేఖలోకి రాలేవు. అందువల్ల ప్రతి అమావాస్య నాడు గ్రహణం ఏర్పడదు. కానీ, అమావాస్య నాడు, చంద్రుడి కక్ష్య, భూకక్ష్య ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
యేటా ఐదు నుంచి ఏడు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు. ప్రతి పదేళ్లకు గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమం పునరావృతం అవుతుంది.
యేటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పతుంటాయి. కానీ, అవి కొన్ని ప్రాంతాలో ఉన్నవారికే కనిపిస్తుంటాయి.
2019 నుంచి 2029 మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. కానీ, వాటిలో 2019, 2020, 2022, 2027, 2028 లలో ఏర్పడే సూర్య గ్రహణాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి వీక్షించవచ్చు. 2019 డిసెంబర్ 26న ఏర్పడే గ్రహణం 74 శాతం వరకూ దర్శనమిస్తుంది.
గ్రహణాలను నేరుగా కంటితో కొద్దిసేపు కూడా చూడకూడదని, ప్రత్యేక కళ్ళద్దాలు, సోలార్ ఫిల్టర్లు, ఎక్స్‌రే ఫిల్మ్, వెల్డింగ్ గ్లాస్ లాంటి వాటితోనే చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు
- నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు నోబెల్
- సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు... అన్నీ ప్రయోగాలు, ప్రయత్నాలే
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









