మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు

ఫొటో సోర్స్, Esa/ucl
విశ్వంలో మన సౌర వ్యవస్థకు ఆవల సుదూరంగా ఉన్న ఓ నక్షత్ర కక్ష్యలోని గ్రహంపై నీటి జాడలున్నట్లు శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారు.
దీంతో నీటి జాడలున్నట్లుగా చెబుతున్న కే2-18బీ అనే ఆ గ్రహాన్ని ఇప్పుడు గ్రహాంతర జీవుల అన్వేషణకు పరిగణనలోకి తీసుకునే అవకాశమేర్పడింది.
మరో పదేళ్లలో అధునాతన అంతరిక్ష పరిశోధన టెలిస్కోపులు కే2-18బీ గ్రహ వాతావరణంలో ప్రాణులు విడుదల చేసే వాయువులున్నాయా లేదా అన్నది గుర్తించగలుగుతాయని ఆశిస్తున్నారు.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్ యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ జియోవనా తినెట్టి దీన్ని అద్భుతమైన ముందడుగుగా అభివర్ణించారు.
''సౌరవ్యవస్థ ఆవల వేరే నక్షత్ర కక్ష్యలోని జీవానుకూల మండలంలోని ఓ గ్రహంపై నీరుందని మేం కనుగొనడం ఇదే తొలిసారి' అన్నారు జియోవనా.
ఆ గ్రహంపై ఉష్ణోగ్రతలు ద్రవస్థితిలో నీరుండడానికి తగినట్లుగా ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ కే2-18బీ గ్రహం భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అక్కడికి భూమి నుంచి పరికరాలు పంపి పరిశోధనలు చేయడానికి అది చాలా దూరం.

ఫొటో సోర్స్, Getty Images
'తరువాత తరం టెలిస్కోప్‌లు 2020లో అందుబాటులోకి వచ్చేవరకు ఆగడం తప్ప మార్గం లేదు. అవి అందుబాటులోకి వచ్చాక ఆ గ్రహం ఉపరితలంపై జీవ ఉద్గారాలున్నాయో లేదో పరిశోధించాల్సి ఉంటుంద'ని లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన డాక్టర్ ఇంగో వాల్డ్‌మన్ చెప్పారు.
''ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? వేరే ఏ గ్రహం మీదా జీవరాశి లేదా అన్నది సైన్స్‌లో పెద్ద చిక్కుముడిగానే మిగిలిపోయింది'' అంటారు వాల్డ్‌మన్.
ఇలాంటి గ్రహాల్లో జీవరాశి మనుగడకు అనుకూలమైన రసాయనాలున్నాయా లేదా అన్నది రానున్న పదేళ్లలో తెలిసే అవకాశముందని చెప్పారు.
హబుల్ టెలిస్కోప్ సాయంతో 2016-17 మధ్య ఈ సౌర వ్యవస్థకు ఆవల కనుగొన్న గ్రహాలను పరిశీలిస్తున్న క్రమంలో కే2-18బీపై నీటి జాడలు కనుగొన్నారు.
ఇలా చేసిన పరిశోధనల్లో ఒక్క కే2-18బీపై మాత్రమే నీటి అణువుల ఆనవాళ్లు కనిపించాయి. కంప్యూటర్ ఆధారంగా చేసిన విశ్లేషణల ప్రకారం ఆ గ్రహంపై 50 శాతం ప్రాంతంలో నీరుండొచ్చని అంచనా.
ఈ కొత్త గ్రహం భూమికి రెండింతల పరిమాణంలో ఉంటుంది. దీనిపై ఉష్ణోగ్రతలు 0 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటాయి.
కే2-18బీపై నీటి జాడలు కనుగొనడమనేది జీవరాశి ఉన్నది ఒక్క భూమేనా అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో లభించనుందనడానికి సంకేతమని ఈ పరిశోధన బృందంలోని డాక్టర్ ఏంజిలస్ సియారస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ESA/STFC RAL SPACE/UCL/EUROPLANET-SCIENCE OFFICE
సుదూర లక్ష్యం
అయితే, ఏ వాయువుల ఆధారంగా జీవరాశి ఉనికిని నిర్ధరించగలమన్నది ఖగోళ శాస్త్రవేత్తల ప్రశ్న.
మన సౌర వ్యవస్థలో జీవరాశి ఉనికి ఉన్న భూమినే తీసుకుంటే ఆక్సిజన్, నీరు, ఓజోన్ ఉన్నాయిక్కడ. ఇవన్నీ ఇంకేదైనా గ్రహం గుర్తించినా అక్కడ జీవరాశి ఉందని చెప్పడానికి వీల్లేదని పరిశోధకల్లో ఒకరైన తినెట్టి అన్నారు.
ఈ కారణం వల్లే అన్ని గ్రహాలపై పరిశోధనలు చేయలేమని.. జీవానుకూల వాతావరణ పరిస్థితులున్న మండలంలోని గ్రహాలను మాత్రమే అధ్యయనం చేయాలని చెబుతున్నారు తినెట్టి.
గ్రహాంతర జీవంపై అన్వేషణల్లో పడుతున్న తాజా ముందడుగులపై ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్ట్రానమీ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ బెత్ బిల్లర్ మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు సుదూర గ్రహాలపై జీవం ఉనికి కనుగొనడం ఖాయమని 'బీబీసీ'తో అన్నారు.
మరోవైపు తాజా పరిశోధనలు చేసిన బృందం ఎదురుచూస్తున్న అధునాతన టెలిస్కోపులు 2021లో అందుబాటులోకి వచ్చే సూచనలున్నాయి. నాసా ఇప్పటికే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఆవిష్కరించి ఉండాల్సినప్పటికీ అది ఆలస్యమైంది. 2021లో దాన్ని అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు. మరో ఏడేళ్లలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియల్ మిషన్ కూడా ఇతర సౌర వ్యవస్థల్లో గుర్తించిన గ్రహాలపై పరిశోధనలకు వీలు కల్పిస్తుంది.
ఇంతకుముందు కూడా కొన్ని గ్రహాలపై నీరున్నట్లు గుర్తించినప్పటికీ వాటిపై ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో అక్కడ జీవ మనుగడ లేకపోవచ్చన్న అంచనాలున్నాయి.
కే2-18బీని 2015లో కనుగొన్నారు. దీనిపైనే ఇప్పుడు బ్రిటిష్ పరిశోధనా బృందం నీటి జాడలను కనుగొంది.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు ఇస్రోకు మళ్లీ సాధ్యమేనా
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- చంద్రయాన్-2: ‘ల్యాండర్ విక్రమ్ ఆచూకీ దొరికింది’ - ఇస్రో ఛైర్మన్ కె శివన్
- చంద్రయాన్-2: చందమామకు 2.1 కిలోమీటర్ల దూరంలో అసలేం జరిగింది
- సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు... అన్నీ ప్రయోగాలు, ప్రయత్నాలే
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








