చంద్రయాన్-2 సామాన్య ప్రజలకు కూడా ఎందుకంత కీలకమో తెలుసా

ఫొటో సోర్స్, isro.gov.in
- రచయిత, గౌహర్ రాజా
- హోదా, శాస్త్రవేత్త, ఉర్దూ కవి, బీబీసీ కోసం
ఒక సాధారణ పౌరుడు చంద్రయాన్-2 మిషన్ గురించి ఎందుకు ఆసక్తి చూపాలి? పేదరికపు సుడిగుండంలో చిక్కుకున్న సామాన్యుడు ఎప్పుడూ శాస్త్రాన్ని అధ్యయనం చేసుండడు.
రాకెట్, శాటిలైట్, ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ వంటి పదాలు వారికి పెద్దగా పరిచయం లేనివి. సామాన్యుడి జీవితానికి దూరంగా ఉన్నాయి.
అయితే, ఇస్రో చేపట్టిన ఈ మిషన్ ఏ అద్భుత కథ కంటే తక్కువ కాదనే విషయం గ్రహించాలి.
బ్రిటిష్ వలస పాలనలో సంపదంతా కోల్పోయిన దేశం అంతరిక్ష ప్రయోగాలకు ఎందుకు అంత డబ్బు ఖర్చు చేయాలని నిర్ణయించుకుందో మనం ముందుగా తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
మానవాళి కోసమే..
విక్రమ్ సారాభాయి అలాగే, ఇస్రోతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలందరూ తొలినాళ్లలో అంతరిక్ష పరిశోధనలపై భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
''ప్రజలు, సమాజానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మనం రెండవ స్థానంలోనైనా ఉండాలి'' అని ఆనాడు రాజకీయ నాయకులను విక్రమ్ సారాభాయ్ ఒప్పించగలిగారు.
మానవ సహిత అంతరిక్షయాత్రలు, చంద్రుడు, ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడటం ఒక్కటే భారత అంతరిక్ష కార్యక్రమ ముఖ్య లక్ష్యం కాదని విక్రమ్ సారాభాయి నాడే స్పష్టం చేశారు.
చంద్రయాన్ 2 ప్రయోగ సమయంలో సహజంగా ఉద్భవించే ప్రశ్న ఒకటుంది. ఈ ప్రయోగం మన లక్ష్యాన్ని మార్చిందా? లేదా 'చంద్రుడు, ఇతర గ్రహాలను అన్వేషించడం వల్ల మానవాళి నిజమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? అనేదే ఆ ప్రశ్న.
దీనికి అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే కొత్త గ్రహాల అన్వేషణ, అంతరిక్ష పరిశోధన వల్ల వచ్చే జ్ఞానం మానవాళి అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటాన్ని సారాభాయ్ వ్యతిరేకించారు.

ఫొటో సోర్స్, TWITTER/ISRO
70 ఏళ్ల ప్రగతి
1960లలో కేరళలోని తుంబా నుంచి బొమ్మలాంటి రాకెట్లను నిర్మించి ప్రయోగించకపోతే నేడు చంద్రుడు, అంగారక గ్రహాలకు రాకెట్లు పంపే సామర్థ్యాలను భారత్ సాధించలేదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
ఒక రోజు భారత్‌కు సొంత ఉపగ్రహాలు ఉంటాయని, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి, పంటలు, అడవుల పర్యవేక్షణకు సహాయపడతాయని, సమాచార వ్యవస్థకు ఆధారం అవుతాయని మనం ఊహించి ఉండం.
ఇలాంటి ప్రయోగాలు చేయకుంటే కొన్ని ఇతర దేశాల మాదిరిగానే మనం కూడా సామాజిక, ఆర్థిక భద్రత కోసం అభివృద్ధి చెందిన దేశాల దయ మీద ఆధారపడేవాళ్లం.
గత 70 ఏళ్లలో ఇస్రో, సీఎస్ఐఆర్, ఐఏఆర్ఐ, అణుశక్తి సంస్థ, డీఆర్‌డీవో సాధించిన ప్రగతి 1950,60 లలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ల కంటే తక్కువేమీ కాదనే విషయాన్ని మనం గ్రహించాలి.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
అప్పుడు ఊహించలేదు
తీర ప్రాంతాలలో తుపానులు కలిగించే వినాశనాన్ని ఉపగ్రహాలు అందించే సమాచారం ద్వారా ముందే తెలుసుకోవచ్చని ఒకప్పుడు మనం ఊహించామా?
శాటిలైట్లు ఇచ్చే సమాచారంతో తీరప్రాంతంలోని 8 లక్షల మంది ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించవచ్చని అనుకున్నామా?
దేశంలో వెయ్యికి పైగా టీవీ ఛానెల్‌లు పుట్టుకొస్తాయని, వాటిలో ఎక్కువ భాగం కమ్యూనికేషన్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాయని మనం ఊహించలేదు.
అంతరిక్ష పరిశోధనల వల్ల మనం సాధించిన ప్రగతిని చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదైపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక సగటు వ్యక్తి శాస్త్రీయ పరిశోధనల గురించి ఎందుకు ఆలోచించాలి?
ఎందుకంటే, శాస్త్రీయ జ్ఞానం మన జీవితాలను, సామాజిక సంబంధాలను నిరంతరం ప్రభావితం చేస్తుంది.
వాస్తవానికి శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారో తెలుసుకునే హక్కు సార్వభౌమాధికారికి(భారత పౌరుడికి) ఉంది. మానవాళి నిజమైన సమస్యల పరిష్కారానికి అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగపడేలా చేయాలి.
చంద్రయాన్ 2 వంటి ప్రాజెక్టులను విజయవంతం చేయడం మన శాస్త్రీయ ప్రగతికి రిపోర్ట్ కార్డుగా కూడా పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, iSro
నాలుగో దేశం అవుతుంది
చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకంత కీలకమో, చంద్రునిపై దిగడానికి దక్షిణ ధృవాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో అనేది ప్రజలు తెలుసుకోవాలి.
చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి, వాతావరణ పరిస్థితులు భూమికి భిన్నంగా ఉంటాయి. భూమిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే మనం సాధించాం.
కానీ, చంద్రుడిపై గాలి లేదు. అందువల్ల, అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇంధనంతో పాటు, ల్యాండింగ్‌కు సరైన స్థలాన్ని ఎంచుకోవడమూ ముఖ్యమే. ఈ ప్రక్రియకు చాలా కచ్చితత్వం అవసరం.

ఫొటో సోర్స్, Getty Images
రెండు కారణాలతోనే
రెండు కారణాల వల్ల దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండింగ్‌కు ప్రాముఖ్యం పెరిగింది.
అంతా అనుకున్నట్లు జరిగితే... చంద్రుడి దక్షిణ ప్రాంత నేల స్వభావం ఉత్తర ప్రాంతం మాదిరిగానే ఉందా లేదా అనేది దీని ద్వారా తెలిసే అవకాశం ఉండేది.
రెండోది, ఈ ప్రాంతంలో నీరు ఉపయోగపడే పరిమాణంలో ఉందా లేదా అని తెలుసుకునే అవకాశమేర్పడేది.
చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయా లేవా అనే ప్రశ్న శాస్త్రవేత్తను చాలా కాలం నుంచి కలవరపెడుతుంది. దానికీ సమాధానం దొరికుండేదేమో.
మన అన్వేషణలో అక్కడ నీటి జాడలను కనుగొనగలిగితే చంద్రుడిపై ఇప్పటి వరకు ఉన్న మన దృక్పథం మొత్తం మారిపోతుంది.

ఫొటో సోర్స్, iSRO
ఇవి కూడా చదవండి:
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- అమెజాన్ బ్లూ మూన్: చంద్రుడి మీదికి మనుషులు, ఉపగ్రహాలు.. అక్కడే అంతరిక్ష కాలనీలు
- అపోలో11: ‘50 ఏళ్ల కిందట చంద్రుడిపై నడిచాను’
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









