మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి మంగాయమ్మ 73 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఇద్దరూ ఆడపిల్లలు. ఉదయం 10.30 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా వీరిని డాక్టర్లు బయటకు తీశారు. ప్రస్తుతం పిల్లలు, తల్లి క్షేమంగానే ఉన్నారని గుంటూరు నగరంలోని నర్సింగ్ హోమ్ వర్గాలు తెలిపాయి.
పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరూ 1.8 కిలోల చొప్పున బరువు ఉన్నారని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ ఉమా శంకర్ బీబీసీతో చెప్పారు. ప్రస్తుతానికి మంగాయమ్మను, పిల్లలను ఆరు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని వెల్లడించారు. ఆ తర్వాత పిల్లలు ఇద్దరూ 21 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని వివరించారు.
వయసు పైబడిన మహిళలు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు.. సాధారణంగా రొమ్ముపాలు ఇవ్వకుండా చూస్తామని, వేరే తల్లుల పాలు పడతామని ఆయన తెలిపారు.
‘గొడ్రాలు అనేవాళ్లు.. చాలా బాధలు పడ్డాం’ - మంగాయమ్మ
తనను గొడ్రాలు అంటూ చుట్టుపక్కల వాళ్లు నిందించేవాళ్లని, అందుకే పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నానని మంగాయమ్మ తరచూ చెప్పేవారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
సిజేరియన్ తర్వాత మంగాయమ్మ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.
‘‘ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన సమయం. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎందరో డాక్టర్లను కలిసాం. గొడ్రాలు అని అందరూ అంటుంటే చాలా బాధలు పడ్డాం. ఇద్దరు బిడ్డలు కలగడం ఆనందంగా ఉంది. అంతా డాక్టర్ ఉమా శంకర్ గారి చలువ’’ అంటూ వ్యాఖ్యానించారు.
‘నన్ను గొడ్రాజు అనేవాళ్లు.. ఆ ముద్ర పోయింది’ - మంగాయమ్మ భర్త రాజారావు
మంగాయమ్మ భర్త యరమాటి సీతారామ రాజారావు తన ఆనందాన్ని బీబీసీతో పంచుకున్నారు.
‘‘చాలా సంతోషంగా ఉంది. అంతా డాక్టర్ల కృషి. మొదట్లో మేము కూడా చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయాం. అయినా ఈ డాక్టర్ గురించి విని ఓ ప్రయత్నం చేద్దామని వచ్చాము. రెండు నెలలకే గర్భం రావడంతో నమ్మకం కుదిరింది. గతంలో కొన్నిసార్లు అలానే జరిగి మళ్ళీ పోయేది. అందుకే 9నెలలుగా ఆస్పత్రిలో నే ఉన్నాం. ఈరోజు పిల్లలను చూసిన తర్వాత మా వాళ్ళు అందరూ నన్ను గొడ్రాజు అంటూ వేసిన ముద్ర పోయింది. పిల్లలు ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటాం’’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇదీ మంగాయమ్మ కథ..
తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి సీతారామ రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారి ఆశ తీరకుండానే ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక బలీయంగా ఉంది. వారికి పొరుగున ఉండే ఒక మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి కావడంతో, తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని మంగాయమ్మ నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, Facebook/Sanakkayala Uma Shankar
నిరుడు నవంబరులో గుంటూరులోని ఒక నర్సింగ్ హోమ్‌కు మంగాయమ్మ దంపతులు వచ్చి ఐవీఎఫ్ నిపుణులైన డాక్టర్ ఉమాశంకర్‌ను కలిశారు. బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది. అప్పటి నుంచి ఆమెను ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసింది.
‘ప్రపంచ రికార్డ్’ - డాక్టర్
73 ఏళ్ల వయసులో మంగాయమ్మ కవలలకు జన్మనివ్వడం ప్రపంచ రికార్డు అని డాక్టర్ చెప్పారు. ‘ప్రస్తుతం గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం 67 ఏళ్ల వయసులో ఒక మహిళ పిల్లలకు జన్మనిచ్చారు. మంగాయమ్మ 1947 జూలై 1వ తేదీన జన్మించారు. ఇప్పుడు ఆమెకు 73 సంవత్సరాలు. కాబట్టి ఇది ప్రపంచ రికార్డు’ అని ఉమా శంకర్ తెలిపారు.
‘అనైతికం’ - ఐఎస్ఏఆర్, ఐఎఫ్ఎస్, ఏసీఈ
కాగా, 73 ఏళ్ల వయసున్న మహిళకు ఐవీఎఫ్ పద్ధతిలో సంతాన సాఫల్య చికిత్స అందించటం అనైతికమని ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ (ఐఎస్ఏఆర్), ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ (ఐఎఫ్ఎస్), అకాడమీ ఆఫ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్స్(ఏసీఈ) సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
18 సంవత్సరాల లోపు, 45 సంవత్సరాలకు పైబడిన మహిళలకు ఐవీఎఫ్ చికిత్స అందించకూడదని అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) బిల్లు 2017 చాప్టర్ 4, పేరా 37, సబ్ పేరా 7(ఎ)లో స్పష్టంగా పేర్కొన్నారని ఈ ప్రకటనలో వివరించాయి.
అయితే, ఇవి కేవలం మార్గదర్శకాలు మాత్రమేనని, చట్టం కాదని కాబట్టే దీన్ని ఆసరాగా చేసుకుని ఉండొచ్చునని ఐఎఫ్ఎస్ అధ్యక్షురాలు గౌరీ దేవి చెప్పారని ది హిందూ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
కాగా, 73 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనివ్వటం సమంజసం కాదని, ఆ పిల్లల పెంపకం, వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి:
- అండదానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- 15 ఏళ్లకే మెనోపాజ్: ’ఇక నాకు పిల్లలు పుట్టరు'
- వీర్యం కావాలి... దాతల కోసం ఫేస్బుక్లో వెతుకుతున్న మహిళ
- ఐవీఎఫ్ ప్రభావంతో... తగ్గిపోతున్న ‘పిల్లల దత్తత’
- ‘సంప్రదాయ వైద్యంతో గర్భం’.. మోసపోయిన వందలాది మంది మహిళలు
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సర్వేపల్లి రాధాకృష్ణ: ‘మిస్టర్ మావో కంగారుపడకండి.. స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశా’
- అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి
- ఆర్టీసీ విలీనం: జగన్ ప్రభుత్వ నిర్ణయంతో మేలు జరిగేది ఎవరికి?
- మోదీతో కలసి చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను వీక్షించనున్న శ్రీకాకుళం విద్యార్థిని
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- ఐవీఎఫ్: తమకు పుట్టిన పిల్లల్లో తమ లక్షణాలు లేవంటూ కేసు వేసిన దంపతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








