జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ

ఫొటో సోర్స్, AFP
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రిలయన్స్ సంస్థ తన జియో గిగా ఫైబర్‌ను లాంచ్ చేసింది. జియో తాజాగా ప్రకటించిన సేవలన్నీ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి వచ్చాయి.
జియో 2016 సెప్టెంబర్ 5న ప్రారంభమైంది. ఆ సంస్థ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడీ కొత్త సేవలను ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
బిజినెస్ లకు పదో వంతు ధరలోనే సేవలు
జియో గిగా ఫైబర్ సేవలు గృహావసరాలతో పాటు వ్యాపారాలకూ అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలో స్టార్టప్‌లు.. చిన్న, మధ్య తరహా వర్తకులను ప్రోత్సహించేందుకు అతి తక్కువ ధరలతో 'ఫైబర్ టూ ఆఫీస్' సేవలు కూడా ప్రారంభించబోతోంది.
ఇప్పటివరకూ స్టార్టప్‌లు నెలకు రూ.15 వేల వరకూ ఇంటర్నెట్ బిల్లులు చెల్లించేవి . కానీ జియో ఫైబర్ టూ ఆఫీస్ సేవలు కేవలం నెలకు రూ.1500 రూపాయల టారిఫ్‌తోనే ప్రారంభం కానున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంట్లోనే హోం థియేటర్ ఎప్పటి నుంచి
ఇంట్లోనే నేరుగా సినిమా మొదటి రోజే చూసే సేవలను 2020 నాటికల్లా అందిస్తామన్నారు.
ఇక జియో గిగా ఫైబర్ నెట్‌తో వచ్చే ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి దేశంలో అన్ని నెట్ వర్క్‌లకు పూర్తిగా ఔట్ గోయింగ్ ఉచితంగా అందించబోతున్నామని, యూఎస్, కెనడా వంటి దేశాలకు అన్ లిమిటెడ్ కాలింగ్ నెలకు కేవలం 500 రూపాయలకే అందించబోతున్నట్లు వెంకటరెడ్డి చెప్పారు.
'వన్ ఇయర్ వెల్ కం' ప్లాన్ కింద ఏడాది సబ్ స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు ఒక 4కే లేదా హెచ్‌డీ టీవీ సెట్ టాప్ బాక్స్ తో పాటు ఏడాది ప్లాన్ కూడా ఉచితంగా అందివ్వబోతున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ గిగా ఫైబర్?
గిగా ఫైబర్‌తో డిజిటల్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయి.. ఏమేం సాధ్యమవుతాయన్నది అందరిలో ఆసక్తి పెంచుతోంది.
ఓ పాతికేళ్ల కిందటి సంగతి చూస్తే, అప్పట్లో ఇంటర్నెట్ స్పీడ్ 54 కేబీపీస్‌లోపే ఉండేది. అంటే ఆ వేగంతో మన మెయిల్ ఓపెన్ కావడానికీ రెండు నిమిషాలు పట్టేది. కానీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో పరుగులు పెడుతున్న నేటి డిజిటల్ జనరేషన్ వేగాన్ని అందుకోవాలంటే ఇంటర్నెట్ వేగమూ అదే స్థాయిలో ఉండాలి. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశమే గిగా ఫైబర్‌నెట్.
ఇంటర్నెట్ స్పీడ్‌ను గిగా బైట్స్‌కి పెంచి ఇవ్వడమే ఈ గిగా ఫైబర్ ఉద్దేశం. అంటే ఇంటర్నెట్ తొలినాళ్లలో ఉన్న స్పీడ్ కన్నా ఇప్పుడు పది లక్షల రెట్లు స్పీడ్ పెరుగుతుందన్నమాట.
అంటే వన్ జీబీ సైజ్ ఉన్న సినిమా పది సెకండ్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 4కే వీడియోలున్న సినిమాలు కూడా ఏమాత్రం స్ట్రీమింగ్ లేకుండా చూడొచ్చు. ఒకప్పుడు సూపర్ కంప్యూటర్ల వంటివాటికి మాత్రమే అందుబాటులో ఉండే స్థాయి సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ ఇకపై ఇళ్లలోనూ అందుబాటులోకి రానుందని వెంకటరెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తు అంతా డిజిటల్ మయమే.
ఇప్పటికే స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఏసీలు వచ్చేశాయి. మరికొన్నాళ్లకు ఇంట్లో వాడే అన్ని వస్తువులూ ఇంటర్నెట్ అనుసంధానంగా ఉంటాయి. వీటినే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఇలాంటి సాంకేతికత వల్ల మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లో వస్తువుల్ని ఆపరేట్ చేయగలిగే వీలుంటుంది.
ఈ గిగా ఫైబర్ వల్ల కేవలం హైరిజల్యూషన్ సినిమాలు చూడటమే కాదు హై స్పీడ్ గేమింగ్, స్ట్రీమింగ్‌లతో, హై స్ట్రీమ్ వీడియో కాన్ఫరెన్స్, ఆఫీస్ వర్క్‌లు, ఆగ్మెంటెడ్ రియాలటీ వంటి సేవలూ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినియోగించుకోవచ్చు. అన్నింటినీ మించి భవిష్యత్తులో ఏదైనా సినిమా రిలీజైన తొలి రోజే ఇంట్లోనే కూర్చుని చూసే వీలూ కలుగుతుంది. గిగా ఫైబర్‌తో ఇల్లు నిజంగా హోం థియేటర్ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇదంతా ఎలా సాధ్యం?
ఫైబర్ టూ హోం టెక్నాలజీ తెస్తున్న సౌలభ్యం ఇది. ఇప్పుడున్న ఇంటర్నెట్ అంతా ఆప్టికల్ ఫైబర్ ద్వారానే కనెక్టయి ఉన్నా ఆ ఫైబర్ మాత్రం నేరుగా మన ఇంటికి రాదు. ఇంటికి దగ్గర్లో ఉన్న కనెక్షన్ బాక్స్ వరకూ ఫైబర్‌తో అనుసంధానమై అక్కడి నుంచి మన ఇంట్లో కంప్యూటర్లు, వైఫైలకు ఈథర్నెట్ కేబుల్‌తో అనుసంధానమయ్యేది.
కానీ ఫైబర్ టూ హోం టెక్నాలజీతో నేరుగా మన ఇంటికే ఆప్టికల్ ఫైబర్ తో నెట్ కనెక్ట్ అవుతుంది. అందుకే గిగాబైట్ స్థాయిలో మనకు నెట్ స్పీడ్ వస్తుంది.
ఈ డైరెక్ట్ ఫైబర్ టూ హోం టెక్నాలజీ వల్ల ఇంటర్నెట్‌తో పాటు, సెట్ బాక్స్‌కు అవసరమైన టీవీ సిగ్నళ్లు, టెలిఫోన్ సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు.
అంటే గిగా ఫైబర్ ఒక్కటి ఉంటే హైస్పీడ్ ఇంటర్నెట్, అల్ట్రా హెచ్‌డీ డీటీహెచ్ సేవలు, ల్యాండ్ లైన్.. మూడు సేవలనూ ఒకే కనెక్షన్‌తో ఉపయోగించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Ani
నాలుగేళ్ల కిందట మొదలైన వేగం
నాలుగేళ్ల కిందటి వరకూ భారత దేశంలో ఇంటర్నెట్ చాలా ఖరీదైన వ్యవహారంగా ఉండేది. జియో రాకతో డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి.
ఇప్పుడు ఇంత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అత్యంత చౌకగా అందిస్తోంది రిలయెన్స్ జియో.
తాజాగా లాంఛ్ చేసిన ప్లాన్లలో బేసిన్ ప్లాన్‌లో 700 రూపాయలకు 100 ఎంబీపీస్ స్పీడ్ అందిస్తోంది. అత్యధిక టారిఫ్ పది వేల రూపాయల వరకూ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
వేగానికి కొలమానం ఇదీ..
డిజిటల్ పరిభాషలో నెట్ వేగాన్ని 'బైట్స్ పర్ సెకండ్స్'లో కొలుస్తారు. ఒక సెకనుకు 1024 బైట్స్ డాటా ట్రాన్స్‌ఫర్ అయితే అప్పుడు దాన్ని 1 కేబీపీస్(కిలో బైట్స్ పర్ సెకండ్) అంటారు. ఇలాంటివి ఒక సెకండ్‌కు 1024 కిలోబైట్లు ట్రాన్స్‌ఫర్ అయితే దాన్ని ఒక ఎంబీపీఎస్ అంటారు.
ఇలాంటి 1024 మెగా బైట్ల డాటా ఒక్క సెకండ్లో ట్రాన్స్‌ఫర్ అయితే ఆ వేగాన్ని ఒక గిగా బైట్ పర్ సెకండ్ అంటారు.
ఇలా సెకెండ్‌కు జీబీల కొద్దీ హైస్పీడ్ డాటాను ట్రాన్స్‌ఫర్ చేయగలిగేదే గిగా ఫైబర్. ఆ స్థాయి స్పీడ్ నెట్ ఉంటే ఇంటర్నెట్ ఆధారంగా సాగే పనులన్నీ మిల్లీ సెకండ్లలోనే పూర్తయిపోతాయి.
ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్ LIVE: జమ్ము-కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ఆర్టికల్ 370 సవరణ: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








