కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'

ఫొటో సోర్స్, Bjp
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఈ కళ్లు ఎన్నో బాధలు చూశాయి, ఎన్నో మరణాలు చూశాయి, రక్తపాతాన్ని చూశాయి, వలసలు చూశాయి. కానీ ఇలాంటి రోజు మళ్లీ ఒకటి చూస్తాయని అసలు అనుకోలేదు."
ఈ మాటలన్నది 58 సంవత్సరాల వయసున్న కశ్మీరీ పండిట్ అశోక్ భాన్. ఈయన 1990 జనవరి 19న అన్నీ వదిలి, కశ్మీర్ నుంచి జమ్మూకు శరణార్థిగా వెళ్లిపోయారు.
మమ్మల్ని పాకిస్తాన్‌లో కలిపేయండి అని మసీదుల నుంచి ఆ రాత్రి వచ్చిన నినాదాలను ఉద్వేగంతో గుర్తుచేసుకున్నారు అశోక్ భాన్.
"జనవరి 19 నాటి ఆ సాయంత్రం గుర్తొస్తే నాకు ఇప్పటికీ వణుకొస్తుంది. నేను అప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను. మసీదుల నుంచి నినాదాలు వినపడగానే నా కాళ్లు వణికాయి. అప్పుడు జరిగినదాన్ని నేను మాటల్లో చెప్పలేను. కశ్మీరీ పండిట్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్ని వైపుల నుంచి నినాదాలు వెల్లువెత్తాయి. దీంతో నా మనసులో ఒకటే ఆందోళన... ఇప్పుడు నా కుటుంబం అంతా ఎక్కడికి వెళ్లాలి? ఏం తినాలి? మా ఇళ్లు ఏమైపోతాయి?" అని భాన్ ఆనాటి ఘటనలను వివరించారు.

భాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి దిల్లీలో నివసిస్తున్నారు.
"నేను కశ్మీర్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నా. నేను కశ్మీర్ వదిలి వచ్చేనాటికి నా వయసు 27ఏళ్లు. ఇప్పుడు 60కి చేరువయ్యాను. ఇప్పటికీ మా ఇల్లు కశ్మీర్‌లోనే ఉంది. కశ్మీర్ నా మాతృభూమి. ఏదో రోజు మేం కశ్మీర్‌కు తిరిగివెళ్తాం అనుకుంటూనే 30 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రోజు మాకు ఈద్ లాంటిది. మా కల ఇన్నాళ్లకు నెరవేరింది" అని భాన్ అన్నారు.

'ఈరోజు మా నాన్న బతికి ఉండుంటే బాగుండేది'
హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన బిల్లుపై 30 ఏళ్లుగా దిల్లీలో వస్త్రాల దుకాణం నడుపుకుంటున్న అశోక్ కుమార్ మట్టూ సంతోషం వ్యక్తం చేశారు.
"మా నాన్న బతికి ఉండుంటే ఈ రోజు ఎంతో బాగుండేది. కొద్ది కాలం క్రితమే ఆయన మరణించారు. ఆయన ఉంటే ఇప్పుడు చాలా సంతోషించేవారు. ఎక్కడెక్కడో ఉన్న కశ్మీరీ పండితులంతా ఈరోజు పండగ చేసుకుంటున్నారు. ఇది వారందరికీ ఎంతో ముఖ్యమైన రోజు" అని తన తండ్రిని గుర్తుచేసుకుంటూ మట్టూ చెప్పారు.
"మేం కశ్మీర్‌ను వదిలి వచ్చినప్పుడు ఇక అది మా ఇల్లు కాదు అనే అనుకున్నాం. కానీ ఈరోజు దేశం మొత్తం చెబుతోంది, కశ్మీర్ మనది అని" అని మట్టూ తెలిపారు.

నేను చికిత్స చేసినవాళ్లే నన్ను పంపించాలనుకున్నారు
1990కి పూర్వం శ్రీనగర్‌లో పనిచేసిన డాక్టర్ ఎల్ఎన్ ధర్ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. జనవరి 19కి ఒక్క రోజు ముందు కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. కానీ వాటిని మేం పెద్దగా పట్టించుకోలేదు.
"కశ్మీరీ పండిట్లను కశ్మీర్ నుంచి వెళ్లగొట్టాలని ఓరోజు రాత్రి మసీదులో ప్రకటించారు. ఆ సమయంలో కశ్మీరీ పండిట్ల ముందు మూడు మార్గాలున్నాయి. అందులో మొదటిది ఇస్లాంను స్వీకరిచడం, రెండోది ప్రాణాలు అర్పించడం, మూడోది కశ్మీర్‌న వదిలివెళ్లిపోవడం. మాకు ఇల్లు వదిలి వచ్చేయడం మినహా మరో అవకాశం లేదు. అయితే ఇది కేవలం రెండు, మూడు నెలలపాటే అనుకున్నాం. ఖాళీ చేతులతో ఇల్లు వదిలి వచ్చేశాం. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇన్నాళ్లకు మేం సంతోషించే రోజు వచ్చింది" అని ధర్ తెలిపారు.
'ఆర్టికల్ 370 సవరణ'తో కశ్మీరీ పండిట్ వర్గాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. కశ్మీర్‌కు తాము తిరిగి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- జమ్మూ కశ్మీర్ విభజన: ఏదో ఒక రోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం: అమిత్ షా
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
- 'ఆర్టికల్ 370 సవరణ'తో జమ్మూ, కశ్మీర్లో ఏమేం మారతాయి
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘కశ్మీర్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం రద్దు’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








