గోదావరి వరదలు: ముంపులో 350 గ్రామాలు.. మూడు రాష్ట్రాల మధ్య ఆగిపోయిన రాకపోకలు

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వారంలో రెండోసారి వరద తాకిడి కనిపిస్తోంది. ఈసారి నీటి మట్టం వేగంగా పెరగడంతో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాదకర హెచ్చరిక స్థాయికి చేరగా, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం సాగుతోంది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 14.2 అడుగులకు చేరుకుంది.
దాంతో 175 క్రస్ట్ గేట్లను పూర్తిగా ఎత్తివేసి 13,45,437 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు.
తాజా సమాచారం..
గోదావరిలో వరద క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం తగ్గుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
అయితే, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మరో 10 గంటల్లో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నీటిమట్టం పెరిగితే మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది.
రెండు జిల్లాల్లోనూ..
ఈ వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారుగా 350 గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. 400 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
శబరి నది పొంగి ప్రవహించడంతో ఏపీ, తెలంగాణా, చత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. చింతూరు ఏజన్సీ ప్రాంతంలో మరో 16 గ్రామాలకు వరద నీరు చేరింది.
ఏటా వచ్చే ఈ స్థాయి వరదనీరు కన్నా ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా వరద తాకిడి ఎక్కువగా ఉంది.
ముఖ్యంగా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలమయం కావడానికి బ్యాక్ వాటర్ కారణంగా కనిపిస్తోంది.
పూడిపల్లి గ్రామానికి చెందిన కారం రామయ్య బీబీసీతో మాట్లాడుతూ.. ''గతంలో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరినప్పటికీ గోదావరి మా వాకిళ్లలోకి మాత్రమే వచ్చేది. కానీ ఈసారి వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. అన్నీ ఖాళీ చేసి పునరావాస కాలనీకి చేరాల్సి వచ్చింది. నిర్వాసితుల కాలనీ నిర్మించి, నష్టపరిహారం చెల్లించి ఉంటే మాకు సమస్య ఉండేది కాదు. ప్రభుత్వం అలా చేయకుండా కాఫర్ డ్యామ్ కట్టడంతో మేము నీటిలో నానాల్సి వస్తోంద''ని చెప్పుకొచ్చారు.
కాఫర్ డ్యామ్‌కు నష్టం
పోలవరంలో కూడా నిర్మాణంలో ఉన్న స్పిల్ వే నిండా వరద నీరు చేరింది. కాఫర్ డ్యామ్‌కి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల గండిపడింది.
దేవీపట్నం మండల కేంద్రం సహా అనేక గ్రామాలు గడిచిన వారం రోజులుగా నీటిలో నానుతున్నాయి. జూనియర్ కాలేజీ, పలు హాస్టళ్లలోకి కూడా వరద నీరు చేరింది. దాంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. పోచమ్మగండి ఆలయంలోకి నీరు చేరడంతో అమ్మవారి విగ్రహం మునిగిపోయింది.
జలదిగ్బంధంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి.
దిగువన పోలవరం, సీతానగరం, రాజమహేంద్రవరం సహా కోనసీమలోని పలు లంక గ్రామాల్లో వరద నీరు చేరడంతో పంటలకు అపారనష్టం ఏర్పడింది.
14 మండలాల్లో సుమారుగా 45 వేల ఎకరాల పంట నీటి పాలైనట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. లంక గ్రామాల ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 45, పశ్చిమ గోదావరి జిల్లాలో 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పునరావాస కేంద్రాల్లో ఆహారం అందిస్తున్నప్పటికీ వరద తగ్గిన తర్వాత తలెత్తే సమస్యల పట్ల శ్రద్ధ చూపాలని రాజమహేంద్రవరం లంక వాసి రామకృష్ణ కోరారు.
పునరావాస కేంద్రంలో ఉన్న ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. లంకలోకి నీరు చేరడంతో మూడు రోజుల క్రితమే ఇక్కడకు వచ్చామన్నారు. 'అధికారులు ఆహారం అందిస్తున్నారు. పిల్లాపాపలతో ఇక్కడే ఉన్నాం. కానీ రెండు రోజులకు వరద తగ్గగానే మాకు అసలు సమస్యలు వస్తాయి. బురద మధ్యలో పాములను ఎదుర్కొంటూ జీవించాలి. అలాంటి సమయంలో మాకు సహాయం అందిస్తే బాగుంటుంద'న్నారు.
ఎగువన గోదావరి శాంతిస్తుండడంతో సోమవారం ఉదయం నుంచి గోదావరి వరద తాకిడి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
- కశ్మీర్ లోయ ఉద్రిక్తం: 'కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు'
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘‘సారీ అమ్మ.. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు’’
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









