కశ్మీర్ ఉద్రిక్తం: 'పాకిస్తాన్... మీ జవాన్ల మృతదేహాలను తీసుకువెళ్ళండి‘ -భారత్

కశ్మీర్, సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

నియంత్రణ రేఖకు ఇటువైపు పడి ఉన్న పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను తీసుకువెళ్లాలని భారత్ ఆ దేశానికి సూచించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ)కి చెందిన జవాన్లు జమ్మూకశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌లో దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని, బదులుగా భారత సైన్యం జరిపిన దాడిలో వారిలో ఐదుగురు నుంచి ఏడుగురు వరకూ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పీటీఐ తెలిపింది.

నియంత్రణ రేఖకు తమవైపు పడి ఉన్న పాక్ సైనికుల మృతదేహాలను తీసుకువెళ్లాలని ఆ దేశ సైన్యానికి భారత సైన్యం సూచించినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం అందిందని పేర్కొంది.

భారత సైన్యం

ఫొటో సోర్స్, BILAL BAHADUR

బీఏటీ జులై 31, ఆగస్టు 1వ తేదీల్లో చొరబాటు ప్రయత్నాలు చేసిందని, వీటిని భారత సేనలు భగ్నం చేశాయని పీటీఐ తెలిపింది.

పాక్ సైనికుల మృతదేహాల్లో ఆ దేశ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎన్ఎస్‌జీ) కమాండోలవి కనీసం నాలుగు ఉన్నట్లు పీటీఐ పేర్కొంది.

కశ్మీర్
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ ఆదేశంతో కశ్మీర్ నుంచి తిరుగుప్రయాణమవుతున్న పర్యాటకులు

భారత్ అధీనంలోని కశ్మీర్‌లో మూడు రోజులుగా హడావిడి బాగా పెరిగింది. ఆ ప్రాంతంలో భద్రత బలగాల మోహరింపులను కేంద్రం ఉన్నపళంగా పెంచింది.

పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్రికులు ఆ ప్రాంతం వదిలివెళ్లిపోవాలని ప్రభుత్వం సూచనలు కూడా చేసింది.

ఈ పరిణామాలతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది.

కశ్మీర్‌లోని తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీ శుక్రవారం రాత్రి తన ఇంట్లో వివిధ పార్టీల నాయకులతో ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్, పీపుల్స్ మూమెంట్ నాయకుడు ఫైసల్ కూడా సమావేశానికి హాజరయ్యారు.

మహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, ANi

ఫొటో క్యాప్షన్, మహబూబా ముఫ్తీ

''ఆర్టికల్ 35ఏ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మార్పులు చేస్తారని వదంతులు వస్తున్నాయి. ఇస్లాంలో చేతులు జోడించడానికి అనుమతి లేదు. అయినా, నేను చేతులు జోడించి, ప్రధానమంత్రిని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా'' అని మహబూబా ముఫ్తీ అన్నారు.

ముఫ్తీ సహా ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మలిక్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి తెరదించి, వదంతుల వ్యాప్తిని అరికట్టాలని ఆయన్ను వారు కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అయితే, రాష్ట్రంలో పరిస్థితులు సాఫీగానే ఉన్నాయని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

''భద్రతా బలగాలకు సంబంధించిన ఆదేశాలను, వేరే అంశాలతో కలిపి చూస్తున్నారు. అందుకే ఇలాంటి వదంతులు పుడుతున్నాయి. వాటిని నమ్మొద్దు'' అని గవర్నర్ సత్యపాల్ మలిక్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)