Zomato: 'తిండికి మతం లేదు'.. 'మరి హలాల్ మాటేంటీ?' - జోమాటో ట్వీట్‌పై సోషల్ మీడియాలో చర్చ

జొమాటో

ఫొటో సోర్స్, Getty Images

'తిండికి మతం లేదు.. తిండే మతం' అంటూ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

తనకు ఫుడ్ డెలివరీ చేసేందుకు హిందువును కాకుండా మరొకరిని పంపించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమిత్ శుక్లా (యూజర్ నేమ్: NaMo_SARKAAR) అనే పేరుతో ఓ వ్యక్తి జొమాటోకు ట్వీట్ పెట్టాడు.

జొమాటో

ఫొటో సోర్స్, Twitter

దీనికి స్పందిస్తూనే, తిండికి మతం లేదంటూ జొమాటో ఇండియా ట్వీట్ చేసింది.

జొమాటో స్పందనను చాలా మంది ప్రశంసించారు. ఆ సంస్థ వ్యవహరించిన తీరుపై ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తాయి.

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కూడా ఈ విషయంపై స్పందించారు.

జొమాటో

ఫొటో సోర్స్, Twitter

''మేం అనుసరించే విలువలకు విరుద్ధంగా వ్యాపారం జరగాలంటే, దాన్ని కోల్పోయేందుకు కూడా మేం చింతంచం'' అని ఆయన ట్వీట్ చేశారు.

హిందూ డెలివరీ బాయ్ కావాలంటూ అడిగిన అమిత్ శుక్లాను ట్విటర్‌లో చాలా మంది విమర్శించారు. ఆయన తీరు మూర్ఖంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు.

జొమాటో

ఫొటో సోర్స్, Twitter

'అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు'

అయితే, అమిత్ శుక్లాకు మద్దతుగానూ కొందరు మాట్లాడారు. #IStandWithAmit అనే హ్యాష్‌ట్యాగ్‌తో వాళ్లంతా ట్వీట్లు పెట్టారు.

జొమాటో ద్వంద్వ వైఖరి పాటిస్తోందని మండిపడ్డారు.

ముస్లింలకు ప్రత్యేకంగా 'హలాల్' మాంసం వంటకాలను జొమాటో ఎందుకు అందిస్తోందని ప్రశ్నించారు.

జొమాటో

ఫొటో సోర్స్, Twitter

తాము అందుకున్న ఫుడ్ హలాల్ చేసింది కాదంటూ కొందరు చేసిన ఫిర్యాదులకు జొమాటో సానుకూలంగా స్పందించిన సందర్భాలను ప్రస్తావిస్తూ వాళ్లు విమర్శలు చేశారు.

హిందువులు ప్రశ్నించినప్పుడు మాత్రమే తిండికి మతం లేదన్న విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు.

కొన్ని వర్గాలు తినడానికి ఇష్టపడే 'జట్కా' పద్ధతిలో కోసిన మాంసాన్ని, 'హలాల్' తరహాలోనే ఎందుకు అందించడం లేదని అడిగారు.

జొమాటో

ఫొటో సోర్స్, Twitter

కొందరైతే యాప్‌ను అనిస్టాల్ చేస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు.

అయితే ఈ విషయంపై జొమాటో వివరణ ఇస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఆహారాన్ని ఎంచుకునేందుకు వినియోగదారులకు వీలైనంత ఎక్కువ సమాచారం ఇచ్చేందుకే 'హలాల్' అన్న ట్యాగ్‌ను తాము పెడతామని.. జైనుల ఆహారం, శాకాహారం, నవరాత్రికి తినే ఆహారం వంటి ట్యాగ్‌లు కూడా తమ వేదికలో ఉంటాయని పేర్కొంది.

జొమాటో

ఫొటో సోర్స్, Twitter

తగినంత సమాచారం లేక వినియోగదారులు తాము అనుకున్నది కాకుండా వేరేరకమైన ఆహారం పొందిన కేసుల్లో తాము బాధ్యత వహిస్తామని జొమాటో వివరించింది.

వినియోగదారులు కోరుకుంటే జట్కా మాంసం ట్యాగ్‌ను తీసుకువచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)