అబ్బాయిల ముందు అమ్మాయి ఎందుకు ఎక్కువ తినదు?

- రచయిత, యావో-హువా లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీ స్నేహితులతో కలిసి కమ్మటి భోజనం ఆస్వాదించిన ఆ క్షణాలు మీకు గుర్తున్నాయా? అలాంటప్పుడు - 'అరే, ఎక్కువ తినేశామే?' అని మీకనిపించిందా?
మరీ ఎక్కువగానో లేదా మరీ తక్కువగానో తింటున్నందుకు మీరు బహుశా సామాజిక నియమాలను నిందించవచ్చు. కానీ, ఇతరులతో కలిసి తింటున్నప్పుడు మనం ఎక్కువ తినేస్తామని.. ఇతరులు దేనిని, ఎలా తింటున్నారో మనం కూడా దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తామని దశాబ్దాల పరిశోధనలు చెబుతున్నాయి.
మన భోజనంపై మనతో ఉన్నవారి ప్రభావం ఏ మేరకు ఉంటుంది? కొవ్వులు, చక్కెరను తద్వారా బరువును తగ్గించుకోవడానికి ఈ సామాజిక ప్రభావాలను ఉపయోగించుకోవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
డైరీలతో పరిశోధన
1980లో జాన్ డీ కాస్ట్రో అనే వైద్యుడు కొందరి డైరీలు సేకరించి వారి ఆహార అలవాట్లపై పరిశోధనలు చేశారు. వాటి ద్వారా - మన ఆహారంపై మనతో ఉన్నవారి ప్రభావం కూడా ఉంటుందని వెల్లడైంది. 1994 నాటికి కాస్ట్రో 500కు పైగా డైరీలు సేకరించారు. వాటి ద్వారా రాసిన వారు ఎలా తినేవారు, ఆ సామాజిక సందర్భం ఏమిటి, వారు ఒంటరిగా తిన్నారా లేదా ఎవరితోనైనా కలిసి తిన్నారా అనేది పరిశీలించారు.
ఆ పరిశోధనల్లో ఒంటరిగా ఉన్నప్పటి కంటే ఇతరులతో కలిసి ఉన్నపుడే వారు ఎక్కువ తిన్నారనే విషయం ఆయనను ఆశ్చర్యపరిచింది.
మిగతా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కూడా కలిసి భోజనం చేసేప్పుడు 40 శాతం ఎక్కువ ఐస్‌క్రీం, 10 శాతం ఎక్కువ మాంసం తింటున్నట్టు తేలింది. కాస్ట్రో దీనికి 'సామాజిక సర్దుబాటు' అనే పేరు పెట్టారు. మనం తినే తిండిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు.
మనం ఇతరులతో కలిసి తింటున్నప్పుడు అంత ఎక్కువగా ఎందుకు తింటాం? ఆకలి వల్లా? మూడ్ వల్లా? లేదంటే అందరితో మాట్లాడుతూ పరధ్యానంలో అలా తినేస్తామా? కాస్ట్రో, ఇతర శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఇతరులతో కలిసి తింటున్నప్పుడు మనం భోజనం చేసే సమయం పెరుగుతుందని, ఆ అదనపు సమయంలో ఎక్కువ లాగించేస్తామని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
సమయమే కీలకం..
కొన్ని హోటళ్లలో చేసిన పరిశోధనల్లో పెద్ద బృందాలుగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం భోజనం చేయడానికి ఇష్టపడతారని తేలింది. భోజనం సమయం పరిమితంగా ఉన్నప్పుడు, పెద్ద విందుకు వెళ్లినా ఎక్కువగా తినలేకపోయారు.
2006లో జరిగిన ఒక ప్రయోగంలో, శాస్త్రవేత్తలు 132 మందిని ఒకేచోట కూర్చోపెట్టారు. వారికి కుక్కీస్, పిజ్జా తినడానికి 12 లేదా 36 నిమిషాల సమయం ఇచ్చారు. అక్కడ ఉన్న వారంతా ఒంటరిగా, జంటలుగా, నలుగురి బృందాలుగా ఉన్నారు.
ఈ ప్రయోగంలో నియమిత భోజన సమయంలో ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధం లేకుండా అందరూ ఒకే స్థాయిలో తిన్నారు. చాలా మంది కలిసినపుడు ఎక్కువ తినడానికి కారణం, పొడిగించిన భోజన సమయమే కీలకం అని ఈ ప్రయోగంలో బలమైన ఆధారం లభించింది.
మనం మన స్నేహితులతో భోజనం చేస్తున్నప్పుడు ఇది చాలావరకూ నిజమే అనిపిస్తుంది. మనం ఎక్కువ సేపు ఉండాల్సి రావచ్చు, అలాంటప్పుడు, ఇంకో సమోసా తిందామని అనుకోవచ్చు.
మనం ఒక బృందంతో కలిసి తింటున్నప్పుడు, వ్యక్తిగతంగా మరిన్ని పదార్థాలు ఆర్డర్ కూడా ఇస్తాం. ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో జరిగిన పరిశీలనలో తేలింది. ఒక పెద్ద విందులో చాలా పాస్తాలు, తీపి వంటకాలు ఆర్డర్ ఇచ్చారు. అందరితో కలిసి చేసే భోజనం మనకు చాలా ఆకలిగా ఉన్నామనే భావన కలగజేస్తుంది.
పీటర్ హెర్మాన్ అనే ఒక ఫుడ్ సైంటిస్ట్ తన "విందు సిద్ధాంతం" ప్రతిపాదించడానికి ఇలాంటి దానిపై ప్రయోగం చేశారు.
మనకు తెలిసిన వారందరితో కలిసి తింటుంటున్నపుడు ఒక చనువు ఉంటుంది. అందుకే వారితో కలసి కూచోగానే ఎలాంటి జంకూ గొంకూ లేకుండా మరింత తినేస్తాం.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మోడలింగ్..
మనకు తోడుగా ఉన్నది భ్రమ అయినా, తినడాన్ని మనం ఆస్వాదిస్తాం అని ఒక జపాన్ అధ్యయనంలో తేలింది. కొంతమందిని ఒంటరిగా అద్దం ముందు నిలబెట్టారు. మరికొంత మందిని గోడ పైనున్న ఒక ఫొటో ఎదురుగా నిలబెట్టారు. వారిని పాప్ కార్న్ తినమన్నారు. ఫొటో ఎదురుగా ఉన్నవారికంటే అద్దం ముందు ఉన్నవారు ఎక్కువ పాప్ కార్న్ తిన్నారు.
కానీ, కొన్నిసార్లు మనతో చాలామంది ఉన్నా మనం తక్కువే తింటాం. ఎలా ప్రవర్తించాలి అనే సామాజిక కట్టుబాట్లు మనల్ని అలా చేస్తాయి. ఇలాంటి సందర్భాలలో మనం ఇతరులు ఎలా తింటున్నారో గమనిస్తూ, వారిని అనుసరిస్తాం. ఈ ప్రవర్తనను "సోషల్ మోడలింగ్" అంటారు.
దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. లావుగా ఉన్న పిల్లలు మిగతా పిల్లల గుంపుతో ఉన్నప్పుడు తక్కువగా తింటారని పరిశోధనలు చెబుతున్నాయి. అదే లావుగా ఉండేవారికి మరో లావాటి వ్యక్తి తోడుగా ఉంటే వారు మరిన్ని చిప్స్, కేక్స్ తింటారు. కానీ ఎవరైనా సాధారణ బరువు ఉన్నవారితో కలిసినపుడు మాత్రం అలా తినరు. ఒక యూనివర్సిటీ కెఫేలో జరిగిన అధ్యయనంలో టేబుల్ దగ్గర పురుషులు ఉన్నప్పుడు మహిళలు తక్కువగా తినడం గమనించారు. కానీ చుట్టూ మహిళలే ఉన్నప్పుడు మాత్రం వాళ్లు ఎక్కువగా లాగించారు.
బ్రిటన్‌లోని ఒక రెస్టారెంట్‌లో, 'ఇక్కడ ఎక్కువ మంది కస్టమర్స్ కూరగాయలు తింటారు' అని బోర్డ్ పెట్టగానే, అక్కడికి వచ్చే వారంతా తమ భోజనంలో కూరగాయలు తినడం మొదలుపెట్టారు. చాక్లెట్ రేపర్స్ చెల్లాచెదురుగా పడి ఉండడం కూడా జనాల్లో చాక్లెట్స్ తినాలనే కోరికను మరింత పెంచింది.
ఇతరులతో తినడం అనేది పిల్లలకు సురక్షితమైన విధానాలను, పోషకాహారాన్ని ఎంచుకోవడాన్ని, ప్రమాదకరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడాన్ని నేర్పిస్తుంది.
"మనం తప్పులు చేయడం వల్లే నేర్చుకుంటాం. కానీ అది చాలా ప్రమాదం, అది మనల్ని చాలా అనారోగ్యానికి గురిచేస్తుంది. చిన్నతనం నుంచే మిగతా వారిని గమనించడం, వారిలా తినడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధులను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వారు ఎంచుకునే ఆహారం చాలా పరిమితంగా, తగినట్టు ఉంటుంది" అని బర్మింగ్‌హాం యూనివర్సిటీలో సైకాలజీ ఆఫ్ ఈటింగ్ ప్రొఫెసర్ సుజానే హిగ్గిన్స్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అలబామా యూనివర్సిటీ ప్రివెంటివ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ సారా జీన్ సాల్వీ "దురదృష్టవశాత్తూ కరకరలాడేవి, తీయటి పదార్థాలు ఎన్నో తినడానికి సిద్ధంగా ఉండడంతో మన ప్రస్తుత ఆహార నియమాలు మారిపోవచ్చు. తమకు దగ్గరగా ఉన్న బృందాల్లో ఏం తింటున్నారో అవే వారూ తినచ్చు. ఎక్కువ తింటున్నామని పెద్దగా అనుకోకపోవచ్చు. అతిగా తింటే, వారి బరువు కూడా పెరుగుతుంది" అని తెలిపారు.
తినడంలో, ఊబకాయంలో సామాజిక కోణాలను సాల్వీ అధ్యయనం చేశారు. "బీఎంఐ చార్ట్ ప్రకారం ఎంత బరువుండాలో చెప్పినపుడు, కొంతమంది ఆశ్చర్యపోయారు, తప్పు చూపిస్తోందని చార్టునే తప్పుబట్టారు" అని సాల్వీ తెలిపారు.
ప్రపంచంలో వందకోట్ల మందికి పైగా ఊబకాయంతో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. వీరిలో పిల్లలే 34 కోట్ల మంది ఉన్నారు.
అదృష్టవశాత్తూ, ఆరోగ్యంగా తినాలంటే మనం స్నేహితులను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. సామాజిక ప్రభావం చాలావరకూ మన ఆహార అలవాట్లకు ఒక రూపం ఇచ్చిందనేది మొదట గుర్తించాలి. తర్వాత అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలి, మనం తినేదానిపై అదుపు ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి.
కానీ హెర్మాన్ చెప్పిందే నిజమైతే.. అందరిలో ఉన్నప్పుడు మనల్ని మనమే మరిచిపోతే, విందును ఆస్వాదిస్తే, అలాంటప్పుడు మన ఆకలికి కళ్లెం వేయడం అనేది అసాధ్యమై పోతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








