టిల్లర్‌సన్: ఆసియా భద్రతలో భారత్ కీలక భూమిక పోషించాలి

ఫొటో సోర్స్, Reuters
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకొంటున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ చెప్పారు.
‘వ్యూహాత్మక బంధం’లో భారత్‌ను ఒక భాగస్వామిగా ఆయన పేర్కొన్నారు.
భారత్-అమెరికా బంధాన్ని ప్రస్తావిస్తూ, ఈ స్థాయి సంబంధాన్ని తాము చైనాతో ఎన్నటికీ ఏర్పరచుకోమని, ఎందుకంటే చైనా ప్రజాస్వామిక సమాజం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ఒప్పందాలను చైనా తోసిరాజంటోందని ఆయన విమర్శించారు. దక్షిణ చైనా సముద్రం వివాదాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
వచ్చే వారం ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం వాషింగ్టన్‌లో మేధో సంస్థ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో జరిగిన ఓ కార్యక్రమంలో టిల్లర్‌సన్ ప్రసంగించారు.
చైనాతో అమెరికా నిర్మాణాత్మక సంబంధాలను కోరుకొంటోందని ఆయన తెలిపారు. అయితే పొరుగు దేశాల సార్వభౌమత్వానికి, అమెరికాతోపాటు అమెరికా మిత్రపక్షాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా చైనా వ్యవహరిస్తే స్పందించకుండా ఉండలేమని స్పష్టం చేశారు.
అమెరికా, భారత్ అంతర్జాతీయ భాగస్వాములని టిల్లర్‌సన్ చెప్పారు. ప్రజాస్వామిక విలువల్లోనే కాదు, భవిష్యత్తు పట్ల విజన్‌లోనూ రెండు దేశాల మధ్య సారూప్యం ఉందని తెలిపారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా మరింత కీలక పాత్ర పోషించాలనుకొంటోందని చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంకేతాలు పంపిన తర్వాత కొన్ని గంటలకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
దక్షిణ చైనా సముద్రంలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని టిల్లర్‌సన్ విమర్శించారు. అమెరికా, భారత్ గౌరవించే అంతర్జాతీయ చట్టాలను ఈ చర్యలతో చైనా సవాలు చేస్తోందని ఆరోపించారు. భారత్‌తోపాటు పురోగతిని సాధిస్తున్న చైనా, వివిధ అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదని విమర్శించారు.
ఆసియాలో భద్రత విషయంలో భారత్ మరింత కీలక భూమిక పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర దేశాలకు వాటి సార్వభౌమత్వం, ఇతర ప్రయోజనాల పరిరక్షణలో, ఆర్థికాభివృద్ధిలో అమెరికా, భారత్ తోడ్పాటు అందించాలని చెప్పారు.
ఆధిపత్య వైఖరి ప్రదర్శించం: చైనా
టిల్లర్‌సన్ వ్యాఖ్యల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
చైనా ఎన్నటికీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించబోదని, రాజ్య విస్తరణకు పాల్పడబోదని, ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలనుకోదని రాయబార కార్యాలయం చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబరులో చైనా సహా పలు ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








