ఈ గ్రామస్తులు రోజూ సరిహద్దు దాటి చైనా వెళ్లొస్తుంటారు!

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
భారత్ - చైనాలు కేవలం ప్రపంచంలో శక్తివంతమైన దేశాలే కాదు పొరుగు దేశాలు కూడా. ఈ రెండు దేశాల మధ్యలో సరిహద్దు వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాంటి సరిహద్దు వివాదాలకు ఉదాహరణే డోక్లామ్ వివాదం.
కానీ, ఇన్ని వివాదాలున్నా భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు చైనాకి, చైనా ప్రజలు భారత్‌కు రోజు వస్తూ వెళ్తుంటారు. అదే ఛగ్లాగామ్. ఇది అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉంది.
ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ముందుగా మేము అస్సాం రాజధాని గువాహటి నుండి రాత్రంతా ప్రయాణం చేసి తీన్‌సుకియా వెళ్లాం.
ఈ ప్రాంతం నుండి అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు చాలా దగ్గర. రెండు గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చు. ఇదంతా కొండ ప్రాంతం. ఇక్కడ హోటళ్లు, సత్రాలు లేకపోవడంతో సర్క్యూట్ హౌస్‌లో ఉన్నాము.
అంతా పర్వతారోహణ ప్రాంతం
మమ్మల్ని చూసి అక్కడున్న ఒకతను "కొండలెక్కి చైనా సరిహద్దుకు వెళుతున్నారా?’’ అని అడిగారు.
మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నా మరుసటి రోజు ఉదయం కచ్చా రోడ్ల ద్వారా ఛగ్లాగామ్‌కి ప్రయాణం మొదలు పెట్టాం.
ఎత్తైన కొండచరియల ప్రాంతం అది. ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన లోయల ప్రాంతమది.
ఎక్కడా మనుషులే కనిపించరు. గంట ప్రయాణం చేస్తే ఎవరో ఒకరు కనిపిస్తున్నారు.

చైనా వెళ్లడం చాలా ఈజీ
చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ గ్రామానికి చేరుకోవడం అంత సులభం కాదు. కానీ, ఇక్కడి నుండి చైనాకు అలవోకగా చేరుకోవచ్చు.
ఛగ్లాగామ్‌లో మొత్తం 50 కుటుంబాలున్నాయి. అల్లిందేగా కూడా ఇక్కడే ఉంటారు.
ఆయన జీవనోపాధి యాలకులను సాగు చేయడం. ఈ ఊరి జనం ఆహార పదార్థాలు కొనాలంటే 5 గంటలు ప్రయాణించి వేరే ప్రాంతానికి వెళ్లాలి. అదే వారికి అత్యంత సమీప ప్రాంతం.
అల్లిందేగా కుటుంబ సభ్యులు చైనాలో కూడా ఉంటారు. రెండు దేశాల మధ్య ఎన్ని వివాదాలున్నా వీరి మధ్య మాత్రం ఎలాంటి గొడవలూ లేవు. వీరి అనుబంధాన్ని సరిహద్దు విడదీయలేదు. వారు రోజూ సరిహద్దు దాటి అటూ ఇటూ వెళ్లి వస్తూ ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటారు.

"మేము మిష్మి తెగకు చెందినవాళ్ళం. మా కుటుంబంలో సగం మంది సరిహద్దుకు అవతల చైనాలో ఉంటారు. మా ఊళ్ళో వాళ్లు ఔషధ ఆకుల కోసం అడవులకు వెళ్తే అక్కడ వారు కూడా కలుస్తుంటారు. రోజూ ఒకటి నుండి రెండు గంటలు మాట్లాడుకుంటాం. మంచి చెడులు తెలుసుకుంటూ సరదాగా గడుపుతాం" అని అల్లిందేగా తెలిపారు.
ఈ ఊళ్ళో భారత సైనిక క్యాంపు కూడా ఉంది. జవాన్లు క్యాంపు బయట సిగెరెట్ తాగుతూ కనిపించారు.
"మీరు ఇక్కడకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొబైల్ ఫోన్, టీవీ లాంటి సదుపాయాలు లేవు. కొండలమీద ఎక్కి పహరా కాస్తుంటాం. ఇక్కడి వాతావరణం ఎలా ఉందో మీరే చూడండి" అని వాళ్లలో ఓ జవాను చెప్పారు.
ఛగ్లాగామ్ ప్రజలు, ఆ చుట్టుపక్కలుండేవారు సైన్యానికి గైడ్‌గా లేదా ట్రాన్స్‌లేటర్ గా పనిచేస్తుంటారు.
24 ఏళ్ల ఆయండియో సోంబోపే ఇక్కడ గైడ్‌గా పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆయన ఉపాధి వేటలో ఉన్నారు.

చైనా ఆర్మీతో..
సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను తాను చాలాసార్లు కలిశానని ఆయండియో అంటున్నాడు.
"ఓ రోజు మధ్యాహ్నం నేను సరిహద్దు దగ్గర ఉంటే వారందరూ సరిహద్దు దాటి 100 మీటర్ల లోపలికి వచ్చారు. చుట్టుపక్కల భారత సైన్యానికి చెందిన వారు ఎంతమంది ఉంటారని నన్ను అడిగారు. 300 మంది అని చెప్పాను. కాసేపటి తర్వాత వారు తిరిగి వెళ్లిపోయారు" అని ఆయన తెలిపారు.

భారత్ - చైనాల మధ్యలో ఎన్నో సరిహద్దు వివాదాలున్నాయి. రెండు దేశాల మధ్య 1962లో యుద్ధం కూడా జరిగింది.
ఇటీవల డోక్లామ్ సరిహద్దు సమస్య కారణంగా ఇరుదేశాల మధ్య కొద్ది నెలల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అనంతరం సద్దుమణిగింది.
భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో పలు గ్రామాలు చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి.

అసలు సమస్య ఏంటి?
ఈ ఐదు రాష్ట్రాల్లో సిక్కిం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఖచ్ఛితమైన సరిహద్దు రేఖ లేదు. ఈ వివాదానికి సానుకూల ఆలోచనే పరిష్కారమని భారత సైన్యం మాజీ చీఫ్ వి.పి.మాలిక్ పేర్కొన్నారు.
‘‘సరిహద్దులో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను మ్యాప్ మీద గుర్తించాలి. అలా గుర్తిస్తే జీపీఎస్ సహాయంతో ఎవరు ఎవరి ప్రాంతంలో ఉన్నారనేది ఇట్టే తెలుసుకోవచ్చు. సమస్యేమిటంటే చైనా ఇప్పటి వరకూ మార్క్ చేయనివ్వలేదు. అందుకే చైనా సైన్యం భారత్‌లో కనిపిస్తూ ఉంటుంది‘‘ అని ఆయన పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య ఎన్ని సరిహద్దు వివాదాలున్నా భారత సరిహద్దు ప్రాంతంలో నివసించే ఇక్కడి ప్రజల మీద దాని ప్రభావం నామమాత్రంగానే ఉంది.
మా ఇతర కథనాలు:
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- జిన్‌పింగ్‌ను మరో మావో అని ఎందుకంటారు?
- జిన్‌పింగ్ ఇప్పుడు మావో అంతటి ‘శక్తిమంతుడు’
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










